Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

ఐటీఐఆర్‌ఇవ్వరేం?

-2014 నుంచి ఐటీఐఆర్‌పై స్పష్టత లేని కేంద్రం
-మీరు తెస్తామన్న మేలైన విధానం ఏమైంది?
-కేసీఆర్‌ ఎన్ని లేఖలు రాసినా స్పందన లేదు
-పునరుద్ధరణాప్రత్యామ్నాయమా ఏదో ఒకటి తేల్చండి
-కేంద్రమంత్రి రవిశంకర్‌కు మంత్రి కేటీఆర్‌ లేఖ

ప్రపంచంలో ఆర్థిక మందగమనం, కొవిడ్‌ సంక్షోభం నేపథ్యంలో కంపెనీలు పూర్వస్థితికి వెళ్లేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నది. ఈ కీలకమైన సమయంలో హైదరాబాద్‌కు ఐటీఐఆర్‌ లేదా అంతకన్నా మెరుగైనది అందిస్తే ఐటీ పరిశ్రమకు, దానివృద్ధికి ఊతం ఇచ్చినట్టు అవుతుంది. కేంద్రం చెప్తున్న మేకిన్‌ఇండియా, ఆత్మనిర్భర్‌ భారత్‌ వంటి కార్యక్రమాల స్ఫూర్తితో ఐటీఐఆర్‌ ప్రారంభిస్తే బాగుంటుంది. అనేక ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. ఈ దిశగా సానుకూల నిర్ణయం తీసుకోవాలి.
-కేంద్రమంత్రికి రాసిన లేఖలో కేటీఆర్‌

నిరుద్యోగ యువతకు ఉపాధిని కల్పించేందుకు ఉద్దేశించిన ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌ (ఐటీఐఆర్‌)పై సరైన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు కేంద్రాన్ని కోరారు. ఐటీఐఆర్‌పై 2014 నుంచి కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన విధానం లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఐటీఐఆర్‌ను పునరుద్ధరించాలని లేదా మరో మేలైన విధానం అవలంబించాలని సూచించారు. మంత్రి కేటీఆర్‌ గురువారం కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌కు లేఖ రాశారు. ఐటీఐఆర్‌ నేపథ్యం, దానిస్థాపన కోసం రాష్ట్రప్రభుత్వం చేసిన ప్రయత్నాలు, ఆరున్నరేండ్లుగా కేంద్రం అనుసరిస్తున్న విధానం.. తద్వారా నెలకొన్న పరిణామాలను లేఖలో ప్రస్తావించారు. కేటీఆర్‌ కేంద్రానికి రాసిన లేఖ పూర్తి పాఠమిదీ.

తెస్తామన్న మేలైన విధానం ఏది?
ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌ పేరిట 2008లో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టిన నాటి కేంద్ర ప్రభుత్వం 2010లో హైదరాబాద్‌, బెంగళూరులను ఎంపిక చేసింది. రాష్ట్రప్రభుత్వం హైదరాబాద్‌లో మూడు క్లస్టర్ల కింద 49వేల ఎకరాలను దీనికోసం గుర్తించింది. తద్వారా నూతన ఐటీ కంపెనీలను రప్పించేందుకు, పెట్టుబడులకు ప్రోత్సాహకంగా సుమారు రూ.3,275 కోట్లతో వివిధ కార్యక్రమాలను చేపట్టేందుకు అంగీకరించిన కేంద్రం.. రెండుదశల్లో ఈ నిధులను ఖర్చుచేయాలని నిర్ణయించింది. ఇందులో మొదటిదశ కార్యక్రమం పనులను 2018 నాటికి రూ.165 కోట్లతో పూర్తిచేయాలి. రెండోవిడుతలో వివిధదశలుగా 20 ఏండ్లలో పూర్తిచేయాల్సి ఉన్నది. మొదటిదశలో భాగంగా గుర్తించిన అంశాల్లో రైల్వే, రోడ్డు రవాణా శాఖలకు సంబంధించి అదనపు బడ్జెట్‌, నిధుల కోసం రాష్ట్రప్రభుత్వం కేంద్రంతో నిరంతరం సంప్రదిస్తూనే ఉన్నా.. ఇప్పటికీ ఎలాంటి కార్యక్రమాలు ప్రారంభం కాలేదు. 2014లో కేంద్రంలో నూతన ప్రభుత్వం వచ్చాక ఐటీఐఆర్‌ ప్రాజెక్టు నమూనాను సమీక్షించి, మరింత మేలైన పథకాన్ని తీసుకొస్తామని చెప్పింది. 2017లో ఐటీఐఆర్‌ భాగస్వాములతో విస్తృతస్థాయి చర్చలు జరిపినా.. ఇప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. సీఎం కేసీఆర్‌ అనేకసార్లు కేంద్రానికి లేఖలు రాసినా కీలకమైన కార్యక్రమంపై గత ఆరేండ్లలో ఎలాంటి స్పందన రాలేదు.

