ఎంపీ సీటును కేకే కమిటీ నిర్ణయిస్తుంది.. సీపీఐ పొత్తు రెండ్రోజుల్లో తేలుతుంది కాంగ్రెస్‌తో పొత్తు ముగిసిన అధ్యాయం.. ఏప్రిల్ 11నుంచి ప్రచారంలోకి వెళ్తా: కేసీఆర్ తెలంగాణలో దొరలెక్కడున్నరు? ఉద్యమంలో కుటుంబమంతా జైళ్లలో ఉన్నం ఆడబిడ్డకు అర్ధరాత్రి బెయిలు వచ్చినపుడు దొరలం కాదా? కుటుంబ పాలన అనేది రాంగ్ ఫిలాసఫీ కరుణానిధి, ములాయం, ఇందిరవి కుటుంబాలు కావా? 14 ఏళ్లుగా పిచ్చిపిచ్చి కూతలు చాలా కూశారు తెలంగాణ ఉద్యమ ప్రస్థానం అయిపోయింది మా పార్టీలో ఇతరులకు ఖాళీ లేదు ఆంధ్రోళ్లతో అప్రమత్తత అవసరం విలేకరుల సమావేశంలో టీఆర్‌ఎస్ అధినేత

వచ్చే ఎన్నికల్లో మెదక్ జిల్లా గజ్వేల్ అసెంబ్లీ స్థానంలో పోటీ చేస్తున్నానని టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. పార్లమెంటుకు ఏ స్థానంనుంచి పోటీ చేయాలనేది కేకే ఆధ్వర్యంలోని కమిటీ నిర్ణయిస్తుందని ఆయన చెప్పారు. కాంగ్రెస్‌తో పొత్తుల అంశం ముగిసిపోయిన అధ్యాయమన్న కేసీఆర్ సీపీఐ పొత్తులపై రెండ్రోజుల్లో స్పష్టత వస్తుందని చెప్పారు. ఆదివారం టీఆర్‌ఎస్ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కొందరు ఇతర పార్టీల నేతలు పదేపదే దొరల పాలన, కుటుంబ పాలన అంటూ విమర్శించడంపై ఆయన అగ్గిమీద గుగ్గిలమయ్యారు.
తెలంగాణలో ఇంకా దొరలున్నారా? అని నిప్పులు చెరిగారు. తమ ఇంటి ఆడబిడ్డను రెండ్రోజులు జైల్లో పెట్టి అర్ధరాత్రి 3 గంటలకు వదిలేశారని.. అపుడు దొరలం కాదా? అని నిలదీశారు. తమ కుటుంబమంతా ఉద్యమంలో పాల్గొన్నామని, రేపు రాజకీయాల్లోనూ ఉంటామన్నారు. ఆంధ్ర నాయకుల ధోరణి చూస్తుంటే తెలంగాణకు ఇంకా ప్రమాదాలు పోలేదనిపిస్తుందన్నారు. రాజకీయాల్లో సహనం, ఓపిక అవసరమని చెరుకు సుధాకర్‌ను ఉద్దేశించి అన్నారు. అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులకు వీలున్నచోట సీట్లు ఇస్తూనే ఉన్నామన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి అధికారం అవసరమని, ఆ దిశగా పార్టీని బలమైన రాజకీయ శక్తిగా మలచాల్సిన అవసరముందని కొండా దంపతుల చేరికపై చెప్పిన కేసీఆర్, ఇది కొంతమందికి నచ్చవచ్చు.. కొందరికి నచ్చకపోవచ్చు అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే…
