-మేం ఢిల్లీకి గులాం కాము.. తెలంగాణ ప్రజలకు సలాం చేస్తాం -అనివార్య పరిస్థితుల్లోనే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది -అన్నీ ఎన్నికల్లో గులాబీజెండా రెపరెపలాడాలి: కేటీఆర్ -టీఆర్‌ఎస్‌లో చేరిన రంగారెడ్డి టీడీపీ నేతలు
హైదరాబాద్: సినీ నటుడు పవన్‌కల్యాణ్ ఈ మధ్య పార్టీ పెట్టిండట. ఆడియో ఫంక్షన్‌లో మాట్లాడినట్టు రెండు గంటలు మాట్లాడిపోయిండు. కానీ ఒక మంచి నినాదాం ఇచ్చిండు. కాంగ్రెస్ హటావో.. దేశ్‌కో బచావో అన్నాడు. కాంగ్రెస్ హటావో అన్నది నచ్చింది. దానిని మనం కూడా ఆచరించాలి. ఆంధ్రా పార్టీ హటావో.. తెలంగాణకో బచావో అనాలి. ఆంధ్రా పార్టీలేవైనా వాటిని హటావో అనే అనాలి అని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కే తారకరామారావు పేర్కొన్నారు. కేసీఆర్, టీఆర్‌ఎస్‌నుద్దేశించి చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారని, మనల్ని తిడితే ఆంధ్రలో నాలుగు ఓట్లుపడుతాయనేదే ఆయన బాధని ఎద్దేవా చేశారు. పక్క రాష్ట్రమోల్లను, గడ్డపోల్లను మనం పట్టించుకోవద్దు అని సూచించారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు మంగళవారం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌లో చేరారు. రాష్ట్ర సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, నేతలు అనంతరెడ్డి, కొండల్‌రెడ్డి, సంజీవరావు, మధు తదితరులకు పార్టీ కండువాలు కప్పి గులాబీ దళంలోకి ఆహ్వానించిన కేటీఆర్ మాట్లాడుతూ రంగారెడ్డిలో అద్భుతమైన భూములు, నిక్షేపాలున్నాయని, వాటిని కాపాడుకోవాలని సూచించారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై తీరుతుందని, ఈలోపు వస్తున్న స్థానిక, మున్సిపల్, సార్వత్రిక ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లాలోనూ టీఆర్‌ఎస్ విజయం సాధించాలని అన్నారు. తెలంగాణ భవన్‌ను చూస్తుంటే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ జయకేతనం ఎగురవేసినట్లుగానే అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ నంబర్‌వన్‌గా ఎదుగుతోందని పేర్కొన్నారు. తెలంగాణ మేమే ఇచ్చినం, మేమే తెచ్చినం కనుక అధికారంలోకి వస్తామంటూ కాంగ్రెస్ నేతలు కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ చేసిన మోసాలను ప్రజలు మరిచిపోలేదన్నారు. 1969లో 400 మందిని కాల్చి చంపింది, 10 మంది ఎంపీలు గెలిస్తే వారిని కాంగ్రెస్‌లో కలుపుకొన్నది వారే, 2004లో తెలంగాణ ఇస్తానని సోనియాగాంధీ కరీంనగర్‌లో చెప్పారు. కానీ ఏమీ చేయలేకపోయారు. ఆ తరువాత 2009లో కూడా పాత హామీనే ఇచ్చిపోయారు. తెలంగాణ ఇస్తామని సోనియాతో చెప్పించారు. చివరికీ టీఆర్‌ఎస్‌ను చంపే ప్రయత్నం చేశారు. 2009 తరువాత మళ్లీ నాలుగేళ్లు బలిదానాలు, ఉద్యమాలు జరిగినా కేసులు పెట్టింది వారే. ఈ సమయంలో వారు సీమాంధ్రలో కుక్కచావు చస్తామని భావించి తెలంగాణను అనివార్య పరిస్థితుల్లో ఇవ్వాల్సి వచ్చింది అని పేర్కొన్నారు. ఢిల్లీకి గులాం కాము, తెలంగాణ ప్రజలకు సలాం చేస్తాం. జయశంకర్‌సార్ తెలంగాణను శాసించి తెచ్చుకోవాలని అన్నారు. దానిప్రకారమే తెచ్చినం. యాదిరెడ్డి ఢిల్లీకి పోయి సోనియాగాంధీకి అర్థమయ్యే హిందీ, ఇంగ్లీష్ భాషలలో 8పేజీల ఉత్తరం రాసి ఆత్మహత్య చేసుకున్నడు.
అయినా తెలంగాణ ఇవ్వలే. రెండు నెలల్లో ప్రభుత్వం పోతుందనంగా, చివరి పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టారు. ఇవన్నీ ప్రజలు మరిచిపోలేదు. తెలంగాణ ఎవరివల్ల వచ్చిందో ప్రజలకు స్పష్టంగా తెలుసు అని చెప్పారు. రాబోయే అన్ని ఎన్నికల్లోనూ రంగారెడ్డిజిల్లాలో గులాబీ జెండా రెపరెపలు ఎగురాలని ఆకాంక్షించారు.