రాష్ర్టానికి ప్రతిష్ఠాత్మక కంపెనీలు
తెలంగాణలో ఐటీ ఉద్యోగుల సంఖ్య దాదాపు రెట్టింపయింది. అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, ఆపిల్‌, ఫేస్‌బుక్‌, సేల్స్‌ ఫోర్స్‌, సర్వీస్‌నౌ వంటి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు తమ పెట్టుబడులకు హైదరాబాద్‌ను గమ్యస్థానంగా ఎంచుకున్నాయి. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, డాటా అనలిటిక్స్‌, ఐవోటీ, సైబర్‌ సెక్యూరిటీ, డిజిటల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ టెక్నాలజీస్‌, గేమింగ్‌, యానిమేషన్‌, గ్రాఫిక్స్‌, బ్లాక్‌చైన్‌ తదితర సాంకేతికరంగాల్లోనూ తెలంగాణ ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలతో ముందుకుపోతున్నది. ఇన్నోవేషన్‌ రంగంలోనూ టీహబ్‌, టీవర్క్‌, వీహబ్‌, టాస్క్‌ వంటి ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టింది. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్‌ ఎకనమిక్‌ స్లోడౌన్‌, కొవిడ్‌ సంక్షోభం నేపథ్యంలో కంపెనీలు పూర్వస్థితికి వెళ్లేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నది. ఇలాంటి అత్యంత కీలకమైన సమయంలో హైదరాబాద్‌ నగరానికి ఐటీఐఆర్‌ లేదా అంతకుమించి మెరుగైన కార్యక్రమాన్ని అందిస్తే ఐటీ పరిశ్రమకు, దానివృద్ధికి బలమైన ఊతం ఇచ్చినట్టు అవుతుంది. కేంద్రం గత కొన్నేండ్లుగా చెప్తున్న మేకిన్‌ఇండియా, ఆత్మనిర్భర్‌ భారత్‌ వంటి కార్యక్రమాల స్ఫూర్తితో ఐటీఐఆర్‌ ప్రారంభిస్తే బాగుంటుంది. ఐటీఐఆర్‌ను పునరుద్ధరించడం ద్వారా అనేక ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. ఈ దిశగా సానుకూల నిర్ణయం తీసుకోవాలి.

కేంద్రం నుంచి స్పందన లేకపోయినా
ఐటీఐఆర్‌ వంటి ప్రాధాన్యం ఉన్న అంశంపై కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోయినా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక తెలంగాణ ఐటీ రంగంలో గొప్పవృద్ధిని సాధించింది. 2014లో రూ.57,258 కోట్లు ఉన్న ఐటీ ఎగుమతులు 2019- 20 నాటికి రూ.1,28,807 కోట్లకు పెరిగాయి. ఆరేండ్లలో స్థూలంగా 110 శాతం వృద్ధిని సాధించింది. ఇది జాతీయ సగటు కన్నా ఎంతో ఎక్కువ.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.