Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

గ్రీన్‌సిగ్నల్ ఇవ్వండి

నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో వివిధ రైల్వేప్రాజెక్టులను సత్వరం చేపట్టాలని కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి చేశారు. కాజీపేటను రైల్వే డివిజన్ కేంద్రంగా మార్చాలని, వరంగల్‌లో రైల్వే యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని, హైదరాబాద్‌లో మరిన్ని స్టేషన్లు ఏర్పాటు చేయాలని, ఏపీ ఎక్స్‌ప్రెస్ పేరును తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా మార్చాలని ఆయన కోరారు. నిజాం హయాంలో రైల్వేశాఖకు వేలకొద్దీ ఎకరాల భూమిని ఉచితంగా అందచేశారని చెప్పిన కేసీఆర్, ప్రస్తుతం మెట్రోరైలు నిర్మాణంలో స్థలాలు అవసరమైన సందర్భాల్లో రైల్వేశాఖ కూడా సహకరించేలా చూడాలన్నారు.

KCR-with-Railway-minister01

-రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర రైల్వేమంత్రికి సీఎం విజ్ఞప్తి -కాజీపేటను డివిజన్ చేయండి -హైదరాబాద్‌లో మరిన్ని స్టేషన్లు ఏర్పాటు చేయండి -ఏపీ ఎక్స్‌ప్రెస్‌ను తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా మార్చండి: కేసీఆర్ -సీఎంను కలుసుకున్న కేంద్ర రైల్వేమంత్రి సురేశ్ ప్రభు -పెండింగ్ ప్రాజెక్టులపై సమావేశం ఏర్పాటుకు హామీ సోమవారం మధ్యాహ్నం మంత్రి సురేష్‌ప్రభు సచివాలయంలో సీఎంను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ పీకే శ్రీవాత్సవ కూడా ఆయనతో ఉన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న వివిధ ప్రాజెక్టుల పరిస్థితిని కేంద్రమంత్రికి వివరించారు. పెండింగ్ ప్రాజెక్టులు సత్వరమే పూర్తి చేయాలని, అలాగే సుదీర్ఘకాలంగా ప్రజలు డిమాండ్ చేస్తున్న నూతన ప్రాజెక్టుల అనుమతుల విషయంలో ఉదారంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో నూతన రైల్వేలైన్ల కు భూకేటాయింపు అంశంలో పూర్తి సహాయ సహకారాలు అందచేస్తామని హామీ ఇచ్చారు.

విభజన చట్టంలో హామీ ఇచ్చినా ఇంతవరకూ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అంశం ముందుకు కదలలేదని సీఎం కేసీఆర్ మంత్రి సురేశ్ ప్రభు దృష్టికి తెచ్చారు. హైదరాబాద్‌లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలాలి, నాగులపల్లి రైల్వే స్టేషన్లను పూర్తిస్థాయి వసతులను కల్పించి అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, తద్వారా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌పై ఉన్న ఒత్తిడిని తగ్గించవచ్చని సూచించారు. ఈ సందర్భంగా కేసీఆర్ కేంద్ర రైల్వే మంత్రికి ఒక వినతిపత్రం అందిస్తూ.. తెలంగాణ రాష్త్రంలో పెండింగు ప్రాజెక్టులు, కొత్త ప్రాజెక్టులు, వాటి ప్రాధాన్యతలను వివరించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ ప్రాంతాన్నికూడా తాకకుండా వెళుతున్న రైలుకు ఏపీ ఎక్స్‌ప్రెస్ పేరు అసమంజసమని, దానిని వెంటనే తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా మార్చాలని అన్నారు. వివిధ ప్రాజెక్టులపై త్వరిత నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. సీఎం వినతులను సావధానంగా విన్న కేంద్ర మంత్రి సురేష్‌ప్రభు రాష్ట్రంలోని పెండింగు ప్రాజెక్టులపై త్వరలో ఒక సమావేశం నిర్వహిస్తానని, అలాగే హైదరాబాద్ నగరంపై ప్రత్యేకంగా మరో సమావేశం కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలచారి, ప్లానింగ్ బోర్డు వైస్‌ఛైర్మన్ నిరంజన్‌రెడ్డి, సీఎం కార్యాలయం ముఖ్య కార్యదర్శి ఎస్ నర్సింగరావు, మున్సిపల్ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి ఎంజీ గోపాల్, జీహెచ్‌ఎంసీ ప్రత్యేక అధికారి సోమేశ్‌కుమార్, రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్‌శర్మ, హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి తదితరులు ఉన్నారు.

