– రాష్ట్ర సాధన గమ్యాన్ని ముద్దాడినం – అభివృద్ధి గమ్యాన్ని చేరుకోవాలి – తెలంగాణ మీద కొనసాగుతున్న కుట్రలు – దూరదృష్టి లేకనే ప్రతిపక్షాలు బిత్తర, గత్తర – కాళోజీ శతజయంతి వేడుకల్లో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన గమ్యాన్ని ముద్దాడినం..ఇక మరో గమ్యం ముద్దాడాల్సిన బాధ్యత మనపై ఉంది. బాధలు, కష్టాలు లేని నవయుగం చూడాలనేది కాళోజీ కల. ఆ గమ్యాన్ని చేరేందుకు కృషి జరగాలి. ఆయన చెప్పినట్టు మానవుడు కేంద్రంగా అభివృద్ధి జరగాలి.

కొందరు తెలంగాణపై కుట్రలు ఇంకా మానుకోవడం లేదు. కొట్లాడుకుంటా బతకడం తెలంగాణకు తెలుసు.. మాతోపెట్టుకుంటే వారే దెబ్బతింటరు.. తెలంగాణ కోసం ఎంతకైనా తెగిస్తాం.. అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. మంగళవారం రవీంద్రభారతిలో కాళోజీ శత జయంతి వేడుకలను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. దీనికి ముందు కాళోజీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం శతజయంతి సమాపనోత్సవంలో ప్రధాన ప్రసంగం చేశారు. ఆయన ప్రసంగం ఆయన మాటల్లోనే..
కాలునికీ తలవంచని కాళోజి .. కాలానికే కాదు.. కాలునికీ కూడా జీ హుజూర్ అనని వ్యక్తిత్వం కాళోజీదీ, జయశంకర్ కూడా ఇదే కోవకు చెందినవారు. కాళోజీ విశ్వకవి, ఆయన రచనలు విశ్వజనీనం..సార్వజనీనం. బాధలు, కష్టాలు లేని నవయుగం ఎప్పుడు చూస్తామోనని కాళోజీ కలలు కనేవారు.. ఆ దిశగా ప్రయత్నం చేస్తాం. ఆంధ్ర వాళ్లు చొచ్చేటప్పుడు తియ్యగా మాట్లాడిండ్రు…చొచ్చిన తర్వాత మనకు తెలుగే రాదన్నరు. దీనికి కాళోజీ ముక్కు సూటిగా సమాధానం చెప్పారు. తమిళులతో కొట్లాడినపుడు వారిది ఆంధ్ర మాత, మనది తెలంగాణ తల్లి. ఆంధ్రమాతను ముంచిండ్రు. తెలంగాణ తల్లిపై కుట్ర చేసిండ్రు. తెలుగుతల్లిని తెరమీదకు తెచ్చిండ్రు.
కోపం వచ్చి తెలుగుతల్లిని దయ్యం అంటే కోపం వారికి. దీనిపై కాళోజీ నుంచి నా వరకు కొట్లాటే.. తెలంగాణ అభివృద్ధి కోసం ఎంతకైనా తెగిస్తాం..తెగింపు తెలంగాణ ప్రజలకే సాధ్యం..అది మా రక్తంలోనే ఉంది. అందుకే కాళోజీ అన్నట్లుగా గెలిచి నిలువాలన్న దాన్ని నిజం చేశాం..చేస్తాం. సర్వే చేస్తే తప్పు పట్టిండ్రు. తెలంగాణ వాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్క తీయొద్దా.. రెండు మూడు రోజుల్లో లెక్కలు బయటికి వస్తాయి. హైదరాబాద్‌లో 4 లక్షల ఇండ్లు..మనుషులు ఉంటారన్న విషయం జీహెచ్‌ఎంజీ కమిషనర్‌కే తెలియదు.. ఇదేం చందూలాల్ దర్బార్? మహానీయుల ఆవేదన అణచివేతకు గురైంది. ఇపుడు పగ్గాలు తెంపుకుని రవీంద్రభారతిలో నాట్యం చేస్తున్నది
విమర్శలకు బెదిరేది లేదు… తెలంగాణ రాష్ట్రంలో 80 శాతం మంది ప్రజలు బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారు..వీరు కేంద్ర బిందువుగా అభివృద్ధి జరగాల్సిన అవసరముంది. కొంతమంది తెలిసీ తెలియని.. దూరదృష్టిలేని, దీర్ఘదర్శులు కానివారే ఆగమై, బిత్తర, గత్తరకు లోనై ప్రభుత్వంపై విమర్శలకు పాల్పడుతున్నారు. వీరి విమర్శలకు బెదిరిపోయేది లేదు. తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తాం. కొంతమంది అధికారులు ఇంకా ఏపీ చట్టాలను ముందు పెడ్తున్నారు..తెలంగాణ దిశగా ఆలోచించండని చెప్పాను. అవసరమైతే కొత్త చట్టాలను తయారు చేయండి. శాసనసభలో ఆమోదిస్తాం అన్నాను. హైదరాబాద్‌లో నాలుగున్నర లక్షల మంది ఫుట్‌పాత్‌ల మీద పడుకుంటున్నరు..ఈ పరిస్థితి మార్చేందుకు చర్యలు తీసుకుంటా. మురికి వాడలు లేని హైదరాబాద్ చేస్తా.. మురికి లేని సమాజమే నా కల. రోడ్ మ్యాప్- మైల్‌స్టోన్ ఏంటి అనే విషయాలపై మేధావులు, ప్రజా సంఘాలతో కలిసి కమిటీ ఏర్పాటు చేస్త.
అసలైన తెలంగాణవాది.. కార్యక్రమంలో శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్ మాట్లాడుతూ కాళోజీ అసలు సిసలైన తెలంగాణ వాది అని కొనియాడారు. శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ అవినీతిపై ధిక్కార స్వరం వినిపించిన యుగపురుషుడని కాళోజీని ప్రశంసించారు. ముఖ్యమంత్రి ఓఎస్‌డీ, కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ రవీంద్రభారతి వేదికపై కాళోజీ జయంతి వేడుకల సన్నివేశం అద్భుతమన్నారు. శత జయంతి సమాపనోత్సవం అధ్యక్షులు బీ నర్సింగరావు మాట్లాడుతూ తెలంగాణను జయించిన విజయుడు కేసీఆర్ అని కితాబిచ్చారు.
తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ, కాళోజీ ఫౌండేషన్ వరంగల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు కేవి రమణాచారి దిశానిర్ధేశం చేసారు. కాళోజీ సమగ్ర సాహిత్యంపై పరిశోధన జరిపి ఎన్ యాదగిరిరావు రాసిన దిశ పుస్తకాన్ని ఈ కార్యక్రమంలో కేసీఆర్ ఆవిష్కరించారు. ప్రభుత్వ సలహాదారులు రామ్‌లక్ష్మన్, ఏకే గోయల్, ప్రఖ్యాత రచయిత అంపశయ్య నవీన్, కాళోజీ ఫౌండేషన్ అధ్యక్షులు నాగిళ్ళ రామశాస్త్రి, కాళోజీ కుమారుడు, కోడలు రవికుమార్, వాణి రవికుమార్, రాళ్లబండి కవితాప్రసాద్, అందెశ్రీ తదితరులు పాల్గొన్నారు.