– దసరా, దీపావళి నాటికి కొత్త రేషన్ కార్డుల పంపిణీ – ఆగస్టులో ఇంటింటి సమగ్ర సర్వే నిర్వహించండి – పథకాల అమలుకు విదేశాల తరహాలో తెలంగాణ సిటిజన్ కార్డులు – అధికారులతో సమీక్షలో సీఎం కేసీఆర్
రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసే అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలాలు అసలైన లబ్ధిదారులకు అందాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. గృహనిర్మాణం, రేషన్ కార్డులు, పెన్షన్ల పంపిణీలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ స్థాయిలో ఆర్థిక, సామాజిక స్థితిగతులపై వచ్చే నెలలో సమగ్ర సర్వే నిర్వహించాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు.
ప్రభుత్వ పథకాల అమలుపై సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు ఇతర ఉన్నతాధికారులతో అపార్డులో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల అమలు పారదర్శకంగా ఉండాలన్నారు. అవినీతికి ఆస్కారం ఉండకూడదని అధికారులకు చెప్పారు. గత ప్రభుత్వాలు అనుసరించిన కొన్ని తప్పుడు పద్ధతులవల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలు అసలైన లబ్ధిదారులకు అందకుండా పోయాయని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉన్నట్టువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఉండకూడదన్నారు. రేషన్ కార్డులు, పెన్షన్లు, గృహ నిర్మాణ పథకాల్లో గతంలో చాలా అవినీతి అక్రమాలు చోటుచేసుకున్నాయని, ఇకనుంచి అలాంటి వాటికి తావివ్వకూడదని అధికారులకు సూచించారు.
సామాజిక, ఆర్థిక పరిస్థితులపై ఆగస్టు నెలలో గ్రామస్థాయిలో పూర్తి సర్వే నిర్వహించాలని నిర్ణయించారు. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షమే పథకాలపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలన్నారు. కల్యాణ లక్ష్మి పథకం ద్వారా ప్రభుత్వం ఇచ్చే రూ.50 వేలు నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకే ఎలా చేరుతాయో, అదేవిధంగా ఇతర సంక్షేమ పథకాలు కూడా నేరుగా వారి ఖాతాలోకే చేరేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై ప్రభుత్వం దగ్గర ఇప్పటివరకు కచ్చితమైన సమచారం లేదని, అందుకే తెలంగాణలో సమగ్ర సర్వే నిర్వహించాల్సిన అవసరముందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
ప్రతీ కుటుంబం వివరాలు కచ్చితంగా సేకరిస్తే సంక్షేమ పథకాల అమలు సులువవుతుందన్నారు. సమగ్ర సర్వే తర్వాత విదేశాల్లో మల్టీపర్పస్ హౌస్‌హోల్డ్ కార్డులను ఇస్తున్నట్టే రాష్ట్రంలో కూడా ప్రజలకు తెలంగాణ సిటిజన్ కార్డులను జారీచేస్తామని సీఎం వెల్లడించారు. బోగస్ రేషన్‌కార్డులను ఏరివేసి, కొత్త రేషన్ కార్డులను దసరా, దీపావళి పర్వదినాల మధ్య పంపిణీకి ఏర్పాట్లు చేయాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అపార్డులో సీఎం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ప్రభుత్వ సలహాదారులు బీవీ పాపారావు, ఏకే గోయల్, సీఎం పేషీ ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, సీనియర్ ఐఎఎస్ అధికారులు బీపీ ఆచార్య, రేమండ్ పీటర్, పార్థసారథి, బుర్రా వెంకటేశం, ఇంటిలిజెన్స్ ఐజీ శశిధర్ రెడ్డిలు పాల్గొన్నారు.