హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఈనెల 29 నుంచి మూడు రోజులపాటు జరిగిన క్రెడాయ్ ప్రాపర్టీ షోకు విశేష స్పందన లభించింది. దీంతో తెలంగాణలో రియల్, నిర్మాణ రంగాల్లో స్తబ్దత నెలకొన్నదని కొన్ని రోజులుగా జరుగుతున్న దుష్ప్రచారానికి, గందరగోళానికి తెరపడింది. నిన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో రియల్, నిర్మాణ రంగ భవితవ్యం ఎలా ఉంటుందనే సందేహాలను ఈ ప్రదర్శన పటాపంచలు చేసిందని క్రెడాయ్ అధ్యక్షుడు శేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు.

హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, ముంబై సహా వివిధ నగరాలకు చెందిన 150 మంది బిల్డర్లు ప్రాపర్టీ షోలో పాల్గొని తమ ప్రాజెక్టుల బ్రోచర్లతో వినియోగదారులకు సవివరంగా వివరించారు. సొంతింటి కల నిజం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్న వినియోగ దారులు కూడా భారీ స్థాయిలో ప్రాపర్టీ షోను సందర్శించి తమ సందేహాలు నివృత్తి చేసుకున్నారు. శుక్రవారం ప్రాపర్టీ షో ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్, రియల్, నిర్మాణ రంగంపై వరాల జల్లు కురిపించారు.
హైదరాబాద్ నగర పరిధిలో రియల్, నిర్మాణ ప్రాజెక్టుల ప్రారంభానికి వసూలు చేస్తున్న నాలా పన్ను, వివిధ శాఖల నుంచి ఎన్‌వోసీలు ఇవ్వడానికి బదులు సింగిల్‌విండో పద్దతుల్లో అనుమతులు మంజూరు చేస్తామని సీఎం చేసిన ప్రకటనతో బిల్డర్లలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఐదంతస్తులు దాటిన భవనానికి ఇంపాక్ట్ ఫీజు పేర సర్కార్‌కు రుసుము చెల్లించాలి. విస్తరిస్తున్న నగరంలో మౌలిక వసతుల కల్పనకు ఆదాయ వనరులు పెంచుకునేందుకు ప్రభుత్వానికీ ఇంపాక్ట్ ఫీజు చెల్లింపు అనివార్యం.
గతంలోనూ ఉన్న ఈ ఫీజు రూ.ఐదు కోట్లు దాటిన వారికి వాయిదా పద్ధతిలో చెల్లించే వెసులుబాటు కల్పిస్తూ జీవో ఇచ్చారు. ప్రస్తుతం గడువు తీరిపోయిన జీవో పునరుద్దరణకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కొండలు, గుట్టలు తవ్వి నిర్మాణాలు చేపడితే మైనింగ్ పన్ను వసూలు కాదనలేరు. కానీ సాధారణ ప్రదేశాల్లోనూ వసూలు చేస్తున్న ఈ పన్నుకు ఒక విధానమే లేదు. ఐదు నుంచి పదిరెట్ల జరిమానాలు వేస్తూ గతంలో విజిలెన్స్ అధికారులు నిర్ణయాలు తీసుకున్న దాఖలాలు కోకొల్లలు. దీన్ని రద్దు చేస్తూ ప్రతి చదరపు అడుగుకు మూడు రూపాయల మైనింగ్ పన్ను వసూలు విధానం అమలు చేస్తామని సీఎం చెప్పారు. సొంతింటి కల నిజం చేసుకోవాలని భావించే వినియోగదారులకు భారంగా మారిన వ్యాట్ రద్దుతో ఊరట లభించింది.
పెట్టుబడుల కేంద్రం హైదరాబాద్: హరీశ్‌రావు హైదరాబాద్ నగరం దేశంలోనే పెట్టుబడులకు కేంద్రంగా మారుతుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆదివారం ఆయన మూడు రోజుల పాటు మాదాపూర్ హైటెక్స్‌లో జరిగిన ప్రాపర్టీ షో ముగింపు సభలో ముఖ్య అతిథిగా మాట్లాడుతూ గత పదేండ్లుగా రియల్ రంగం పలు ఒడిదొడుకులను ఎదుర్కొన్నదని తెలిపారు.
వచ్చే ఏడాది నాటికి రియల్ ఎస్టేట్ రంగానికి మంచి రోజులు రానున్నాయన్నారు. సామాన్యులకు అందుబాటులో గృహ నిర్మాణాలు చేపట్టాలని మంత్రి బిల్డర్లకు సూచించారు.ఇండ్ల నిర్మాణంలో అవరోధంగా ఉన్న మైనింగ్ ఇంపాక్ట్ ఫీజు తన శాఖ పరిధిలోకి వస్తుందని, దీన్ని ఒకటి, రెండు రోజుల్లో ఎత్తివేస్తూ జీవో జారీ చేస్తామన్నారు. కొత్త రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు వేచి చూస్తున్నారని హరీశ్‌రావు చెప్పారు.
నిబంధనలు, ప్రణాళికల ప్రకారం ప్రాజెక్టుల నిర్మాణాలు ఉంటే ఎవరూ భయపడాల్సిన పని లేదన్నారు. హైదరాబాద్‌లో కబ్జాకు గురైన చెరువులను పునరుద్ధరించడంతోపాటు వాటి పరిరక్షణకు గ్రీనరీ, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. వాటి నిర్వహణ బాధ్యతలు స్థానికులకే అప్పగిస్తామని హరీష్‌రావు వివరించారు.బిల్డర్ల సమస్యలు ఇప్పటికే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామని, త్వరలో వాటికి పరిష్కారం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో శాసనసభ ఉపసభాపతి పద్మా దేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, క్రెడాయ్ జాతీయ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి, హైదరాబాద్ క్రెడాయ్ అధ్యక్షుడు జైవీర్‌రెడ్డి, ప్రభాకర్‌రావు, రాంరెడ్డి పాల్గొన్నారు.