-ఐదేండ్లలో ఐదింతలు దాటి వినియోగం -3.80 లక్షల నుంచి 25 లక్షల ఎకరాలకు సాగు విస్తీర్ణం

అత్తెసరు ఆయకట్టుకే నీరందించే నిర్లిప్తత నుంచి ఆరేండ్లలో గోదావరి బేసిన్ ఆకుపచ్చ మాగాణంలా మారింది. 2014లో వంద టీఎంసీల జలా ల వినియోగానికే పరిమితం కాగా, ఈ ఏడాది ఏకంగా 530 టీఎంసీలను వాడుకొనేందుకు తెలంగాణ సిద్ధమవుతున్నది. గతేడాది 250 టీఎంసీల వరకు గోదావరి జలాలను బీడు భూములకు మళ్లించగా.. ఈ ఏడాది రెట్టింపునకుపైగా వినియోగానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి రావడంతో శ్రీరాంసాగర్‌కు వరదవచ్చినా, రాకున్నా.. ఈ స్థాయి వినియోగానికి కార్యాచరణ సిద్ధమైంది.
శ్రీరాంసాగర్, దేవాదుల, కడెం, ఎల్లంపల్లి, శ్రీరాజరాజేశ్వర, ఎల్‌ఎండీ, అన్నపూర్ణ, రంగనాయకసాగర్, కొండపోచమ్మసాగర్ పరిధుల్లో రెండు సీజన్లలోనూ వేల చెరువులను నింపడం.. వ్యవస్థసిద్ధంగా ఉన్నచోట నేరుగా ఆయకట్టుకు సా గునీరందించడంతో గోదావరిజలాల వినియోగం 500 టీఎంసీలు దాటనున్నది. ఇప్పటికిప్పుడు 200 టీఎంసీలకుపైగా నిల్వకు జలాశయాలు సిద్ధంగా ఉండటంతో కరువుఛాయలు ఉండవని సాగునీటిరంగ నిపుణులు చెప్తున్నారు. గతేడాది నిజాంసాగర్, సింగూరు ఆయకట్టుకు సాగునీరు అందలేదు. గతేడాది ఎస్సారెస్పీకి పునర్జీవం తెచ్చిన కాళేశ్వరం.. ఈ ఏడాది ఈ రెండింటికీ జీవం పోసేందుకు సిద్ధమవుతున్నది.
గోదావరి బేసిన్‌లో సాగుతీరిలా..

2019-20 యాసంగిలో గోదావరి బేసిన్‌లోని వేల చెరువుల కింద 4.31 లక్షల ఎకరాలకు సాగునీరందింది.