Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

చీకట్ల నుంచి వెలుగు తీరానికి..

తెలంగాణలో 113 నుంచి 115 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఉన్నది. కానీ తెలంగాణలో లభ్యమయ్యేది 57 మిలియన్ యూనిట్ల విద్యుత్ మాత్రమే. మిగతా విద్యుత్‌ను ఎక్కడి నుంచి తెస్తారు. విభజన వల్ల తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ సంక్షోభం తలెత్తుతుంది. ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణకు కరెంట్ తెస్తామంటున్నారు. అది సాధ్యం కాదు. విభజన వల్ల తెలంగాణలో చిమ్మచీకట్లు అలుముకుంటాయి కేంద్రం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న తర్వాత తొమ్మిది రోజుల మౌనం అనంతరం 2013 ఆగస్టు 8న అప్పటి సీఎం ఎన్.కిరణ్‌కుమార్ రెడ్డి విలేఖరుల సమావేశంలె చెప్పిన మాటలివి.

Harish Rao 01

విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిగిన సందర్భంగా కూడా కిరణ్‌కుమార్ రెడ్డి ఇదే విధమైన వ్యాఖ్యలు చేశారు. 2014 జనవరి 25న అసెంబ్లీలో మాట్లాడిన కిరణ్‌కుమార్ రెడ్డి కరెంట్ గురించి ఇలా అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 40 నుంచి 50 శాతం వరకు విద్యుత్ కొరత ఉంది. తెలంగాణలో వినియోగం ఎక్కువ, ఉత్పత్తి తక్కువ. 17 లక్షల వ్యవసాయ పంపుసెట్లు ఉన్నాయి. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములున్నాయి. వాటన్నింటికి కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది. సమైఖ్యంగా ఉంటేనే తెలంగాణకు విద్యుత్ విషయంలో లాభం జరుగుతుంది. విభజన వల్ల తెలంగాణ ప్రజలు నష్టపోతారు. సమైఖ్య రాష్ట్రంలో కలిసి ఉండటం వల్ల తెలంగాణ ప్రజలు దశాబ్దాలుగా పొందుతున్న లాభాలు, సౌకర్యాలు కోల్పోతారు ఇలా సాగింది కిరణ్‌కుమార్ రెడ్డి ప్రసంగం. అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉన్న మేము అప్పుడు చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలిపాం. కిరణ్‌కుమార్ రెడ్డి చెప్పినవన్నీ అబద్దాలని ఖండించాం. రాష్ట్రంలో విద్యుత్ కొరతకు సమైఖ్య పాలకులు అవలంబించిన విధానాలే కారణమని బల్లగుద్ది వాదించాం. తెలంగాణ రాష్ర్టాన్ని విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశాం. నేను స్వయంగా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నిర్వహించి పబ్లిక్ హియరింగులకు కూడా పోయి వాదించిన.

కిరణ్‌కుమార్ రెడ్డితో పాటు సీమాంధ్ర నాయకులంతా కరెంట్ గురించి ఒకే విధంగా మాట్లాడారు. ఇప్పుడు ఏడాది గడిచిపోయింది. ఆంధ్ర నాయకులు చెప్పింది నిజమా? మేము చెప్పింది నిజమా? అనే విషయాన్ని బేరీజు వెసుకునే సమయం వచ్చింది. నిబద్ధత, పట్టుదల, ప్రజలకు మేలు చేయాలనే తపన ఉంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలమనే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చేతల్లో చూపించారు. గత 20 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ ఎండకాలం వచ్చినా ఒకటే సీన్. పగలు, రాత్రి తేడా లేకుండా విద్యుత్ కోతలు. పరిశ్రమలకు పవర్ హాలిడేలు. గృహ విద్యుత్తుకు గంటల తరబడి కోతలు. వ్యవసాయానికి రెండు, మూడు గంటలు కూడా కరెంట్ ఇవ్వలేని దుస్థితి. ఇదే సమయంలో జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఎప్పుడూ విద్యుత్ కొరతపై గొడవలే జరిగేవి. ప్రతిపక్ష సభ్యులు సమావేశాలకు ఎండిపోయిన వరి గడ్డిని, జొన్న మొక్కలు తెచ్చి ప్రదర్శించేవారు. ల్యాంతర్లతో ర్యాలీలు నిర్వహించే వారు. ఖాళీ కుండలతో ప్రదర్శనలు చేసే వారు. కానీ ఈసారి బడ్జెట్ సమావేశాల్లో ఆ సీన్ కనిపించిందా? అసలు కరెంట్ సమస్యే ప్రస్తావనకు రాలేదు. ఎక్కడా ఒక్క రైతు కూడా కరెంట్ కోత వల్ల తన పొలం ఎండిపోయిందనలేదు. ఒక్క పారిశ్రామివేత్త కూడా కరెంటు లేదని బాధపడలేదు. పవర్ హాలిడేలు ఎత్తేయాలని గతంలో ఇదే మార్చి, ఏప్రిల్ మాసాల్లో ఇందిరా పార్కు వద్ద పారిశ్రామిక వేత్తలు, చిన్న పరిశ్రమల యజమానులు, చిన్నపాటి పనులు చేసుకునే వారు ధర్నాలు చేసేవారు. కానీ ఈసారి ఆ ఊసేలేదు. ఏడాదిలో ఎంత మార్పు?

