బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల కోసం గాలింపు ముమ్మరంగా సాగుతుందని రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు .
నీటిలో మట్టి బాగా పేరుకొని ఉండటంతో లోతుకు వెళ్లి గాలించటంలో ఇబ్భందులు ఎదురవుతున్నాయని, దీనితో డిజాస్టర్ మేనేజ్ మెంట్ కు చెందిన రెండు బృందాలను పిలిపించామని చెప్పారు. వారు మంగళవారం నుంచి గాలింపు ప్రారంబిస్తారని చెప్పారు. లార్జి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ డ్యాం అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ విషాదం జరిగిందన్నారు. రెస్క్యూ ఆపరేషన్ పూర్తయ్యేవరకు తను కులుమనాలిలోనే ఉంటానని నాయిని తెలియజేశారు. సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు నాయిని నర్సింహారెడ్డి సోమవారం ఉదయమే అక్కడికి వెళ్ళిన విషయం తెలిసిందే. విమానంలో ఢిల్లీకి అక్కడి నుండి చండీగఢ్ వెళ్ళిన నాయిని అక్కడినుండి పన్నెండు సీట్ల హెలికాప్టర్ లో కులుమనాలి చేరుకున్నారు. అక్కడే ఉండి విద్యార్ధుల వసతి, సహాయ చర్యలు పర్యవేక్షిస్తున్నారు . ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ ఇరవై నాలుగుమంది విద్యార్ధులు, ఓ ఫ్యాకల్టీని ఢిల్లీలో ఉన్న తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి ప్రత్యేక విమానంలో ఢిల్లీ తీసుకెళ్ళారని నాయిని చెప్పారు. అక్కడి నుండి వారిని హైదరాబాద్ కు పంపిస్తారన్నారు. గల్లంతైన వారిలో నలుగురు విద్యార్థుల మృతదేహాలు దొరికాయని, వాటిని ఎయిర్ ఫోర్సుకు చెందిన హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ పంపించామని తెలిపారు. డిజాస్టర్ మేనేజ్ మెంట్ వైస్ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి తో ఫోన్లో మాట్లాడామని ఆయన రెండు ప్రత్యేక బృందాలను కులుమనాలి పంపించారని చెప్పారు.