Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

ఈ ఏడాది ప్రతి నియోజకవర్గానికి 500 ఇండ్లు

-ఎంత ఖర్చయినా సరే -టార్గెట్ మించినా అందరికీ ఇండ్లు.. హైదరాబాద్, వరంగల్‌లో వెంటనే నిర్మాణాలు -ఓపెన్ బిడ్డింగ్ ద్వారా కాంట్రాక్టర్ల ఎంపిక.. గృహనిర్మాణ పథకానికి క్యాబినెట్ ఆమోదం -ఘనంగా రాష్ట్ర అవతరణ ఉత్సవాలు.. వేడుకల్లో పలు కొత్త పథకాల ప్రకటన -అదే రోజునుంచి క్రమబద్ధీకరణ పట్టాల పంపిణీ -టీఎస్-ఐపాస్ ప్రకటన జూన్ 12కు వాయిదా -ఆర్థికశాఖలో 13 కొత్త పోస్టుల ఏర్పాటు.. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయాలు!

kcr రాష్ట్రంలో ఇండ్లు లేని నిరుపేదలకు గౌరవప్రదమైన, సొంత ఇంటి కల నెరవేరే రోజు దగ్గరకు వచ్చింది. ఈ ఏడాదినుంచే ఈ పథకాన్ని చేపట్టాలని రాష్ట్ర క్యాబినెట్ సమావేశం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది నియోజకవర్గానికి 500 చొప్పున డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణం ప్రారంభించాలని సంకల్పించింది. ఇందుకు ఖర్చు ఎంతైనా ఫర్వాలేదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. నిధుల కొరత లేదని స్పష్టంచేశారు. ఇండ్లులేని నిరుపేదలందరికీ డబుల్‌బెడ్‌రూమ్ ఇండ్లు కట్టించి ఇద్దామని అన్నారు. మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. దాదాపు రెండున్నర గంటలపాటు సాగిన సమావేశంలో రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణతోపాటు ప్రధానంగా డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణంపై చర్చ జరిగింది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లపై ఒక పాలసీని రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించింది. ఇండ్లు లేని పేదలు ఎక్కువగా ఉంటే టార్గెట్‌కు మించి అయినా సరే నిర్మించాల్సిందేనని ఈ సమావేశంలో ముఖ్యమంత్రి స్పష్టంచేశారని విశ్వసనీయవర్గాలు చెప్పాయి.

ఈ నాలుగేండ్లలో పేదలందరికీ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని అన్నారని తెలిసింది. ప్రతిపక్ష పార్టీల వాళ్లు మనం ఇండ్లు కట్టలేమని అంటున్నారని, వారి అంచనాలు తలకిందులు చేసేలా అర్హులైన పేదలందరికీ ఇండ్లు నిర్మించి ఇచ్చి చూపించాలని సీఎం అన్నారు. ఇటీవల వరంగల్ నగరంలోని పేదల కాలనీల్లో, కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌లోని వివిధ బస్తీల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించారు. ఆ సందర్భంగా ఆయా కాలనీలు, బస్తీల్లో నివసించే ఇండ్లులేని పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను నిర్మిస్తామన్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే రెండు లక్షల ఇండ్లను నిర్మిస్తామని ప్రకటించారు. దీనికి అనుగుణంగా హైదరాబాద్, వరంగల్ నగరాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలను వెంటనే చేపట్టాలని క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించారు. అలాగే హైదరాబాద్ అభివృద్ధిపై శాఖలవారీగా ప్రణాళికలు తయారు చేయాలని నిర్ణయించారు. డబుల్ బెడ్‌రూమ్‌ఇండ్ల నిర్మాణానికి ఓపెన్ బిడ్డింగ్‌ద్వారానే కాంట్రాక్టర్లను ఎంపిక చేయాలని తీర్మానించారని తెలిసింది.

ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ వేడుకలు భారీగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఒక్కో జిల్లాకు ఒక్కో మంత్రికి బాధ్యతలు అప్పగించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న పలు కొత్త పథకాలను తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న జరిగే ఉత్సవాలలో ప్రకటించాలని నిర్ణయించారు. జీవో 58 కింద దరఖాస్తు చేసుకున్న పేదలకు అదే రోజు నుంచి ఉచితంగా క్రమబద్ధీకరణ పట్టాలు ఇవ్వాలన్న నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

టీఎస్-ఐపాస్ ప్రకటన జూన్ 12న! రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా, దేశంలో ఎక్కడా లేని విధంగా తయారు చేసిన తెలంగాణ నూతన పారిశ్రామిక విధానం (టీఎస్-ఐపాస్) మంత్రివర్గ ఆమోదం పొందింది. దీనిని జూన్ 7న దిగ్గజ పారిశ్రామికవేత్తల సమక్షంలో ప్రకటించాలని తొలుత నిర్ణయించిన సంగతి తెలిసిందే. కానీ.. ఇంత తక్కువ వ్యవధిలో పారిశ్రామికవేత్తలు ఒకే వేదిక మీదకు రావడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొంత మంది ప్రముఖ పారిశ్రామికవేత్తలతో మాట్లాడిన తరువాత.. వారి సూచన మేరకు పారిశ్రామిక విధానం ప్రకటన తేదీని జూన్12కి మార్చాలని కేబినెట్‌లో నిర్ణయించినట్లు తెలిసింది. ఒకటి రెండు రోజులు అటూఇటూ అయినా ఫర్వాలేదని, కానీ.. అందరి సమయాన్ని చూసుకొని విధాన ప్రకటన వెలువరించాలని భావించినట్లు సమాచారం.

సౌర విద్యుత్ పాలసీకి ఆమోదం సౌర విద్యుత్ విధానాన్ని మంత్రివర్గం ఆమోదించింది. విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ బీహెచ్‌ఈఎల్‌తో చేసుకున్న ఎంవోయూకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జూలై 2వ వారంలో పెద్ద ఎత్తున చేపట్టనున్న హరితహారం కార్యక్రమాన్ని క్యాబినెట్ ఆమోదించింది. ఆటవీశాఖ భూమిని హార్టీకల్చర్ యూనివర్సిటీకి బదిలీచేస్తూ మరో నిర్ణయం తీసుకుంది. ఆర్థికశాఖలో 13 కొత్త పోస్టుల ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. భూ ఆక్రమణ చట్టానికి సవరణలు చేసింది. షేక్‌పేట నాలా వద్ద ఒక ప్రైవేట్ కంపెనీకి 29 గుంటల భూమిని కేటాయిస్తూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. యూదగిరి గుట్ట దేవాలయం అభివృద్ధికి సంబంధించిన భూసేకరణకు ఆమోదం తెలిపారు. భూ ఆక్రమణ కేసులను విచారణ చేసే ట్రిబ్యునల్‌ను రద్దు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది.

29న టీఆర్‌ఎస్‌ఎల్పీ ఈ నెల 29న టీఆర్‌ఎస్‌ల్పీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది. మండలి ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించుకోవడానికి తగిన వ్యూహాలను రూపొందించడంతోపాటు.. ఎమ్మెల్యేలు ఏ విధంగా ఓట్లు వేయాలనే అంశంపై ఆ రోజు జరిగే సమావేశంలో శిక్షణ ఇస్తారు. జూన్ ఒకటిన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు టీఆర్‌ఎస్ నుంచి ఐదుగురు అభ్యర్థులు రంగంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఐదుగురు అభ్యర్థులనూ గెలిపించుకోవడానికి 29న జరిగే సమావేశంలో ఒక్కో అభ్యర్థికి ఓట్ల కేటాయింపులు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.