Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

అధ్యయనంతోనే.. ప్రాజెక్టుల పునరాకృతి

-ఆయకట్టు పెరగడం వల్లనే అంచనాలు పెరిగాయి -ఐదు ప్రాజెక్టుల పునరాకృతితో అంచనా వ్యయం రూ.61,487 కోట్ల మేరకు పెరిగింది -గుత్తేదారులకు మేలు చేకూర్చడం లేదు -ముంపును నియంత్రించేందుకే తుపాకులగూడెం -అసెంబ్లీలో నీటిపారుదలశాఖ మంత్రి శ్రీ హరీశ్‌రావు స్పష్టం

‘రాష్ట్ర భవిష్యత్తు అవసరాలను పరిగణనలోకి తీసుకునే ప్రాజెక్టులను పునరాకృతీకరించాం. ఆయకట్టు పెôచాం. రిజర్వాయర్ల సామర్థ్యాన్నీ పెంపొందించాం. వీటన్నింటి కారణంగానే అంచనా వ్యయాలు పెరిగాయి. ప్రాజెక్టుల సమగ్ర నివేదికలను(డీపీఆర్‌) రూపొందించకుండా, కేంద్ర ప్రభుత్వానికి పంపకుండా పనులు చేపట్టామన్నది అబద్ధం. కాళేశ్వరం ద్వారా 2021-22లోపు ఆయకట్టుకు నీటిని అందిస్తాం.’ అని నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు స్పష్టం చేశారు. బుధవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్‌ మధుసూదనాచారి ప్రశ్నోత్తరాలను చేపట్టారు. నీటిపారుదల ప్రాజెక్టుల పునరాకృతులపై ఎమ్మెల్యేలు జి.కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌, ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు. ‘గతంలో రూపొందించిన ప్రణాళిక ప్రకారం ప్రాణహిత చేవెళ్లను నిర్మిస్తే నీళ్లు లేని కట్టడంగా మిగిలిపోతోంది. అందుకే దాని ఆకృతి మార్చాం. దాని సామర్థ్యాన్ని 11 టీఎంసీల నుంచి 145 టీఎంసీలకు పెంచాం. తాము ప్రతిపాదించిన చోట నీళ్లు ఉన్నట్లు కేంద్ర జలవనరుల కమిషన్‌(సీడబ్ల్యూసీ) కూడా ఆమోదించింది. కాళేశ్వరం ప్రాజెక్టును గతంలో 16 లక్షల ఎకరాల ఆయకట్టుతో ప్రతిపాదించారు. తాము దాన్ని 37 లక్షల ఎకరాలకు పెంచాం. గోదావరిపై మూడు వారధులు నిర్మించి 365 రోజులూ నీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకున్నాం. కంతనపల్లి ప్రాజెక్టును ఆగం చేశామన్నది వాస్తవం కాదు. అక్కడ ప్రాజెక్టు నిర్మిస్తే 11 వేల ఎకరాల గిరిజన భూములు, 20 తండాలు ముంపునకు గురి అవుతాయి. అందుకే తుపాకులగూడెం వద్ద ప్రాజెక్టును నిర్మిస్తున్నాం. అక్కడ ఒక్క ఇల్లు కూడా ముంపు బారిన పడటం లేదు. 250 ఎకరాలు మాత్రమే ముంపునకు గురి అవుతోంది. ఇందిరాసాగర్‌, రాజీవ్‌సాగర్‌ ప్రాజెక్టులను పునరాకృతీకరించి అభయారణ్యాన్ని కాపాడాం. ప్రాణహిత-చేవెళ్ల సుజల ప్రవంతి, జేసీఆర్‌ దేవాదుల ఎత్తిపోతల, ఇందిరమ్మ వరద ప్రవాహ కాలువ, పీవీ నరసింహారావు కంతనపల్లె సుజల స్రవంతి, సీతారామ ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టుల పునరాకృతి కారణంగా అంచనా వ్యయం రూ.61,487 కోట్లు పెరిగింది. పునరాకృతుల ద్వారా గుత్తేదారులకు మేలు చేస్తున్నామన్నది అవాస్తవం. పారదర్శకంగా ప్రాజెక్టులను నిర్మిస్తున్నాం. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత గుత్తేదారులకు ముందస్తు బయానాలిచ్చే (మొబలైజేషన్‌ అడ్వాన్సులు) విధానాన్ని ఎత్తివేశాం. ఈపీసీ విధానాన్ని రద్దు చేశాం. గతంలో ప్రాజెక్టుల సమగ్ర నివేదిక రూపొందించే పేరుతో గుత్తేదారులు మూడు శాతం మొత్తాన్ని బయానాగా తీసుకునేవారు. ఇప్పుడు ప్రభుత్వ ఇంజినీర్లే ఆ పని చేస్తున్నారు.’ రానున్న వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టులను నిర్మిస్తున్నాం.’ అని వెల్లడించారు.

పునరాకృతి వల్లనే అనుమతులొచ్చాయి ‘నీటి వనరుల లభ్యత లేకుండానే మునుపటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రాజెక్టులను చేపట్టడంతో వాటికి అనుమతులు రాలేదు. తాము పునరాకృతి చేయడం వల్లనే కేంద్ర జనవనరుల కమిషన్‌ అనుమతులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం లేదని చెప్పటం లేదు’ అని.. కాళేశ్వరం ప్రాజెక్టు పనులపై ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, గొంగిడి సునీత, ఎర్రబల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్‌, ఎన్‌.ఒదేలు(తెరాస), ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌(భాజపా) అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీశ్‌రావు సమాధానంగా చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు తొలి ఫలితం వరంగల్‌ జిల్లాతోపాటు మునుపటి నల్గొండ జిల్లా పరిధిలోని తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాలకే దక్కుతుందన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో ఒక్క పోలవరం ప్రాజెక్టును మాత్రమే జాతీయ ప్రాజెక్టుగా పేర్కొన్నారని, కాళేశ్వరం ప్రాజెక్టు కూడా చేర్చి ఉంటే కేంద్రం నుంచి నిధులు వచ్చేవని వివరించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.