-రెండురోజుల్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులు -రైతు కష్టం తెలిసిన ప్రభుత్వం మాదే -ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం -చెక్కుల పంపిణీలో వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి

ఎర్రజొన్న రైతుల రెక్కల కష్టం తెలిసిన ప్రభుత్వం తమదేనని, అందుకే బకాయిలను చెల్లిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని దేగాంలో ఆర్మూర్ మండలానికి చెందిన ఎర్రజొన్న రైతుల బకాయిల పంపిణీ కార్యక్రమంలో, కోటగిరి క్రీడోత్సవాల్లో ఆయన మాట్లాడారు. ఆర్మూర్ ప్రాంతానికి చెందిన రైతులు ఆరేండ్లుగా ఎర్రజొన్న బకాయల కోసం ఎన్నో పోరాటాలు చేశారని, గత ప్రభుత్వాలు ఎర్రజొన్న బకాయిలు చెల్లించడంలో నిర్లక్ష్యం చేశాయని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్మూర్ సభలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఏర్పాటైన రెండు నెలల్లోనే ఆర్మూర్‌కు వచ్చిన సందర్భంలో ఎర్రజొన్న బకాయిలు చెల్లిస్తామని ప్రకటించారని గుర్తుచేశారు. ప్రభుత్వం ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లోని పది మండలాల పరిధిలోని 141 గ్రామాలకు చెందిన రైతులకు క్వింటాల్‌కు రూ.340 చొప్పున మొత్తం రూ.3,04,90,407 ఎర్రజొన్న బకాయిలు చెల్లిస్తున్నట్లు చెప్పారు. ఇవి రెండు, మూడు రోజుల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లోకి చేరుతాయన్నారు. జూలై 16న క్యాబినెట్ సమావేశంలో 43 కీలక అంశాలపై నిర్ణయా లు తీసుకొని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తమది మాట నిలబెట్టుకునే ప్రభుత్వమని, ప్రభుత్వం ఏర్పాటైన రెండు నెలల్లోనే ప్రజలకిచ్చిన పలు హామీలపై కసరత్తు ప్రారంభించి చిత్తశుద్ధిని నిరూపించుకుంటున్నదన్నారు. కాంగ్రెస్, టీడీపీల్లా హామీలను తుంగలో తొక్కే సంస్కృతి తమ ప్రభుత్వానిది కాదన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించాలన్న ఉద్దేశంతోనే సమగ్ర కుటుంబ సర్వేను చేపట్టామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ వినియోగం 8వేల మెగావాట్లు ఉండగా, ప్రస్తుతం నీటి ద్వారా 2,100 మెగావాట్లు, బొగ్గు ద్వారా 2,300 మెగావాట్లు ఉత్పత్తి అవుతుందన్నారు. ఇలా జరగడానికి 42 ఏండ్ల కాంగ్రెస్, 16 ఏండ్ల టీడీపీ పాలనే కారణమని ఆరోపించారు. ఇతర రాష్ర్టాల నుంచి విద్యుత్ కొనుగోలు చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారన్నారు. రాష్ట్రంలో మూడేండ్లలో ప్రభుత్వరంగ సంస్థ జెన్‌కో ద్వారా 6 నుంచి 8వేల మెగావాట్ల విద్యుత్‌ను తయారుచేసి రైతులకు నిరంతరాయంగా 24 గంటల పాటు సరఫరా చేస్తామని చెప్పారు.
రుణమాఫీ కచ్చితంగా అమలుచేస్తాం రాష్ట్రంలో 39 లక్షల మంది రైతులకు రూ.17,900 కోట్ల రుణమాఫీ చేయనున్నట్లు మంత్రి పోచారం వివరించారు. రూ.లక్షలోపు పంట రుణాలను కచ్చితంగా ఈనెల చివరి లోపు మాఫీ చేస్తామని ఎలాంటి అనుమానం అవసరం లేదని, రుణ మాఫీ అయిన వెంటనే బ్యాంకుల్లో మళ్లీ రైతులకు పంట రుణాలు ఇచ్చేటట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని స్పష్టంచేశారు. ఒక సహకార సొసైటీలో రూ.40 వేలు, మరో బ్యాంకులో రూ.30 వేలు రుణం ఉన్నా కూడా మాఫీ వర్తిస్తుందన్నారు. 2009 నుంచి 2014 వరకు వడగండ్ల వానకు పంటలు నష్టపోయామని, వాటికి పరిహారం కోసం గత ప్రభుత్వం వద్దకు వెళ్తే పట్టించుకోలేదని, అలాంటి నాయకులు నేడు విమర్శలు చేయడం విడ్డురంగా ఉందని ఎద్దేవాచేశారు. తమ ప్రభుత్వం ఏర్పడగానే మొట్టమొదటగా పంట నష్టపరిహారం కింద రూ.480 కోట్లు విడుదలు చేసిందని గుర్తుచేశారు.