-కోటి అరవై లక్షల చేతులు కలుపుదాం -స్వచ్ఛ హైదరాబాద్‌ను తీర్చిదిద్దుకుందాం -నేను జగమొండిని.. చెప్పింది చేసి తీరుతా -పేదలు బాగుపడితేనే మా ప్రభుత్వానికి తృప్తి -22న నగర సమస్యలపై అధికారులతో చర్చిస్తాం -చెత్తపై యుద్ధంలో ప్రజలే కథానాయకులు -నాలుగేండ్లపాటు స్వచ్ఛ హైదరాబాద్ నిర్వహిస్తాం -అర్హులకు ఇండ్లు ఇప్పించే బాధ్యత ప్రభుత్వానిది -జూన్ 2 నుంచి లక్ష పట్టాల పంపిణీ -స్వచ్ఛ హైదరాబాద్‌లో సీఎం కే చంద్రశేఖర్‌రావు -మండుటెండలను లెక్కచేయకుండా రాజధానిలో సుడిగాలి పర్యటన
స్వచ్ఛ హైదరాబాద్‌ను పరిపూర్ణంగా సాకారం చేసుకునేందుకు నగరంలోని కోటీ అరవై లక్షల చేతులు కలవాలని అభిలషించారు. తాను జగమొండినని, చెప్పించి చేసి తీరుతానని స్పష్టంచేశారు. పేదలు బాగుపడితేనే తమ ప్రభుత్వానికి తృప్తి అన్న కేసీఆర్.. ఈ ఐదు రోజుల కార్యక్రమం సందర్భంగా ప్రభుత్వం దృష్టికి వచ్చిన నగర సమస్యల పరిష్కారంపై 22న అధికారులతో సమావేశమై నగరాభివృద్ధికి బ్రహ్మాండమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తామని హామీ ఇచ్చారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా ఐదవ రోజైన బుధవారం ముఖ్యమంత్రి నగరంలో విస్తృతంగా పర్యటించారు. ఒకవైపు మండుటెండల్లో వడగాలికి సవాలు విసురుతూ సుడిగాలి పర్యటన చేశారు.
నగరం శుభ్రంగా ఉండాలంటే బస్తీల స్వరూప స్వభావాలు మారిపోవడం అత్యంత ముఖ్యమని చెప్పిన కేసీఆర్.. ఆయా బస్తీల్లో పేదలకు డబుల్ బెడ్‌రూమ్‌ల ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. స్థానికులు లేవనెత్తిన అనేక సమస్యలపై స్పందిస్తూ, వాటిని వెంటనే పరిష్కరించాలని అక్కడికక్కడే ఆదేశాలు జారీచేశారు. ఈ సందర్భంగా వివిధ బస్తీల్లో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ చెత్తపై యుద్ధంలో ప్రజలే కథానాయకులుగా ఉండాలని సీఎం పిలుపునిచ్చారు. గవర్నమెంటు ఎంత చేసినా ఏం కాదు. ఏ బస్తీల ఉన్నోళ్లు ఆ బస్తీల.. ఏ గల్లీల ఉన్నోళ్లు ఆ గల్లీల.. ఎక్కడికక్కడ ప్రజలే కథానాయకులు కావాలి. మీరు ముందల పడితేనే, పట్టుబడితేనే ఇది సక్సెస్ అయితది. శుభ్రమైన మంచినీళ్లు కడుపు నిండా రావాలన్నా.. ఈ చెత్త జీవితాలు మారాలన్నా.. ఇండ్లులేని వారందరికీ ఇండ్లు రావాలన్నా.. ప్రభుత్వం-ప్రజలు కలిసి యుద్ధం చేస్తేనే బాగుపడే పరిస్థితులు వస్తయి అని చెప్పారు. అర్హులందరికీ ఇండ్లు ఇప్పించే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టంచేశారు. ప్రభుత్వం దగ్గర డబ్బులున్నాయని, ఒక్కో ఇంటిని పది లక్షల వ్యయంతో నిర్మిస్తామని చెప్పారు. జూన్ 2 నుంచి నగరంలో ఇండ్ల క్రమబద్ధీకరణకు సంబంధించి