ఇవీ వినతులు.. కేంద్ర రైల్వే మంత్రికి సీఎం సమర్పించిన వినతిపత్రంలో పేర్కొన్న పెండింగు ప్రాజెక్టులు, కొత్త ప్రాజెక్టులు, రైళ్ళ వివరాలు ఇలా ఉన్నాయి. -కాజీపేట కేంద్రంగా కొత్త డివిజన్.. వరంగల్‌లో రైల్వే యూనివర్సిటీ -ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ. -గద్వాల-మాచెర్ల మధ్యన నూతన రైల్వే లైను -పాండురంగాపురం-భద్రాచలం మధ్యన కొత్త రైల్వేలైను

-భద్రాచలం రోడ్ -సత్తుపల్లి కొత్త బ్రాడ్‌గేజీ రైల్వేలైనును వేగవంతం చేస్తూ చంద్రగొండ వరకు పొడిగించాలి. -2012-13లో రూ.152.26 కోట్లతో మంజూరు చేసిన కాజీపేట వ్యాగన్ తయారీ పరిశ్రమ ప్రారంభించాలి. -పెద్దపల్లి-కరీంనగర్-నిజామాబాద్ బ్రాడ్‌గేజీ (178.39 కి.మీ.)లో జగిత్యాల-నిజామాబాద్ మధ్య రైల్వే లైను పనులను పూర్తిచేయాలి. దీనికి భూసేకరణ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం రూ. 26.68 కోట్లను కరీంనగర్‌ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వద్ద, మరో రూ. 27.61 కోట్లను నిజామాబాద్ కలెక్టర్ వద్ద ప్రభుత్వం జమచేసింది.

-153.6 కి.మీ. పొడవైన మనోహరాబాద్-కొత్తపల్లి కొత్త బ్రాడ్‌గేజీ లైను దీర్ఘకాలంగా పెండింగులో ఉంది. దీనికి మొత్తం 952.95 కోట్లు అవసరం. రాష్ట్ర ప్రభుత్వం భూమిని ఉచితంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా ఇందుకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే నుంచి ప్రతిపాదన ఇంకా అందలేదు. ప్రాజెక్టు ఖర్చులో మూడో వంతును భరించేందుకు సిద్ధమని ప్రభుత్వం 16.9.14న లేఖ అందచేసింది.

-17.16 కి.మీ. పొడవైన అక్కన్నపేట-మెదక్ కొత్త బ్రాడ్‌గేజీ లైనును రూ. 117.74 కోట్లతో 2012-13 సంవత్సరంలో మంజూరు చేసింది. దీనికి భూమిని ఉచితంగా ఇవ్వడంతోపాటు 50 శాతం ప్రాజెక్టు వ్యయాన్ని రాష్ట్రం భరిస్తుంది. భూసేకరణ కోసం రూ. 25.26 కోట్లను, రాష్ట్ర వాటాలో రూ. 10 కోట్లను విడుదల చేసింది.

-మంచిర్యాల్-పెద్దంపేట (ప్యాచ్‌వర్క్), కాజీపేట- విజయవాడ (మూడో లైను, విద్యుదీకరణ మొత్తం 219.64 కి.మీ.), రాఘవపురం-మందమర్రి (ప్యాచ్‌వర్క్ 24.30 కి.మీ.)లతోపాటు మణుగూరు-రామగుండం (200 కి.మీ.) రైల్వే లైను సర్వేను 2005-06లో రైల్వే బోర్డు మంజూరు చేసింది. -సికింద్రాబాద్-మహబూబ్‌నగర్ డబ్లింగ్ సర్వే పనులు, సికింద్రాబాద్-జహీరాబాద్ డబ్లింగ్ సర్వే పనులు, పగిడిపల్లి-శంకర్‌పల్లి సర్వే పనులు పెండింగులో ఉన్నాయి.