గజ్వేల్ నుంచే పోటీ చేస్తా వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ అసెంబ్లీ స్థానానికి నేను పోటీ చేయాలని మా ఎన్నికల కమిటీ నిర్ణయించింది. అక్కడి నుంచి పోటీ చేయాలని చాలా ఒత్తిళ్లు ఉన్నాయి. ఎంపీ స్థానం ఎక్కడ అనేది మా ఎన్నికల కమిటీ రెండుమూడు రోజుల్లో క్లియర్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేదు. అది ముగిసిన అధ్యాయం. సీపీఐతో చర్చలు జరుగుతున్నాయి. రెండుమూడు రోజుల్లో తేలుతుంది. కేకే చర్చిస్తున్నరు. సీపీఎంతో పొత్తుపై చర్చించలేదు. ఏదున్నా కేకే నేతత్వంలోని పొత్తుల కమిటీ చూస్తుంది. ఏప్రిల్ 11 నుంచి ప్రచారపర్వంలోకి దిగుతా. పార్టీలోకి చాలామంది వస్తామంటున్నారు. ఇంకా 9మంది లైన్లో ఉన్నారు. వచ్చేదుంటే ముందే వచ్చేదుండే. కాంగ్రెస్ నుంచి కూడా వస్తామంటున్నారు. కానీ మా పార్టీలో ఖాళీ లేదు. జయ నామ సంవత్సరంలోనే మా తొలి జాబితా రావచ్చు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 27 నాటికి అంతా ఎన్నికల బిజీలో ఉంటారు. కాబట్టి ఆవిర్భావ సభ పెట్టడం సాధ్యంకాకపోవచ్చు.
దెబ్బలు తిన్నం.. జైల్ల పడ్డం.. ఏమన్న అంటే బీసీలం అంటున్నారు. దొరల రాజ్యం అంటున్నారు. ఇంకా తెలంగాణలో దొరలెవరున్నారు? మరి కమ్మ, రెడ్డి, రాజుల పాలనలో పనిచేయొచ్చా? ఇగ మాట్లాడితే కుటుంబ పార్టీ అంటున్నారు. నేను, నా కొడుకు, నా బిడ్డ, హరీష్‌రావు అందరం ఒక్కటేనాడు జైళ్లో ఉన్నం. ఆడబిడ్డ కవితను అరెస్టు చేసి రెండు రోజుల తరువాత అర్ధరాత్రి మూడు గంటలకు వదిలిపెట్టిండ్రు. అపుడు దొరలం కాదా? మేమంతా ఉద్యమాల్లో ఉన్నం.. రాజకీయాల్లో ఉన్నం.. ఉంటం. పిచ్చికూతలు కూస్తే ఊరుకోం! కరుణానిధి, ఫరూక్ అబ్దుల్లా, ములాయం సింగ్, ఇందిరాగాంధీ కుటుంబాలు రాజకీయాల్లో లేవా? టీడీపీ కుటుంబ పార్టీ కాదా? అసలు కుటుంబపాలన అనేదే రాంగ్ ఫిలాసఫీ. టాలెంట్‌కు కుటుంబం శాపం కావొద్దు. చేతకాని మాటలు మాట్లాడొద్దు. ప్రజాసేవకు దృక్పథం ఉండాలి. పిచ్చికూతలు మానండి. ఇష్యూల వారీగా మాట్లాడండి. నా కుటుంబం అంతా ఉద్యమంలో ఉంది. కుటుంబం అంతా రాజకీయాల్లో ఉంటుంది. ఉపవాసాలు, రాస్తారోకోలు, ధర్నాల, జైళ్లు అన్నీ అనుభవించినం. అప్పుడు కుటుంబం కనిపించలేదా? 14 సంవత్సరాలుగా పిచ్చిపిచ్చి కూతలు చాలా కూశారు. న్యాయం, ధర్మం ప్రజల చూస్తారు. వాళ్లే నిర్ణయిస్తరు.
