చైనా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బృందం ఆదివారం సాయంత్రం బీజింగ్‌నుంచి షెన్‌జాన్ నగరానికి చేరుకున్నది. చైనా సిలికాన్ వ్యాలీగా పిలిచే ఈ నగరం అనేక ఐటీ, మ్యానుఫాక్చరింగ్ కంపెనీలకు నెలవు. 1979లో చైనా ఆర్థిక సంస్కరణలకు నడుం కట్టిన తర్వాత ఈ నగరాన్ని ప్రత్యేక ఆర్థిక జోన్‌గా తీర్చిదిద్దారు. అనతికాలంలోనే ఈ నగరం 30 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించింది.
-బీజింగ్‌లో తియానన్మెన్ స్వేర్, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా సందర్శన -చారిత్రక, వర్తమాన ప్రాముఖ్యత పర్యాటక అభివృద్ధిపై ఆరా -మహాకుడ్యంపై గంటపాటు గడిపిన సీఎం

డాలియన్ నగరంలో ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనడంతో ప్రారంభమైన సీఎం పర్యటన ఆరు రోజులుగా డాలియన్, బీజింగ్‌లో పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీలు, సంప్రదింపులతో బిజీబిజీగా కొనసాగింది. ఈ భేటీల ఫలితంగా పలు ప్రముఖ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులకు ఉత్సాహం చూపాయి. బీజింగ్ నుంచి బయలుదేరి ఆదివారం సాయంత్రానికి ముఖ్యమంత్రి బృందం షెన్‌జాన్ చేరుకుంది. అంతకు ముందు సీఎం అధికారులు, అనధికారులతో కలిసి బీజింగ్‌లోని పర్యాటక ప్రాధాన్యం కలిగిన తియానన్మెన్ స్వేర్, గ్రేట్ వాల్ ఆఫ్ చైనాలను సందర్శించింది.
ముందుగా ముఖ్యమంత్రి బృందం బీజింగ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రదేశం తియానన్మెన్ స్కేర్‌ను చేరుకుంది. ఫర్‌బిడెన్ సిటీ నుంచి వేరు చేసే తియానన్మెన్ గేట్ పేరునే ఈ స్వేర్‌కు పెట్టారు. ఇందులో చైనా విప్లవవీరుల స్మారకాలు, గ్రేట్‌హాల్ ఆఫ్ పీపుల్, నేషనల్ మ్యూజియం ఆఫ్ చైనా, మావో జెడాంగ్ మెమోరియల్ హాల్ తదితర కట్టడాలు ఉన్నాయి. చైనా చరిత్రలో తియానన్మెన్ స్కేర్‌కు అధిక ప్రాధాన్యం ఉంది. ప్రపంచంలోని ఐదు అతిపెద్ద స్వేర్‌లలో తియానన్మెన్ స్వేర్ చోటు చేసుకుంది.
గ్రేట్ వాల్ ఆఫ్ చైనా.. తియానన్మెన్ స్వేర్‌ను తిలకించిన తరువాత ప్రపంచంలోని ఏడు అద్భుతాల్లో ఒకటైన చైనా మహాకుడ్యం (గ్రేట్ వాల్ ఆఫ్ చైనా)ను ముఖ్యమంత్రి కేసీఆర్ బృందం సందర్శించింది. ప్రపంచంలో అతి పొడవైన ఈ మానవ నిర్మాణాన్ని చైనాలోని ఉత్తర సరిహద్దులో శత్రుదేశాల దాడులనుంచి రక్షించుకోవడానికి నిర్మించారు. క్విన్ షి వాంగ్ కాలంలో ప్రారంభమై అనేక రాజవంశాలు పలు విడతలుగా దీనిని నిర్మించాయి. మింగ్ రాజులు దీనిని సింహభాగం పూర్తిచేశారు. అనేక కోటలు, సైనిక నిఘా స్థావరాలు, వాణిజ్య రవాణా మార్గాల చెక్‌పోస్టుల సమూహంగా ఇది నిర్మితమైంది.

దేశం తూర్పునుంచి పశ్చిమ దిశను తాకే ఈ మహాకుడ్యం నిర్మాణంలో ఆయా కాలాల్లో ఉన్న అద్భుత నిర్మాణ ప్రక్రియలన్నీ వినియోగించారు. రాళ్లు, ఇటుకలు, సున్నం, మట్టి, కలప తదితర ముడిపదార్థాలను దీని నిర్మాణంలో వాడారు. సీఎం బృందం చాలాసేపు ఇక్కడ గడిపింది. ఈ కట్టడాల చారిత్రక నేపథ్యం, ప్రస్తుత కాలంలో వీటిని వినియోగించుకుంటున్న తీరు, పర్యాటకరంగాన్ని ఆకర్షించేందుకు ప్రభుత్వ కృషి తదితర వివరాలను సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు.