-బీసీ ముసుగేసుకున్న ఓసీ దొర ఈటల -హాస్టల్‌లో చదివిన వ్యక్తికి వేలకోట్లు ఎక్కడివి? -తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే నీచ స్వభావి -టీఆర్‌ఎస్‌పై, కేసీఆర్‌పై మాట్లాడితే ఊరుకోం -మంత్రి గంగుల ఆగ్రహం -చీమలు పెట్టిన పుట్టలో పాములా చేరిన ఈటల

ఈటల రాజేందర్ హుజూరాబాద్‌లో ఉంటే బీసీ, హైదరాబాద్‌కొస్తే ఓసీ.. ఆయన బీసీ ముసుగేసుకున్న ఓసీ దొర అని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. పూర్వ కమలాపూర్, ప్రస్తుత హుజూరాబాద్ నియోజకర్గంలో ఏ బీసీ వ్యక్తినీ ఎదగనీయకుండా చేశారని ధ్వజమెత్తారు. చీమలు పెట్టిన పుట్టలో చేరిన పాముగా చేరారని పేర్కొన్నారు. మంగళవారం తెలంగాణభవన్‌లో మంత్రి గంగుల మీడియాతో మాట్లాడుతూ.. ఈటల ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో తరుచూ దేవరయాంజాల్ భూములపై మాట్లాడుతుండేవారని, వాటిని క్రమబద్ధీకరించుకోవడమే దాని వెనుక అసలు ఉద్దేశమని ఆరోపించారు. పదవిలో ఉన్నప్పుడు గుర్తుకురాని బీసీలు, ముదిరాజ్‌లు ఇప్పుడు గుర్తుకొస్తున్నారని ఎద్దేవాచేశారు. తన వ్యాపారసంస్థలో ఎంతమంది బీసీలు పార్టనర్స్‌గా ఉన్నారని ప్రశ్నించారు. అసెంబ్లీలో ఏనాడూ బీసీల గురించి, ముదిరాజ్‌ల గురించి మాట్లాడలేదన్నారు. పక్క నియోజకవర్గాల్లో పోటీచేసిన బీసీలను ఓడగొట్టేందుకు యత్నించే కుసంస్కారి అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
తండ్రిలాంటి సీఎంను అంటే ఊరుకోం సీఎం కేసీఆర్ నీడలో మంత్రులు, ఎమ్మెల్యేలం అందరం సంతోషంగా ఉన్నామని మంత్రి గంగుల తెలిపారు. ఆరుసార్లు ఎమ్మెలేగా గెలిచానంటూ ఈటల మాటిమాటికి చెప్పడం విడ్డూరంగా ఉన్నదన్నారు. టీఆర్‌ఎస్ బీ-ఫాం ఇవ్వడం వల్ల, సీఎం కేసీఆర్ బొమ్మతోనే గెలిచిన విషయాన్ని మరచిపోవద్దని హితవుపలికారు. మంత్రులు, ఎమ్మెల్యేలను కేసీఆర్ తనవద్ద గంటలకొద్ది కూర్చోబెట్టుకుని, మంచి చెడు అన్నీ విచారిస్తారని అన్నారు. ఈటల పక్కన ఏ బీసీ నాయకుడైనా కూర్చున్న చరిత్ర, కూర్చుంటే ఓర్చిన చరిత్ర ఉన్నదా? అని నిలదీశారు. కన్నతల్లి వంటి పార్టీని, తండ్రిలాంటి సీఎం కేసీఆర్‌ను అంటే ఊరుకొనేది లేదని హెచ్చరించారు. తల్లిపాలు తాగి రొమ్ముగుద్దే నీచబుద్ధి ఈటలదని అన్నారు. టీఆర్‌ఎస్ మహాశక్తిమంతమైన పార్టీ, సీఎం కేసీఆర్ తెలంగాణకు లెజండ్ అని పేర్కొన్నారు. త్వరలోనే హుజూరాబాద్‌లో పర్యటిస్తామని పేర్కొన్నారు.
తెలంగాణలో అంబానీ కంటే ఎక్కువ బీసీ హాస్టల్‌లో ఉండి చదువుకున్న ఈటల రాజేందర్‌కు వేలఎకరాల భూమి, అన్నివేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని మంత్రి గంగుల నిలదీశారు. మెడికల్ కాలేజీ ఎట్లా వచ్చిందని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ ఆయనను ఎమ్మెల్యేను, మంత్రిని చేస్తే తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకొని ఇవాళ తెలంగాణలో రిలయెన్స్, అంబానీ కంటే మించిపోయారని ఆరోపించారు.
ఓడితే నవ్వుతడు.. గెలిస్తే ఏడుస్తడు టీఆర్‌ఎస్‌లో ఉంటూ అవకాశం కోసం ఎదురుచేసిన మేకవన్నెపులి ఈటల అని గంగుల మండిపడ్డారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఎన్నికల్లో ఓడిపోతే నవ్వటం.. గెలిస్తే ఏడ్వటం ఈటలకు మొదటినుంచీ అలవాటని ఆరోపించారు. ఆయన మనసులో ఎప్పటినుంచో దురాలోచన ఉన్నదని చెప్పారు. పార్టీ ఆవిర్బావం నుంచి పనిచేసిన ఎంతోమందిని అణచివేసిన చరిత్ర ఈటలదని విమర్శించారు. రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు సతీమణి ఎంపీపీగా ఉంటే అవిశ్వాస తీర్మానం పెట్టారని, జమ్మికుంట, హుజూరాబాద్ మున్సిపల్ చైర్మన్లపైనా అవిశ్వాస తీర్మానాన్ని పెట్టి దించేసిన దుర్మార్గ స్వభావి అని మండిపడ్డారు.
ఈటల రాజేందర్ హుజూరాబాద్‌లో ఉంటే బీసీ, హైదరాబాద్‌కొస్తే ఓసీ.. ఆయన బీసీ ముసుగేసుకున్న ఓసీ దొర. పూర్వపు కమలాపూర్, ప్రస్తుత హుజూరాబాద్ నియోజకర్గంలో ఏ బీసీ వ్యక్తినీ ఎదగనీయకుండా చేసిన పెద్దదొర. చీమలు పెట్టిన పుట్టలో చేరిన పాము. ఈటల ఉమ్మడిరాష్ట్ర అసెంబ్లీలో తరుచూ దేవరయాంజల్ భూములపై మాట్లాడే వారు. వాటిని క్రమబద్ధీకరించుకోవడమే దాని వెనుక అసలు ఉద్దేశం. పదవిలో ఉన్నప్పుడు గుర్తుకురాని బీసీలు, ముదిరాజ్‌లు ఆయనకు ఇప్పుడు గుర్తుకొస్తున్నారు. -మంత్రి గంగుల కమలాకర్