ఉద్యమ ప్రస్థానం ముగిసింది.. తెలంగాణ ఉద్యమ ప్రస్థానం అయిపోయింది. రాజకీయ పార్టీ అన్నాక అధికారంలోకి రావాలి. ప్రజలకు ఏమైనా చేస్తం అని చెప్పినప్పుడు చేయాలంటే అధికారం కావాలి. అందుకు రాజకీయ ఫలితాలు కావాలి. అందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో వాటిని తీసుకుంటం. కొండా దంపతులు రాజకీయ నాయకులు. మాకు అవసరం ఉంది. తీసుకున్నం. బయటి నుండి ఒక శక్తి వస్తుంటే తీసుకోం అని అనం కదా. మనదగ్గర ఏదైనా శక్తి ఉంటేనే ప్రజలకు ఏమన్న చేస్తం. ఉద్యమస్ఫూర్తి ఉండాలి. చెరుకు సుధాకర్‌కు 2004లోనే అవకాశం ఇచ్చినం. డిపాజిట్ కూడా రాలె. రాజకీయాల్లో ఓపిక ఉండాలె. పార్టీ పిలిచి అవకాశాలు ఇస్తది. మేం ఇలా ఉండటం కొందరికి నచ్చొచ్చు… మరికొందరికి నచ్చకపోవచ్చు. అమరుల కుటుంబాలకు టికెట్ల సంగతి. కొందరికి వారు అడుగకముందే పిలిచి ఎమ్మెల్సీ అవకాశం ఇస్తాం అంటున్నాం. కొందరికి ఎమ్మెల్యే టికెట్లు కూడా ఇస్తున్నాం. పార్టీలో అందరికీ టికెట్లు ఇవ్వగలమా? టీఆర్‌ఎస్‌ను బదునాం చేసే ఎత్తుగడ ఇది. వీహెచ్, ఢిల్లీ నుండి వచ్చిన కొందరైతే అమరులపై లేనిప్రేమ ఒలుకపోస్తున్నరు. అసలు అమరులను చేసిందే ఈ పుణ్యాత్ములు కదా.
అప్రమత్తంగా ఉండాల్సిందే.. తెలంగాణకు ఇంకా గండాలు పోలేదు. కిరణ్‌కుమార్‌రెడ్డి అధికారంలోకి వస్తే రెండు ప్రాంతాలను కలుపుత అంటున్నడు. 35 ఎంపీ సీట్లు గెలిపించి ఇస్తే మల్ల కలిపేస్తం అని గాలిముద్దుకష్ణమ నాయుడు అంటున్నాడు. ఇంకా మనకు భయం ఉంది. వెంకయ్య నాయుడు ప్రవర్తన చూస్తుంటే ఇంకా అప్రమత్తంగా ఉండాలనిపిస్తోంది. పార్లమెంట్‌లో పెప్పర్‌స్ప్రే చేస్తరని నేనైతే ఊహించలేదు. తెలంగాణ వచ్చినంక రెండు సంవత్సరాలు కష్టాలుంటాయి. రాబోయే రోజుల్లో ప్రజలకేం చేయబోతామో ఎన్నికల ముందే చెబుతాం.తెలంగాణ తెచ్చిన కీర్తి నాకు వెయ్యిజన్మలకు సరిపోతుంది. ఉద్యమంతో మొదలు పెట్టిన…. ఉద్యమంతోనే ముగించిన. రాష్ట్రపతి కూడా దీవించిండు. అంతకన్న గొప్ప వ్యక్తి ఎవరు ఉండరు కదా. చంద్రబాబు అయితే బీసీ సీఎం అంటున్నాడు. ఇన్నాళ్లూ ఎందుకు ఇవ్వలేదు. ఆంధ్రలో సీఎం పదవి బీసీలకు ఇవ్వు. బీసీలపై చిత్తశుద్ధి ఉంటే రెండు రాష్ర్టాల్లో బీసీలను సీఎం చేస్తానని ప్రకటించు. టీఆర్‌ఎస్‌గానీ, కేసీఆర్‌గానీ ఉంటే ఆంధ్రోళ్లకు భయం. ఎవరు గెలిచినా సరేగానీ టీఆర్‌ఎస్ గెలువొద్దని ఆంధ్ర శక్తులు కోరుకుంటున్నాయి. రాబోయే విద్యా సంవత్సరంలోని పుస్తకాల్లో ఏఏ అంశాలుండాలనేదానిపై మా నిపుణుల బందం, మేధావులు గవర్నర్‌ను కలుస్తారు. తెలంగాణ వచ్చినంక కూడా పాత పాఠాలేనా? అని ఒక పత్రికలో వచ్చింది. ఇప్పటికే పుస్తకాలను ప్రింటింగ్‌కు ఇచ్చి ఉంటారు. అయినా దీనిపై గవర్నర్‌ను మా బృందం రెండుమూడు రోజుల్లో వెళ్లి కలుస్తుంది. విలేకరుల సమావేశంలో పొలిట్‌బ్యూరో సభ్యుడు నాయిని నర్సింహ్మారెడ్డి టీఆర్‌ఎస్‌ఎల్‌పీ నేత ఈటెల రాజేందర్ తదితరులు ఉన్నారు.
