-మంత్రులే అరెస్టయిన చరిత్ర ఆ పార్టీది -ఒక్క ప్రాజక్టైనా కట్టిన ముఖాలా మీవి -ప్రాజెక్టులను అడ్డుకొనేందుకు300లకు పైగా కేసులేశారు -ప్రజలకు ప్రత్యక్షంగా ఫలితం చూపుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు -కేసీఆర్‌పై ఆరోపణలు సహించేది లేదు -మీడియాతో మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి

అధికారంలో ఉన్నప్పుడు అవినీతి ఆరోపణలతో మంత్రులే అరెస్టయిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆ పార్టీ నేతలు ఇప్పుడు అవినీతిపై మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టుల నిర్మాణానికి ముందే అవినీతికి రూట్ మ్యాప్ గీసుకొని అందరూ డబ్బులు పంచుకొనేవారని విమర్శించారు. అలాంటి నేతలు తెలంగాణ ప్రభుత్వంపై ఎక్కడ, ఎవరికి, దేనిపై ఫిర్యాదు చేస్తారని మండిపడ్డారు. బుధవారం తెలంగాణభవన్‌లో మంత్రి జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి ఏపీలో తెలంగాణ ప్రాంతం ఎండుతుంటే పట్టించకోని కాంగ్రెస్ నేతలకు నేడు సీఎం కేసీఆర్‌ను విమర్శించే అర్హత లేదని హెచ్చరించారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఫిర్యాదు చేస్తామంటున్న కాంగ్రెస్ నేతలు.. సాగునీటి ప్రాజెక్టులు, పింఛన్లు, రైతుబంధు, ఇతర సంక్షేమ పథకాలు ఆపాలని ఫిర్యాదు చేస్తారా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కాంగ్రెస్ నేతలకు అవినీతి కనిపిస్తుంటే.. రైతులకు మాత్రం దాని ఫలాలు కండ్లముందు సాక్షాత్కరిస్తున్నాయని తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూస్తే కాంగ్రెస్‌కు వణుకు పుడుతున్నదని పేర్కొన్నారు. నల్లగొండ కాంగ్రెస్ నేతలు 60 ఏండ్లు పెంచి పోషించిన ఫ్లోరైడ్ భూతాన్ని.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆరేండ్లలోనే అంతం చేశారని చెప్పారు. ఇటీవల కేంద్రం విడుదల చేసిన నివేదిక ప్రకారం నల్లగొండలో ఒక్కటి కూడా కొత్త ఫ్లోరైడ్ కేసు నమోదు కాలేదని తెలిపారు. ఇదంతా కూడా మిషన్ భగీరథ వల్లే సాధ్యమైందని కొనియాడారు.
గతంలో పైసలు, పదవుల కోసం తప్ప నల్లగొండ సాగు, తాగునీటి కోసం ఏనాడైనా పోరాడారా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఇతర నేతలకు హితవు పలికారు. సీఎం కేసీఆర్‌పై ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తయితే పుట్టగతులుండవే ఉద్దేశంతో కాంగ్రెస్ నేతలు 300పైగా కేసులు వేశారని.. కేసీఆర్ సంకల్ప బలం ముందు అవేవీ నిలువలేదని పేర్కొన్నారు.
మాట్లాడే ముందు వివరాలు తెలుసుకోండి: పల్లా కాంగ్రెస్ నేతలు ఏదైనా మాట్లాడానికి ముందు వివరాలు తెలుకోవాలని రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి హితవు పలికారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధికి లోబడే రాష్ట్రం అప్పులు తీసుకున్నదని.. తెలంగాణ కంటే 26 రాష్ర్టాలు ఎక్కువగా తీసుకున్నాయని తెలిపారు. 14.2 శాతం ఆర్థిక వృద్ధిరేటుతో దేశంలోనే తెలంగాణ మూడోస్థానంలో ఉన్నదని చెప్పారు. 2004-14 వరకు ఇసుకపై రూ.36 కోట్లు అదాయం వస్తే.. 2015-2020 వరకు రూ. 3,780 కోట్ల ఆదాయం తీసుకొచ్చామని తెలిపారు. దీన్ని చూస్తే ఎవరిది అవినీతో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఏ ఒక్క ప్రాజెక్టు, పథకంపై ఇప్పటివరకు ఎవరూ వెలేత్తి చూపించలేదని పేర్కొన్నారు.