2013 డిసెంబర్‌లో రెండు నుంచి ఆరు గంటల పాటు గృహ విద్యుత్‌లో కోత విధించేవారు. 2014 డిసెంబర్‌లో ఒక్క గంట కూడా కోత లేదు. 201 4 జనవరిలో కూడా లోడ్ రిలీఫ్ పేరిట 2 నుంచి 6 గంటల వరకు విద్యుత్ కోతలు ఉండేవి. 2014 ఫిబ్రవరిలో కూడా అదే పరిస్థితి. కానీ 2015 జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ఒక గంట కూడా గృహ విద్యుత్‌లో కోతపెట్టలేదు. 2014 మార్చిలో రోజుకు కనిష్టంగా మూడు గంటలు, గరిష్టంగా 6 గంటలు విద్యుత్ కోత ఉండేది. కానీ ఈ ఏడాది మార్చి మొత్తంలో ఒక్క రోజు ఒక గంట సేపు కూడా కరెంట్ కోత లేదు.

ఇక పరిశ్రమల విషయానికి వస్తే.. 2014లో మార్చిలో వారానికి ఒకరోజు పవర్ హాలిడే ఉండేది. ఈసారి పవర్ హాలిడే లేదు. 2014 ఏప్రిల్లో ప్రతిరోజు మూడు నుంచి ఆరు గంటల పాటు పరిశ్రమలకు విద్యుత్ కోత ఉండేది. వారానికి రెండు రోజులు పవర్ హాలిడేలు ఉండేవి. కాని ఈసారి అలాంటి పరిస్థితి లేదు. మనం ఇప్పుడు ఏప్రిల్ మొదటి వారంలో ఉన్నాం విద్యార్థులకు పరీక్షలు జరిగే సమయం, ఈ సమయంలో కరెంట్ కోతలు వద్దంటూ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేవాళ్లం. కానీ ప్రభుత్వం మా మాట వినకపోయేది. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక ఒక్క గంట సమయం కూడా కరెంట్ పోకుండా ఇవ్వగలుగుతున్నాం. నిజానికి గతంతో పోలిస్తే తెలంగాణలో ఇప్పుడు విద్యుత్ వినియోగం పెరిగింది. పెరిగిన డిమాండుకు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం. 2014 ఫిబ్రవరిలో రోజుకు 137 మిలియన్ యూనిట్లు సరఫరా చేయగలిగితే, 2015 ఫిబ్రవరిలో 140 మిలియన్ యూనిట్లు సరఫరా చేశాం. 2014 మార్చిలో రోజుకు 138 మిలియన్ యూని ట్లు అందించగలిగితే, 2015 మార్చిలో 150 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేశాం. వ్యవసాయానికి కూడా సరిపడినంత విద్యుత్‌ను అందించగలుగుతున్నాం.