లక్షమంది పేదలకు పట్టాలు పంపిణీ చేస్తామని ప్రకటించారు. అటు పాతబస్తీలో పర్యటించిన సందర్భంగా హైదరాబాద్‌లో, మొత్తం తెలంగాణలో గంగా జమునా తహజీబ్ పరిమళాలు వెదజల్లాలని పిలుపునిచ్చారు. పాత బస్తీకి మళ్లీ పూర్వ వైభవం రావాలని ఆకాంక్షించారు. తొలి రెండు రోజులు సికింద్రాబాద్ నియోజకవర్గంలోనే పర్యటించిన కేసీఆర్.. సోమ, మంగళవారాల్లో ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లోనూ తిరిగారు. బుధవారం సుదీర్ఘ షెడ్యూలుతో గ్రేటర్‌లోని పలు నియోజకవర్గాలను చుట్టారు. ఉదయం 10.30 గంటల నుంచి శరవేగంగా ఆయన షెడ్యూలు కదిలింది. భానుడి భగభగతో హైదరాబాద్‌లో ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్ ఉంది.
అయినప్పటికీ సీఎం కేసీఆర్ ఎండను లెక్కచేయక.. మధ్యాహ్నం రెండు గంటలవరకు పలు ప్రాంతాల్లో పర్యటించారు. తొలుత పాత నగరంలోని చార్మినార్ నియోజకవర్గం డబీర్‌పుర డివిజన్‌లోని బాల్‌శెట్టి కేఫ్ వద్దకు వచ్చారు. అక్కడ స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆతర్వాత ఎస్‌ఎస్ బాడకు వెళ్లి అక్కడి ప్రజలతో మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ 38 మంది నిరుపేదలకు ఇండ్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. మంచి గాలి, వెలుతురు వచ్చేలా ఇండ్ల నిర్మాణం ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు.
ఆతర్వాత పాతబస్తీలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. అక్కడినుంచి నేరుగా సైదాబాద్ డివిజన్‌లోని ఎర్రకుంటకు వచ్చారు. అక్కడ ఉన్న హిందూ శ్మశానవాటికను పరిశీలించారు. ప్రధానంగా ఈ శ్మశానవాటిక కబ్జాకు గురవుతున్నందున తనను రావాల్సిందిగా ఎంపీ అసద్ కోరారని చెప్పిన సీఎం.. హిందూ శ్మశానవాటిక కబ్జాకు గురి కాకుండా ఎంపీ అసద్ ఇలా ప్రత్యేక చొరవ తీసుకోవడం తనకు సంతోషం కలిగించిందన్నారు. కబ్జాదారులు ఎంతటివారైనా వారిని తొలగించాల్సిందిగా అధికారులను సీఎం ఆదేశించారు. ఈ శ్మశానవాటికను అధునాతన వసతులతో అభివృద్ధి చేసుకోవాల్సిందిగా సూచించిన ముఖ్యమంత్రి.. అందుకు రూ.2 కోట్ల నిధులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ అంతటా అందరూ ఇంత సంఘటితంగా ఉంటే కబ్జాదారులను పారద్రోలవచ్చని అన్నారు. అక్కడి నుంచి సుంకేశ్వరబజార్ మీదుగా సరూర్‌నగర్ మినీ ట్యాంక్‌బండ్‌ను సీఎం పరిశీలించారు. అక్కడినుంచి కొత్తపేట రైతుబజార్‌కు వెళ్లి, పరిశీలించారు. ఆతర్వాత ఎన్టీఆర్‌నగర్ బస్తీవాసులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. అక్కడ వారితో మాట్లాడిన తర్వాత తిరిగి క్యాంపు కార్యాలయానికి వెళ్లారు.