Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

కరెంటు బాధ్యత కేంద్రానిదే

-చెప్పినంత విద్యుత్ సాధిస్తే సీఎంకు పాలాభిషేకం: రేవంత్‌రెడ్డి -ఏపీ సర్కారుకు వంతపాడిన టీడీపీ సభ్యుడు.. మాతృద్రోహం చేస్తున్నారంటూ సీఎం ఆగ్రహం -4వేల మెగావాట్ల ప్లాంట్ కాంగ్రెస్ పుణ్యమేనన్న జానారెడ్డి -తెలంగాణకు 54% విద్యుత్‌ను ఏపీ ఇచ్చి తీరాలని వ్యాఖ్య -విభజన చట్టాన్ని బాబు ధిక్కరించడం విచారకరం: లక్ష్మణ్ -పొత్తు ఎవరితో పెట్టుకున్నా.. తాము ప్రజల పక్షమేనని వెల్లడి -ఏపీ సర్కారు కుట్రలపై ఢిల్లీకి అఖిలపక్షం -విభజన చట్టం అమలుకోసం కేంద్రానికి విజ్ఞప్తి -విద్యుత్‌పై వాడిగా వేడిగా సుదీర్ఘ చర్చ.. పరస్పర విమర్శలతో అట్టుడికిన సభ

KCR addressing in  Assembly ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014ను ఉల్లంఘించిన ఏపీ ప్రభుత్వ తీరుపై రాష్ట్ర శాసనసభ తీవ్రంగా మండిపడింది. న్యాయంగా తెలంగాణకు రావాల్సిన విద్యుత్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ సాధించాల్సిందేనని తీర్మానించింది. రాష్ట్రంలో విద్యుత్ కొరత, రైతుల ఆత్మహత్యల అంశాలపై సోమవారం రాష్ట్ర శాసనసభలో దాదాపు పది గంటలపాటు సుదీర్ఘంగా, వాడివేడి చర్చ జరిగింది.

 

రాష్ట్రంలో విద్యుత్ కొరతకు దారితీసిన పరిస్థితులను సవివరంగా ప్రస్తావించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. ఉమ్మడి రాష్ట్రంలో గత 50 ఏండ్లుగా పరిపాలన సాగించిన కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల చేతకానితనంవల్లే తెలంగాణలో ప్రస్తుతం కరెంటు కష్టాలు వచ్చాయని స్పష్టంచేశారు. ప్రస్తుత ఇబ్బందికర పరిస్థితుల్లో నార్త్ గ్రిడ్‌నుంచి విద్యుత్ తీసుకుందామంటే గత ప్రభుత్వాల పుణ్యమాని స్లాట్ లేకుండా పోయిందనిచెప్పారు. గత ప్రభుత్వాల తప్పిదాలను సరిదిద్దేందుకు తాము చేపడుతున్న చర్యలను సభ దృష్టికి తెచ్చారు.

ఒకవైపు విభజన చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉల్లంఘించడమే కాకుండా ఉద్దేశపూర్వకంగానే తెలంగాణకు రావాల్సిన న్యాయమైన విద్యుత్ వాటా ఇవ్వకుండా, శ్రీశైలంలోకూడా జల విద్యుత్ ఉత్పత్తి చేసుకోకుండా అడ్డంకులు సృష్టిస్తున్నదని దుయ్యబట్టారు. తెలంగాణ రైతన్నల పంటలను ఎండగొట్టి, రైతుల నోట్లో మట్టికొట్టాలని ఏపీ ప్రభుత్వం చూస్తున్నదని ఆక్షేపించారు. దీనిని తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రాజకీయపక్షాలు ముక్తకంఠంతో ఖండించి, తెలంగాణకు రావాల్సిన న్యాయమైన విద్యుత్‌వాటాను ఇప్పించేలా కేంద్రాన్ని కోరుతూ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేయాలని సీఎం సూచించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని శాసనసభ ఏకగీవ్రంగా ఆమోదించింది.

సభ ఆమోదించిన తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని నిర్ణయించారు. తెలంగాణకు ఆంధ్రప్రదేశ్‌నుంచి రావాల్సిన విద్యుత్‌వాటాను సాధించేందుకు కలిసికట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై పోరాడాలని అన్ని రాజకీయపార్టీలు నిర్ణయించాయి. ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, సీపీఐ, సీపీఎం, ఎంఐ ఎం, వైఎస్సార్సీపీలు అంగీకరించాయి. ఇందుకోసం ఢిల్లీకి ప్రధానమంత్రివద్దకు అఖిలపక్ష కమిటీని తీసుకువెళ్లటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. పరస్పర ఆరోపణలు, విమర్శలు, వాగ్యుద్ధాలమధ్య విద్యుత్ అంశంపై వాడివేడి చర్చ జరిగినా.. చివరకు ఏపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై అన్ని పార్టీలను ఒప్పించి, శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేయించటంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం విజయం సాధించింది.

