Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

జాతీయపార్టీలు విఫలం

-అన్నిఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే హవా
-బీజేపీ, కాంగ్రెస్‌ కూడా పెద్దసైజు ప్రాంతీయ పార్టీలే
-‘టైమ్స్‌నౌ’ యాక్షన్‌ప్లాన్‌-2020 సమ్మిట్‌లో మంత్రి కేటీఆర్‌
-రాష్ర్టాలు బలపడితేనే దేశం బలపడుతుంది
-తెలంగాణ ఇచ్చిన దానికంటే కేంద్రం 1.57 లక్షల కోట్లు తక్కువిచ్చింది
-నిధుల విడుదలపై కేంద్ర ఆర్థిక మంత్రి మాటలు సరికావు
-పెద్దనోట్ల రద్దుకు మద్దతిచ్చినందుకు చింతిస్తున్నాం

దేశంలో జాతీయ రాజకీయ పార్టీలు విఫలమయ్యాయని, ఆ రెండు జాతీయ పార్టీలకు (బీజేపీ, కాంగ్రెస్‌కు) ప్రాంతీయ పార్టీలు బలమైన ప్రత్యామ్నాయాలుగా మారబోతున్నాయని, గత కొంతకాలంగా జరుగుతున్న అన్ని ఎన్నికల్లోనూ ప్రాంతీయ పార్టీలే బలమైన ప్రత్యామ్నాయాలుగా ఎదుగుతున్నాయని రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న పార్టీలన్నీ సాంకేతికంగా ప్రాంతీయ పార్టీలేనని, దేశవ్యాప్తంగా ఉనికి, యంత్రాంగం ఉన్న జాతీయ పార్టీలేవీ లేవని, బీజేపీ, కాంగ్రెస్‌ సైతం పెద్దసైజు ప్రాంతీయ పార్టీలేనని పేర్కొన్నారు.

దేశంలో ప్రత్యామ్నాయ కూటమికి అవకాశాలు ఏర్పడుతున్నాయని చెప్పారు. గత 70 ఏండ్లుగా కాంగ్రెస్‌, బీజేపీ దేశాన్ని నిరాశపర్చాయని, ఆర్థిక అభివృద్ధి, మౌలికవసతులు, సదుపాయాల కల్పన, సంక్షేమ కార్యక్రమాల రూపకల్పన తదితర అంశాల్లో ఆ పార్టీలు ప్రజల ఆకాంక్షలను అందుకోలేకపోయాయని, ఈ విషయాన్ని దేశ ప్రజలు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారని చెప్పారు. ‘టైమ్స్‌నౌ’ వార్తాచానల్‌ గురువారం ఢిల్లీలో నిర్వహించిన యాక్షన్‌ ప్లాన్‌-2020 సమ్మిట్‌లో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ‘దేశ నిర్మాణంలో రాష్ట్రాల పాత్ర’ అనే అంశంపై జరిగిన చర్చాగోష్ఠిలో పారిశ్రామికరంగంతోపాటు వివిధ సమాకాలీన అంశాలపై కేటీఆర్‌ తన అభిప్రాయాలను వెల్లడించారు. భారతదేశం రాష్ట్రాల సమాఖ్య అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని, రాష్ర్టాలు బలపడినప్పుడే దేశం బలంగా ఉంటుందని స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని విధానాలను తీసుకొచ్చినా, ఎలాంటి కార్యక్రమాలను చేపట్టినా వాటి ఆచరణ, అమలు అంతా రాష్ర్టాల్లోనే ఉంటుందన్న విషయం మర్చిపోకూడదని, ‘మేకిన్‌ ఇండి యా’ లాంటి కార్యక్రమాల్లోనూ రాష్ట్రాల కార్యాచరణ, అనుమతులు, రాష్ట్ర ప్రభుత్వశాఖల సహకారం కీలకంగా ఉంటుందన్నారు.

