కవులు, కళాకారులు, మేధావులకు నిలయం సిద్దిపేట. ఇదే గడ్డపై మరో ఆణిముత్యమే మంత్రి హరీశ్‌రావు. ఆయనో వ్యూహకర్త, బుల్లెట్. ఏ పనినైనా సాధించే దమ్మున్న వ్యక్తి. చురుకుతనం, ఎక్కడి నుంచైనా నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేయాలనే తపన ఉన్న లీడర్ అని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరావు మంత్రి హరీశ్‌రావుపై ప్రశంసల జల్లు కురిపించారు. నేను ఎమ్మెల్యేగా ఉండగా చూసిన సిద్దిపేటలోని కోమటిచెరువుకు ఇప్పుడు చూస్తున్న చెరువుకు ఎంతో తేడా ఉంది.

-అతడో వ్యూహకర్త, బుల్లెట్ -సీఎం కేసీఆర్ ప్రశంసల జల్లు
హరీశ్ ఈ చెరువును గొప్పగా అభివృద్ధి చేశాడు. వెరీగుడ్.. ఇక్కడి వాతావరణం చూస్తుంటే సిద్దిపేటకు మళ్లీ రావాలని అనిపిస్తున్నది అని అన్నారు. సిద్దిపేటలో తాగునీటి సరఫరా తీరును రాష్ట్రంలోని వివిధ శాఖలకు చెందిన మంత్రులు, అధికారులకు స్వయంగా వివరించిన సీఎం కేసీఆర్ ఆ తర్వాత ఇక్కడ జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సిద్దిపేటలోని వేంకటేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్ణంలోని పబ్లిక్ సర్వెంట్స్ హోమ్ స్వర్ణోత్సవాల్లో పాల్గొన్నారు.
అనంతరం స్థానిక కోర్టుకు వెళ్లి న్యాయవాదులను కలిశారు. ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాల్లో కేసీఆర్ మాట్లాడారు. జిల్లా కేంద్రం చేయడం, సాగునీరు, రైలు మార్గం ఏర్పాటు పనులు సిద్దిపేటకు బాకీ ఉన్నాయని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. తప్పకుండా సిద్దిపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైను పనులకు ప్రభుత్వం 50 శాతం నిధులు కేటాయించిందని వెల్లడించారు. ఇక మిగిలింది సాగు నీరు.. బుల్లెట్ లాంటి మంత్రి హరీశ్‌రావే సాగునీటి శాఖ మంత్రి. ఆయనే మీ దగ్గర ఉండగా నీళ్లెందుకు రావు అని పేర్కొన్నారు. సిద్దిపేట పట్టణంలో న్యాయవాదుల కోసం ప్రత్యేకంగా ఓ మోడల్ కాలనీ ఏర్పాటు చేసి అందులో 110 మందికి స్థలాలివ్వడానికి చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు.