-ఆఫీస్ స్పేస్ ఆక్యుపెన్సీలో బెంగళూరును దాటాం -ఢిల్లీ పెద్దలు ఉద్ధరిస్తారని ఎదురుచూడటం లేదు -అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో మంత్రి కేటీఆర్ -తెలంగాణ ఔన్నత్యాన్ని చాటడానికి మిద్దెలెక్కి అరుస్తం -నేటి తెలంగాణ ఆలోచనలే.. రేపు దేశానికి ఆదర్శం -ఎమ్మెల్యేలు, జర్నలిస్టుల ఇండ్లస్థలాల అంశం సుప్రీం విచారణలో ఉన్నది -సమాచారశాఖ పద్దులపై చర్చలో కేటీఆర్

ఐటీరంగానికి సంబంధించి ఆఫీస్ స్పేస్ ఆక్యుపేషన్‌లో హైదరాబాద్ నగరం బెంగళూరును దాటిపోయిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. రాష్ట్రంలో ఐటీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య ఐదున్నర లక్షలకు చేరుకొన్నదని.. రాష్ట్ర ఏర్పాటుకు ముందువరకు ఈ సంఖ్య కేవలం మూడు లక్షలే ఉండేదని గుర్తుచేశారు. శనివారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్ సమాధానమిస్తూ పారిశ్రామికరంగంలో తెలంగాణ అనూహ్యమైన అభివృద్ధిని సాధించిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిచెందిన అమెజాన్, గూగుల్, ఫేస్‌బుక్, యాపిల్ వంటి కంపెనీలు బెంగళూరును కాదని హైదరాబాద్‌కు వచ్చాయని చెప్పారు. టీఎస్‌ఐపాస్ ద్వారా 12.67 లక్షల ఉద్యోగాలను సృష్టించామన్నారు. ఎన్డీయే, యూపీయే ప్రభుత్వాలు హైదరాబాద్‌లో ఐటీఐఆర్‌కు ఒక్కపైసా ఇవ్వలేదని.. పైగా ఐటీఐఆర్‌ను ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వమే పక్కనపెట్టిందని మంత్రి కేటీఆర్ చెప్పారు. యూపీఏ ప్రభుత్వం 2013లో బెంగళూరు, హైదరాబాద్‌లలో ఐటీఐఆర్‌కు అనుమతిని ఇచ్చిందని చెప్పారు.
ఢిల్లీ పెద్దలు ఉద్ధరిస్తారని తాము ఎదురుచూడటంలేదని.. తమపని తాము చేసుకొంటూ పోతున్నామని పేర్కొన్నారు. ఐటీఐఆర్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం 20 ఏండ్లకు రెండు లక్షల కోట్ల రూపాయలను అంచనావేస్తే.. టీఆర్‌ఎస్ పాలనలో కేవలం ఐదేండ్లలోనే రూ.1.09 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని, అన్నిరంగాల్లో ముందుకు పోతున్నందువల్లే తెలంగాణలో 17% వృద్ధిరేటు సాధ్యమైందని, ఐటీ సంబంధిత రంగాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలమందికి ఉపాధి అవకాశాలు లభించాయని తెలిపారు. ఐటీఐఆర్‌ను వాళ్లేదో ఉద్ధరించినట్లు.. తాము నాశనం చేసినట్లు కాంగ్రెస్ నేత మాట్లాడటం సరికాదని, వాస్తవాలను పరిశీలించాలని సూచించారు. ఇకనైనా కాంగ్రెస్ నేతలు విమర్శలు చేయడం మాని, ప్రభుత్వం చేస్తున్న మంచిపనిని అభినందించాలని కోరారు. రాష్ట్ర యువత కేసీఆర్ సర్కారుపై సంపూర్ణ విశ్వాసంతో ఉన్నదని చెప్పారు. ప్రతిపక్షాలు విమర్శలు చేయడంమాని తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని మంత్రి కేటీఆర్ కోరారు. ఐటీరంగానికి సంబంధించి ఆఫీస్ స్పేస్ మార్కెట్‌లో బెంగళూరును దాటిపోయిందంటూ సీబీఆర్‌ఈ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో సభ్యులకు వెల్లడించిన అంశాన్ని కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.