ఏ పార్టీ ఏం చెప్పినా ఆఖరుకు తెలంగాణకు ఏపీ నుంచి రావాల్సిన విద్యుత్ రావటం లేదని అంగీకరించక తప్పలేదు. దీనికి ముందు ఉదయం టీఆర్‌ఎస్ సభ్యుడు ఏనుగు రవీందర్‌రెడ్డి విద్యుత్ అంశంపై 304 నిబంధన కింది అడిగిన ప్రశ్నలకు సీఎం చంద్రశేఖర్‌రావు సమాధానమిస్తూ.. ఏపీ సీఎం చంద్రబాబు ముక్కు పిండి మరీ తెలంగాణకు రావాల్సిన విద్యుత్‌ను తీసుకొస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ పంటలను ఎండగట్టాలని చంద్రబాబు కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే నిర్మించిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్లో తెలంగాణకు 54%, ఏపీకి 46% వాటా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారని, కానీ ఏపీ ముఖ్యమంత్రి చట్టాన్ని అతిక్రమించారని కేసీఆర్ చెప్పారు. ఈ విషయంపై తాను, ప్రభుత్వ కార్యదర్శి అనేక పర్యాయాలు కేంద్రానికి తెలియజేశామని, లేఖలద్వారా కూడా ఫిర్యాదుచేశామని వివరించారు.

న్యాయబద్ధంగా ఏపీలోని ఏయే ప్రాజెక్టుల నుంచి తెలంగాణకు రావాల్సిన విద్యుత్ వాటా ఎంతో కేసీఆర్ వివరించారు. కానీ.. వాటిని తెలంగాణకు ఇచ్చేది లేదని ఏపీ సీఎం అంటున్నారని సభ దృష్టికితెచ్చారు. తెలంగాణలో విద్యుత్ సమస్య ఒక్క రోజులో వచ్చింది కాదని, ఘనత వహించిన గత ప్రభుత్వాల నిర్వాకంవల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అన్నారు. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాల తెలివి తక్కువతనంవల్ల స్థాపిత కరెంట్‌లో కేంద్రంనుంచి ఎక్కువ వాటాను ఏపీ పొందలేకపోయిందని ముఖ్యమంత్రి విమర్శించారు. 2001 లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 8.45 కోట్లు. కేంద్రంనుంచి తీసుకోవాల్సిన స్థాపిత కరెంట్‌లో హైడ్రో, గ్యాస్, థర్మల్ కలిపి ఏపీకి దక్కిన వాటా 16,719 మెగావాట్లు మాత్రమేనని చెప్పారు.

అనంతరం మాట్లాడిన ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సభ్యుడు జానారెడ్డి.. తెలంగాణ రాష్ట్రంలో నాలుగువేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను నెలకొల్పాలని చట్టంలో చేర్చింది కాంగెస్ పార్టీనేనని చెప్పారు. మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణకు 54శాతం ఇచ్చి తీరాల్సిందేనని, కృష్ణపట్నం, హిందూజా నుంచి కరెంటు ఇవ్వాల్సిందేనని అన్నారు. చట్టాన్ని ధిక్కరించడం ఏపీ ప్రభుత్వానికి సాధ్యం కాదని అన్నారు. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని కృష్ణాబోర్డు ఇచ్చిన తీర్పుపై ఆయన నిరసన వ్యక్తం చేశారు. అఖిలపక్షంగా ఢిల్లీకి వెళ్లేందుకు తాము సిద్ధమని చెప్పారు. 21వేల మెగావాట్ల స్థాయికి తెలంగాణను తీసుకుపోతాం అని ప్రభుత్వం చెబుతుంటే విచిత్రంగా అనిపిస్తున్నదని అన్నారు.

దానికి ముందు ఎన్టీపీసీ నుంచి త్వరగా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమయ్యేలా చూడాలి. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేస్తే మరో నాలుగువేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. మొత్తం 8వేల మెగావాట్లతో రైతుల సమస్యలు తీర్చొచ్చు. ఆ తరువాత మీరు 50వేల మెగావాట్ల విద్యుత్ తెచ్చినా సంతోషమే అన్నారు. ముఖ్యమంత్రి విద్యుత్ సమస్యల గురించి విశదీకరిస్తున్నప్పుడు శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో విద్యుత్ ఉత్పత్తి అంశం వచ్చింది. సాగర్, శ్రీశైలంలో ఉత్పత్తి మొదలుపెడితే ఏపీ సీఎం చంద్రబాబు, ఇరిగేషన్ మినిస్టర్ నానా యాగీ చేశారు.