తీసుకున్నదెంత? ఇచ్చిందెంత?
రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం తన సొంత నిధులు ఇస్తున్నట్టు ఆలోచించడం మంచిదికాదని, కేంద్రానికి రాష్ట్రాలు నిధులు సమకూరుస్తున్న విషయాన్ని మరువకూడదని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. దేశంలో ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొనేందుకు, పారిశ్రామిక ప్రగతికి కేంద్రం మరింత ఉదారంగా ముందుకురావాలని సూచించారు. కేంద్రం నుంచి తెలంగాణకు రూ.5 వేల కోట్ల జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) బకాయిలు రావాల్సి ఉన్నదన్నారు. గత ఐదేండ్లలో కేంద్రానికి తెలంగాణ రూ.2.72 లక్షల కోట్లు ఇస్తే.. కేంద్రం నుంచి రాష్ర్టానికి రూ.1.15 లక్షల కోట్లు మాత్రమే వచ్చాయని, దేశ నిర్మాణానికి తెలంగాణ గత ఐదేండ్లలో రూ.1.57లక్షల కోట్లు ఇచ్చిందని తెలిపారు. ఈ వాస్తవాలను పక్కనపెట్టి తెలంగాణకు ఏదో ఇచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం చెప్పడం సరికాదన్నారు.

వారు శత్రువులు కాదు..
బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలను వ్యక్తిగత శత్రువులుగా భావించడంలేదని, కేవలం రాజకీయ ప్రత్యర్థులుగా పరిగణించి ఎన్నికల్లో పోరాడుతున్నామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. కేంద్రంలోని అధికార పార్టీ భావజాలాన్ని, సిద్ధాంతాలను వ్యతిరేకించినంతమాత్రాన ఆ ప్రభుత్వం రాష్ట్రాలను లేదా ఇతర పార్టీలను శత్రువులుగా చూడాల్సిన అవసరంలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలకు తాము అంశాలవారీగా మద్దతిచ్చామని, కేంద్రం చేపట్టిన ప్రజావ్యతిరేకమైన చర్యలను అదేవిధంగా వ్యతిరేకించామని చెప్పారు. సీఏఏ (పౌరసత్వ సవరణ చట్టం) బిల్లును పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ తీవ్రంగా వ్యతిరేకించిందని, ఇలాంటి వివాదాస్పద చట్టాల కంటే కేంద్రం దృష్టిసారించాల్సిన ప్రాధాన్య అంశాలు చాలా ఉన్నాయన్నది టీఆర్‌ఎస్‌ అభిప్రాయమని తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా ఉన్న భారతదేశంలో ఆర్టికల్‌ 370 రద్దును, సీఏఏని ఒకేవిధంగా చూడలేమన్నారు.

హైదరాబాద్‌ రెండో రాజధానిపై..
ప్రజల మెరుగైన జీవనానికి అత్యుత్తమ అవకాశాలున్న నగరాల్లో హైదరాబాద్‌ గత ఐదేండ్ల నుంచి అగ్రస్థానంలో కొనసాగుతున్నదని, దీన్ని దేశానికి రెండో రాజధానిగా ప్రకటించాల్సి వస్తే హైదరాబాద్‌ ప్రజలు అంగీకరిస్తారా? లేదా? అన్నదానిపై తనకు అనుమానమున్నదని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. కో-ఆపరేటివ్‌ ఫెడరలిజం, టీమిండియా లాంటి మాటలు చెప్పే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆ భావనల స్ఫూర్తితో పనిచేయాలని కోరుకుంటున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి ఆర్థికంగా సహకరించాలని నీతి ఆయోగ్‌ పలుమార్లు కేంద్రానికి సూచించినా ఇప్పటివరకు మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, కాళేశ్వరం లాంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేశారు.

