-యాసంగిలో ఎఫ్‌సీఐ సేకరించిన ధాన్యంలో 63% మన రాష్ట్రానిదే -ఉచిత విద్యుత్, సాగునీటి లభ్యతతో రైతులకు లబ్ధి -భారత ఆహార సంస్థ ప్రకటనపై సీఎం కేసీఆర్ -దేశానికే దిక్సూచి: మంత్రి కే తారకరామారావు
దేశానికి తిండిపెట్టే స్థాయికి రాష్ట్రం ఎదుగటం గర్వంగా ఉన్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఈ యాసంగిలో తెలంగాణ నుంచే అత్యధికభాగం ధాన్యం సేకరణ చేశామని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) సీఎండీ డీవీ ప్రసాద్ ప్రకటించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ రైతులకు అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో పెరిగిన సాగునీటి లభ్యతను, ఉచిత విద్యుత్‌ను తెలంగాణ రైతులు సమర్థంగా వినియోగించుకొని, తమ వృత్తి నైపుణ్యంతో బ్రహ్మాండమైన పంటలు పండించారని ప్రశంసించారు.
దేశానికి కావాల్సిన ఆహారం అం దించడంలో తెలంగాణ నంబర్ వన్ రాష్ట్రంగా నిలిచిందని ఎఫ్‌సీఐ సీఎండీ బుధవారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి ఎఫ్‌సీఐ ప్రకటించిన వివరాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం తెలంగాణ దేశానికే ధాన్యాగారంగా అవతరించిందని అభినందించారు. యాసంగిలో తాము సేకరించిన మొత్తం ధాన్యంలో 63 శాతం కేవలం తెలంగాణ నుంచి, మిగతా అన్ని రాష్ర్టాల నుంచి కలిపి 37 శాతం సేకరించినట్టు తెలుపడం రాష్ర్టానికి గర్వకారణమని చెప్పారు.
కరోనా నేపథ్యంలో ఎదురైన అనేక సవాళ్లను అధిగమించి ఈ సారి ప్రభు త్వ రంగ సంస్థలు రికార్డుస్థాయి కొనుగోళ్లు చేపట్టాయని తెలిపారు. దేశవ్యాప్తంగా ఎఫ్‌సీఐ ఈ యాసంగిలో ఇప్పటిదాకా 83.01 లక్షల టన్నుల ధాన్యం సేకరించగా, అందులో తెలంగాణ నుంచే 52.23 లక్షల టన్నులు సేకరించినట్టు స్పష్టంచేశారు. ఈ సారి ఎఫ్‌సీఐ 91.07 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా, అందులో సగానికి పైగా ఇప్పటికే తెలంగాణ సమకూర్చిందన్నారు. తెలంగాణలో ఈ యాసంగిలో ఎక్కువ వరి పంట పండినందున అది దేశ అవసరాలకు ఎంతగానో ఉపయోగపడిందని ఎఫ్‌సీఐ విడుదల చేసిన ప్రకటన ద్వారా స్పష్టమైందని పేర్కొన్నారు.
లాక్‌డౌన్ నేపథ్యంలో రైతులు పం డించిన ప్రతి గింజను సేకరించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. మొత్తం 6,386 కేంద్రాలు ఏర్పాటు చేసి, ఇప్పటివరకు 55.52 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుచేసింది. తెలంగాణ నుంచి పెద్దఎత్తున ధాన్యం వస్తున్న నేపథ్యంలో స్వయంగా ఎఫ్‌సీఐ సీఎండీ ప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పు డు సంప్రదింపులు జరిపారు. గతంలో సాగునీటి వసతి లేక, కరెంటు సరిగా అందక తెలంగాణలో పంటలు సరిగా పండకపోయేవి. దీంతో ధాన్యంతోపాటు ఇతర పంటల దిగుబడి తక్కువగా ఉం డేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి సీ ఎం కేసీఆర్ సాగునీటి రంగానికి ఎనలేని ప్రాధా న్యం ఇచ్చారు. వ్యవసాయాభివృద్ధికి- రైతు సంక్షేమానికి అనేక చర్యలు తీసుకున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వం శరవేగంగా పూర్తిచేసి, సా గునీరు అందించింది. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం, భూగర్భ జలమట్టాలు పెరిగాయి. 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నది. దీంతో అటు ప్రాజెక్టు కాల్వలు, చెరువులు, బోరు బావుల ద్వారా పుష్కలంగా సాగునీటిని వాడుకోవడం సాధ్యమైంది. ఈ కారణంగా రాష్ట్రంలో వరిసాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. గత యాసంగిలో 17 లక్షల ఎకరాల్లో వరి పంట సాగవగా, ఈ యాసంగిలో 39.5 లక్షల ఎకరాల్లో వరిసాగు జరిగింది. ఫలితంగా రికార్డుస్థాయిలో వరి ధాన్యం చేతికొచ్చింది. పండిన పంట రాష్ట్ర అవసరాలు తీర్చడంతోపాటు దేశ అవసరాలను కూడా తీర్చేలా అవతరించడం గర్వకారణమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్‌కు పల్లా కృతజ్ఞతలు సీఎం కేసీఆర్ చర్యల ఫలితంగానే రాష్ట్రంలో వరిసాగు విస్తీర్ణం, ధాన్యం దిగుబడులు పెరిగాయని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. దేశానికి అవసరమైన ధాన్యంలో ఎక్కువ శాతం తెలంగాణ నుంచి వెళ్ల డం వెనుక కేసీఆర్ దార్శనికత ఉన్నదని కొనియాడారు. ఇంతటి ఘనతను సాధించిన సీఎం కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
సజావుగా వ్యవసాయోత్పత్తుల కొనుగోళ్లు రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయోత్పత్తుల సేకరణ సజావుగా కొనసాగుతున్నది. శనగ, పొద్దుతిరుగుడు సేకరణ పూర్తయింది. ధాన్యం, మక్కజొన్నల కొనుగోళ్లు తుదిదశకు చేరుకున్నాయి. రైతుల వద్ద ఉన్న ధాన్యం, మక్కజొన్న పంటలను పూర్తిగా కొనుగోలు చేసేంత వరకు కేంద్రాలను కొనసాగిస్తామని రైతుబంధు సమితి అధ్యక్షుడు రాజేశ్వర్‌రెడ్డి చెప్పారు. బుధవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 7,623 కేంద్రాల ద్వారా 63,89,830 టన్నుల పంటలను కొనుగోలు చేసినట్టు తెలిపారు.
రూ.7 వేల కోట్లకుపైగా చెల్లింపులు పూర్తి రాష్ట్రవ్యాప్తంగా బుధవారం వరకు సేకరించిన వరి ధాన్యం విలువ రూ.10,177 కోట్లు. ఇం దు లో ఇప్పటికే రూ.6,433 కోట్లు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. తాజాగా రూ.600 కోట్ల మొత్తాన్ని ఒకే రోజు విడుదలచేశాం. అంటే రూ.7 వేల కోట్లకు పైగా చెల్లింపులు పూర్తవడం రికార్డు. ఇప్పటివరకు 7.37 లక్షల మంది రైతుల నుంచి 55.52 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చే శాం. కొనుగోళ్ల ప్రక్రియ 86 శాతం పూర్తయింది. -పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి
రైతాంగానికి గర్వకారణం: మంత్రి కేటీఆర్ ధాన్యం సేకరణలో రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నదని, ఇది తెలంగాణ రైతులందరూ గర్వించాల్సిన విషయమని మంత్రి కే తారకరామారావు తెలిపారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో రాష్ట్రం అద్భుత ప్రగతిని సాధిస్తున్నదని బుధవారం ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఎఫ్‌సీఐ సీఎండీ ప్రకటించిన వివరాల ప్రకారం ధాన్యం సేకరణలో తెలంగాణ దేశంలోనే ముందు నిలిచిందన్నారు. దేశంలో 83 లక్షల టన్నుల ధాన్యం సేకరిస్తే ఇందులో 63 శాతం తెలంగాణ నుంచే వచ్చినట్టు ప్రకటించారని కేటీఆర్ చెప్పారు.
రాష్ట్రంలో పంటల కొనుగోళ్లు ఇలా.. (టన్నుల్లో)
