-కేసీఆర్ ఉన్నంత వరకు రైతుబంధు ఉంటది
-దళిత బంధును ఆరు నూరైనా అమలు చేస్తాం
-రైతు ప్రయోజనాలు దెబ్బతీస్తే సహించం.. ఎంతటి కొట్లాటకైనా తెలంగాణ సిద్ధం
-మా సహనాన్ని బలహీనతగా చూడొద్దు.. కేంద్రంలో ఉన్నది ప్రజావ్యతిరేక ప్రభుత్వం
-రైతులను టీఆర్‌ఎస్‌కు దూరం చేసే కుట్ర.. బీజేపీకి దేశహితం, ప్రజాహితం పట్టదు
-టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధుల సమావేశంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఫైర్

తెలంగాణ రైతాంగ ప్రయోజనాలను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తే ఊరుకునే ప్రసక్తేలేదని, కేంద్రంతో ఎంతటి కొట్లాటకైనా సిద్ధమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. తెలంగాణ సహనాన్ని బలహీనతగా భావిస్తున్నారన్న సీఎం.. తమ ఓపికకు కూడా హద్దు ఉంటుందని హెచ్చరించారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్రంలో ఉన్నది ప్రజా వ్యతిరేక ప్రభుత్వమని, అది మైనారిటీలకు మాత్రమే వ్యతిరేకం కాదని.. పేద, బడుగు, బలహీనవర్గాలన్నింటికీ వ్యతిరేకమని ధ్వజమెత్తారు. రాష్ట్రం నుంచి బియ్యం కొనుగోలుకు ఎఫ్‌సీఐ సహకరించకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రాలు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని, కానీ, అది తన బాధ్యత నుంచి తప్పుకొంటున్నదని విమర్శించారు. తెలంగాణ రైతుల సమస్యను కేంద్రం రాజకీయ కోణంలోనే చూస్తున్నదని ఆక్షేపించారు. రైతులను రాష్ట్ర ప్రభుత్వానికి, టీఆర్‌ఎస్‌కు దూరంచేసే కుట్రలో భాగంగానే ధాన్యం కొనుగోలుపై కేంద్రం కిరికిరి పెడుతున్నదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి సిద్ధాంతాలు, రాజకీయ విలువలు లేవని, తన రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతకైనా తెగిస్తున్నదని ధ్వజమెత్తారు. అయినప్పటికీ ఎంతో సహనంతో ఉన్నామని చెప్పారు. తెలంగాణ సహనాన్ని బలహీనతగా భావిస్తున్నారని, మన ఓపికకు కూడా హద్దు ఉంటుందని హెచ్చరించారు. త్వరలో రైతు ఉద్యమాన్ని చేపడుతున్నామని, అప్పుడు పార్టీ సత్తా చూపించాలని పిలుపునిచ్చారు. బీజేపీకి దేశహితం, ప్రజాహితం పట్టదని, అన్నింటినీ అమ్మేస్తున్నదని మండిపడ్డారు. ఎల్‌ఐసీ, రైల్వేలు, రోడ్లు, ఎయిర్‌పోర్టులు.. ఇట్ల చెప్పుకొంటూ పోతే అనేకం ఉన్నాయని అన్నారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పార్టీ శ్రేణులకు ఉద్బోధించారు.
కేసీఆర్ ఉన్నంత వరకు రైతుబంధు ఉంటుంది
కేసీఆర్ ఉన్నంత వరకు రైతు బంధు ఉంటుందని తాను గతంలో అసెంబ్లీలోనే చెప్పానని కేసీఆర్ గుర్తుచేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ పథకం ఆగదని స్పష్టంచేశారు. ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, జాజుల సురేందర్ తదితరులు మాట్లాడుతూ యాసంగిలో వరి వేసుకుంటే రైతుబంధు ఇవ్వవద్దన్న వ్యవసాయశాఖ అధికారుల ప్రతిపాదనపై పునఃపరిశీలన చేయాలని కోరారు. కొన్ని చోట్ల చెరువుల కింద, కాలువల కింద వరి తప్ప మరో పంట పండదని, కొన్ని భూముల్లో వరి తప్ప ప్రత్యామ్నాయం ఉండదని వివరించారు. ప్రభుత్వం కొనకపోయినా ఫర్వాలేదని, సొంత రిస్క్‌పై వరి వేసుకుంటారని, అలాంటి వారి పట్ల కఠినంగా ఉండవద్దని ముఖ్యమంత్రిని కోరారు. వ్యవసాయశాఖ అధికారుల ప్రతిపాదనపై ముందుకు వెళ్లవద్దని విజ్ఞప్తిచేశారు. దీనిపై కేసీఆర్ స్పందిస్తూ ‘కేసీఆర్ ఉన్నంత వరకు రైతుబంధు ఉంటది. ఇదే విషయాన్ని అసెంబ్లీలో, అనేక సందర్భాల్లో పార్టీ సభల్లో కూడా చెప్పాను’ అని గుర్తుచేశారు. పంటమార్పిడి గురించి రైతులకు అవగాహన కల్పించాలని, రైతువేదికలను ఉపయోగించాలని, క్లస్టర్లవారీగా సమావేశాలు పెట్టాలని ఈ సందర్భంగా సీఎం చెప్పారు.
వందశాతం దళితబంధు అమలు చేసి తీరుతాం
- Advertisement –
VDO.AI
‘దళిత బంధును ఆరునూరైనా వందశాతం అమలుచేసి తీరుతం. దళితులకు ఇవ్వడం ఆరంభం మాత్రమే. రానురాను రాష్ట్రంలోని ప్రతీ వర్గానికి.. ప్రతీ పేదకు దీన్ని అందించాలన్నది మా లక్ష్యం. తెలంగాణకు ఏదైనా మనమే చేయాలి. మనమైతేనే చేయగలగం. ఈ ప్రాంతంపై.. ప్రజలపై మనకున్న ప్రేమ జాతీయ పార్టీలకు ఉండదు. హుజూరాబాద్‌లో దళితబంధును పూర్తిగా ఇస్తం. పైలట్ ప్రాజెక్ట్‌గా చేపట్టిన నాలుగు మండలాల్లోనూ వందశాతం దళితబంధు ఇస్తం. దీంతోపాటు ప్రతీ శాసనసభ నియోజకవర్గ పరిధిలో వంద కుటుంబాల చొప్పున దళితబంధు కోసం నిధులు కేటాయిస్తం. లబ్ధిదారుల ఎంపిక బాధ్యత స్థానిక ఎమ్మెల్యేలదే. రాబోయే బడ్జెట్‌లో నిధులను రూ.25 వేల కోట్లకు పెంచుతం. ప్రతి నియోజకవర్గం పరిధిలో రెండువేల మందికి అందించేందుకు ప్రణాళిక రూపొందించాం. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి దళిత కుటుంబానికీ పథకాన్ని అందిద్దాం’ అని కేసీఆర్ చెప్పారు.