ఈ క్షణానికి కరెంట్ కోతల్లేకుండానే ముందుకు సాగుతున్నాం. ఇది ఒక్కరోజులో వచ్చిన మార్పు కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రజల విద్యుత్ అవసరాలను గమనించి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అమలు చేస్తున్న స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక విధానాల ఫలితం. నిజానికి సమైఖ్య రాష్ట్రంలో విద్యుత్ విషయంలో తెలంగాణకు పూర్తి అన్యాయం జరిగింది. నీళ్లు, బొగ్గు తెలంగాణలో ఉన్నప్పటికీ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు మాత్రం ఆంధ్రాలో పెట్టారు. విభజన జరిగే నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 8,924 మెగావాట్ల విద్యుత్ అందుబాటులో ఉంటే, అందులో తెలంగాణలో ఉత్పత్తి అయ్యేది 4,365 మెగావాట్లు మాత్రమే. దాదాపు 4,559 మెగావాట్ల విద్యుత్ ఆంధ్రలో అందుబాటులో ఉంది. విభజన చట్టంలోనే పేర్కొన్న ప్రకారం తెలంగాణలో 53 శాతం వినియోగం ఉంటే, ఆంధ్రలో 47 శాతం మాత్రమే ఉంది. కానీ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో వినియోగానికి అవసరమైనంత విద్యుత్ ఉత్పత్తి చేయడానికి కావలసిన ప్లాంట్లు లేకున్నా, విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వాల్సినంత కరెంట్ తెలంగాణకు ఇవ్వకున్నా, జలవిద్యుత్ ఉత్పాదనలో పక్క రాష్ట్రం అడ్డంకులు సృష్టిస్తున్నా, వాటిని తెలంగాణ ప్రభుత్వం అధిగమిస్తూ వస్తున్నది. రోజుకు దాదాపు 6,000 మెగావాట్ల విద్యుత్ డిమాండును తీర్చగలుగుతున్నది. ఖర్చుకు వెనకాడకుండా బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేసి అన్నదాతకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. గృహ, వాణిజ్య, పారిశ్రామిక అవసరాలను కోతలు లేకుండానే తీర్చగలుగుతున్నాం. అటు తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు కూడా శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారు. విద్యుత్ సంస్థలు సంస్థాగత సామార్థ్యాన్ని పెంచుకున్నాయి. గతంలో ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్‌ఎఫ్) 74 శాతం ఉంటే ఇప్పుడది 80 శాతానికి చేరింది. దీనివల్ల 1300 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను అదనంగా ఉత్పత్తి చేసుకోగలిగాం. ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ నష్టాలను కూడా ఒక శాతం తగ్గించుకోగలగడం వల్ల 600 నుంచి 700 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను అదనంగా పొందగలిగాం.

వీటితో ఇప్పటికీ కోతలు లేకుండా చూడగలుగుతున్నాం. మరో రెండు నెలల పాటు ఇదే పరిస్థితి కొనసాగించడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఏడాదికి రానున్న రోజుల్లో కొద్దో గొప్పో ఇబ్బంది ఏర్పడినా ఇక భవిష్యత్తులో తెలంగాణలో విద్యుత్ కోతలు లేని పరిస్థితి వస్తుంది. అందుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలోని ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికిప్పుడు పరిస్థితి నుంచి గట్టెక్కడానికి అవలంబించే స్వల్పకాలిక విధానాలతో పాటు మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు పోతున్నాం. ప్రస్తుతం 4320 మెగావాట్లు అందుబాటులో ఉన్నా యి. 2018 నాటికి 24 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నవి. 2015 చివరి నాటికే 7 వేల మెగావాట్లకు పైగా విద్యుత్ తెలంగాణ రాష్ట్రంలో అందుబాటులోకి వస్తుంది. 2016 నుంచే విద్యుత్ కోతలకు తెరపడుతుంది. జెన్‌కో, ఎన్టీపీసీ, కేంద్ర వాటా, ఛత్తీస్‌గఢ్ కరెంట్, హైడల్, గ్యాస్, సోలార్, సింగరేణి తదితర మార్గాల ద్వారా రాబోయే మూడేళ్లలో 24,000 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాం. విభజన వల్ల తెలంగాణ రాష్ట్రం చీకట్లో మగ్గిపోతుందని మాట్లాడిన వారి నోళ్లు మూతపడేలా, కళ్లు బైర్లు కమ్మేలా, తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు నిండేలా రాష్ట్రంలో విద్యుత్ కాంతులు విరజిమ్ముతాయి.

పాలకులకు సరైన ఆలోచనా విధానం, ఆచరణాత్మక వైఖరీ ఉంటే ఏదైనా సాధించవచ్చని కేసీఆర్ గారు విద్యుత్ విషయంలో నిరూపిస్తున్నారు. కేవలం గత పాలకులకు చిత్తశుద్ధి లేకనే కార్యసిద్ధి జరగలేదు. అధికారంలో ఉన్నప్పుడు గత పాలకుల పాపం వల్ల మనకు కరెంటు కష్టాలు వచ్చాయి. ఇప్పుడు అధికారం తెలంగాణ ప్రజల చేతికి వచ్చింది కాబట్టే కరెంటు కష్టాలు తొలుగుతున్నాయి. (వ్యాసకర్త: నీటి పారుదల, మార్కెటింగ్, గనులు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి)

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.