Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

జిల్లాల్లో సమస్యలేమున్నాయి?

ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలుకావస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు నియోజకవర్గ, జిల్లాలవారీగా సమస్యలు, ప్రాజెక్టులు, నిధుల కేటాయింపు, తక్షణ అవసరాలపై దృష్టి సారించారు. తెలంగాణలోని పది జిల్లాల మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో శుక్రవారం టీఆర్‌ఎస్ భవన్‌లో సమావేశమయ్యారు. -ప్రజాప్రతినిధులతో సమావేశాలు.. సీఎం సమగ్ర సమీక్ష -హాజరైన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు -సమస్యల పరిష్కారంపై సానుకూలంగా స్పందించిన కేసీఆర్ -జిల్లా మంత్రితో చర్చించి ప్రతిపాదనలు ఇవ్వాలని ఆదేశం

KCR 02

ముందుగా అన్ని జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులతో మాట్లాడిన ఆయన.. తర్వాత జిల్లాలవారీగా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి? విపక్షాల విమర్శలను ఎలా ఎదుర్కోవాలి? అనే అంశాలపై దిశానిర్దేశం చేశారు. ప్రస్తుత పరిస్థితులను ప్రజాప్రతినిధులకు వివరిస్తూనే, నియోజకవర్గాలు, జిల్లాలవారీగా సమస్యల జాబితా, అవసరమైన నిధులు, ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ఇన్‌చార్జిల బాధ్యతలు వివరించారు.

కొందరు ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గ, జిల్లా సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లగా.. పరిష్కారానికి సానుకూలంగా స్పందించారని తెలిసింది. మిగతా వాటి విషయంలో జిల్లా మంత్రితో సమావేశమై ప్రతిపాదనలను సమర్పించాలని ఆదేశించినట్లు సమాచారం. దీంతో మంత్రుల ఆధ్వర్యంలో ఆయా జిల్లా ప్రజాప్రతినిధులు శనివారం సీఎంకు ప్రతిపాదనలు సమర్పించనున్నారు.

ఆదిలాబాద్ జిల్లా: మంచిర్యాలను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని జిల్లా ప్రతినిధులు సీఎం దృష్టికి తీసుకెళ్లగా.. జిల్లాల పునర్విభజనలో తొలి ప్రాధాన్యం మంచిర్యాలకే ఇవ్వనున్నట్లు సీఎం హామీ ఇచ్చినట్లు తెలిసింది. అంతర్గత, అంతరాష్ట్ర రోడ్ల నిర్మాణానికి నిధుల విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

జిల్లాలో సాగునీటి పరిస్థితి, కొత్త ప్రాజెక్టులపై ప్రతిపాదనలు మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో ఇవ్వనున్నారు. తెల్లరేషన్‌కార్డుల విషయంలో ఐదెకరాల నిబంధనపై చర్చకు వచ్చినట్లు తెలిసింది. రైతులు వర్షాలులేక ఇబ్బంది పడుతున్నారని.. ఐదెకరాల నిబంధన తొలగించాలని కోరారు. ఇందుకు స్పందించిన సీఎం.. ఆ నిబంధన పాతదేనని చెప్పారు. ఆదాయ పరిమితిని రూ.2లక్షల వరకు పెంచేందుకు పరిశీలిస్తున్నామని ప్రజాప్రతినిధులకు చెప్పినట్లు తెలిసింది.

నల్లగొండ: శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి రెగ్యులర్‌గా నీటి విడుదల చేయాలని.. నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో పంటను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజాప్రతినిధులు సీఎంను కోరినట్లు తెలిసింది. ఇటీవల ఆరు పట్టణాలను స్మార్ట్ సిటీలుగా మార్చే విషయంలో కేంద్రానికి రాష్ట్రం ప్రతిపాదించగా.. అందులో నల్లగొండ పట్టణాన్ని కూడా చేర్చాలని సీఎంను కోరినట్లు సమాచారం. విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా సమస్యలు, ప్రతిపాదిత ప్రాజెక్టులు, అవసరమైన నిధులు, పనుల ప్రాధాన్య క్రమాన్ని సీఎంకు లిఖిత పూర్వకంగా సమర్పించనున్నారు.

ఖమ్మం: పోలవరం ముంపు ప్రాంతాల్లోని ఏడు మండలాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయులు సుమారు 1500-1600మంది పని చేస్తున్నారని, వీరంతా ప్రస్తుతం అయోమయంలో ఉన్నారని సీఎం దృష్టికి ఆ జిల్లా ప్రజాప్రతినిధులు తీసుకెళ్లారు. ఖమ్మం జిల్లా వైరా ప్రాజెక్టుకు నికర జలాలు కేటాయిస్తే 30వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుందని, అందుకు రూ.62కోట్లతో కాల్వల ఆధునీకరణ చేపట్టాలని కోరగా.. సీఎం సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. వైరా సెగ్మెంట్‌లో 278కి.మీ. పొడవున 102 లింకు రోడ్లకు ప్రతిపాదనలు ఇచ్చారు. ఇల్లెందు నియోజకవర్గం బయ్యారం చెరువు పనులకోసం రూ.50కోట్లు నిధులు కోరినట్లు తెలిసింది. కొత్తగూడెం నియోజకవర్గానికి సంబంధించి నేడు సీఎంకు ప్రతిపాదనలు ఇవ్వనున్నారు.

మెదక్ జిల్లా : వచ్చే ఐదేళ్లలో ఏమేం కార్యక్రమాలు, అభివృద్ది పనులు చేపట్టాలో ప్రణాళికను తయారు చేశారు. ప్రాధాన్యతా క్రమంలో బడ్జెట్‌ను ఈ పనులకు కేటాయించేలా ప్రణాళిక సిద్ధం చేసి సీఎంకు సమర్పించాలని నిర్ణయించారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేల నుంచి ప్రతిపాదనలు రావాల్సి ఉంది. శనివారం మధ్యాహ్నం సీఎంకు పూర్తి ప్రతిపాదనలు ఇవ్వనున్నారు.

చేగుంట ఆయకట్టు లైనింగ్ పనులు, డిగ్రీ కాలేజీలు, కొంతూరు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు, చేగుంట-వడియారం-మెదక్ 21కి.మీ. ఆర్‌అండ్‌బీ రోడ్డు విస్తరణ, బోధన్ – హైదరాబాద్ ఫోర్ లైన్ చేయటంవల్ల మెదక్ రోడ్డు విస్తరణ అవకాశముంటుందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. చేగుంట-దుబ్బాక పీబ్ల్యూడీ రోడ్డు విస్తరణ, జిల్లా వ్యాప్తంగా ఖాళీల భర్తీ, కొత్తగా ప్రభుత్వ దవాఖానల ఏర్పాటుపై సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మహబూబ్‌నగర్: తమ జిల్లాకు మంత్రి లేడని.. పనులు, ఇతర కార్యక్రమాల విషయంలో ఇబ్బంది అవుతున్నదని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

దీనికి సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్.. త్వరలో పరిష్కారానికి హామీ ఇచ్చినట్లు తెలిసింది. మహబూబ్‌నగర్‌లో ఎయిమ్స్‌తోపాటు, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రతిపాదనలు పెట్టగా.. రూ.800కోట్లు విడుదల చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి త్వరలో తాను శంకుస్థాపన చేస్తానని, వాటర్ గ్రిడ్ కూడా వస్తుండటంతో తాగునీటి సమస్యలు తీరుతాయని తెలిపారు. వీటితో ఒక ఫుడ్, అక్వారెల్ పార్కు, వెయ్యి మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టుతో పాటు మరో వెయ్యి మెగావాట్ల సోలా ర్ పవర్ ప్రాజెక్టును కూడా మంజూరు చేయాలని కోరారు.

కరీంనగర్: కరీంనగర్-మనోహరాబాద్-సికింద్రాబాద్ రైల్వే లైను ప్రతిపాదనలు ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని.. ఈ సారి బడ్జెట్‌లో కేంద్రం నిధులు మంజూరు చేసేలా చూడాలని సీఎంను కరీంనగర్‌జిల్లా ప్రజాప్రతినిధులు కోరారు. కేంద్రంతో మాట్లాడి రైల్వే బడ్జెట్‌లో నిధుల మంజూరుకు కృషి చేస్తానని సీఎం హామీ ఇచ్చినట్లు తెలిసింది. కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మంజూరు చేయాలని సీఎం కేసీఆర్‌కు ప్రతిపాదించారు.

జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ఈటెల రాజేందర్, కల్వకుంట్ల తారక రామారావు ఆధ్వర్యంలో శనివారం సీఎంకు ప్రతిపాదనలు సమర్పించనున్నారు. వరంగల్ జిల్లా: జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు మరింతగా నిధులు ఇవ్వాలని జిల్లా ప్రజాప్రతినిధులు కోరినట్లు తెలిసింది. వరంగల్, ఖాజీపేట, హన్మకొండ పట్టణాలకు చుట్టూరా ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేయాలని కోరారు. కంతనపల్లి ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు కేటాయించి.. యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని విన్నవించారు. రంగారెడ్డి : వెనుకబడ్డ ప్రాంతంగా ఉన్న వికారాబాద్‌ను ప్రత్యేకంగా అభివృద్ధి చేసేందుకు నిధుల కేటాయింపు, ప్రాజెక్టుల ఏర్పాటులో ప్రాధాన్యం ఇవ్వాలని ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారు.

నిజామాబాద్ జిల్లా: అంతర్గత రహదారుల నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు. మెదక్-నిజామాబాద్ మధ్య ఎల్లారెడ్డి నియోజకవర్గంలో వంతెన నిర్మిస్తే దూరభారం తగ్గుతుందని సీఎం కేసీఆర్ దృష్టికి జిల్లా ప్రజాప్రతినిధులు తీసుకెళ్లారు.

గ్రేటర్ హైదరాబాద్: గ్రేటర్ సమీక్షలో ప్రధానంగా పార్టీ బలోపేతంపైనే సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారు. పార్టీని బలోపేతం చేయాలటే గ్రేటర్‌లోని నియోజకవర్గ ఇన్‌చార్జిలు పరిస్థితిపై సమీక్ష చేయాలని ప్రజాప్రతినిధులు సీఎంకు సూచించినట్లు తెలిసింది. గ్రేటర్‌లో పార్టీ బలోపేతం, గ్రేటర్ బలోపేతం శనివారం హోంశాఖ మంత్రితో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు సమావేశం కానున్నారు.

 

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.