Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

ఆదర్శ పురపాలన

-దేశంలోనే ఉత్తమంగా తెలంగాణ పట్నాలు
-ఒక్కో కౌన్సిలర్‌ ఒక కేసీఆర్‌ కావాలి.. తప్పు చేస్తే పదవులు ఊడుతయ్‌
-నూతన మేయర్లు, చైర్‌పర్సన్లు, కార్పొరేటర్లతో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌

ఆదర్శ పురపాలన

దేశం మొత్తంలోనే ఆదర్శవంతమైన పురపాలన అందిస్తామని.. మున్సిపల్‌శాఖ మంత్రిగా ఆ బాధ్యత తనదని.. ఇందులో కీలకపాత్ర మేయర్లు, చైర్‌పర్సన్లు, కార్పొరేటర్లదేనని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు అన్నారు. పట్టణాల రూపురేఖలు మార్చాలన్నా, పట్టణ ప్రగతి కార్యక్రమం విజయవంతం కావాలన్నా కౌన్సిలర్లు, కార్పొరేటర్ల చేతుల్లో ఉన్నదన్నారు. వారు గట్టిగా అనుకుంటే దేశంలోనే ఆదర్శవంతమైన పట్టణాలను తయారుచేసి చూపించే సత్తా ఉన్నదనే సంపూర్ణ విశ్వాసం తనకు ఉన్నదని చెప్పారు.

కొత్తగా ఎన్నికైన మున్సిపల్‌ చైర్మన్లు మేయర్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ప్రజలకు అవినీతిరహిత సేవలు అందించాలని పిలుపునిచ్చారు. ‘తప్పులు చేయవద్దు.. ప్రభుత్వానికి తలవంపులు తీసుకురావద్దు’ అని సూచించారు. ఎవరైనా తప్పుచేస్తే పదవులు ఊడుతాయని హెచ్చరించారు. ప్రతిఎన్నికలోనూ ప్రజలు సారు- కారు అంటూ ఓటేస్తున్నారని.. మనం బాధ్యతగా మెలగాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. గురువారం వివిధ జిల్లాల నుంచి మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు, వైస్‌ చైర్‌పర్సన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను కలిసేందుకు తెలంగాణభవన్‌కు వచ్చారు.

ఈ సందర్భంగా వారితో కేటీఆర్‌ మాట్లాడారు. గెలువడంతోనే బాధ్యత తీరదని.. గెలిచినంత మాత్రాన అహంకారం, గర్వం తలకెక్కకూడదని.. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలని సీఎం కేసీఆర్‌ ఎప్పుడూ చెప్తుంటారని గుర్తుచేశారు. ప్రతి కౌన్సిలర్‌ ఒక కేసీఆర్‌ కావాలని పిలుపునిచ్చారు. పట్టణ రూపురేఖలు మార్చాలని, ప్రతిపక్షాలు ఎన్ని కుయుక్తులు పన్నినా ప్రజలు టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టారని, మీరుముందుకెళ్లండి.. మేము అండగా ఉంటామని అన్నారు. నాలుగేండ్లు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే ఉంటుందని, అందరం కలిసి సమన్వయంతో ముందుకు వెళ్దామని చెప్పారు.

కొత్త పాలకవర్గాలకు నిధులు, విధులు, బాధ్యతలు అన్నీ ఉంటాయని.. మున్సిపాలిటీలకు ఏడాదికి రూ. 2074 కోట్లు విడుదల చేస్తామని తెలిపారు. మున్సిపల్‌ చట్టాన్ని కఠినంగా, పటిష్ఠంగా అమలుచేస్తామన్నారు. కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, చైర్‌పర్సన్లు, మేయర్లకు త్వరలో శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. నూతన పాలకవర్గాలు పట్టణాల్లో పచ్చదనం, పారిశుద్ధ్యం, ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, పారదర్శకత, పౌరసేవలు అం దించాలని అన్నారు. ప్రజలకు పైసా లంచం ఇచ్చే అవసరం లేకుండా, అవినీతిరహిత సేవ లు అందాలని తెలిపారు. ‘కొత్తచట్టాన్ని అధ్యయనంచేయండి. చట్టం గురించి పూర్తిగా తెలుసుకోండి. వార్డును ఆదర్శంగా మార్చే ప్రయ త్నంచేయండి. మున్సిపల్‌ ఎన్నికల్లో చాలామంది పీజీ, ఇంజినీరింగ్‌, డిగ్రీ చదివినవారు, ఐటీ ఉద్యోగాలు గెలిచారు. చట్టంలో ఏమైనా మార్పులు కావాల్సి ఉంటే చెప్పండి’ అని మంత్రి కేటీఆర్‌ సూచించారు.

