Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

కార్మికులపై వరాల జల్లు

-డ్రైవర్లు, హోంగార్డులు, వర్కింగ్ జర్నలిస్టులకు… -ఐదు లక్షల ఉచిత ప్రమాద బీమా – జిల్లాకు ఒక స్కిల్ బిల్డింగ్ సెంటర్ – కనీస వేతన సలహా మండలి పునరుద్ధరణ – రాష్ట్రంలో విద్యుత్ కోతలుండవ్.. పరిశ్రమలు మూతపడవ్ – కార్మికుల ఆర్థిక సాయం పెంపు.. సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ – మేడే ఉత్సవాల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు భరోసా

KCR addressing in May day celebrations

ప్రధాని మోదీ చేపట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం చాలా బాగుంది. మనమే వస్తువులను తయారుచేసే నైపుణ్యం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కార్మికులలో వృత్తి నైపుణ్యం పెంచడానికి జిల్లాకు ఒక స్కిల్ బిల్డింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం. దీనికి సంబంధించి త్వరలో విధానాన్ని ప్రకటిస్తాం. – -సీఎం కేసీఆర్

అంతర్జాతీయ కార్మిక దినోత్సవమైన మేడే రోజున కార్మికులపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వరాల జల్లు కురిపించారు. వారి ఉద్యోగానికి.. జీవితానికి పలు రక్షణలు ప్రకటించారు. రాష్ట్రంలో ఆటోలు, క్యాబ్‌లు, ట్రక్కులు సహా వివిధ రకాల వాహనాల డ్రైవర్లకు, హోంగార్డులకు, వర్కింగ్ జర్నలిస్టులకు ఉచితంగా ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఐదు లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో కార్మికుల ఉపాధి భద్రత, సంక్షేమంకోసం తమ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. కార్మికులలో నైపుణ్యం పెంచడానికి జిల్లాకు ఒక స్కిల్ బిల్డింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. కార్మికుల కుటుంబాలకు అందించే ఆర్థిక సహాయ మొత్తాలను పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో రాష్ట్ర కార్మికశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే ఉత్సవాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో డైవర్లకు, హోంగార్డులకు, వర్కింగ్ జర్నలిస్టులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నాం. రాష్ట్రంలో మొత్తం ఐదులక్షలకు పైగా ప్రైవేట్ డ్రైవర్లుంటారు. వారందరికీ ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది. హోంగార్డులు 16 వేల వరకు ఉన్నారు. మరో 12 వేల మంది వర్కింగ్ జర్నలిస్టులున్నారు. వారందరికీ ప్రమాదబీమా వర్తిస్తుంది. ఈ రోజు నుంచే అమలులోకి వస్తుంది. కార్మికుల సంక్షేమంకోసం మా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది. భవన, ఇతర నిర్మాణరంగ కార్మిక కుటుంబాలకు ఇచ్చే ఆర్థిక సహాయాలను, ప్రోత్సాహకాలను పెంచాం. ప్రమాదంలో మరణించిన వారికి ఇచ్చే ఆర్థిక సహాయాన్ని రెండు లక్షలనుంచి 5 లక్షలకు, శాశ్వత శారీరక వైకల్యానికి గురయ్యే వారికి ఆర్థిక సహాయాన్ని రెండు నుంచి 3లక్షలకు, కుటుంబంలో వివాహం సందర్భంగా ఇచ్చే సహాయాన్ని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచాం.

ప్రసూతి సమయంలో ఆర్థిక సహాయాన్ని 30వేల నుంచి 60 వేలకు, హాస్పటల్స్‌లో చికిత్సకోసం ఇచ్చే ఆర్థిక సహాయాన్ని రూ.1500 నుంచి రూ.3 వేల వరకు పెంచాం అని చెప్పారు. కనీస వేతన సలహా మండలిని పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు. అసంఘటిత రంగ కార్మికులకు యూ విన్ గుర్తింపు కార్డులిస్తామని సీఎం చెప్పారు. ఆన్‌లైన్ ద్వారానే అన్నిసేవలు అందుతాయని చెప్పారు. సమస్యల పరిష్కారానికి 1800 3070 8787 నంబరుతో ప్రత్యేక టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసినట్లు వివరించారు.

