
-టీఆర్‌ఎస్‌ను ఒంటిచేత్తో విజయతీరాలకు చేర్చిన కేసీఆర్ -సంక్షేమ పథకాలకు జైకొట్టిన ఓటరు -అపవిత్ర కలయికకు ప్రజల గుణపాఠం -బాబు అండ్‌కోకు చెంపదెబ్బ.. బీజేపీకి కలిసిరాని మోదీ ప్రచారం -తెలంగాణ టీఆర్‌ఎస్‌దే -టీఆర్‌ఎస్ ఆధిక్యం/ గెలుపు ;64/22 -కారు స్పీడుకు కూటమి తుత్తునియలు -నిశ్శబ్ద విప్లవం
ఇది కేసీఆర్ సునామీ! ఇది గులాబీ ప్రభంజనం! ఇదీ తెలంగాణ ఆత్మగౌరవం!! ఒకే ఒక్కడై గెలుపు బాధ్యతను భుజాన వేసుకున్న కేసీఆర్.. ఒంటిచేత్తో టీఆర్‌ఎస్‌ను విజయతీరాలకు చేర్చారు. వన్‌సైడ్ వార్‌లో టీఆర్‌ఎస్‌ను సెంచరీకి సమీపంలో నిలిపారు. కూటమి హామీల కుప్పను చెత్తకుప్పల్లోకి విసిరేసిన తెలంగాణ ఓటరు.. రాష్ర్టాన్ని సాధించి.. బంగారు తెలంగాణ సాధనకు అలుపెరుగని యజ్ఞం చేస్తున్న కేసీఆర్‌కే తమ మద్దతని ఓటు గుద్ది మరీ తేల్చిచెప్పాడు! పచ్చి అవకాశవాద రాజకీయంతో కట్టిన కూటమి దవడలను ఎడాపెడా వాయించిపారేశాడు! తాము విజ్ఞులమని చాటిన తెలంగాణ ప్రజలు.. సీమాంధ్ర నేతలు, వారి తైనాతీల ఆశలపై నీళ్లు కుమ్మరించారు! ఆఖరునిమిషంలో కూటమి నేతలు ఎన్ని కుట్రలు చేసినా.. మహామహులు రంగంలోకి దిగినా.. లొంగని ప్రజలు.. కాంగ్రెస్, టీడీపీకి కర్రు కాల్చి వాతపెట్టారు. అపనమ్మకాలను పటాపంచలు చేస్తూ.. కేసీఆర్ నాయకత్వానికే జై కొట్టారు. టీఆర్‌ఎస్‌పై నమ్మకంతో ప్రజలు నిశ్శబ్ద విప్లవాన్ని తెచ్చారు. వందసీట్లు గెలుస్తామంటూ మొదటిరోజునుంచీ కచ్చితంగా చెప్తున్న కేసీఆర్.. అన్నట్టుగానే కారును వందకిలోమీటర్ల వేగంతో పరుగుతీయిస్తున్నారు. కొన్ని జాతీయ మీడియాలు, సర్వే సంస్థల అంచనాలను కూడా టీఆర్‌ఎస్ మించిపోతున్నది. తాను అమలుచేసిన సంక్షేమ పథకాలు, ప్రజల జీవితాల్లో తాను తెచ్చిన మార్పు ఫలితాలనిస్తుందనే కేసీఆర్ నమ్మకాన్ని ప్రజలు నిజం చేశారు. ఇది తెలంగాణ ప్రజలపై కేసీఆర్‌కు ఉన్న ధీమా! ఇది.. తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌పై ఉన్న విశ్వాసం!
చరిత్ర సృష్టించిన కేసీఆర్.. పూర్తికాలం కాకుండానే ముందస్తుకు వెళ్లిన సంఘటనలు దేశంలో పలుమార్లు చోటుచేసుకున్నాయి. కానీ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ముందస్తుకు వెళ్లి గెలిచిన సందర్భాలు లేవు. తెలంగాణలో మొదటిసారి ఆ ఘనతను సాధించటం ద్వారా కేసీఆర్ చరిత్ర సృష్టించారు. సాధారణంగా భయంతో ముందస్తుకు వెళుతారనే అభిప్రాయం ఉంది.. కానీ.. కేసీఆర్ బాధ్యతతో, నమ్మకంతో తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు ఆమోదించారని తాజా ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ముందస్తయినా.. నిర్ణీతకాలానికే ఎన్నికలు జరిగినా.. సంక్షేమం గురించి ఆలోచించేవారికే ప్రజలు పట్టంగడుతారని కేసీఆర్ రుజువుచేశారు. దశాబ్దాల పోరాటాల అనంతరం రాష్ట్రం సాధించుకున్న వేళ ఉద్యమ ప్రభావం తీవ్రంగా ఉన్న 2014 ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్ ఒకింత తక్కువ సీట్లకే పరిమితమైనా.. నాలుగున్నరేండ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు టీఆర్‌ఎస్ ప్రభుత్వంపైన, దాని సారథి కేసీఆర్‌పైన ప్రజల్లో నమ్మకాన్ని పెంచాయి.
