-నగరం నడిబొడ్డునే -సర్కారు ఖర్చుతోనే బహుళ అంతస్తుల్లో డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్లు -నిర్మాణానికి 2వేల ఎకరాల ప్రభుత్వ భూమి సేకరణ -ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్రాత్మక నిర్ణయం -హైదరాబాద్‌లో గృహనిర్మాణంపై అధికారులతో సమీక్ష
మనదీ ఒక బ్రతుకేనా.. కుక్కల వలె.. నక్కల వలె.. సందులలో పందుల వలె.. అని మహాకవి శ్రీశ్రీ నిరుపేదల దుర్భర జీవితాలపై నిర్వేదం ప్రకటించారు. మన బతుకు ఇంతే అని పేదలుకూడా దారిద్య్రానికి, కష్టానికి అలవాటు పడ్డారు. విధి రాత అనుకుని మురికి కూపాల్లో, చీకటి గుహల్లాంటి ఇరుకు గదుల్లో జీవితాలను వెళ్లదీస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోలా ఆలోచించారు. తెలంగాణ వచ్చిన తరువాత కూడా నిరుపేదలకు నిలువ నీడ కల్పించలేని అసహాయ ప్రభుత్వమా ఇది అని తనకు తాను ప్రశ్నించుకున్నారు. లక్షా 15 వేల కోట్ల రూపాయల బడ్జెట్‌ను ప్రవేశపెట్టుకున్నామని, మనకు మనం మురిసిపోతున్నాం. కానీ మన పక్కనే ఉన్న పేదలు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారనే విషయాన్ని విస్మరిస్తున్నాం.
మనది ధనిక రాష్ట్రమని గర్వంగా ప్రకటించుకుంటున్నాం. కానీ ధనిక రాష్ట్రంలోని పేదల జీవితాలవైపు తొంగిచూడటం లేదు. ప్రగతి ఫలాలు అందరికీ దక్కకుంటే సొంత రాష్ట్రానికి అర్థమేముంటుంది? స్వపరిపాలనలో కూడా పేదల బతుకు మారకుంటే విలువేముంటుంది? పారదర్శకత, అవినీతిరహిత, సంక్షేమహిత ప్రభుత్వం నడిపే టీఆర్‌ఎస్ పార్టీ వల్లే పేదల బతుకుల్లో మార్పు తేకుంటే ఇక ఎవరివల్ల అవుతుంది?.. ఈ అంతర్మథనం నుంచే కేసీఆర్ మదిలో ఓ అద్భుత ఆలోచన పుట్టింది. గతంలో ఎక్కడా.. ఎప్పుడూ.. లేనివిధంగా హైదరాబాద్ నగరంలోని 2.10 లక్షల మంది నిరుపేదలకు నూటికి నూరు శాతం సొంత ఇల్లు పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతోనే కట్టించాలని ముఖ్యమంత్రి చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. అనుకున్నదే తడవుగా కార్యాచరణలోకి దిగారు.
ధనవంతుల విలాసాలు, వినోదాలు, కాలక్షేపాలు, అలవాట్లకోసం వేల ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించినప్పుడు నిలువ నీడలేని నిరుపేదలకు ఇండ్లు కట్టించడానికి విలువైన స్థలాలను కేటాయిస్తే తప్పేమిటి? నిరుపేదల ఇండ్లంటే ఎక్కడో విసిరేసినట్లు దూరంగా ఉండొద్దు.. నగరం మధ్యలోనే వారూ నివసించాలి. వీలైతే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లోనే పేదలకు ఇండ్లు కట్టాలి.. రూ. 1.15 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టుకున్న రాష్ట్రంలో నిరుపేదల ఇండ్లకోసం నిధులు కేటాయించలేమా? ఎక్కడో అక్కడ మొదటి అడుగు పడితీరాలి.. ఆ అడుగు మనదే కావాలి.. మనం చేయలేకపోతే ఇక ఎవరూ పేదల గురించి పట్టించుకోరు.
పేదలకు కూడా విలువైన స్థలాల్లో ఇండ్లు కట్టించి ఇచ్చేలా ఆలోచించి, ఇండ్ల నిర్మాణాలకు స్థలాలు సేకరించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో హైదరాబాద్ నగరంలో పేదల గృహనిర్మాణంపై దాదాపు నాలుగు గంటలపాటు అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకోవడమేకాకుండే అక్కడికక్కడే ఆదేశాలు జారీచేశారు.