తెలంగాణ పంటలు ఎండగట్టాలని చంద్రబాబు కంకణం కట్టుకున్నడు అని సీఎం ఆరోపించారు. దీంతో టీడీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడకూడదని స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. సీఎం జోక్యం చేసుకుని ఏపీ సీఎం ముక్కుపిండి మన విద్యుత్ తీసుకొస్తం. బాబు నిర్వాకం గురించి మాట్లాడితే మీకు ఎందుకు పౌరుషం పొడుచుకొస్తున్నది? ఇవి వాస్తవాలు కావా? అని నిలదీశారు. టీడీపీ సభ్యుడు రేవంత్‌రెడ్డి ఏపీ ప్రభుత్వాన్ని సమర్థించేలా మాట్లాడారు. 1994లో చంద్రబాబు అధికారం చేపట్టేనాటికి 5634మెగావాట్ల ఉత్పత్తి ఉందని, ఇది 40 సంవత్సరాల రాష్ట్రంలో సాధించినదని అన్నారు. హైదరాబాద్‌లో కోతలులేకుండా, వ్యవసాయానికి కరెంటు ఇచ్చిన ఘనత చంద్రబాబుదని చెప్పారు.

ఆస్తులు, అప్పులను 42ః58శాతం ప్రకారం పంచినట్లు విద్యుత్ కూడా పంచాలని బాబు అనలేదని, అందుకే తెలంగాణకు 54% కరెంటు వచ్చిందని అన్నారు. ఈ సమయంలో సీఎం జోక్యం చేసుకున్నారు. రేవంత్‌రెడ్డి సభను పక్కదారి పట్టిస్తున్నారు. ఒకవైపు ఏపీ ప్రభుత్వం ఫ్యూజులు పీకుతూ మరోవైపు వీళ్లతో ఆ నాయకుడు యాత్రలు చేయిస్తున్నాడు. తెలంగాణకు రావాల్సిన 980మెగావాట్ల విద్యుత్‌ను చంద్రబాబు అడ్డుకుంటున్నాడు. బాబు ఫ్యూజులు పీకింది.. మీరు యాత్రలు చేసింది నిజం కాదా? సమస్యను చర్చించేందుకు చర్చించాలి కానీ ఉపన్యాసాలొద్దు అన్నారు. రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ థర్మల్‌ద్వారా 11525 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి అవుతుంటే తెలంగాణకు 58%, హైడల్‌లో 58.6% వస్తున్నదని చెప్పారు. దీనిపై తీవ్రంగా స్పందించిన సీఎం.. అధ్యక్షా.. తెలంగాణకు ఇది బ్లాక్‌డే.

మాతృభూమికి ద్రోహం చేస్తున్నారు. ద్రోహం చేసుకుంటూ ఏపీ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని సమర్థిస్తున్నారు. ఏం వాదిస్తున్నాడు? అన్నీ అబద్ధాలే అని ఆగ్రహంగా అన్నారు. ఈ వాగ్యుద్ధం అనంతరం సభను సాయంత్రం సెషన్ కోసం నాలుగు గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు. సాయంత్రం ప్రత్యేకంగా విద్యుత్ సమస్యపై చర్చ మొదలైనప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర రైతాంగం, ప్రజల ప్రయోజనాలు కాపాడడమే టీఆర్‌ఎస్ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టంచేశారు. తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకున్నామని తెలిపారు. వచ్చే మూడేండ్ల తర్వాత రెప్పపాటు సమయంకూడా కరెంటు పోకుండా విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, సరఫరా వ్యవస్థలను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో, చిత్తశుద్ధితో ముందుకు సాగుతుందని ప్రకటించారు.

విద్యుత్‌లోటు కారణంగా రబీ సీజన్‌లో వరి పంట వేయకుండా ఆరుతడి పంటలను వేసుకోవాలని రైతాంగానికి విజ్ఞప్తిచేశారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో అందరం సమిష్టిగా కలిసి పోరాడుదామన్న స్ఫూర్తితో ప్రతిపక్ష సభ్యులు మాట్లాడడం సంతోషదాయకమన్నారు. తెలంగాణకు సంబంధించిన సమస్యలపై కేంద్రం స్పందించాల్సినంత తొందరగా స్పందించడంలేదన్నారు. విభజన చట్టం ప్రకారంగా తెలంగాణకు రావాల్సిన విద్యుత్ వాటా ఇప్పించాలని, కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అందరికీ విద్యుత్తు పథకాన్ని తెలంగాణకు వర్తింపజేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ)ను గౌరవించి, విభజన చట్టాన్ని అమలుచేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని తెలిపారు. రాజకీయాల్లో సహనశీలత ఎంతో అవసరమని ఈ సందర్భంగా విపక్షాలకు ఆయన సూచించారు.

