-పోరుబిడ్డలను కాల్చి చంపింది కాంగ్రెస్సే
-చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ విమర్శ
-చంద్రబాబునాయుడి ఏజెంట్ రేవంత్
-కుంభకోణాల పార్టీ కాంగ్రెస్: బాల్క సుమన్
-ఆదివాసీ అమరుల ఆత్మ ఘోషిస్తుంది

ఇంద్రవెల్లిలో రేవంత్‌రెడ్డి మాటలు అన్నీ అబద్ధాలేనని.. అవి వింటే అమరుల ఆత్మలు ఘోషిస్తాయని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. భూమి కోసం, భుక్తి కోసం పోరాడిన దళిత, గిరిజన బిడ్డలను కాల్పిచంపింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తుచేశారు. మంగళవారం హన్మకొండలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి భాష మార్చుకుని బ్లాక్‌మెయిల్, చౌకబారు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. దళిత, గిరిజనుల కోసం సీఎం కేసీఆర్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు. వారి ఆశాజ్యోతి సీఎం కేసీఆర్ అని కొనియడారు. తాము తెలంగాణ ఉద్యమంకోసం జైలుకెళ్తే.. రేవంత్‌రెడ్డి ఓటుకునోటు కేసులో జైలు పాలయ్యాడని ఎద్దేవా చేశారు.
బాల్క సుమన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీడీపీ కనుమరుగైన నేపథ్యంలో చంద్రబాబు ఏజెంటుగా రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ను నామరూపాలు లేకుండా చేయబోతున్నాడని చెప్పారు. కుంభకోణాల చరిత్ర కాంగ్రెస్‌దని, సంపద పెంచి ప్రజలకు పంచిన పార్టీ టీఆర్‌ఎస్ అన్నారు. దళితులు, గిరిజనులు ఒక్కటైతే ప్రమాదమనే ఇంద్రవెల్లి సభద్వారా వారిలో విషం నింపాలని చూశారని మండిపడ్డారు. దళితబంధు, ఓవర్సీస్, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి అనేక పథకాలను బడుగు, బలహీనవర్గాల సంక్షేమం కోసం తెచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ప్రజలు ఎల్లప్పుడూ అండగానే ఉంటారని చెప్పారు. దమ్ముంటే హుజూరాబాద్ నియోజకవర్గంలో పోటీచేసి డిపాజిట్ దక్కించుకోవాలని రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. పోడు భూముల సమస్యలను సీఎం కేసీఆర్ త్వరలోనే పరిష్కరించనున్నారని తెలిపారు. హుజూరాబాద్‌లో బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్‌పై సానుభూతి ఎందుకు చూపించాలని ప్రశ్నించారు. సమావేశంలో మాజీ ఎంపీ సీతారాంనాయక్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్‌ఖాన్, కార్పొరేటర్ బోయినపల్లి రంజిత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.