మేకిన్ ఇండియా బాగుంది ప్రధాని నరేంద్రమోదీ చేపట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం చాలా బాగుంది. ప్రతి వస్తువును దిగుమతి చేసుకోవడానికి బదులు మనమే వస్తువులను తయారు చేసే నైపుణ్యం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచీకరణలో చాలా పోటీ ఉంది. దానికి తగ్గ విధంగా నైపుణ్యం పెంచుకోవాలి. కార్మికులలో వృత్తి నైపుణ్యం పెంచడానికి జిల్లాకు ఒక స్కిల్ బిల్డింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం. దీనికి సంబంధించి త్వరలో విధానాన్ని ప్రకటిస్తాం అని చెప్పారు. స్కిల్ బిల్డింగ్ సెంటర్‌లకు కేంద్రం సహాయం అందించాలి. కేంద్ర మంత్రి దత్తాత్రేయ మన వారే. ఆయన ప్రధానితో మాట్లాడి సహాయం తీసుకురావాలి అని కోరారు. కార్మికుల సంక్షేమంకోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రులు కూడా కార్మికుల బాగు కోసం తపిస్తున్నరు. ఆదిలాబాద్ సిర్పూర్ కాగజ్‌నగర్ పేపర్ మిల్లును తెరిపించడానికి హోంమంత్రి నాయినన్న నిద్ర పోనివ్వడం లేదు. అన్నా కార్మికుల పరిస్థితి ఏమిటి.. ఫ్యాక్టరీని తెరిపించాలి.. అంటూ ఒకటే వెంట పడుతుండు. నిద్రలేకుండా కష్టపడుతుండు. కార్మికుల బాధలు చూసి కాగజ్‌నగర్ పేపర్ మిల్లు ఫ్యాక్టరీ యజమానిని నేనే స్వయంగా పిలిచి మాట్లాడిన. రాయితీలిస్తం.. ఏ సహాయం కావాలన్నా అందిస్తామని భరోసా ఇచ్చినం. కానీ చైనానుంచి పేపర్ పల్ప్ చాలా ఖరీదైందని, దిగుమతి చేసుకోవడం వల్ల భారం పెరుగుతుందని యజమాని చెప్పాడు. కాగితం ధరను చైనా పెంచడంవల్ల ఫ్యాక్టరీని నడపలేని పరిస్థితి ఏర్పడిందని బాధపడ్డడు. ఏపీ రేయాన్స్ పరిశ్రమ విషయంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కూడా అదే రీతిలో కష్టపడుతున్నారు అని సీఎం వివరించారు.

ఏడ చూడు చైనా వస్తువులే! చైనానుంచి చాలా వస్తువులను దిగుమతి చేసుకోవడంవల్ల ధరలు పెరిగి, అనర్థాలు తలెత్తుతున్నాయి. ఏడ చూడు చైనా వస్తువులే. ఊరూర చైనా బజార్‌లతో స్వదేశీ తయారీ వస్తువులకు గిరాకీ తగ్గి కార్మికులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉంది. చైనా వస్తువులు తక్కువ ధరకు దొరుకుతున్నాయని కొంటున్నరు. అవి కొన్ని రోజులకే పాడవుతున్నయ్. దిగుమతి తాకిడి పెరిగి స్పిన్నింగ్‌మిల్లులు, కాటన్‌మిల్లులు కూడా దెబ్బతింటున్నాయి. విదేశాలనుంచి దిగుమతిని తగ్గించాల్సి. దత్తన్న కూడా ఈ విషయాన్ని ప్రధానికి వివరించాలి అని కేసీఆర్ చెప్పారు.

నీతి ఆయోగ్‌తో రాష్ర్టాలకు లాభం ప్రధాని మోదీ ప్లానింగ్ కమిషన్ స్థానంలో నీతి ఆయోగ్‌ను ప్రవేశపెట్టి మంచి నిర్ణయం తీసుకున్నారు. మోదీకూడా సీఎం పనిచేసిండు కాబట్టి రాష్ర్టాల బాధలు ఆయనకు తెలుసు. నీతిఆయోగ్‌లో ముఖ్యమంత్రులకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంవల్ల రాష్ర్టాలు ఎదుర్కొంటున్న చాలా సమస్యలను డైరెక్ట్‌గా చెప్పుకోగలుగుతున్నాం. ఇంతకుముందు ప్లానింగ్ కమిషన్ సీఎంలను లెక్కచేసేది కాదు. ఎవరో బిచ్చగాళ్లను చూసినట్లే చూసేది. ఇప్పుడు ముఖ్యమంత్రులకే అవకాశం ఉంది. ముఖ్యమంత్రుల కోసం రిట్రీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నరు. అందులో కార్మికులకు సంబంధించిన సమస్యలపై మాట్లాడతాను.

రాష్ట్రంలో భారీ యంత్రాల కర్మాగారం పెట్టాలని నీతిఆయోగ్‌లో చెబుతా. ఉన్న ఒక్క హెచ్‌ఎంటీ గత ప్రభుత్వాల నిర్లక్ష్యంవల్ల మూతపడింది. దేశంలో హెవీ మిషన్ కర్మాగారం ఉంటే చాలామందికి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. నేను కేంద్ర కార్మిక మంత్రిగా ఉన్న సమయంలో కార్మిక కుటుంబాలను ఆదుకోవడానికి ప్రధానిని ఒప్పించి శ్రామిక కళ్యాణ్ యోజన పథకాన్ని తెచ్చిన. బీడీ కార్మికులకు నెలకు వేయి రూపాయల భృతిని ఇస్తున్నాం. దీంతో మూడు లక్షల 70వేల మందికి లాభం జరుగుతుంది. అని సీఎం వివరించారు.

కరెంటు కష్టాలు బంద్ కార్మిక లోకానికి చెబుతున్నా! తెలంగాణలో కరెంట్ కష్టాలు ఇక బంద్. వచ్చే మార్చివరకు మరో మూడు వేల మెగావాట్ల అదనపు విద్యుత్‌ను ఉత్పత్తి చేయబోతున్నాం. రైతులకు రాత్రి పూటకాదు.. పగటి పూటనే బాజాప్తాగా తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేస్తం. తెలంగాణ వస్తే కరెంటే రాదని ఒక మాజీ సీఎం కట్టె పెట్టి మరీ చెప్పిండు. మరి ఇయ్యాల ఏమైంది? ఇంతకు ముందు ఎప్పడు కరెంట్ పోతుందో, ఎప్పడు వస్తుందో భగవంతునికి కూడా తెలిసేది కాదు. పరిశ్రమలు మూత పడేవి. కార్మికులు రోడ్డున పడేవారు. ఇప్పుడాపరిస్థితి లేదు. ఇక పరిశ్రమలకు విద్యుత్ కోతలుండవు, కార్మికులకు ఉపాధి కష్టాలుండవు అని కేసీఆర్ చెప్పారు.

