Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

హాంకాంగ్ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం..

-కలిసి పనిచేద్దాం.. కలిసి ఎదుగుదాం -పరిశ్రమల అధిపతులతో సీఎం కేసీఆర్ -టీఎస్‌ఐపాస్‌ను వివరించిన ముఖ్యమంత్రి -తెలంగాణపై డాక్యుమెంటరీ ప్రదర్శన -ఉత్సాహభరితంగా సాగిన సమావేశం -టియాన్‌టిన్‌లో భారీ కంచు బుద్ధ విగ్రహాన్ని సందర్శించిన సీఎం బృందం -నేటితో ముగియనున్న చైనా పర్యటన -సాయంత్రానికల్లా హైదరాబాద్‌కు

CM-KCR-invites-Hong-Kong-Industrial-officials-to-Telangana

చైనా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తొమ్మిదవ రోజైన మంగళవారం హాంకాంగ్‌లోని పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని వారిని సాదరంగా ఆహ్వానించారు. పారిశ్రామికాభివృద్ధికి తమ రాష్ట్రం కట్టుబడి ఉందని చెప్తూ రండి కలిసి పని చేద్దాం.. కలిసి ఎదుగుదాం.. అంటూ సీఎం ఆహ్వానించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న సానుకూల అంశాలను వివరించిన సీఎం కేసీఆర్.. తెలంగాణ ప్రభుత్వం ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా వినూత్నంగా తీసుకువచ్చిన నూతన పారిశ్రామిక విధానం (టీఎస్‌ఐపాస్) గురించి వివరించారు.

పారిశ్రామిక అనుమతుల కోసం గ్రిల్స్‌లేని సింగిల్ విండో విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పిన సీఎం.. నిర్దిష్ట కాలపరిమితిలో అనుమతులు జారీ చేసే ప్రక్రియను సవివరంగా తెలియజేశారు. హాంకాంగ్‌లోని రినైస్సెన్స్ హార్బర్ వ్యూ హోటల్‌లో జరిగిన ఈ సెమినార్‌లో తెలంగాణపై ఐదు నిమిషాల వ్యవధితోకూడిన డాక్యుమెంటరీని ప్రదర్శించగా.. హాజరైన పారిశ్రామికవేత్తలు ఆసక్తిగా దానిని తిలకించారు. టీఎస్‌ఐపాస్‌కు ఆకర్షితులైన పారిశ్రామికవేత్తలు.. దీని విషయంలో తమకున్న సందేహాలను వ్యక్తంచేసి.. నివృత్తి చేసుకున్నారు. తొలుత సమావేశానికి హాజరైన ప్రతినిధులకు హాంకాంగ్‌లో భారత కాన్సుల్ జనరల్ ప్రశాంత్ అగర్వాల్ స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంపై అవగాహన కలిగించేలా డాక్యుమెంటరీని ప్రదర్శించారు. తెలంగాణలో వ్యాపార అవకాశాలు, నూతన పారిశ్రామిక విధానం గురించి రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి అర్వింద్‌కుమార్ వివరించారు. సెమినార్‌లో భాగంగా సమావేశంలో పాల్గొన్న వివిధ కంపెనీల ప్రతినిధులతో ప్రశ్న-జవాబు కార్యక్రమాన్ని నిర్వహించి వారికున్న సందేహాలను నివృత్తి చేశారు.

హాంకాంగ్‌లో ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ అరుణాచలం ముగింపు వాక్యాలు పలికారు. సెమినార్‌కు వచ్చిన ప్రతినిధులు, కాన్సులేట్ జనరల్, సీఎం కలిసి భోజనం చేశారు. చైనాలోని దక్షిణ తీరప్రాంతంలో ప్రకృతి సహజంగా ఏర్పడిన పెద్ద ఓడరేవుతో హాంకాంగ్ మహానగరంగా ఎదిగింది. ప్రపంచంలో ప్రజలు అత్యధికంగా వినియోగించుకునే ప్రజారవాణా వ్యవస్థల్లో హాంకాంగ్‌ది అగ్రస్థానం. ఇక్కడ 90 శాతం మంది ప్రజలు ప్రజారవాణా వ్యవస్థ ద్వారానే ప్రయాణిస్తుంటారు.

భారీ బుద్ధ విగ్రహం సందర్శన.. సెమినార్ ముగిసిన తరువాత సీఎం కేసీఆర్, ప్రతినిధుల బృందం, భారత కాన్సులేట్ జనరల్ ప్రశాంత్ అగర్వాల్‌తో కలిసి లాంతౌ ద్వీపం న్యాంగ్‌పింగ్ ప్రాంతంలోని టియాన్‌టన్ భారీ కంచు బుద్ధ విగ్రహాన్ని సందర్శించారు. దీనిని 1990లో నిర్మించడం ప్రారంభించి, 1993 డిసెంబర్ 29న పూర్తిచేశారు. చైనా సంప్రదాయం ప్రకారం బుద్ధుడు జ్ఞానోదయం పొందిన రోజు అదే. 112 అడుగుల పొడవు, 250 మెట్రిక్ టన్నుల బరువు ఉన్న ఈ విగ్రహాన్ని 202 కంచు ముక్కలతో తయారుచేశారు. ఈ బరువును మోసేలా విగ్రహం లోపలి భాగంలో స్టీలు ఫ్రేంలను అమర్చారు. పర్యాటకులు ఈ విగ్రహం సమీపానికి వెళ్లాలంటే 268 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఈ బుద్ధ విగ్రహం మనిషి -ప్రకృతికి, ప్రజలు-విశ్వాసాలకు మధ్యన ఉన్న సామరస్య సంబంధానికి ప్రతీకగా చెప్తుంటారు. హాంకాంగ్‌లో ప్రధాన బౌద్ధ కేంద్రం, పర్యాటక కేంద్రం కూడా ఇదే.

నేడు హైదరాబాద్‌కు సీఎం కేసీఆర్.. ముఖ్యమంత్రి కేసీఆర్ బృందం పది రోజుల చైనా పర్యటనను ముగించుకుని బుధవారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకోనుంది. ఈనెల 7న ఉదయం ప్రత్యేక విమానంలో చైనాకు వెళ్ళిన కేసీఆర్ తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, నూతన పారిశ్రామిక విధానాన్ని చాటి చెప్పడంతోపాటు, వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ప్రసంగించారు. సీఎం బృందం బుధవారం ఉదయం హాంకాంగ్ నుంచి విమానంలో బయలుదేరి సాయంత్రానికి హైదరాబాద్ చేరుకుంటుంది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.