ఇప్పటికే రూ.6వేల కోట్ల విలువైన పనులు పూర్తి పూర్తయిన 18 ప్రాజెక్టులు అందుబాటులోకి పాత, కొత్త నగరాలనే తేడా లేకుండా పనులు ప్రజారవాణా మార్గాలను మెరుగుపరుస్తున్నాం అన్నిచోట్లా ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం ట్రాఫిక్ నివారణకు ప్రజారవాణా ప్రోత్సాహిస్తాం అసెంబ్లీలో ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు, ఆయన మార్గదర్శకాలకు అనుగుణంగా హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నామని ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. నగర అభివృద్ధికోసం సుమారు రూ.30వేల కోట్లను వెచ్చించనున్నామని, ఇప్పటికే రూ.6వేల కోట్ల విలువైన పనులను పూర్తిచేశామని వివరించారు. అసెంబ్లీలో శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు హైదరాబాద్ నగరాభివృద్ధి, రోడ్లు, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై ప్రశ్నలు అడిగారు. వాటిలో కొన్నింటికి మంత్రి కేటీఆర్ లిఖితపూర్వకంగా, అనుబంధ ప్రశ్నలకు మౌఖికంగా సమాధానం ఇచ్చారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మెరుగైన రవాణా సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధికి (ఎస్సార్డీపీ) శ్రీకారం చుట్టిందని తెలిపారు. అందుకు సంబంధించిన ప్రాజెక్టును లీ అసోసియేట్స్ కంపెనీ దాదాపు రెండున్నరేండ్లు సమగ్రంగా అధ్యయనం చేసి నివేదిక అందజేసిందని చెప్పారు. అందులో భాగంగా నగరంలో లింక్‌రోడ్ల అభివృద్ధి, ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మిస్తున్నట్టు తెలిపారు.
పాత.. కొత్త వ్యత్యాసం లేకుండా అభివృద్ధి.. పాతబస్తీ, కొత్త హైదరాబాద్ అనే వ్యత్యాసం లేకుండా నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. ఎస్సార్డీపీ కింద రూ.29,695.20 కోట్లతో పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించామని, ఇతర పథకాల కింద కూడా పనులను పూర్తిచేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 18 ప్రాజెక్టులను పూర్తిచేసి నగరవాసులకు అందుబాటులోకి తెచ్చామన్నారు. సుమారు రూ.6వేల కోట్ల విలువైన పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయని వెల్లడించారు. ఒక్క పాత హైదరాబాద్‌లోనే రూ.713 కోట్ల నిధులను వెచ్చించామని చెప్పారు. అందులో సాధారణ రోడ్ల విస్తరణకు రూ.477 కోట్లు, ఎస్సార్డీపీ కింద రూ.228 కోట్లు, లింక్‌రోడ్ల కింద రూ.8 కోట్లు వెచ్చించామన్నారు. సుమారు రూ.2.900 కోట్లను నగరంలో ఖర్చుచేయగా, అందులో 25% నిధులను పాతనగరంలోనే ఖర్చుచేశామని తెలిపారు.
ఎక్కడా లేని విధంగా టీడీఆర్ ఏర్పాటు రోడ్ల అభివృద్ధికి భూసేకరణలో జాప్యం జరుగుతున్నదని పలువురు సభ్యులు లేవనెత్తిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. జీహెచ్‌ఎంసీ నాలుగు జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్నదని, అయినప్పటికీ భూసేకరణను వేగవంతంగా పూర్తిచేస్తున్నామని వివరించారు. ప్రత్యేకంగా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌నే స్పెషల్ కలెక్టర్ ఫర్ ల్యాండ్ అక్విజిషన్‌గా నియమించామని తెలిపారు. పనులను వేగంగా పూర్తిచేసేందుకు కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టామని, అందులో భాగంగానే ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్ (టీడీఆర్)ను ఏర్పాటుచేశామని తెలిపారు. టీడీఆర్ బ్యాంకును సైతం ఏర్పాటు చేశామని, ఇటు బిల్డర్లకు, అటు భూ దాతలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూశామని చెప్పారు. తద్వారా జీహెచ్‌ఎంసీకి రూ.568 కోట్లను ఆదా చేశామని తెలిపారు.
కేటీఆర్‌కు అక్బరుద్దీన్ కృతజ్ఞతలు మంత్రి కేటీఆర్ సమాధానాలతో సంతృప్తిచెందిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి చొరవతో నగరంలో మెరుగైన రవాణావసతులు ఏర్పడుతున్నాయని, ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు అందుబాటులోకి వస్తున్నాయని, ఫలితంగా పాతబస్తీ స్వరూపమే మారిపోతున్నదని కొనియాడారు. పలు పనులకు సంబంధించి గతంలో జరిగిన సమావేశాల మినిట్స్‌ను పరిగణనలోకి తీసుకోవాలని ఒవైసీ కోరగా, అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు.
గ్రిడ్‌లాక్‌గా హైదరాబాద్ షోరూంల నుంచి రోజూ వందల కొత్తవాహనాలు నగర రోడ్లపైకి వస్తున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ ఇప్పటికే గ్రిడ్‌లాక్‌గా మారిందని చెప్పారు. నగరంలోని వాహనాలన్నీ ఒకేసారి రోడ్డుమీదకు వస్తే ఎలాంటి సందులేకుండా పోవడాన్ని గ్రిడ్‌లాక్ అంటారని వివరించారు. దీనిని పరిగణనలోకి తీసుకొని ట్రాఫిక్ నియంత్రణకు, సగటు ప్రయాణ సమయాన్ని పెంచేందుకు, కాలుష్యాన్ని తగ్గించేందుకు, ప్రజారవాణాను ప్రోత్సహించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామన్నారు. అందులో భాగంగా జంక్షన్ల వద్ద ఫ్రీలెఫ్ట్ కోసం ప్రత్యేకంగా భూమిని సేకరిస్తున్నామని తెలిపారు. నగరాభివృద్ధి పనుల సత్వర పూర్తికి ప్రతిఒక్కరూ సహకరించాలని, స్థానిక ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పనులు వేగంగా పూర్తిచేయడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.