-వెంటనే ఒప్పందాలు కుదుర్చుకోండి -పట్టణాల్లో రూఫ్‌టాప్ సోలార్ ప్యానళ్ల వినియోగాన్ని ప్రోత్సహించండి -ఇంధనశాఖ అధికారులతో సమీక్షలో సీఎం కేసీఆర్

గురువారం సచివాలయంలో సీఎం కేసీఆర్ ఇంధనశాఖ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. బుధవారం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో జరిగిన చర్చల సారాంశాన్ని ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్ శైలేంద్రకుమార్ జోషి ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. సమగ్ర నోట్‌ను అందజేశారు. వెయ్యి మెగావాట్ల విద్యుత్తును తెలంగాణ రాష్ర్టానికి ఇచ్చేందుకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సానుకూలంగా ఉన్న నేపథ్యంలో అందుకు సంబంధించిన అవగాహన ఒప్పందం (ఎంవోయూ) వెంటనే కుదుర్చుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.
ఇరు రాష్ర్టాల (తెలంగాణ, ఛత్తీస్‌గఢ్) మధ్య విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. విద్యుత్ ధరల నిర్ణయం విషయంలో విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్(ఈఆర్సీ) నిబంధనలకు లోబడి ఉండాలని సూచించారు. ఇకపై రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్‌ను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అందుకనుగుణంగా అదనపు విద్యుత్ లభ్యత కోసం ప్రయత్నించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశానికి ట్రాన్స్‌కో సీఎండీ సయ్యద్ ముర్తుజా రిజ్వీ, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ కార్తికేయ మిశ్రా తదితరులు హాజరయ్యారు.