తెలంగాణకు పరిశ్రమలు క్యూకడతయ్ ప్రపంచంలో బాగా పోటీ ఉంది. పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు వస్తే ఉపాధి పెరుగుతుంది. పరిశ్రమలు స్థాపించే వారికి ప్రోత్సాహకాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలోనే బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీని తీసుకువచ్చాం. తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు వచ్చే వారికి ఒక్క పైసా లంచం లేకుండా, ఎక్కడా తిరిగే బాధ లేకుండా దరఖాస్తు చేసుకున్న 15 రోజలలోనే అన్ని రకాల అనుమతులను ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నం. పరిశ్రమలు పెట్టడానికి వచ్చేవారు ఎయిర్‌పోర్ట్‌నుంచి సక్కగ నా ఆఫీసుకే వస్తరు. వారు ఇచ్చే దరఖాస్తులను పరిశీలించి ఒక్కొక్క దశలో 15మందిని ఎంపికచేస్తం. అందరినీ ఒకేసారి ఎంపిక చేస్తే ఇబ్బందవుతుంది. ఏం సత్తా లేనోళ్లు, పత్తాలేనోళ్లు కూడా పరిశ్రమలు పెడుతమని ముందుకువస్తరు. వాటన్నిటినీ జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి.

అందుకే నా కార్యాలయంలోనే ఈ ఏర్పాట్లు చేశా. ఒక్కో దశలో 15మందిని నేరుగా ఎయిర్‌పోర్ట్‌నుంచి ఒక అధికారి సక్కగా నా కార్యాలయానికి తీసుకువస్తరు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన అధికారే అన్ని రకాల అనుమతులను తెప్పిస్తరు. మలేసియాలో ఇదే విషయం నేను చెబితే మీరు చెప్పే దాంట్లో సగం అమలు చేసినా అద్భుత ఫలితాలుంటాయి అని అక్కడి పారిశ్రామికవేత్తలన్నారు. కాదు హండ్రెడ్ పర్సెంట్ చేసి చూపుతామని అన్నా. కొన్ని రోజుల్లో తెలంగాణలో పెట్టుబడులకు పారిశ్రామిక వేత్తలు క్యూకడుతరు అని సీఎం చెప్పారు.

అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత అసంఘటిత కార్మికుల ప్రయోజనాలకోసం కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని ఇదే కార్యక్రమంలో మాట్లాడిన కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. దేశవ్యాప్తంగా 39కోట్ల అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రతకోసం స్మార్ట్ కార్డులను ఇస్తున్నట్లు వెల్లడించారు. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా కార్యక్రమాలు దేశంలోని ఉత్పాదక, కార్మిక రంగాలలో విప్లవాత్మక మార్పులను తీసుకురాబోతున్నాయని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉపాధి కల్పనా కేంద్రాలను నేషనల్ కేరీర్ సర్వీస్ ద్వారా రూ.400కోట్లతో ఆధునీకరిస్తున్నామని తెలిపారు.

లాభాల్లో వాటాలివ్వండి -నాయిని పరిశ్రమల యజమానులు తమకు వచ్చే లాభంలో కొంత మొత్తాన్ని కార్మికుల సంక్షేమానికి ఇవ్వాలని రాష్ట్ర కార్మిక, హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి సూచించారు. కొన్ని పరిశ్రమలు యూనియన్లు పెట్టకుండా కార్మికులను అడ్డుకుంటున్నాయని అన్నారు. ఇది సరైన పద్ధతి కాదని, యూనియన్లు పెట్టుకునే హక్కు కార్మికులకు ఉందని స్పష్టంచేశారు. తమ ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి, ఉపాధి కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని వివరించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, కార్మిక, ఉపాధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హర్‌ప్రీత్‌సింగ్, కార్మిక శాఖ కమిషనర్ నదీంఅహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.

