Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

‘అనంత’ రైతు గోస ప‌ట్ట‌దా

రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలను అనుకూల మీడియాతో భూతద్దంలో చూపుతూ నానాయాగీ చేస్తున్న తెలంగాణ టీడీపీ నేతలకు, ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం రైతుల ఆత్మహత్యలు కనిపించడంలేదా? అని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. అనంతపురం జిల్లాలో రోజుకు ఇద్దరుముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే, వారి చావుకేకలు వినిపించడం లేదా అని నిలదీశారు.

Harish Rao press meet 01

-అక్కడి ఆత్మహత్యలను మీడియా ఎందుకు చూపడం లేదు? -నిజాయితీ ఉంటే ఆ కుటుంబాలకూ నష్టపరిహారమివ్వండి -తెలంగాణ టీడీపీ నేతలకు మంత్రి హరీశ్‌రావు సవాల్ -ఎన్టీఆర్‌కు నైతికతలేదన్న బాబుకు ఇప్పుడింత ప్రేమెందుకని ప్రశ్న సోమవారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో బస్సుయాత్రల పేరిట నాటకాలాడిన మీరు.. అనంతపురం రైతు ఆత్మహత్యలను ఎందుకు అదృశ్యం చేస్తున్నరు? మీకు నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే అనంతపురంలో కూడా బస్సుయాత్ర చేపట్టండి. అక్కడ కూడా చనిపోయిన రైత కుటుంబాలకు డబ్బు పంచిపెట్టండి అని సవాల్ విసిరారు. కేవలం తెలంగాణ ప్రభుత్వంపై బుదరజల్లి, బద్నాం చేసేందుకే టీ టీడీపీ నేతలు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. అభూ కల్పనలతో టీడీపీ నేతలు ఆడుతున్న డ్రా మాలను సీమాంధ్ర ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారన్నారు. రాష్ట్రంలో రైతు రుణాలను మాఫీ చేసినం.

కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు ఒక్క రైతుకు, ఒక్క పైసా రుణాన్ని మాఫీచేశారా? అక్కడ రుణమాఫీ చేయకపోవడంతోనే అనంతపురం రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని మేం కూడా ఆరోపణలు చేయొచ్చు. విమర్శకు ప్రతివిమర్శ ఉంటది. నువ్వు ఒకవేలు చూపితే.. నాలుగు వేళ్లు నిన్ను చూపిస్తయి. చనిపోయిన రైతు కుటుంబాలను ఆదుకునేందుకు మా ప్రభుత్వం చేయాల్సినదంతా చేస్తున్నది. ప్రతి కుటుంబానికి రూ.1.5 లక్షల పరిహారం ఇచ్చి ఆదుకొనేందుకు ప్రయత్నిస్తున్నం.

బాధిత కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నం. ఉచిత కరెంటును కొనసాగించడంతోపాటు గతంలో రూ.212 కోట్లుగా ఉన్న ఉచిత కరెంటు సబ్సిడీని రూ.300 కోట్లకు పెంచినం. రూ.4,250 కోట్లను రుణమాఫీకి విడుదల చేసినం. రూ.9వేల కోట్ల కొత్త రుణాలను ఇప్పించినం. చెరువుల పునరుద్ధరణతో భరోసా కల్పిస్తున్నం. నాలుగేండ్ల ఇన్‌పుట్ సబ్సిడీని విడుదల చేసి రైతాంగానికి మా ప్రభుత్వం అండగా ఉంటున్నదిఅని తెలిపారు. వ్యవసాయోత్పత్తులకు మార్కెట్ యార్డుల్లో ధర పడిపోతే ప్రభుత్వపరంగా కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో రూ.400 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు.

కూర్చునేది అక్కడ.. ఓట్లు ఇక్కడివా? శంషాబాద్ డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టొద్దంటూ శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేస్తే.. దాంతో సంబంధంలేదని, ఎన్టీఆర్ పేరు పెట్టాలని టీటీడీపీ నేతలు మాట్లాడటం దురదృష్టకరమని హరీశ్‌రావు మండిపడ్డారు. ఇంగ మార్పు రాదు. రాష్ట్రం బాగుపడాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటుంటే.. ఇంకా మీరు ఆంధ్ర పాట, చంద్రబాబు పాటే పాడుతున్నరు. కరెంటు ఇయ్యనంటున్న చంద్రబాబు మంచోడని సభలో పొగుడ్తరు.

