-100శాతం ఎఫ్‌డీఐతో దేశంలోకి అడుగుపెడుతున్న తొలి విదేశీ కంపెనీ -రూ.600 కోట్ల వరకు పెట్టుబడి పెట్టేందుకు అంగీకారం -క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్‌తో సమావేశమైన కంపెనీ సీఈఓ జువెన్షియో మైజ్తూ

మరో అంతర్జాతీయ కంపెనీ తెలంగాణకు వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం కొన్ని రంగాల్లో 100శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి ఇవ్వడంతో.. దేశానికి వచ్చిన తొలి కంపెనీ మన రాష్ర్టానికే ప్రాధాన్యం ఇచ్చింది. ఇక్కడి వాతావరణం, చారిత్రక నేపథ్యం, కొత్త ప్రభుత్వం అమలు చేయనున్న పారిశ్రామిక విధానాలపై సంతృప్తి చెంది.. స్వీడన్‌కు చెందిన ఐకియా ఫర్నిచర్ కంపెనీ తెలంగాణలో విస్తృతంగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది.
అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఐకియా కంపెనీ దేశంలో తన మొదటి స్టోర్‌ను హైదరాబాద్‌లోనే ప్రారంభించనుంది. తెలంగాణవ్యాప్తంగా రూ.500నుంచి600 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వంతో బుధవారం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును ఐకియా సీఈఓ జువెన్షియో మైజ్తూ కలిశారు.
ఈ సందర్భంగా కంపెనీ సీఈఓ మైజ్తూ, పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కే ప్రదీప్‌చంద్ర ఎంఓయూపై సంతకాలు చేశారు. గత నెలలో సింగపూర్ పర్యటనలో ఐకియా స్టోర్స్‌ను సీఎం కేసీఆర్ సందర్శించారు. నిర్మల్, సిల్వర్ ఫిలిగ్రి, పెంబర్తి కళాకారులు తయారుచేస్తున్న వస్తువులు ఐకియాలో చూసిన సీఎం కేసీఆర్, తెలంగాణలోని స్థానిక కళాకారులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ముందుకురావాలని సంస్థ ప్రతినిధులను కోరారు. మెట్రో రైలు ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటుచేయనున్న రిటైల్ టెర్మినల్స్‌లోనూ స్టోర్ల ఏర్పాటుకు అవకాశం కల్పించాలన్న కంపెనీ అభ్యర్థనకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.
తాము కుదుర్చుకున్న ఎంఓయూతో ఇరు పక్షాలకు లాభాలు ఉంటాయని సీఈఓ జువెన్షియో మైజ్తూ ఆశాభావం వ్యక్తం చేశారు. భేటీలో ఐకియా కంపెనీ ప్రతినిధులు తమ సంస్థ ఉత్పత్తుల క్యాటలాగ్‌ను సీఎం కేసీఆర్‌కు సమర్పించారు. ఎక్కడైతే ప్రతి రోజు అద్భుతం ఉంటుందో శీర్షికతో ఉన్న ఆ క్యాటలాగ్‌లో స్లీపింగ్, బాత్‌రూం, ఆర్గనైజింగ్ రూమ్స్, రిలాక్సింగ్, కిచెన్ వంటి అనేక ఉత్పత్తుల గురించి పేర్కొన్నారు. కంపెనీకి అన్ని విధాలా తోడ్పాటునందిస్తాం
100శాతం ఎఫ్‌డీఐతో దేశంలోకి వస్తున్న తొలి విదేశీ కంపెనీ అయిన ఐకియా తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం సంతోషంగా ఉందని సీఎం కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ఐకియాను కూడా ఇండస్ట్రీగానే పరిగణిస్తూ రాయితీలు అందిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ చుట్టూ ఏర్పాటు చేసే స్టోర్లకు ప్రభుత్వం నుంచి తోడ్పాటు అందిస్తుందన్నారు. మెట్రో రిటైల్ టెర్మినల్స్‌లోనూ ఐకియా స్టోర్లకు అనుమతి ఇస్తామని చెప్పారు. భేటీలో నీటి పారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు, సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ నర్సింగ్‌రావు, పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కే ప్రదీప్‌చంద్ర, ఐకియా చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ ప్రీత్‌ధూపర్, కంట్రీ మేనేజర్ నీతూ కపాసి పాల్గొన్నారు.