-2015-16 రైల్వే వర్క్స్ ప్రోగ్రాంలో 15 లెవల్ క్రాసింగ్ ప్రాంతా ల్లో ఆర్వోబీలు, ఆర్‌యూబీల నిర్మాణాలను చేర్చాలి. (కరీంనగర్‌లో ఉప్పల్-జమ్మికుంట, జమ్మికుంట-బిజిగిర్‌షరీఫ్, కొలనూర్-పెద్దపల్లిల మధ్యన, మహబూబ్‌నగర్-ఎంక్యూఎన్‌ల మధ్యన, జహీరాబాద్-మెటల్‌కుంట మధ్యన, ఆలేరు-పెంబర్తి మధ్యన, నిజామాబాద్‌లో యూపీడబ్ల్యూ-కేఎంసీ మధ్యన, వరంగల్‌లో కాజీపేట-హసన్‌పర్తి, కాజీపేట-వరంగల్, వరంగల్-చింతలపల్లి, చింతలపల్లి-యెలుగూరు, మహబూబాబాద్‌యార్డు, గార్ల-డోర్నకల్, నష్కల్-పెండ్యాల, ఖమ్మంలో యెర్రుపాలెం-గంగినేనిల మధ్యన)

హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు .. మెట్రోరైలు ప్రాజెక్టుకు సంబంధించి సహేతుకంకాని విధంగా దక్షిణ మధ్య రైల్వే ట్రాఫిక్ బ్లాక్ ఛార్జీలును డిమాండ్ చేస్తున్నది. గడిచిన 3 సంవత్సరాలుగా 8 జంక్షన్లపై చర్చలు కొలిక్కి రాలేదు. ట్రాఫిక్ బ్లాక్ ఛార్జీల రూపంలో రూ. 10 కోట్లు అడగడం సహేతుకం కాదు. భరత్‌నగర్ మెట్రో రైల్వే క్రాసింగ్ పనులు దీనివల్లే ఆగిపోయాయి. మెట్రో పనుల్లో ఆర్వోబీల నిర్మాణంలో తీవ్ర జాప్యం ప్రాజెక్టుపై పడింది. ఇలాంటి ట్రాఫిక్ బ్లాక్ ఛార్జెస్‌ను బెంగళూరులోగానీ, ముంబైలోగానీ వసూలు చేయలేదు.

ముంబైలో పశ్చిమ రైల్వే మెట్రో రైలు కోసం నామమాత్రంగా మాత్రమే వసూలు చేసింది. హైదరాబాద్ మెట్రో రైల్వే ప్రాజెక్టు ప్రజోపయోగం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో 10 చోట్ల చిన్న చిన్న స్థలాలు అవసరం ఉంది. రైల్వేకు వేలాది ఎకరాల భూమిని ఉచితంగా నిజాం ఇచ్చారు. ఇవాళ కేవలం 2 ఎకరాల స్థలాన్ని ఇవ్వడానికి దక్షిణ మధ్యరైల్వే ముందుకు రావడం లేదు.

ఇదే స్థలాల్లో ఉన్న ఇతరుల స్థలాలకు గజానికి రూ. 50 వేలు ఇస్తుంటే.. రైల్వే గజానికి రూ.1.50 లక్షలు అడుగుతుండటం విస్మయానికి గురిచేస్తుంది. మార్కెట్ ధర ప్రకారం ఉండాలని రైల్వే బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయకపోవడంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో మెట్రో పనులన్నీ ఆగిపోయాయి. 8 చోట్ల ఆర్వోబీల నిర్మాణాలపై పన్నులు, సుమారు 2 ఎకరాలకు రూ. 60 కోట్లు చెల్లించినా..కేంద్ర రైల్వే శాఖ మంత్రి జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. -గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు ప్రతియేటా సర్వీసు ఛార్జీలుగా దక్షిణ మధ్య రైల్వే రూ. 6.74 కోట్లు చెల్లించాల్సిఉంది. ఇప్పటికే రూ. 33.70 కోట్లు బకాయిలు పేరుకుపోయాయి.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.