తెలంగాణ అసెంబ్లీల జాగిస్తే.. అది వద్దని ఏపీ అసెంబ్లీలో ఏపీ మంత్రుల గదుల్లో కూర్చుంటరు. దానికి ఏపీ అసెంబ్లీ అనుమతి తీసుకుంటరు. ఏపీ టీడీఎల్పీలో, ఏపీ మంత్రుల గదుల్లో కూర్చుని మాట్లాడుకునే మీకు ఓట్లు మాత్రం తెలంగాణవి కావాల్నా. అసెంబ్లీలో ఇక్కడి ప్రజల మనోభవాలను కించపరిచేలా మాట్లాడుతరు. మీరు రాష్ట్ర ద్రోహానికి పాల్పడుతున్నరు అని మండిపడ్డారు. విద్యుత్‌పై సభలో రేవంత్‌రెడ్డి చూపిన రికార్డును స్పీకర్ వద్ద ఉంచమంటే ఎందుకు ఉంచటంలేదని ప్రశ్నించారు. అసలు ఆ రికార్డు ఎవరిచ్చారో.. ఎక్కడి నుంచి తెచ్చారో.. ఎవరి దగ్గర ఉంచారో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఆంధ్ర కంటే తెలంగాణ ఎక్కువ కరెంటు వాడుకుందని రేవంత్‌రెడ్డి అబద్ధాలు చెప్పి రాష్ట్ర ద్రోహానికి పాల్పడ్డారని, ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ఏమీ ఉండదన్నారు. ఉమ్మడిరాష్ట్రంలో పీపీఏల ఫైళ్లను అసెంబ్లీ ముందుంచాలని చంద్రబాబును అప్పటి సీఎం కోరితే ముందుకు రాలేదని, కానీ ఇప్పుడు స్పీకర్ ఆదేశిస్తే ఫైళ్లు సభముందు పెడతామని తామే ఆఫర్ ఇచ్చామన్నారు. ఏపీలో చంద్రబాబు రైతు, డ్వాక్రా, చేనేత రుణాల మాఫీ చేయలేదని, రాజధాని పేరిట టీడీపీ సీనియర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. మీడియా సమావేశంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, గువ్వల బాలరాజు, గంప గోవర్ధన్, చింతా ప్రభాకర్ పాల్గొన్నారు.

ఎన్టీఆర్‌ను అన్న మాటలు మరిచినవా..? ఎన్టీఆర్‌లో నైతిక విలువలు లేవంటూ గతంలో ఇండియాటుడేతో అన్న మాటలు మర్చిపోయారా అని చంద్రబాబును హరీశ్‌రావు ప్రశ్నించారు. నైతిక విలువలు లేని నాయకుడిపై ఇప్పుడు ఎందుకంత ప్రేమ చూపుతున్నారు? ఓట్లు, రాజకీయం కోసమా? పాఠ్యపుస్తకాల్లో ఎన్టీఆర్ చరిత్రను పెడదామంటే.. అందులో మామకు వెన్నుపోటు పొడిచిన నీ చరిత్ర ఒక పేజీలో ఉంటుందనే భయంతోనే పెట్టొద్దన్నవు.

ఎన్టీఆర్ చివరిదశలో ఆత్మక్షోభకు గురైన చరిత్ర అందరికీ తెలుస్తుందని వద్దన్నవు అని నిప్పులు చెరిగారు. చంద్రబాబు కుటిలబుద్ధి తెలిసే గొడ్డుకన్నా హీనం, గాడ్సేకన్నా ఘోరం అని ఎన్టీఆర్ అన్నారని గుర్తుచేశారు. చంద్రబాబుకు నిజాయితీ ఉంటే, మనిషి మారితే అనంతపురంలో ఆత్మహత్యలకు చేసుకున్న రైతుల కుటుంబాలకు ప్రభుత్వపరంగా,పార్టీపరంగా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.