అవి పెద్దసైజు ప్రాంతీయ పార్టీలే..
ప్రస్తుతం దేశంలో ప్రాంతీయ పార్టీలు, పెద్దసైజు ప్రాంతీయ పార్టీలు మాత్రమే ఉన్నాయని, జాతీయ పార్టీలు లేవని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. దక్షిణ భారత దేశంలో బీజేపీ కర్ణాటకలో మినహా మరెక్కడా లేదని, అలాంటప్పుడు అది ఏవిధంగా జాతీయ పార్టీ అవుతుందని ప్రశ్నించారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నప్పుడు యూనియన్‌ ఆఫ్‌ స్టేట్స్‌, గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా అని ఉన్నదే తప్ప సెంట్రల్‌ గవర్నమెంట్‌ అనే పదం లేదని తెలిపారు. రాష్ట్రాలు బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుందన్నారు.

పెద్దనోట్ల రద్దుకు మద్దతుపై చింతిస్తున్నాం..
పెద్దనోట్ల రద్దుకు మద్దతిచ్చినందుకు చింతిస్తున్నామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పూర్ణక్రాంతి పథకంలో నడుస్తున్నామని, అందులో భాగంగానే పెద్దనోట్లను రద్దుచేసినట్లు అప్పట్లో ప్రధాని మోదీ చెప్పారని, కానీ అచరణలో ఆ విధంగా జరగలేదని అన్నారు. పెద్దనోట్ల రద్దుపై అసెంబ్లీలో కూడా చర్చించి మద్దతు ఇచ్చామని, అందుకు ఇప్పుడు చింతిస్తున్నామని చెప్పారు. పెద్దనోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని, ఆర్థిక వృద్ధి ఆటంకం కలిగిందని తెలిపారు. జీడీపీ గణనీయంగా తగ్గడానికి అది కూడా ఓ కారణమన్నారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన రాహుల్‌ గాంధీ టీఆర్‌ఎస్‌ను బీజేపీకి బీ టీం అన్నారని, అలాగే ప్రధాని మోదీ వచ్చి టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌కు బీ టీం అన్నారని మంత్రి కేటీఆర్‌ గుర్తుచేస్తూ.. తాము ఎవరికీ బీ టీం కాదని, తెలంగాణ ప్రజలకు టీఆర్‌ఎస్‌ ఏ టీం అని స్పష్టంచేశారు.

కేంద్రానికే ఎక్కువిచ్చాం
-గత ఐదేండ్లలో రూ.2.72 లక్షల కోట్లు చెల్లించాం
-తెలంగాణకు కేంద్రం ఇచ్చింది రూ.1.12 లక్షల కోట్లే
-రాష్ర్టానికి ఎక్కువ నిధులిచ్చామనడం సరికాదు

ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్‌
తెలంగాణకు ఎక్కువ నిధులిచ్చామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌ వేదికగా మాట్లాడటం బాధకలిగించిందని రాష్ట్ర మున్సిపల్‌, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. గత ఐదేండ్లలో తెలంగాణ నుంచి వివిధ పన్నుల రూపేణా కేంద్రానికి రూ.2,72,926 కోట్లు చేరాయన్నారు. రాష్ట్రాల నుంచి జమ అయిన నిధులనే కేంద్రం తిరిగి రాష్ట్రాలకు కేటాయిస్తుందనే విషయాన్ని గమనించాలని, దీనిలో తెలంగాణ వాటా ఎక్కువగా ఉన్నదన్న విషయాన్ని గుర్తుచేసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు కేంద్రం నుంచి రాష్ర్టానికి రూ.1,12,854 కోట్లు మాత్రమే వచ్చాయని, తెలంగాణ నుంచి రూ.1,60,072 కోట్లు ఎక్కువగా ఇచ్చామని మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో వివరించారు. తెలంగాణకు కేంద్రం ఏ మేరకు నిధులు విడుదల చేసిందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఆయన కోరారు. కేంద్ర మంత్రిపై విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితి రాకూడదన్నారు. గత ఐదేండ్లలో కేంద్రానికి తెలంగాణ చెల్లించిన పన్నుల లెక్కలను మంత్రి కేటీఆర్‌ సమగ్రంగా వివరించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.