కేసీఆర్ వెంట్రుక కూడా పీకలేరు
కాంగ్రెస్‌లో కలిస్తే మంచోళ్లు.. లేకుంటే దొరలా?
-ఎందుకీ లఫంగి ముచ్చట్లు
-విలీనం చేస్తానంటేనే తెలంగాణ ఇచ్చారా..?
-అడిగినప్పుడే ఎందుకు సప్పుడు చేయలేదు
-పీనుగులా ఉన్న కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చాం
-హైదరాబాద్ కబ్జాలపై నోరు మెదపరెందుకు?
-ఆస్తులపై విచారణ చేసినా వెంట్రుక కూడా పీకలేరు..
-ఎన్నికల ప్రచారసభల్లో కాంగ్రెస్‌పై ధ్వజమెత్తిన కేసీఆర్
కోట్లతో ముస్లింలకు ప్రత్యేక బడ్జెట్..
పోలవరం డిజైన్ మార్చేవరకు పట్టువదలబోమని హామీ
2012లో తెలంగాణ ఇస్తే పార్టీని విలీనం చేస్తానన్నాం.. అప్పుడు వాళ్లు వినలేదు.. దాంతో ఢిల్లీలో విలేకరుల సమావేశంపెట్టి కాంగ్రెస్ తీరును ఎండగట్టి.. కరీంనగర్‌లో మేధోమథనం నిర్వహించాం. ఇప్పుడేమో తప్పుడు కూతలు కూస్తున్నారు. ఎందుకీ లఫంగి ముచ్చట్లు. కాంగ్రెస్‌తో కలిస్తే మంచోళ్లు.. లేకుంటే దొరలంటారా? గింత దుర్మార్గం ఎక్కడన్నా ఉంటుందా? నేను మోసం చేశానని, పార్టీని విలీనం చేయలేదని రాహుల్‌గాంధీ అంటున్నాడు. పార్టీలు విలీనం చేస్తేనే రాష్ట్రాలు ఇస్తారా? ప్రజల ఆకాంక్ష పట్టదా?
తెలంగాణ ఏర్పాటుకు 2012లో ఢిల్లీలో గడప గడపకు తిరిగినం.. తెలంగాణ ఇస్తే పార్టీని విలీనం చేస్తానన్నాం.. అప్పుడు వాళ్లు వినలేదు.. ముందుకు రాలేదు.. దాంతో ఢిల్లీలో విలేకరుల సమావేశం పెట్టి కాంగ్రెస్ తీరును ఎండగట్టి.. కరీంనగర్‌లో మేధోమథనం నిర్వహించాం. ఇప్పుడేమో తప్పుడు కూతలు కూస్తున్నారు. ఎందుకీ లఫంగి ముచ్చట్లు. కాంగ్రెస్‌తో కలిస్తే మంచోళ్లు.. లేకుంటే దొరలంటారా..?.. గింత దుర్మార్గం ఎక్కడన్నా ఉంటుందా..? అని టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. నేను మోసం చేశానని, పార్టీని విలీనం చేయలేదని రాహుల్‌గాంధీ అంటున్నాడు.
పార్టీలు విలీనం చేస్తేనే రాష్ట్రాలు ఇస్తారా?.. ప్రజల ఆకాంక్ష పట్టదా..? అని నిలదీశారు. నిన్న సోనియా, నేడు రాహుల్‌గాంధీలిద్దరూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో టీఆర్‌ఎస్ పాత్ర లేదని అంటున్నారు. మరి పాత్రే లేనప్పుడు తమ పార్టీని ఎందుకు విలీనం చేయాలని అడుగుతున్నారని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మంగళవారం వరంగల్ జిల్లాలో భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, తొర్రూరు (పాలకుర్తి), మరిపెడ (డోర్నకల్), ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, ఇల్లెందు, కొత్తగూడెం బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయా సభల్లో కేసీఆర్ మాట్లాడుతూ పొన్నాల లక్ష్మయ్య పదేపదే నా ఆస్తులపై విచారణ జరిపిస్తానని ప్రకటనలు చేయడం హస్యాస్పదంగా ఉందన్నారు.
