-జెడ్పీ చైర్మన్ల కైవసానికి టీఆర్‌ఎస్ కసరత్తు -ఇప్పటికే నాలుగు జెడ్పీల్లో మెజారిటీ -స్వరాష్ట్రంలో సొంత పార్టీకి.. -హంగ్ జిల్లాల్లో కారెక్కుతున్న టీడీపీ, కాంగ్రెస్ జెడ్పీటీసీలు -మున్సిపాలిటీల్లోనూ ఇదే తీరు

స్వరాష్ట్రంలో సొంతపార్టీ గూటికే జిల్లా పరిషత్తులు చేరిపోనున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ జెడ్పీ ఛైర్మన్ ఎన్నికల కోసం నోటిఫికేషన్‌ను జారీచేసిన నేపథ్యంలో వేగంగా చోటుచేసుకుంటున్న పరిణామాల మధ్య అధికార పార్టీ వైపే మెజారిటీ జిల్లా ప్రజాపరిషత్‌లు మొగ్గుచూపుతున్నాయి. మొత్తం 9 జడ్పీలలో ఏడింటిపై గులాబీ జెండాను ఎగురవేయడం ఖాయమైంది. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ ప్రత్యర్థులను చిత్తు చేసి గణనీయమైన సంఖ్యలో స్థానాలు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో మూడు జిల్లాల్లో టీఆర్‌ఎస్ స్పష్టమైన మెజార్టీని సాధించింది.
ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో కారు స్పీడ్‌కు మిగిలిన పార్టీలు ఎదురునిలువలేకపోయాయి. ఇక మెదక్ జిల్లాలో మెజార్టీకి అతి స్వల్ప సంఖ్య తక్కువైనా ఆ వెంటనే కాంగ్రెస్, టీడీపీకి చెందిన జెడ్పీటీసీలు కారెక్కడంతో ఆ జెడ్పీ సైతం గులాబీ దళంలో చేరిపోయింది. దీంతో టీఆర్‌ఎస్ పార్టీ నాలుగింటిని కైవసం చేసుకున్నైట్లెంది. అదిలాబాద్ జిల్లాలో 52 జెడ్పీటీసీలుండగా టీఆర్‌ఎస్ పార్టీ 38 జెడ్పీటీసీలను గెలుచుకుంది. దీనికి తోడు బీఎస్పీ నుండి గెలిచిన జెడ్పీటీసీ కూడా గులాబీకిందకు చేరారు.
ప్రస్తుతం కాంగ్రెస్‌కు ముగ్గురు జెడ్పీటీసీలు కూడా టీఆర్‌ఎస్‌వైపు చూస్తున్నారు. దీంతో మొత్తం 52 జెడ్పీటీసీల్లో 42స్థానాలను టీఆర్‌ఎస్ ఖాతాలో ఉన్నాయి. ఇక కరీంనగర్‌లో 57 జేడ్పీటీసీలకుగాను 41 టీఆర్‌ఎస్ పార్టీ గెలుచుకుంది. ఇక్కడ ఇతర పార్టీలకు చెందిన జేడ్పీటీసీలు కూడా వస్తామంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో 36 జేడ్పీటీసీలుండగా కారు పార్టీఖాతాలో 24 ఉన్నాయి. మెదక్‌లో సైతం ఇతర జడ్పీటీసీ మద్దతు లభించింది. దీంతో ఈ నాలుగు జేడ్పీ ఛైర్మన్లను దక్కించుకోవడంలో ఎలాంటి ఇబ్బంది టీఆర్‌ఎస్‌కు లేదు.
ఆ మూడు జిల్లాలూ టీఆర్‌ఎస్ వెంటే.. పూర్తిస్థాయి మెజార్టీతో నాలుగు జిల్లాలను దక్కించుకున్న టీఆర్‌ఎస్ పార్టీ మిగిలిన మూడు జిల్లాలు కూడా కైవసం చేసుకునే దిశగా పావులు కదుపుతోంది. వరంగల్ జిల్లాలో 50 జేడ్పీటీసీలుండగా టీఆర్‌ఎస్ పార్టీకి 18 మంది సభ్యుల బలం ఉంది. టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుండి 10 మంది, ఇండిపెండెంట్ ఒకరు ఇప్పటికే గులాబీ గూటికి చేరారు. దీంతో జేడ్పీ ఛైర్మన్ సీటును దక్కించుకోవడానికి కావాల్సిన 26 మేజిక్ ఫిగర్ కంటే ఎక్కువ జేడ్పీటీసీలతో టీఆర్‌ఎస్ స్పీడ్ చూపిస్తోంది. రంగారెడ్డి జిల్లాలో కూడా ఎన్నికల ఫలితాల నాటికి హంగ్ పరిస్థితే ఉండేది. జిల్లాలో మొత్తం 33 జేడ్పీటీసీలుండగా టీఆర్‌ఎస్ పార్టీ 12 జేడ్పీటీసీలను కైవసం చేసుకుంది.
జేడ్పీని కైవసం చేసుకోవడానికి మేజిక్ ఫిగర్ 17కి మరో 5 జేడ్పీటీసీల అవసరం ఉంది. ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి తొమ్మిదిమంది జేడ్పీటీసీలున్నారు. ఇందులో ఏడుగురు కారెక్కడానికి సిద్ధమైనట్లు సమాచారం. దీనికి తోడు కాంగ్రెస్ నుండి మరో ముగ్గురు జేడ్పీటీసీలు వచ్చే అవకాశం ఉంది. దీంతో రంగారెడ్డి జేడ్పీని దక్కించుకోవడం టీఆర్‌ఎస్‌కు ఏమాత్రం కష్టం కాదు. మహబూబ్‌నగర్‌లో మొత్తం 64 జేడ్పీటీసీలుండగా మాజిక్ ఫిగర్ 33 జేడ్పీటీసీలు కావాలి. టీఆర్‌ఎస్ పార్టీకి 25 మంది జేడ్పీటీసీలున్నారు. రాష్ట్రంలో మారిన పరిస్థితుల్లో కాంగ్రెస్, టీడీపీ నుండి భారీ ఎత్తున జేడ్పీటీసీలు కారెక్కడానికి ఉవ్విళ్లూరుతున్నారు. దీంతో మహబూబ్‌నగర్ జేడ్పీ తామే కైవసం చేసుకుంటామని పార్టీ నేతలు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఇక నల్గొండ జిల్లాలో 59 జేడ్పీటీసీలకుగాను కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీని సాధించింది. ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక కోర్టు వివాదంలో ఉంది.
ప్రజల నమ్మకమే పార్టీవైపు నడిపిస్తోంది జడ్పీటీసీ ఎన్నికల నాటి పరిస్థితి ఇపుడు మారిపోవడంతో ఇతర పార్టీల తరపున గెలిచిన జేడ్పీటీసీ, ఎంపీటీలు టీఆర్‌ఎస్ పార్టీ వెంట నడవడానికి ముందుకు వస్తున్నారని టీఆర్‌ఎస్ నాయకులు చెబుతున్నారు. గులాబీ పార్టీ భారీ విజయాలు సాధించి అధికారం చేపట్టడంతో పాటు రోజురోజుకు ప్రజల్లో విశ్వనీయత పెంచుకోవడం దానికి కారణమంటున్నారు. తెలంగాణ పునర్ణిర్మానంలో భాగస్వామ్యం కావాలంటే గులాబీ నీడనే చేరడమే సరైనదన్న అంచనాకు వారు వచ్చారంటున్నారు. కేసీఆర్ అంటేనే నమ్మకం. అందుకే ప్రజలు ఆయనపై ఉన్న నమ్మకంతో ఓట్లేసి గెలిపించారు. మా పార్టీ కూడా వారి ఆలోచనలకు అనుగుణంగానే పనిచేస్తోంది.
ఏ రాజకీయ నాయకులైనా ప్రజల కోణంలో నుండే చూస్తారు కనుక వారంతా మా వెంట నడవడానికి సిద్ధం అవుతున్నారు. మెజార్టీ ఎంపీపీలనుకూడా టీఆర్‌ఎస్ పార్టీనే కైవసం చేసుకుంటుంది. ఒకరిద్దరు ఎవరైనా ఇప్పుడు రాకున్నా… భవిష్యత్తులో వారు కూడా మాతోనే కలిసొస్తారు అని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడొకరు విశ్లేషించారు.
ఏ క్యాంపుల్లో ఉన్నా ఓటు టీఆర్‌ఎస్‌కే.. మేం ఏ పార్టీ నుంచి గెలిచామని కాదు. ఏ పార్టీకి మద్దతు పలికితే మా ప్రాంతానికి మేలు జరుగుతుందన్నదే ముఖ్యం అని కాంగ్రెస్ పార్టీ క్యాంపులో ఉన్న ఒక జడ్పీటీసీ అంతరంగాన్ని బట్టి చూస్తే వారు ఎక్కడున్నా జడ్పీ చైర్మన్ ఎన్నిక సమయంలో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వబోతున్నాడనే విషయం స్పష్టం అవుతుంది. అంతేకాదు మా పరిధి మండలం వరకే కానీ మాకంటే పెద్దవాళ్లు ముందుచూపుతో ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు వారి కంటే మేం పెద్దవాళ్లం కాదు.
ఒక రకంగా సందిగ్ధంలో ఉన్న మాకు మా అనుమానాల్ని నివృత్తి చేసే విధంగా మేం కూడా ధైర్యంగా నిర్ణయం తీసుకునే విధంగా మాకు దారి చూపారు అంటూ ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్సీలను ఉటంకించారు. ఇదే పరిస్థితి బల్దియా, నగర పాలక సంస్థల ఎన్నికల్లో సైతం ఉంది. హైదరాబాద్, వరంగల్ నగర పాలక సంస్థలు మినహా మెజారిటీ మున్సిపల్, నగర పాలక సంస్థలు టీఆర్‌ఎస్ ఖాతాలోకి వెళ్లనున్నాయి.