-19, 20 తేదీల్లో ఆరు జిల్లాల్లో ఆరు సభలు -తొమ్మిది నియోజకవర్గాల పరిధిలో సమావేశాలు -ముఖ్యమంత్రి ప్రచారసభల షెడ్యూల్ ఖరారు -మరింత గుబాళించనున్న గులాబీ ప్రచారం
గులాబీ దళ ప్రచారం మరింత గుబాళించనున్నది. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న టీఆర్‌ఎస్ అభ్యర్థులకు,. ప్రచారంలో పాల్గొంటున్న పార్టీ శ్రేణులకు మరింత ఊపు, ఉత్సాహాన్నిస్తూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మలివిడుత ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ఈ నెల 19, 20 తేదీల్లో (సోమ, మంగళవారాలు) ఆరు జిల్లాల్లోని తొమ్మిది నియోజకవర్గాలను కలుపుతూ నిర్వహించే ఆరు సభల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఈ మేరకు షెడ్యూలు ఖరారైంది. రాష్ట్ర ప్రగతిరథ చక్రాలు ఆగొద్దన్న సంకల్పంతో ప్రజాతీర్పు కోరుతూ సెప్టెంబర్ ఆరో తేదీన ప్రభుత్వాన్ని రద్దుచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆ మరుసటిరోజు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వదసభలో పాల్గొన్నారు. తదుపరి అక్టోబర్ మూడో తేదీన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో, నాలుగో తేదీన నల్లగొండ జిల్లా కేంద్రంలో, ఐదో తేదీన వనపర్తి జిల్లా కేంద్రం శివార్లలో నిర్వహించిన భారీ బహిరంగసభల్లో ముఖ్యమంత్రి మాట్లాడారు. గత నాలుగున్నరేండ్ల పాలనలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలను వివరించడంతోపాటు.. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న నిర్ణయానికి దారితీసిన పరిస్థితులను ప్రజలకు తెలియజేశారు. తాజాగా టీఆర్‌ఎస్ పాక్షిక మ్యానిఫెస్టో కూడా విడుదలకావడంతోపాటు సిద్ధాంతాలకు విరుద్ధంగా ప్రతీపశక్తులు కూటమికట్టడం, రాష్ట్రం మునుపెన్నడూ చూడనంతస్థాయిలో విపక్షాల అవకాశవాద రాజకీయాలు నడుస్తున్న నేపథ్యంలో మరింత వాడివేడిగా ముఖ్యమంత్రి ప్రసంగాలు ఉంటాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ రద్దు ప్రకటన తదుపరి వచ్చిన అన్ని సర్వేలు టీఆర్‌ఎస్ ఘన విజయాన్ని ప్రకటించిన నేపథ్యంలో జరిగే సీఎం కేసీఆర్ సభలు.. ఆయా నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థుల మెజార్టీని మరింత పెంచే దిశగా ఉంటాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
