టీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి పదవి చేపట్టనున్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదివారం ఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లోని ఫోర్‌కోర్ట్‌లో సోమవారం సాయంత్రం జరిగే నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన హాజరుకానున్నారు.
-స్వాగతం పలికిన టీఆర్‌ఎస్ ఎంపీలు -నేడు మోడీ ప్రమాణస్వీకారానికి హాజరు

వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి, మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి శనివారం రాత్రే ఢిల్లీకి చేరుకోగా మిగిలినవారంతా ఆదివారం మధ్యాహ్నం వరకు చేరుకున్నారు. అనంతరం ఆదివారం రాత్రి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న కేసీఆర్‌కు వీరు స్వాగతం పలికారు. వీరంతా మోడీ ప్రమాణ కార్యక్రమానికి హాజరవుతారు. కేసీఆర్‌తో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు ఢిల్లీకి వెళ్లారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ విజయాన్ని పురస్క రించుకొని సోమవారం రాత్రి కేసీఆర్ పార్టీ ఎంపీలకు విందు ఇస్తున్నారు. మంగళవారం హైదరాబాద్‌కు తిరిగి వస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ సందర్భంగా కరీంనగర్ ఎంపీ వినోద్ టీ మీడియాతో మాట్లాడుతూ రానున్న ఐదేళ్లలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మారుతుందని, బ్రాండ్ తెలంగాణ స్థాయిని సంతరించుకుంటుందని తెలిపారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మీడియాలో ప్రచారమే ఎక్కువగా జరిగిందని.. నిజమైన అభివృద్ధి స్వల్పమన్నారు. టీఆర్‌ఎస్ మాత్రం మాటలకు దూరంగా ఉండి చేతల్లో పనితనాన్ని చూపిస్తుందన్నారు. బంగారు తెలంగాణ సాధన కూడా ఉద్యమ తరహాలో జరుగుతుందని పేర్కొన్నారు.
తొలిసారిగా ఎంపీగా ఎన్నికైన బాల్క సుమన్ మాట్లాడుతూ.. ఒక దళిత విద్యార్థి నాయకుడిగా ఉన్న తనను పార్లమెంటుకు పంపాలన్న ఆలోచన కేసీఆర్‌ది అయితే, దానిని సుసాధ్యం చేసిన ఘనత నియోజకవర్గ ప్రజలదని అన్నారు. భువనగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ మాట్లాడుతూ ఎంపీగా తనను ఎన్నుకున్న ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయబోనని అన్నారు.
మహబూబాబాద్ ఎంపీ ప్రొఫెసర్ సీతారాంనాయక్ మాట్లాడుతూ ప్రజల ఆకాంక్ష నెరవేర్చార్చడమే తమ తక్షణ కర్తవ్యం అని అన్నారు. నిజామాబాద్ ఎంపీ కవిత మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ర్టానికి కేంద్రంనుంచి సహకారం అందుతున్న నమ్మకం తమకుందని పేర్కొన్నారు. ఒకవేళ చంద్రబాబులాంటి వ్యక్తుల వల్ల తెలంగాణకు కేంద్రం నుంచి అందే సహకారంలో ఏమైనా వ్యత్యాసం ఉన్నట్లయితే అందుకు తెలంగాణ నుంచి ఎన్నికైన తెలుగుదేశం, బీజేపీ ఎంపీలే బాధ్యత వహించాలన్నారు. కేంద్రంతో ఘర్షణపూరిత వైఖరి అవలంబించాలన్న ఉద్దేశం తమకు ఏమాత్రం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తెలంగాణ ఎంపీలుగా ఎన్నికైన తమపై అనేక బాధ్యతలు ఉన్నాయన్నారు. ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా తీసుకురావడం, పాలమూరు ఎత్తిపోతల పథకానికి గుర్తింపు తీసుకురావడం, పోలవరం ప్రాజెక్టు వివాదాన్ని పరిష్కరించడం, బయ్యారంలో ఇనుము-ఉక్కు పరిశ్రమను తీసుకురావడం, ప్రజా జిల్లాలోనూ కొత్త పరిశ్రమల క్లస్టర్లను తీసుకువచ్చి ఉపాధి అవకాశాలను సష్టించడం.. ఇలాంటివన్నీ తమ ముందు ఉన్న కర్తవ్యాలని కవిత వెల్లడించారు.