రాష్ట్ర ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రభు త్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు నిర్మాణంలో అంతర్జాతీయ ప్రమాణాలున్న కంపెనీలకే భాగస్వామ్యం కల్పిస్తామని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు. నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీపడబోమని స్పష్టం చేశారు. మూడున్నరేండ్లలో గ్రిడ్ నిర్మాణం పూర్తి చేస్తామని, ఈ పథకానికి ప్రస్తుత బడ్జెట్‌లోనే నిధులు కేటాయిస్తామని చెప్పారు. సోమవారం రాజేంద్రనగర్‌లోని అపార్డ్‌లో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు అవసరమైన పైపులు, ఇతర పరికరాల తయారీదారులతో మంత్రి సమావేశమయ్యారు.

-నాణ్యతలో రాజీపడే ప్రసక్తే లేదు -మూడున్నరేండ్లలో నిర్మాణం పూర్తి -1,26,000 కిలోమీటర్ల పైపులైన్లు -ప్రస్తుత బడ్జెట్‌లోనే నిధుల కేటాయింపు -పైపుల తయారీదారులతో భేటీలో మంత్రి కేటీఆర్ వాటర్ గ్రిడ్ నిర్మాణంలో భారీస్థాయిలో పైపులు అవసరమవుతాయని, అందుకే జాతీయస్థాయిలో పైపుల తయారీరంగంలో పేరున్న కంపెనీలను ఈ సమావేశానికి ఆహ్వానించామని కేటీఆర్ తెలిపారు. ప్రాజెక్టు పట్ల ప్రభుత్వానికున్న విజన్‌ను కంపెనీల ప్రతినిధులకు వివరించారు. పైపుల తయారీలో అంతర్జాతీయ ప్రమాణాలు కోరుకుంటున్నామన్నారు. కంపెనీలతో నేరుగా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుందని, టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా ఉంటుందని హమీ ఇచ్చారు. ప్రాజెక్టుకు నిధుల కొరత ఉండదన్నారు. నాణ్యత తప్పినా, నిర్ణీత గడువులోపు పైపులను అందించకున్నా కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
ప్రాజెక్టుకు సుమారు 1,26,000 కిలోమీటర్ల పైపులైన్ నిర్మాణం జరుగుతుందని తెలిపారు. పైపుల తయారీదారులకు వ్యాపారావకాశాలు సమృద్ధిగా ఉన్నందున ఇతర రాష్ర్టాల కంపెనీలు తెలంగాణలో యూనిట్లు స్థాపించాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 20 ఏండ్ల క్రితం ఏమ్మెల్యే హోదాలో సిద్దిపేట నియోజకవర్గానికి కేవలం 14 నెలల్లోనే తాగునీరందించిన విధంగానే, టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చే మూడున్నరేండ్లలో రాష్ట్రమంతటా తాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నదని చెప్పారు.
తొమ్మిది జిల్లాల్లో వాటర్ గ్రిడ్ పనులు ఏకకాలంలో ప్రారంభిస్తామని, ప్రతి గ్రిడ్‌ను ఒక్కో ఇంజినీరింగ్ అధికారి పర్యవేక్షిస్తారని తెలిపారు. ఈ సమావేశానికి వివిధ రాష్ర్టాల నుంచి సుమారు 60 కంపెనీలు హాజరయ్యాయి. తమ అనుభవాన్ని, తయారీ సామార్థ్యాన్ని తెలుపుతూ గ్రామీణ తాగునీటి సరఫరాశాఖ (ఆర్‌డబ్ల్యూఎస్) అధికారులకు ప్రతిపాదనలు అందజేశాయి.
నీటిసరఫరా, పర్యవేక్షణ కూడా తమకే అప్పగిస్తే నిర్వహణాపరమైన సమస్యలు తలెత్తవని కంపెనీల ప్రతినిధులు మంత్రికి వివరించారు. సమావేశంలో పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, గ్రామీణ తాగునీటి సరఫరాశాఖ ఇంజినీర్-ఇన్-చీఫ్ సురేందర్‌రెడ్డి, ప్రభుత్వ సాంకేతిక సలహాదారుడు ఉమాకాంత్‌రావు, సీఈ బాబూరావు తదితరులు పాల్గొన్నారు.