ఈటెలను మంత్రిని చేస్తా..: హుజూరాబాద్‌లో ఈటెలను ఏకపక్షంగా గెలిపించి తీసుకువస్తే.. మంత్రిని చేసి మీ చేతులో పెడతానని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలంగాణభవన్‌లో కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ భారతంలో పాండవులే గెలుస్తారు. ఇప్పుడు తెలంగాణ గెలిచింది. ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. బంగారితునుక లాంటి తెలంగాణను తయారుచేసుకుందాం అన్నారు. 2001లో పార్టీ పెట్టిన తరువాత మెదక్ జిల్లా ప్రజ్ఞాపూర్‌లో తనను ఈటెల రాజేందర్ కలిసి తెలంగాణ కోసం పనిచేస్తానని చెప్పారని వివరించారు. తెలంగాణ వ్యాప్తంగా ఇటీవల సర్వేలు చేయిస్తున్నానని, ప్రజాదరణలో మొదటి స్థానం నల్లాల ఓదెలుకు 78శాతం, ఈటెల రాజేందర్‌కు 75శాతం, కేటీఆర్‌కు 70శాతం మద్దతు లభిస్తోందని అన్నారు. ఈటెల రాజేందర్ తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తారన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కథ ఒడిసిపోయిందన్నారు.కాంగ్రెస్ వారు 41సంవత్సరాలు పాలించింది చాలదా? కొత్తగేం జరుగుతుందని ప్రశ్నించారు. 14 సంవత్సరాలు తెలంగాణ మొత్తం పక్షుల్లా తిరిగినం. ప్రజలకేం కావాలో మనకే తెలుస్తుందని అన్నారు. టీఆర్‌ఎస్ వస్తుందని అన్ని సర్వేలు చెబుతున్నాయని, టీవీల సర్వేలు కూడా ధవీకరించాయని చెప్పారు.
కిరణ్‌కుమార్‌రెడ్డి ఆంధ్ర నుండి వచ్చే కరెంటును బంద్ పెడతామంటున్నాడని కేసీఆర్ అన్నారు. మొదటి రెండేళ్లు విద్యుత్ సమస్య ఉన్నా మూడో సంవత్సరం నుంచి ఛత్తీస్‌గఢ్‌లా 24గంటల కరెంటు ఇస్తామన్నారు. కొందరు మోడీమాయలో ఉన్నారని, ఈ మోడీలను, గీడీలను చాలా మందినే చూశామని, వాళ్లకు ఓటేస్తే గోల్‌మాల్ అవుతామన్నారు. కేంద్రంలో చక్రంతిప్పాలంటే 16ఎంపీ స్థానాలు కావాలన్నారు. అందుకే ముందు తెలంగాణ గురించి పట్టించుకుని ఆ తరువాతే దేశం సంగతి పట్టించుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ఎల్‌పీ నేత ఈటెల రాజేందర్, పొలిట్‌బ్యూరో సభ్యుడు నాయిని నర్సింహ్మారెడ్డి, వినోద్, గ్రేటర్ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్‌యాదవ్, యువజన విభాగం అధ్యక్షుడు బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు.