లైఫ్ ఈజ్ ఎ మిరాకిల్.. జిందగీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ నిర్ణయించలేరు.. కొన్ని సార్లు మనకు తెలియకుండానే అనుకోని మార్గం వైపు అడుగులేస్తాం.. కాలేజ్ డేస్‌లో మనం చేసే ఏ పనైనా మన ఫ్యూచర్‌నుడిసైడ్ చేస్తుంది అంటాడు చిన్నవయసులోనే నవ తెలంగాణలో యువ ఎంపీగా ఎన్నికయిన బాల్క సుమన్.ఆయన స్కూల్ ఏజ్ టు కాలేజ్ డేస్ ఇవాళ్టి స్పెషల్ స్టోరీ.

కాలేజ్‌లైఫ్ గురించి ఒక్కమాట?: ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు. ఏ ఊరు మీది?: మాది కరీంనగర్ జిల్లా మెట్‌పల్లి మండలం రేగుంట. మా అమ్మ ముత్తవ్వ, నాన్న సురేశ్. నాకొక చెల్లి, తమ్ముడు. చిన్నప్పడు అల్లరి?: నేను సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నాను. చిన్నప్పుడు చాలా అల్లరి చేసే వాణ్ణే కానీ ఎగ్జ్జామ్స్ వస్తున్నాయంటే మాత్రం సీరియస్‌గా చదివేవాణ్ణి. ఎప్పుడూ క్లాస్‌లో మెరిట్ స్టూడెంట్‌నే. అసలు నోట్స్ కూడా సరిగ్గా రాసుకునే వాణ్ణి కాను, ఫ్రెండ్స్ నోట్స్‌లో చదివి ర్యాంక్ తెచ్చుకునేవాణ్ణి. చిన్నప్పుడు మా తెలుగు టీచర్ రఘుపతి గారు నన్ను ఏకసంథాగ్రహి అనే వారు.
ఎందుకనో?: క్రికెట్, వాలీబాల్ బాగా ఆడేవాణ్ణి. రన్నింగ్ రేస్, వ్యాసరచన పోటీలలో చాలా ప్రైజులు వచ్చాయి. స్కూల్లో ప్లెడ్జ్, న్యూస్ రీడింగ్ నేనే చేసేవాడిని. హాస్టల్‌లో మెస్ ఇన్‌చార్జిగా కూడా ఉన్నాను. సో.. అప్పటి నుంచే నాకు లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉన్నాయి.
కాలేజ్ ఎక్కడ?: డిగ్రీ వరకూ కరీంనగర్ జిల్లాలోనే చదువుకున్నాను. తర్వాత ఎమ్.ఎ. ఇంగ్లీషు కోసం సికింద్రాబాద్ పీజీ కాలేజీలో చేరాను. ఇక్కడే నా లైఫ్‌కు టర్నింగ్‌పాయింట్. మా నాన్న సురేష్ వల్ల చిన్నప్పటి నుంచే నాకు తెలంగాణ పట్ల అవగాహన ఉండేది. నేను పీజీ చేస్తున్న సమయంలోనే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ స్థాపించారు. కాలేజీలో ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి యూనియన్ ప్రెసిడెండ్‌గా పనిచేశాను. తర్వాత ఓ.యూ.లో ఎమ్.ఫిల్ చేస్తున్నప్పుడు టి.ఆర్.ఎస్.వి ఉస్మానియా యూనివర్సిటీ సెక్రెటరీగా ఎన్నికయ్యాను.
ఆ తర్వాత?: తెలంగాణ ఉద్యమం కారణంగా ఎమ్.ఫిల్ మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. తర్వాత వచ్చిన ఉప ఎన్నికలు మళ్లీ నా లైఫ్‌లో టర్నింగ్‌పాయింట్ అయ్యాయి. అప్పుడే నేను కేటీఆర్‌ను మొదటిసారిగా కలుసుకున్నాను.
కేసుల గురించి?: తెలంగాణ ఉద్యమంలో భాగంగా నేను చేసినవి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. అవన్నీ తెలంగాణ కోసమే. 2009 నవంబర్‌లో కేసీఆర్ నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు పోలీసులు లాఠీఛార్జ్ చేసి జైల్లో పెట్టారు. అప్పటి నుంచీ ఇప్పటి వరకు నాపై 100కు పైగా కేసులున్నాయి.
ఇప్పుడు ఎంపీ కదా?: ఎంపీనయ్యాను. కానీ ఇప్పటికీ నేను ఓయూ స్టుడెంట్‌నే. ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్నాను. అప్పుడంటే ఫ్రీ టైం ఉండేది. ఇప్పుడు అంత లేకున్నా నేను సంతోషంగానే ఉన్నాను. నాకు పేపర్లు చదవటం, సినిమాలు చూడటం ఇష్టం. ఇప్పటికీ సినిమాలు చూస్తుంటాను.
సినిమాలు, షికార్లు: చిరంజీవి, కమల్‌హాసన్ యాక్టింగ్‌నాకు నచ్చుతుంది. ఇళయరాజా పాటలంటే ఇష్టం. సాగర సంగమం, నాయకుడు, రుద్రవీణలాంటి పాత సినిమాలు ఇష్టం. తమిళ్ డైరెక్టర్ శంకర్ మూవీస్ నచ్చుతాయి. శ్రీరాములయ్య సినిమాలోని భూమికి పచ్చాని రంగేసినట్లు.. అనే పాట చాలా ఇష్టం. ఇప్పటికీ నా ఇన్నోవాలో రోజుకి ఒక్కసారైనా వింటాను. యూత్‌కి చిన్న సలహా: మనం తలుచుకుంటే ఏదైనా సాధించగలం. మీరు అనుకున్న మార్గంలోనే ప్రయాణించండి. కష్టపడండి ఫలితం దానంతట అదే వస్తుంది. ఉన్న ఊరును కన్న తల్లిని మర్చిపోకండి. మీరెంత ఎత్తుకు ఎదిగినా మీ ఊరికోసం ఏదైనా చేయండి.
మీది లవ్ మ్యారేజ్ కదా! (నవ్వుతూ..) మాది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్. నా వైఫ్ రాణి అలేఖ్య. తను అప్పుడు టిన్యూస్‌లో న్యూస్ రీడర్‌గా పనిచేస్తుండే.. తనని ఫస్ట్ టైమ్ చూసినప్పుడే మనసులో ఫిక్స్ అయ్యాను ఈమెనే నా జీవితానికి రాణి అని. కానీ తనని పెళ్లి చేసుకోవడానికి చాలా ఇబ్బందే పడాల్సొచ్చింది. చాలా ప్రేమ కథల్లోలాగే కాస్ట్ వేరే కాబట్టి ముందు వాళ్లింట్లో ఒప్పుకోలేదు. కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఒప్పించి అందరి సమక్షంలో వాలైంటైన్స్ డే నాడు పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు ఆల్ హ్యాపీ.
కేసీఆర్ ఫ్యామిలీతో మీ అనుబంధం? (హ్యాపీగా నవ్వుతూ..) నన్ను పార్టీలో సీనియర్ నాయకులంతా కేసీఆర్ దత్తపుత్రుడంటారు. కేటీఆర్ నాకు బాస్ అయితే, కేసీఆర్ బిగ్‌బాస్. వాళ్లింట్లో అందరూ నన్నొక ఫ్యామిలీ మెంబర్‌లా చూస్తారు. 2010లో టీఆర్‌ఎస్‌వీ స్టేట్ ప్రెసిడెంట్‌గా నియమించినప్పుడు కేసీఆర్ గారు తన సొంత ఇన్నోవా వైట్ కలర్ కార్ నాకు ప్రెజెంట్ చేశారు. ప్రస్తుతం నేను వాడుతున్న కారు అదే.