హైదరాబాద్‌లో భూ కబ్జాలపై విచారణ జరిపించి ఆక్రమించిన భూములు లాక్కుంటామని నేను ప్రకటన చేస్తే.. నా ఆస్తులపై విచారణ జరిపిస్తానని పొన్నాల సవాల్ చేస్తున్నాడు. దీనినిబట్టే ఆయన కబ్జాదారుల కొమ్ముకాస్తున్నట్లు అర్థమవుతున్నది. ఇలాంటి మాటలకు అక్రమ ఆస్తులున్నోళ్లు.. లఫంగిగాళ్లు భయపడుతారు. నా ఆస్తులపై విచారణకు ఎప్పుడైనా సిద్ధమే.. జేజమ్మలు కూడా కేసీఆర్ వెంట్రుక పీకలేరు అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు పదే పదే టీఆర్‌ఎస్‌పై విమర్శలు చేయడంపై ఆయన ఘాటుగా స్పందించారు. రోజుకు పదుల సంఖ్యలో తాను బహిరంగ సభలకు హాజరవుతుండటం చూసి కాంగ్రెస్ నేతలకు కన్నుకుట్టిందన్నారు. మనదేశంలో ప్రజాస్వామ్యం ఉందికాబట్టి సరిపోయింది.. లేకుంటే ఆంధ్రోళ్ల పార్టీల సభలను తెలంగాణలో పెట్టనిచ్చే ప్రసక్తే ఉండేది కాదన్నారు.
ఆనాడు చంద్రబాబు మిమ్మల్ని లేవకుంట చేస్తే లేపింది ఎవరు? తెలంగాణ కాదా? ఎందుకు ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు? మీ అబద్దపు ప్రచారాలను నమ్మే స్థితిలో తెలంగాణ ఉన్నదనుకుంటున్నారా? నాలుగున్నర కోట్ల మందికి ఓ ఇంటిపార్టీ అక్కరలేదా? అని కేసీఆర్ కాంగ్రెస్ నాయకుల తీరుపై విరుచుకుపడ్డారు. 2004లో అడిగినప్పుడే తెలంగాణ రాష్ర్టాన్ని ఇచ్చి ఉంటే ఇనాంగా ఉండేది.. సోనియాగాంధీ రుణం తీర్చుకునే వాళ్లమని కేసీఆర్ అన్నారు.
60 ఏండ్లు గోస పడ్డాం.. ఇంకా తెలంగాణను ఆంధ్రాలో కలిపి మా అస్థిత్వాన్ని తాకట్టు పెట్టడానికి సిద్ధంగా లేం.. మేము ఢిల్లీకి గులాం కాదు..మాశక్తిని దేశ రాజకీయాలకు చూపుతాం అంటూ ధ్వజమెత్తారు. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ సాధించుకున్నది కుక్కలపాలు, నక్కల పాలు చేయడానికి కాదన్నారు. తిరిగి ఈ కాంగ్రెస్, టీడీపీ దొంగలే అధికారం వెలుగబెడితే తెలంగాణ వచ్చి లాభమేమిటని ప్రశ్నించారు. సారాసీసాల కోసం ఆలోచిస్తే వాళ్లు మన నోట్లో చేతులు పెట్టి పేగులు బయటికి తీస్తారనే విషయం మర్చిపోవద్దని హితవు పలికారు.
గని కార్మికులకు వరాలు..
టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే సింగరేణి కార్మికుల సంక్షేమంపై ప్రత్యేక దష్టి సారిస్తామని కేసీఆర్ అన్నారు. సకలజనుల సమ్మె వేతనాలను తిరిగి ఇప్పిస్తామని, వారసత్వ ఉద్యోగాలు కొనసాగిస్తామని, డిస్మిస్ కార్మికులకు ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు. అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగులకు లభించిన విధంగానే సింగరేణి కార్మికులకు స్పెషల్ ఇంక్రిమెంట్ వర్తింప చేస్తామని, భూపాలపల్లిని జిల్లా కేంద్రంగా మార్చి జయశంకర్ జిల్లాగా నామకరణం చేస్తామని వెల్లడించారు.
మానుకోటలో గిరిజన వర్సిటీ
రైతులకు లక్ష రూపాయల రుణం మాఫీ చేయిస్తానని, వృధ్ధులు, వితంతువులకు రూ.1000, వికలాంగులకు రూ.1500 పింఛన్ ఇస్తామని, వ్యవసాయ ట్రాక్టర్, ట్రాలీలకు టాక్స్ రద్దు చేస్తామని, ఆటో రిక్షాలపై రవాణా పన్ను రద్దు చేయించి పోలీస్, ఆర్టీఏ వేధింపులు అరికడుతామన్నారు. నిరుపేదలకు 125 గజాల జాగలో డబుల్ బెడ్‌రూం, కిచెన్, హాల్‌ను ఫిల్లర్లతో నిర్మించి ఇస్తామని, పాత గృహ రుణాలు మాఫీ చేయిస్తామని హామినిచ్చారు. గిరిజనులకు, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తానని అన్నారు. ఇదంతా జరగాలంటే టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడాలన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా జూరాల నుంచి వరంగల్ జిల్లా పాఖాల వరకు 391 కిలోమీటర్ల పొడవు కాలువతో కృష్ణా నీటిని పాఖాలలో కలుపుతామని, వరంగల్‌లోని కంతనపల్లి, దేవాదుల ప్రాజెక్టులను దగ్గరుండి పూర్తి చేస్తానని చెప్పారు. కంతనపల్లి ప్రాజెక్టును పూర్తి చేసి ములుగు నియోజకవర్గంలో 2లక్షల ఎకరాలకు మొదట సాగు నీరందించే బాధ్యత తనదని కేసీఆర్ అన్నారు. ఖమ్మం, వరంగల్ జిల్లాల మధ్య ఉన్న మానుకోటలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తానని కేసీఆర్ ప్రకటించారు.
రాబోయేది టీఆర్‌ఎస్ ప్రభత్వమే
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడబోతున్నదని సర్వేలన్నీ చెబుతున్నాయని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఖమ్మం సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. మూడు రోజుల నుంచి ఉత్తర తెలంగాణ జిల్లాలో ఆదిలాబాద్, కరీంనగర్ తిరుగుతూ ఈ రోజు వరంగల్‌లో తిరిగి ఇక్కడి వచ్చాను. ఈ జనాన్ని చూస్తుంటే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ క్లీన్ స్వీప్ చేస్తుందనటంలో ఎలాంటి సందేహం, అనుమానం లేదు. ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు తమ రాత తామే రాసుకోబోతున్నారు అని పేర్కొన్నారు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు ఎట్లా అమలు చేస్తారని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని పేర్కొంటూ కేసీఆర్ వివరణ ఇచ్చారు. తమిళనాడులో రామస్వామినాయక్ చేపట్టిన ఉద్యమాలతో డీఎంకే పార్టీ అధికారంలోకి వచ్చింది.
ఏ ప్రజలు అయితే పోరాటం చేశారో ఆ ప్రజల కోసం రిజర్వేషన్ పెంచాలని ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. దీనిని కేంద్రానికి పంపి రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌లో పొందుపరిచి 69శాతం రిజర్వేషన్ అమలు చేసుకుంటున్నారు. అదే పద్ధతిలో తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఒక స్పెషల్ యాక్ట్ పాస్ చేసుకుంటే.. 12 శాతం రిజర్వేషన్ అమలు చేయడం పెద్ద సమస్య కాదు అని కేసీఆర్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా కృష్ణా, గోదావరి నదులపై హక్కు ఉన్న జిల్లా అని, నాగార్జునసాగర్ ఎడమకాలువ, గార్ల, ఇల్లందు మీదుగా తిరగాల్సిన కాలువ కేఎల్‌రావు చేసిన కుట్ర వలన దానిని పాలేరు రిజర్వాయర్‌లో కలిపి ఖమ్మం జిల్లాలో ఆయకట్టును తగ్గించండం జరిగిందని పేర్కొన్నారు.
