చెరువుతో బహుళ ప్రయోజనాలు ఉంటాయని, పునరుద్ధరణతో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.

బుధవారం మెదక్ జిల్లా జహీరాబాద్ మండలం దిడ్గిలో మిషన్ కాకతీయ పనులను మంత్రి హరీశ్‌రావు, శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ చెరువులను అభివృద్ధి చేసిన పొలాలకు సాగునీరు అందిస్తామని, ఒక్క వర్షపు నీటి బొట్టూ వృథాకావొద్దని తెలిపారు. రైతులు చెరువు పనుల్లో స్వచ్ఛందంగా పాల్గొలని కోరారు. ఖరీఫ్ సీజన్ నాటికి చెరువు పనులు పూర్తి చేయాలన్నారు. కాంట్రాక్టర్లు పనులు నాణ్యతగా చేయాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చారించారు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణి, జిల్లా జూయింట్ కలెక్టరు వెంకట్‌రాంరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్, మాజీ మంత్రి ఫరీదుద్దీన్, నియోజకవర్గ ఇన్‌చార్జి మాణిక్‌రావు, మున్సిపల్ చైర్మన్ లావణ్య పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా మల్యాల మండలం మద్దుట్ల గుడిచెరువు పనులను వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే బొడిగె శోభతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. ఒక్క చుక్క నీరు వృథాకాకుండా వాడుకోవాలని రైతులకు సూచించారు. నల్లగొండ జిల్లా పెన్‌పహాడ్, అనంతారం గ్రామాల్లో పనులను విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి సభ్యుడు ఒంటెద్దు నర్సింహారెడ్డి, మోత్కూర్ మండలం అజీమ్‌పేట, అడ్డగూడూర్, భుజలాపురం గ్రామాల్లో పార్లమెంటరీ కార్యదర్శి గాదరి కిశోర్ ప్రారంభించారు.