-దళితులకు బడ్జెట్‌లో వెయ్యికోట్లు -టీఆర్‌ఎస్ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్

వచ్చే ఏడాది నాటికి రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కరోనా విపత్తునుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నందున ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ పోదామని పేర్కొన్నారు. ఆదివారం టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. ‘మనం ఉద్యమం నుంచి వచ్చిన వాళ్లం. మనకు ఈ రాష్ట్ర అవసరాలు తెలుసు. ఏండ్లపాటు కొట్లాడినం. ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి సమస్య మనకు తెలుసు. తాగునీటి గోస తీర్చేందుకు మిషన్ భగీరథను అమలుచేసినం. సాగునీటి కష్టాలను తీర్చేందుకు ప్రాజెక్టులు కట్టుకుంటున్నం. మిషన్ కాకతీయను అమలుచేసినం. ఇంకో ఏడాదిలో రాష్ట్రంలో ప్రతి ఎకరానికి నీళ్లిస్తం. కృష్ణా కింద ఉన్న ప్రాజెక్టులు పూర్తవుతయి. సీతారామ పనులు జరుగుతున్నయి. నాగార్జునసాగర్‌లో మన వాటాను సమర్థంగా వాడుకొనేలా ప్రణాళిక వేశాం. రైతుల కష్టాలను శాశ్వతంగా తీర్చేలా ప్రణాళికలను అమలుచేస్తున్నం. రైతుబంధు, రైతుబీమాతో కర్షకులకు కొంత భరోసా దొరికింది. పంటల కొనుగోలు, మార్కెటింగ్ తదితర వాటిపై దృష్టిసారించాం. తెలంగాణలో ఉన్నది రైతురాజ్యం. మన తొలి ప్రాధాన్యం రైతన్నకే. రైతు కేంద్రంగానే మన విధాన నిర్ణయాలుంటాయి. తెలంగాణ సాధించుకున్న అనతికాలంలోనే అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రారంభించుకొని, దేశంలోనే ఆదర్శవంతమైన రాష్ట్రంగా పేరు గడించాం. మనం ప్రారంభించిన అనేక పథకాలను ఇతర రాష్ట్రాలు, దేశం అనుసరించాల్సిన పరిస్థితికి తీసుకువచ్చాం అది మనకు గర్వకారణం. ఇదే స్ఫూర్తితో రాబోయే కాలంలో మరిన్ని అద్భుతమైన పథకాలను రూపొందించి అమలు చేస్తాం’ అని చెప్పారు.
దళితుల అభివృద్ధికి బడ్జెట్‌లో వెయ్యికోట్లు.. దళితుల అభివృద్ధికి ఇంకా కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరమున్నదని సీఎం కేసీఆర్ అన్నారు. ‘దళితుల సంక్షేమం కోసం ఇప్పటివరకు తీసుకున్న చర్యలు సరిపోవు. ఈసారి బడ్జెట్‌లో సబ్‌ప్లాన్‌కు అదనంగా వెయ్యికోట్లు పెడ్తాం. వచ్చే ఏడాది దీన్ని మరింత పెంచుతాం. మరింత అంటే.. ఏదో తూతూ మంత్రంగా కాదు.. పదివేల కోట్లయినా సరే కేటాయించుకుందం. దళిత వర్గాలను ముందుకు తీసుకెళ్లాలి. ఈ విషయాన్ని ప్రజలకు మనం స్పష్టంగాచెప్పాలి. ఎస్టీలకు సంబంధించిన పోడు భూముల సమస్య ఉన్నది. దీనిపై నేను గతంలో చెప్పిన. పోడు భూముల సమస్య పరిష్కారానికి నేనే వస్త. రాష్ట్రంలో పోడుభూముల సమస్యతో ఆదివాసీ, గిరిజన రైతులు పడుతున్న ఇబ్బందులను త్వరలోనే దూరం చేస్తం. కొన్నిచోట్ల కొంతమంది అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్టు నా దృష్టికి వచ్చింది. ఇది సరికాదు. పోడు భూముల విషయంలో ఒక్కోచోట ఒక్కో సమస్య ఉన్నది. వాటి పరిష్కారానికి క్షేత్రస్థాయి పర్యటనలు అవసరం. అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం నేనే స్వయంగా క్షేత్రస్థాయికి వస్తాను. అప్పటిదాకా గిరిజన రైతులను ఇబ్బంది పెట్టొద్దని, యథాతథ స్థితిని కొనసాగించాలని అటవీ అధికారులను ఆదేశిస్తాం. గిరిజన సోదరుల బాధ నాకు తెలుసు. నేను గతంలో తండాలకు, గిరిజన గూడేలకు వెళ్లిన. అనేకసార్లు ఆ తండాల్లో, గిరిజనుల గూడేల్లో పల్లెనిద్ర చేసిన. ఇప్పు డు చూస్తున్న కల్యాణలక్ష్మి పథకం కూడా వరంగల్ జిల్లాలో ఓ తండాలో గిరిజన సోదరుడి దుఃఖా న్ని చూసిన తర్వాత వచ్చిందే. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలుచేసిన ప్రతి పథకం ప్రజల గుండెల్లో నుంచి వచ్చిందే’ అని సీఎం పేర్కొన్నారు.
బీసీలను ఆదుకుందాం నాయీ బ్రాహ్మణులు, రజకులు.. తదితర అనేక బీసీ కులాలవారికి చేయూతనివ్వాలని సీఎం కేసీఆర్ చెప్పారు. ‘ప్రజలకు మనం ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేసుకొందాం. ఆధునిక సెలూన్లు, దోభీఘాట్‌ల నిర్మాణం, విద్యుత్తు చార్జీల మాఫీ.. వీటన్నింటిని సమర్థంగా అమలు చేద్దాం. వారి సమస్యలేమిటో క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తెలుసుకోవాలి. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి’ అని సీఎం పార్టీ క్యాడర్‌కు సూచించారు.
మనమే మెరుగ్గా ఉన్నాం ఆర్థిక క్రమశిక్షణలో దేశంలోని అనేక రాష్ర్టాలకన్నా మనమే మెరుగ్గా ఉన్నామని సీఎం కేసీఆర్ అన్నారు. ‘అప్పులను మన లిమిట్‌లోనే తీసుకొంటున్నాం. లిమిట్ దాటలేదు. బడ్జెట్‌లో మంచిగా పెట్టుకుందాం. గత బడ్జెట్‌లో చెప్పినదాన్ని కరోనా వల్ల చేయలేకపోయాం. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి కొద్దికొద్దిగా మెరుగుపడుతున్నది. మంచి పథకాలను అమలు చేసుకుందాం’ అని సీఎం కేసీఆర్ వివరించారు.