-విద్యావంతుల ఎన్నికల్లో పోరపాటు జరగదు -దేవీప్రసాద్‌ను గెలిపించి సీఎంకు కానుకగా ఇవ్వాలి: హోంమంత్రి నాయిని -అన్ని వర్గాలను ఆదరించేలా టీఆర్‌ఎస్ పాలన: అభ్యర్థి దేవీప్రసాద్

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి దేవీప్రసాద్ గెలుపు ఖాయమని, తాము చేస్తున్న కృషి కేవలం మెజార్టీ కోసమేనని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని ముషీరాబాద్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి ముఠా గోపాల్ అధ్యక్షతన వాకర్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ బాగ్‌లింగంపల్లి ఆధ్వర్యంలో బాగ్‌లింగంపల్లి సుందరయ్య పార్క్‌లో జరిగిన సమావేశంలో వాకర్స్ దేవీప్రసాద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ ఈ ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకమైందన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌ను కేసీఆర్ విశ్వనగరంగా తీర్చిదిద్ది ప్రపంచంలోనే నంబర్ వన్ సిటీగా నిలపడానికి ప్రణాళికలను సిద్ధం చేశారన్నారు. అలాంటి ఉన్నత ఆలోచనలతో ముందుకు వెళ్తున్న కేసీఆర్‌కు మనమందరం అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. అవినీతికి అస్కారం లేకుండా పాలనను అందించాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారన్నారు. అందుకే టీఆర్‌ఎస్ అభ్యర్థి దేవీప్రసాద్‌ను భారీ మెజార్టీతో గెలిపించి కేసీఆర్‌కు కానుకగా అందించాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే సురక్షితమైన నగరం హైదరాబాద్ అని సర్వేలో తెలిందన్నారు. వీటి ఫలితంగా మనకు వస్తున్న ఐటీఐఆర్ వల్ల మన నిరుద్యోగ యువతకు 17లక్షల ఉద్యోగాలు లభించనున్నాయన్నారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో ప్రతిపక్షాలకు దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అవుతున్నదని, దీంతో ఏమి చేయాలో తెలియక నొటికి ఎదీ వస్తే ఆ ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అభ్యర్థి దేవీప్రసాద్ మాట్లాడుతూ కేసీఆర్ పాలన అన్ని వర్గాలకు మేలు జరిగేలా సాగుతున్నదన్నారు.
అసలు కేసీఆర్ పాలన మానవీయ కోణంలో సాగుతున్నదని, టీఆర్‌ఎస్ పాలనలో ఏ వర్గానికి ఇబ్బందులు రాకూడదనే గట్టి సంకల్పంతో పని చేస్తున్నారన్నారు. ఉద్యమంలో ముందున్న ఉద్యోగులకు సముచిత స్థానం కల్పించాలని కోరిన వెంటనే 43శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ ప్రకటించి ఉద్యోగుల, కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపారని గుర్తుచేశారు. ఉద్యోగుల కనీస వేతనాలు పొందే వారి నుంచి కోతలకు కారణమవుతున్న ఇన్‌కమ్‌ట్యాక్స్‌ను కనీసం రూ.5లక్షలకు పెంచాలని తాము చేసిన డిమాండ్‌ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అన్ని వర్గాల అభివృద్ధికి ఆహర్నిషలు కృషి చేస్తున్న మీ వెంటే మేముంటామనే భరోసాను కేసీఆర్‌కు ఇవ్వాలని, టీఆర్‌ఎస్ అభ్యర్థిగా తనను గెలిపించి కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలని కోరారు. సమావేశంలో అంబర్‌పేట నియోజకవర్గ ఇన్‌చార్జి ఎడ్ల సుధాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ యువనాయకుడు శ్రీనివాస్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, మహిళా నాయకురాలు మాచర్ల పద్మ, వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రాజేంద్రప్రసాద్‌గౌడ్, కందూరి కృష్ణ, శైలజలు మాట్లాడి దేవీప్రసాద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
తహసీల్దార్ల సంఘం మద్దతు పట్టభద్రుల శాసనమండలి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దేవీప్రసాద్‌కు తెలంగాణ తహసీల్దార్ల సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఆదివారం నాంపల్లిలోని తహసీల్దార్ల అసోసియేషన్ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిర్ణయించిన అనంతరం దేవీప్రసాద్‌ను ఆహ్వానించి ఘనంగా సన్మానించి తమ మద్దతు ప్రకటిస్తున్నామని, దేవీ గెలుపునకు శాయశక్తులా కృషి చేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో తహసీల్దార్ల సంఘం ప్రతినిధులు లచ్చిరెడ్డి, నరేందర్, రామకృష్ణ, గోపీరాం, చెన్నయ్యలు తదితరులు పాల్గొన్నారు. రామంతపూర్‌లోని పాలిటెక్నిక్ కాలేజీలో ఉదయం వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు దేవీప్రసాద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.