జగిత్యాల నుంచి గులాబీ జైత్రయాత్ర.. మహాకూటమిగా బరిలో నిలిచి.. పనికిమాలిన ఆరోపణలు, దుష్ప్రచారాలతో అధికారం చేపట్టాలని కలలుగన్న కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లు ఏ ఒక్క దశలోనూ ప్రజలను ఆకట్టుకున్నట్టుగా కనిపించలేదు. మహామహులుగా చెప్పుకొనే కాంగ్రెస్ నేతలు మట్టికరిచారు. ఉదయం నుంచి స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించిన టీఆర్‌ఎస్‌కు తొలి గెలుపు జగిత్యాలలో లభించింది. చరిత్రలో జగిత్యాల జైత్రయాత్రకు ఎంతటి ప్రాముఖ్యం ఉందో.. అదే విధంగా ఎన్నికల ప్రస్థానంలో టీఆర్‌ఎస్ జైత్రయాత్ర జగిత్యాల నుంచే మొదలుకావడం విశేషం. కాంగ్రెస్ సీనియర్ నేత.. కూటమి అధికారంలోకి వస్తే తనకు మంత్రిపదవి ఖాయమని ప్రచారం చేసుకున్న కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డిపై టీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్‌కుమార్ 66 వేలకు పైగా భారీ మెజార్టీతో విజయం సాధించారు. అక్కడినుంచి ఇక టీఆర్‌ఎస్ వెనుతిరిగి చూసే పరిస్థితి రాలేదు. ఆదిలాబాద్ నుంచి.. పాలమూరు వరకు.. మెదక్ నుంచి.. నల్లగొండ వరకు అప్రతిహతంగా టీఆర్‌ఎస్ విజయ ప్రస్థానం ముందుకు సాగుతూనే ఉంది.
ప్రస్తుతానికి హరీశ్‌రావు లక్ష ఓట్ల మెజార్టీ దాటగా, ఆరూరి రమేశ్ 90వేల పైచిలుకు మెజార్టీని కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పద్మారావు, జీ జగదీశ్‌రెడ్డి, జోగురామన్న, మాజీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, బాల్కసుమన్, నోముల నర్సింహయ్య, కంచర్ల భూపాలరెడ్డి, చంటి క్రాంతికిరణ్, తదితరులు విజయబావుటాలు ఎగరేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలవారీగా చూస్తే మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో క్లీన్‌స్వీప్ దిశగా కారు దూసుకుపోతున్నది. కాంగ్రెస్‌లోని మహామహులైన జానారెడ్డి, జీవన్‌రెడ్డి, గీతారెడ్డి, దామోదర రాజనర్సింహ, డీకే అరుణ, షబ్బీర్ అలీ, రేవంత్‌రెడ్డి, బలరాంనాయక్, పొన్నాల, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వంటివారు ఓటమికి అంచుల్లో నిలిచారు.
మహామహుల ప్రచారం.. ప్రజలు నమ్మలేదు.. ఎలాగైనా టీఆర్‌ఎస్‌ను, కేసీఆర్ నాయకత్వాన్ని దెబ్బతీయాలనే దురుద్దేశంతో కూటమి కట్టిన కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐలు మహామహులను ప్రచారం బరిలోకి దించాయి. కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, తెలంగాణను తానే ఇచ్చినట్టుగా సన్నాయి నొక్కులు నొక్కిన సోనియాతోపాటు గులాంనబీ ఆజాద్‌లాంటివారు ప్రచారం చేశారు. టీడీపీ తరఫున పక్క రాష్ట్రం సీఎం చంద్రబాబూ దిగారు. బీజేపీ తరఫున సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాలతోపాటు పలువురు దిగ్గజనేతలు ప్రచారం చేసినా బీజేపీ కనీస ఫలితాలను కూడా సాధించలేక పోయింది. విజయశాంతి, ఖుష్బూలాంటి సినీసువాసనలనుకూడా తెలంగాణ ప్రజలు పట్టించుకోలేదు. మాయావతి, సిద్ధూలాంటి దురంధరులనుకూడా తెలంగాణ ప్రజలను మళ్ళించలేకపోయారు. కుప్పలు తెప్పలుగా, వాస్తవ పరిస్థితులతో సంబంధం లేకుండా హద్దుమీరి ప్రకటించిన అలవిగాని హామీలను ప్రజలు పట్టించుకోలేదు.