విపక్షాలు ముందే నిర్ణయాలు తీసుకుని, ఆందోళనలతో ప్రజల్ని రెచ్చగొట్టడం సరికాదని అన్నారు. 50 ఏండ్లలో సాధ్యంకానిది, ఐదు నెలల్లో సాధ్యం అవుతుందా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా నేను ప్రమాణం చేసి ఢిల్లీకి వెళ్ళిన నాల్గవరోజే నా దిష్టిబొమ్మలు తగులబెట్టారు. టీఆర్‌ఎస్ జెండా దిమ్మెలు కూల్చారు. ఇది చాలా దారుణం. ప్రభుత్వం ఎంతో హుందాగా ప్రవర్తిస్తున్నది. కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పరిపాలనకు సరిపడా అధికారులు కూడాలేరు. ఉన్నంతలోనే ఎంతో మేలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. కొంచెం సహనశీల దృష్టితో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు.

తెలంగాణ విద్యుత్ సమస్యలతో కొట్టుమిట్టాడుతుందని, విభజన చట్టాన్ని పొరుగు రాష్ట్రం (ఆంధ్రప్రదేశ్) ధిక్కరించడం వల్లే ఈ సమస్య ఉత్పన్నం అయ్యిందని తెలిపారు. మేం కష్టాల్లో ఉన్నా మానవత్వంతో ప్రవర్తిస్తున్నాం. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను అప్రజాస్వామికంగా, క్రూరంగా లాగేసుకున్నారు. అయినా మానవత్వంతో ఆ ఏడు మండలాలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వమే విద్యుత్ అందిస్తున్నది అని చెప్పారు. భౌగోళికంగా వేరు అయినా ఇద్దరం కలిసి పనిచేసుకుందామని, ఇరు రాష్ర్టాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందామని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలుసుకున్న సందర్భంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు సూచించానని తెలిపారు.

వాస్తవానికి రెండు రాష్ర్టాలకు (తెలంగాణ, ఏపీ) విద్యుత్ కొరత ఉందని అన్నారు. విభజన చట్టం ప్రకారంగా తెలంగాణకు రావాల్సిన 53.89% విద్యుత్‌కింద 9,080 మెగావాట్ల పవర్ ఇవ్వడానికి ఏపీ నిరాకరిస్తున్నదని చెప్పారు. పైగా ఆ రాష్ట్ర సలహాదారు పరకాల ప్రభాకర్ తెలంగాణకు తెలివేలేదు.. వాళ్ళకు చదువేరాదు.. అన్నట్లుగా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. సమస్య వచ్చిందే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అనే విషయం జగద్వితం అనేది విస్మరించటం శోచనీయమన్నారు. తాము చిల్లర రాజకీయాలు చేయటంలేదని, వాస్తవాలను సభ ద్వారా రైతాంగానికి, ప్రజలకు, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు.

వచ్చే ఏడాది చివరినాటికల్లా 2,100 మెగావాట్ల అదనపు విద్యుత్ ఉత్పత్తి అందుబాటులోకి వస్తుందన్నారు. అందులో సింగరేణి కాలరీస్ ఆధ్వరంలో ఆదిలాబాద్ జిల్లా జైపూర్ వద్ద నిర్మిస్తున్న 1,200మెగావాట్ల పవర్ ప్రాజెక్టు, తెలంగాణ జెన్‌కో ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా భూపాలపల్లివద్ద 600 మెగావాట్లు, సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్ల(సీజీఎస్) నుంచి 300 మెగావాట్ల చొప్పున తోడవుతుందని వివరించారు. వీటికితోడు కృష్ణపట్నం పవర్ ప్రాజెక్టు (నెల్లూరు జిల్లా), హిందుజా పవర్ ప్రాజెక్టు (విశాఖపట్నం)లలో తెలంగాణ వాటాగా 1,300 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందన్నారు. మొత్తంగా మూడేండ్లలో 21వేల మెగావాట్ల లభ్యత ఉంటుందని ప్రకటించారు.

అదే జరిగితే ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు పాలాభిషేకం చేస్తానని రేవంత్‌రెడ్డి చెప్పారు. లేనిపక్షంలో సీఎం సభకు క్షమాపణ చెప్పాలని అన్నారు. ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ తాము అంతిమంగా తెలంగాణ ప్రజలపక్షమేనని బీజేపీపక్ష నేత లక్ష్మణ్ చెప్పారు. ఏపీ విభజన చట్టాన్ని చంద్రబాబు ధిక్కరించటం విచారకరమని అన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.