మన పథకాలు దేశవ్యాప్తంగా ప్రచారంచేస్తాం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడంతోపాటు తెలంగాణ పథకాలను దేశవ్యాప్తంగా ప్రచారంచేస్తామని.. తెలంగాణ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటడానికి మిద్దెలెక్కి అరుస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. శనివారం అసెంబ్లీలో సమాచారశాఖ పద్దుపై ఆయన జవాబిచ్చారు. దేశవ్యాప్తంగా పత్రికల్లో తెలంగాణ పథకాల ప్రచారంపై కాంగ్రెస్ సభ్యుడు శ్రీధర్‌బాబు చేసిన విమర్శలను మంత్రి కేటీఆర్ దీటుగా తిప్పికొట్టారు. నేటి తెలంగాణ ఆలోచనలు రేపటి ఇండియా ఆలోచనలుగా రూపుదిద్దుకొంటున్నాయని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రంలోని ఓ విమానాశ్రయంలో అక్కడి ప్రాంతీయ పత్రికపై తెలంగాణ పథకానికి సంబంధించిన ప్రకటన కనిపించిందని ప్రస్తావించడంపై మంత్రి స్పందిస్తూ.. దేశానికే ఆదర్శంగా నిలిచిన రైతుబంధు పథకంపై ఇతర రాష్ర్టాల్లో ప్రచారం కల్పించడంవల్ల ఒడిశా, బెంగాల్, జార్ఖండ్, బీహార్‌లాంటి రాష్ర్టాలు కూడా ఆ పథకాన్ని ఆదర్శంగా తీసుకొన్నాయని తెలిపారు.
తెలంగాణ పథకానికి ప్రాచుర్యం కల్పించడం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు మేలు జరుగుతుంటే కాంగ్రెస్ సభ్యులకొచ్చిన నష్టమేమిటని ప్రశ్నించారు. ఈ ప్రకటనల వల్ల తెలంగాణ శక్తిసామర్థ్యాలు.. అభివృద్ధి, సంక్షేమంపై ఇతర రాష్ర్టాల్లో చర్చలు జరుగటం తెలంగాణకు లాభమా? నష్టమా? అని ప్రశ్నించారు. పత్రికా ప్రకటన వల్ల పెట్టుబడులకు తెలంగాణ అనుకూలంగా ఉంటుందని, పరిపాలన బాగుంటుందని పెట్టుబడిదారులకు తెలుస్తుందని, తద్వారా రాష్ర్టానికి పరిశ్రమలు వచ్చి యువతకు ఉపాధి లభిస్తుందని వివరించారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమం… దేశంలో ఎక్కడాలేనివిధంగా జర్నలిస్టులకు సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. 2017-18లో 16,868 మందికి గుర్తింపుకార్డులిచ్చామని.. ఈ ఏడాది ఆ ప్రక్రియ కొనసాగుతున్నదని చెప్పారు. ప్రభుత్వోద్యోగులతోపాటు జర్నలిస్టులకు హెల్త్‌కార్డులు జారీచేసి.. కార్పొరేట్ వైద్యశాలల్లో నగదురహిత వైద్యసేవలు అందేలా చూస్తున్నామని పేర్కొన్నారు. చనిపోయిన, అనారోగ్యంతో బాధపడుతున్న జర్నలిస్టుల కుటుంబాలను ప్రత్యేక సంక్షేమనిధి ద్వారా ఆదుకొంటున్నామని, 16,508 మంది జర్నలిస్టులకు రూ.5 లక్షల బీమా కూడా అందిస్తున్నామని, రూ.15 కోట్లతో మీడియా అకాడమీకి భవనం నిర్మిస్తున్నామని వివరించారు.
రాష్ట్రంలో పదిచోట్ల జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు, డబుల్ బెడ్‌రూం ఇండ్లను ఇచ్చామన్నారు. ఎమ్మెల్యేలు, జర్నలిస్టుల ఇండ్లస్థలాలకు సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నదని, అనుకున్నస్థాయిలో ఆ కేసు పరిష్కారం దిశగా ముందుకు సాగడంలేదని తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో కేసు పరిష్కారం కోసం చర్యలు తీసుకొంటున్నారని, వీలైనంత త్వరగా కేసును పరిష్కరించుకొని జర్నలిస్టులకు న్యాయం చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.