నగరంలో 2.10 లక్షల మంది నిరుపేదలకు సొంత ఇండ్లు లేవని సమగ్ర కుటుంబ సర్వేలో తేలిందని, వీరందరికీ బహుళ అంతస్తుల భవనాల్లో ఇండ్లు నిర్మించడానికి 2వేల ఎకరాల స్థలం కావాలని సీఎం పేర్కొన్నారు. ఈ భూమి సేకరణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. పేదలందరికీ ప్రభుత్వమే ఉచితంగా డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు కట్టించి ఇస్తుందని చెప్పారు. నిరుపేదల ఇండ్లంటే ఎక్కడో విసిరేసినట్లు దూరంగా ఉండకూడదన్నారు. నగరం మధ్యలోనే ఇండ్లు ఉండాలన్నారు. వీలైతే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లోనే పేదలకు ఇండ్లు కట్టాలని ఆదేశించారు. రూ. 1.15 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టుకున్న రాష్ట్రంలో నిరుపేదల ఇండ్లకోసం నిధుల కొరత అనే సమస్య ఉండదని స్పష్టంచేశారు.
నగరంలో ప్రభుత్వ కార్యాలయాలకు పదుల ఎకరాలు, చిన్నపాటి విద్యాసంస్థలకు వందల ఎకరాలు, యూనివర్సిటీలకు వేల ఎకరాలు, వివిధ క్లబ్బులకు పెద్ద మొత్తంలో భూములు గతంలో కేటాయించారని సీఎం చెప్పారు. వాటిల్లో చాలా భాగం నిరుపయోగంగానే ఉన్నాయని, వాటిని పేదల ఇంటి నిర్మాణంకోసం ఉపయోగించాలని కేసీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. నగరంలో కార్పొరేట్ సంస్థలు, పరిశ్రమలకు భూములు కేటాయించినప్పుడు, నిరుపేదలకు కూడా ప్రభుత్వ భూములు కేటాయించాలన్నారు. ఒక్క నిరుపేద కూడా నగరంలో తనకు ఇల్లు లేదని అనకూడదని, ఆ విధంగా హైదరాబాద్‌ను మార్చాలన్నది ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. భూమిలేని, బువ్వలేని, ఇల్లు లేని నిరుపేదలున్నారని, వారి గురించి ఆలోచించే సామాజిక బాధ్యత ప్రభుత్వానిదేనని చెప్పారు.
ఇల్లు లేకపోవడం పెద్ద శాపం.. మొదటి దశలో హైదాబాద్ నగరంలో నిరుపేదలందరికీ ఇండ్లు కట్టించి ఇస్తామని సీఎం తెలిపారు. ఇల్లు లేకపోవడం పెద్ద శాపమన్న కేసీఆర్.. ఆ బాధ ఇల్లు లేని వారికే తెలుస్తుందని చెప్పారు. ఆ కష్టాలనుంచి నిరుపేదలను గట్టెక్కించడం ప్రభుత్వ బాధ్యతని ప్రకటించారు. ప్రతి ఇంటికీ నల్లా ద్వారా మంచినీరు అందిస్తామని ప్రతిజ్ఞ తీసుకున్నట్లే, ప్రతి నిరుపేదకు సొంత ఇల్లు కట్టించాలనే ఆశయంతో ప్రభుత్వం ఉందన్నారు. అయితే ఈ బృహత్తర కార్యక్రమం ఒక్క రోజులోనే పూర్తి కాకపోయినప్పటికీ దశల వారీగా ఇండ్ల నిర్మాణం చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు.
ఎవరో ఒకరు, ఎక్కడో అక్కడ మొదటి అడుగు వేయాలని, ఆ పని తమ ప్రభుత్వమే చేస్తుందని చెప్పారు. ఈ పథకంలో అక్రమార్కులు చొరబడకుండా చూడాలని స్పష్టంచేశారు. ఇంటిలిజెన్స్ సహకారంతో అసలైన లబ్ధిదారులను రెవెన్యూశాఖ ఎంపిక చేయాలన్నారు. భూసేకరణ జరిపిన తరువాత ఆ భూమిని స్వాధీనం చేసుకొని రెండు లక్షల ఇండ్ల నిర్మాణం చేపట్టే బాధ్యత తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్‌ను సీఎం ఆదేశించారు. సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, రెవెన్యూ కార్యదర్శి మీనా, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, హైదరాబాద్ సిటీ చీఫ్ ప్లానర్ దేవేందర్‌రెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకట్రావు, హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు మహేందర్‌రెడ్డి, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.