తెలంగాణ రైతాంగానికి జరుగుతున్న అన్యాయం కళ్లకు కట్టినట్లు ఈ జిల్లాలో వేంసూరు మండలంలో కన్పించింది. అక్రమంగా తవ్వుకుని తీసుకుపోయిన కాల్వలో మన రైతులు మోటార్లు పెట్టుకుని పొలం పండించుకుంటే.. ఆంధ్ర రైతులు వచ్చి మోటార్లను కాల్వల్లో పడేసిండ్రు. అప్పుడు రైతులందరూ ఆంధ్ర రైతులను బెదిరించండని నా దగ్గరకు వస్తే.. ఆరోజు తప్పక వస్తదని నేను చెప్పాను. ఇప్పుడు ఆ రోజు వచ్చింది. అదే తెలంగాణ రాష్ట్రం అని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే ఇల్లెందు, బయ్యారంలో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన చేస్తామని తెలిపారు.
బయ్యారం ఖనిజాన్ని దోచుకునేందుకు సీమాంధ్ర పెట్టుబడిదారులంతా క్యూ కట్టినా..అడ్డుకున్నది టీఆర్‌ఎస్సేనంటూ కేసీఆర్ అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఆర్‌ఎంపీ, పీఎంపీలకు శిక్షణ ఇప్పించి వారికి అర్హత సర్టిఫికెట్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వస్తే కొత్తగూడెం పట్టణాన్ని అద్భుత పట్టణంగా తీర్చిదిద్దుతానని కేసీఆర్ అన్నారు.
మణుగూరు, కొత్తగూడెం కేంద్రంగా మరో ఎన్‌టీపీసీ నిర్మాణం చేపడతామన్నారు. ఖమ్మం పట్టణంలో బహిరంగసభ అనంతరం పినపాక నియోజకవర్గంలోని మణుగూరు సభకు హాజరయ్యేందుకు హెలికాప్టర్‌లో బయలు దేరగా భద్రాచలం వైపు హెలికాప్టర్ వెల్లడంతో సిగ్నల్స్ దొరకలేదు. దీంతో హెలికాప్టర్‌ను ఇల్లెందుకు మళ్లించారు. చీకటిపడటంతో మణుగూరు పర్యటనను రద్దు చేసుకున్నారు. అనంతరం కొత్తగూడెం, వైరా సభలో కేసీఆర్ ప్రసంగించారు.
హెలికాప్టర్‌కు సిగ్నల్స్ అందక మరిపెడలో ల్యాండ్
కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌కు సిగ్నల్స్ అందకపోవడంతో మంగళవారం వరంగల్ జిల్లా మరిపెడ బహిరంగసభ వేదిక దగ్గర ల్యాండ్ అయ్యింది. దీంతో నిర్ణీత సమయముకన్న ముందే కేసీఆర్ మరిపెడ సభకు వచ్చారని భావించిన టీఆర్‌ఎస్ శ్రేణులు కలవరపడ్డారు.
కేసీఆర్ హెలికాప్టర్ దిగి వస్తుండగా టీఆర్‌ఎస్ నేతలు నూకల నరేష్ రెడ్డి, సత్యవతిరాథోడ్, శ్రీరంగారెడ్డి హెలికాప్టర్ వద్దకు ఉరుకులు పరుగులు పెట్టారు. తొర్రూరు సభ కాదా, మీరు ఉన్నారేందని కేసీఆర్ ఆ నాయకులను ప్రశ్నించగా మరిపెడ సభ అంటూ నేతలు వివరించారు. దీంతో హెలికాప్టర్ ఇక్కడ ల్యాండ్ చేశారేందని పైలెట్‌పై కేసీఆర్ ఆగ్రహం చెందారు. జీపీఆర్ సిగ్నల్స్ దొరకక అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చిందని చెప్పగా తొర్రూర్ వెళ్లాల్సిందని కేసీఆర్ ఆదేశించడంతో హెలికాప్టర్‌ను తొర్రూర్‌కు తీసుకెళ్లారు.