శ్రమశక్తి అవార్డుల బహూకరణ మేడే ఉత్సవంలో శ్రమశక్తి, ఉత్తమ పారిశ్రామిక యాజమాన్య అవార్డులను ముఖ్యమంత్రి కేసీఆర్ బహుకరించారు. అవార్డులు అందుకున్న వారి వివరాలు ఇలా ఉన్నాయి.ఆల్ ఇండియా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ సాఫ్ యూనియన్ ఉపాధ్యక్షుడు రాపోలు కృష్ణారావు, తెలంగాణ రాష్ట్ర సమితి కార్మిక విభాగం ప్రధాన కార్యదర్శి పీ నారాయణ, హెంఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి మంద సదానందంగౌడ్, వీఎస్‌టీ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎం అశోక్‌రెడ్డి, బీహెచ్‌ఈఎల్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ నేత ఎల్లయ్య, రాష్ట్ర హింద్ మజ్దూర్ సభ ఉపాధ్యక్షుడు ఈ వెంకటేశ్, మిధాని వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు డీ నారాయణరావు, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ కొత్తగూడెం ఉపాధ్యక్షుడు ఏ శ్రీనివాస్, సిద్దిపేటకు చెందిన ట్రేడ్ యూనియన్ నాయకుడు ఎం సిరాజుద్దీన్, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం సింగరేణి కాలరీస్, కొత్తగూడెం నేత శంకర్ నాయక్, అశోక్ లేలాండ్ ఎంప్లాయీస్ యూనియన్ డీసీ యూనిట్ ఉప్పల్ ప్రధాన కార్యదర్శి పీ నర్సయ్య, ఐటీసీ భద్రాచలం పేపర్ బోర్డు ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు గోనె దరుగ, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ కొత్తగూడెం ఉపాధ్యక్షుడు ఎం సంపత్, గ్రేటర్ బల్దియా తెలంగాణ ఎంప్లాయీస్ ఉపాధ్యక్షుడు కే అమరేశ్వర్,

తెలుగునాడు ఎంప్లాయీస్ యూనియన్, రామగుండం ఎన్‌టీపీసీ అధ్యక్షుడు ఏ వెంకటేశ్వర్‌రావు, రామగుండం సూపర్ థర్మల్ పవర్‌స్టేషన్ కరీంనగర్ నేత మెరుగు శంకర్, ఓరియంట్ సిమెంట్ పర్మినెంట్ వర్కర్స్ లోకల్ యూనియన్ దేవపూర్, అదిలాబాద్ ఉపాధ్యక్షుడు సారా రాజయ్య, ఎస్‌సీఆర్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర నాయకులు ఎస్ శ్రీధర్, ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ నేత ఎన్ థామస్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ నేత ఎన్ పద్మారెడ్డి తదితరులున్నారు.

ఉత్తమ మేనేజ్‌మెంట్ అవార్డు పొందిన సంస్థలు వీఎస్‌టీ ఇండస్ట్రీస్ లిమిటెడ్, హైదరాబాద్; సాగర్ సిమెంట్ లిమిటెడ్, మెట్‌పల్లి, నల్గొండ జిల్లా; మైహోం నిర్మాణ సంస్థ మాధాపూర్, హైటెక్ సిటీ, హైదరాబాద్; ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య సంస్థ బంజారాహిల్స్; హిందూస్థాన్ కోకాకోలా బేవరేజెస్ లిమిటెడ్, అమీన్‌పూర్, హైదరాబాద్; శాంతా బయోటెక్నిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, మెడ్చల్, రంగారెడ్డి; లేజర్ షేవింగ్ ప్రైవేట్ లిమిటెడ్, బాలానగర్, హైదరాబాద్; నాట్కో ఫార్మా లిమిటెడ్, కొత్తూర్, మహబూబ్‌నగర్ జిల్లా; జేకే ఫెన్నర్ (ఇండియా) లిమిటెడ్, పటన్‌చెరు, మెదక్; సూపర్‌మ్యాక్స్ పర్సనెల్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్, ఐడీఏ, జీడిమెట్ల, హైదరాబాద్; ఒరియంట్ సిమెంట్ లిమిటెడ్, దేవన్‌పూర్, ఆదిలాబాద్. ఈ సంస్థలకు చెందిన ప్రతినిధులు ఉత్తమ యాజమాన్య అవార్డులను సీఎం చేతుల మీదుగా స్వీకరించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.