ఆంధ్రప్రదేశ్ సర్కార్ విభజన చట్టం పేరిట అనవసరంగా సృష్టిస్తున్న వివాదాలు, తగాదాలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గవర్నర్ నరసింహన్‌తో చర్చించారు. మంగళవారం రాత్రి ఏడు గంటల సమయంలో కేసీఆర్ రాజ్‌భవన్‌కు వెళ్లారు. సుమారు గంటన్నరపాటు గవర్నర్‌తో భేటీ అయ్యారు. ఇంటర్ పరీక్షలు, ఎంసెట్ నిర్వహణపై ఆంధ్రప్రదేశ్‌తో తలెత్తిన వివాదం, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు ఆవశ్యకతపై ప్రధానంగా ఉభయుల మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది.

-పరీక్షలు ఉమ్మడిగా నిర్వహించాలని విభజన చట్టంలో లేదు -ఇంటర్ పరీక్షలు, ఎంసెట్ మేమే నిర్వహించుకుంటాం -ఉద్యోగాల భర్తీకి వెంటనే టీఎస్‌పీఎస్సీ అవసరం -గవర్నర్ నరసింహన్‌కు వివరించిన సీఎం కేసీఆర్ దాంతోపాటు విద్యుత్ సమస్య తీవ్రత, శాసనసభ జరుగుతున్న తీరునుకూడా గవర్నర్‌కు సీఎం వివరించారని సమాచారం. ఇంటర్ పరీక్షలను ఉమ్మడిగా నిర్వహించాలని విభజన చట్టంలో ఎక్కడా లేకపోయినా, ఆంధ్రసర్కార్ తొండి చేస్తున్నదని గవర్నర్‌కు ఆయన ఫిర్యాదు చేశారని తెలిసింది. విభజన చట్టంలోని సెక్షన్ 75, సెక్షన్ 95లో ఏముందనే విషయాన్ని వివరించి చెప్పారు. ఇంటర్మీడియట్ బోర్డు తెలంగాణ రాష్ట్రంలోనే కొనసాగుతున్నదని, సెక్షన్ 75 ప్రకారం సంస్థలు భౌగోళికంగా ఎవరి పరిధిలో ఉంటే వారికే అధికారం ఉంటుందని వివరించినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరీక్షలు నిర్వహించుకోవడానికి మాత్రం కావాల్సిన సహకారం అందిస్తామన్నారు. అంతేకానీ రెండు రాష్ట్రాల్లో పరీక్షలు నిర్వహించే అధికారం తమకే ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పడంలో అర్థంలేదని స్పష్టం చేసినట్లు తెలిసింది. విభజన చట్టం సెక్షన్ 95లో ఉమ్మడిగా ఎంసెట్ నిర్వహించాలన్న నిబంధన ఎక్కడా లేదన్నారు. ఉన్నత విద్యలో 15% ఉమ్మడి ప్రవేశాలు మాత్రమే అని స్పష్టంగా ఉన్నా, ఆంధ్రప్రదేశ్ సర్కార్ రాద్ధాంతం చేయడంపట్ల కేసీఆర్ అభ్యంతరం వ్యక్తంచేసినట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. ఉమ్మడి పరీక్షల పేరుతో తెలంగాణ విద్యార్థుల భవిష్యత్‌తో చెలాగాటం ఆడేందుకు ఏపీ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని, దీనిపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని గవర్నర్‌ను కోరినట్లు ఆ వర్గాలు తెలిపాయి.
పదో షెడ్యూల్‌లోని ఇతర విద్యాసంస్థలకు సంబంధించిన అంశాలపై కూడా గవర్నర్‌కు సీఎం వివరించారు. మంగళవారం ఉదయం తెలంగాణ విద్యాశాఖ ఉన్నతాధికారులు ఇదే విషయంపై గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. ఆ సమావేశం వివరాలను అనంతరం విద్యాశాఖ కార్యదర్శి వికాస్‌రాజ్ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వివరించారు. దీనిపై మరింత స్పష్టత ఇవ్వడానికి ముఖ్యమంత్రి స్వయంగా వెళ్లి గవర్నర్‌ను కలిసినట్లు తెలిసింది.
ఇంటర్మీడియట్ పరీక్షలు, ఎంసెట్ నిర్వహణ, 10వ షెడ్యూల్ పరిధిలో ఉన్న ఇతర విద్యాసంస్థల గురించి చర్చించేందుకు బుధవారం సాయంత్రం 4గంటలకు రెండు రాష్ర్టాల విద్యామంత్రులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేస్తానని ఈ సందర్భంగా కేసీఆర్‌కు గవర్నర్ తెలిపారని విశ్వసనీయవర్గాలు చెప్పాయి. ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటనకు త్వరలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని ముఖ్యమంత్రి గవర్నర్‌కు వివరించినట్లు తెలిసింది. విద్యుత్ సమస్య నివారణకు తీసుకుంటున్న చర్యలను కూడా ఈ సందర్భంగా నరసింహన్‌కు కేసీఆర్ వివరించినట్లు సమాచారం,
మంత్రులూ గ్రామాలకు తరలండి: కేసీఆర్ శాసనసభ సమావేశాలు ముగిసిన వెంటనే మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాలకు తరలాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. మంగళవారం అసెంబ్లీ సమావేశం తర్వాత అందుబాటులో ఉన్న మంత్రులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. జిల్లాలు, మండలాలు, గ్రామాలలో చెరువుల పునరుద్ధరణ, రోడ్ల మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణం, పెన్షన్లు, రేషన్‌కార్డుల పంపిణీవంటి అంశాలపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించాలని సీఎం స్పష్టం చేసినట్లు తెలిసింది. ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వం తలపెట్టిన ప్రతిష్ఠాత్మక పథకాలు, పనులను కిందిస్థాయిలో అమలు జరిగేలా చూడాలని సూచించారు.