తప్పు చేస్తే పదవులు ఊడిపోతయ్‌
కొత్తగా ఇల్లు కట్టుకుంటుంటే కంకర, ఇసుక కుప్పపోయంగానే కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఆఫీసర్లు వస్తారనే ప్రచారం ఉన్నది. గింత పెద్ద ఇల్లు కడుతున్నవ్‌, మా సంగతి ఏందని అడుగుతుంటరు. ఈ విషయంలో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు బాగా బద్నామ్‌ అయిండ్రు. ఈ కల్చర్‌ పోవాలి. ఇప్పటివరకు జరిగిందేదో జరిగింది. సీఎం కేసీఆర్‌ అయితే ఊరుకునే మూడ్‌లో లేరు. తప్పుచేస్తే పదవులు ఊడిపోతయ్‌. ఇందు లో మనోడు.. మందోడు ఏం లేదు. ఇప్పుడు ఉన్నోళ్లంతా మనోళ్లే.. ఎక్కడైనా తప్పుజరిగితే.. మీ ఎమ్మెల్యే, మంత్రి సిఫారసు చేసినా నేనయి తే వినను. తప్పుచేయకండి.. తలవంపులు తెచ్చుకోకండి.. మాకు కూడా తలవంపులు తేకండి.

ఈ విషయంలో చాలా కఠినంగా ఉం డబోతున్నాం’ అని మంత్రి కేటీఆర్‌ హెచ్చరించారు. ఒక్క బిల్డింగ్‌ పర్మిషన్‌కు నెలలతరబడి తిరగాల్నా? ఇందులో ఏమైనా చేసేది ఉన్నదా? రాకెట్‌ తయారుచేసేది ఉన్నదా? అని ప్రశ్నించారు. ‘సెట్‌బ్యాక్‌, పార్కింగ్‌ స్థలం, రోడ్డుకు ఎంతవిడిచి పెట్టాలనేది ఉంటుంది.. 75 గజా లలోపు ఇల్లుకు సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ ద్వారా ఎలాంటి అనుమతి అవసరం లేదు. అంతకంటే ఎక్కువ స్థలంలో ఇల్లు కట్టుకుంటే 21 రోజుల్లో అనుమతి ఇవ్వాలి. ఆలోపు ఇవ్వకుంటే 22వ రోజున అనుమతి ఇచ్చినట్టుగా ఆ యజమానికి లేఖవెళ్తుంది’ అని చెప్పారు. అధికారులు కావాలని ఇంటి అనుమతిలో జాప్యంచేస్తే వారిని కూడా ఉపేక్షించబోమని స్పష్టంచేశారు. ‘పురపాలనలో దేశం మొత్తానికి ఆదర్శ పట్టణాలను తయారుచేసే బాధ్యత ప్రభుత్వానిది, మంత్రిగా నాది. ఇందులో మీది కూడా కీలకపాత్ర’ అని చెప్పారు.

ప్రతి ఎన్నికల్లోనూ అద్భుతం
2014 నుంచి ప్రతి ఎన్నికలో అద్భుతం ఆవిష్కృతమవుతూ వస్తున్నదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ‘సారు- కారు’ అంటూ ప్రజలు టీఆర్‌ఎస్‌ పక్షాన తీర్పుఇస్తున్నారని చెప్పారు. పార్లమెంట్‌, అసెంబ్లీ, పంచాయతీ, పరిషత్‌, మున్సిపల్‌ ఇలా ఏ ఎన్నికలైనా గులాబీపార్టీయే విజ యం సాధిస్తూ వస్తున్నదన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లోనూ పదికి 10 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీల్లో 112 టీఆర్‌ఎస్‌ గెలిచిందని.. ప్రతిపక్షాలు ఎన్నికలంటేనే భయపడే పరిస్థితికి వచ్చాయని తెలిపారు. కాంగ్రెస్‌ బీ ఫాం ఇస్తామంటే తీసుకునేవారు లేకపోయారని.. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయమని చెప్పుకొనే బీజేపీ అన్నిస్థానాల్లో అభ్యర్థులను కూడా నిలబెట్టుకోలేకపోయిందని ఎద్దేవాచేశారు. మున్సిపోల్స్‌లో డబ్బు ప్రభావంతో గెలిచిందంటూ టీఆర్‌ఎస్‌ విజయాన్ని అపహాస్యం చేస్తూ కాంగ్రెస్‌, బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని.. ఆ మాటలు ఓట్లేసిన ప్రజలను అవమానపర్చడమేనన్నారు.

వ్యవస్థలపై నమ్మకంలేని ఉత్తమ్‌
పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి శాసన, న్యాయ, ఎన్నికల వ్యవస్థలపై నమ్మకంలేదని కేటీఆర్‌ విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈవీఎంలపై అనుమానం ఉన్నదని ఉత్తమ్‌ ఆరోపణలు చేశారని.. తర్వాత బ్యాలెట్‌ పద్ధతిలో జరిగిన పంచాయతీ, పరిషత్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోరపరాజయం పాలయిందని చెప్పారు. అటు న్యాయవ్యవస్థ, ఇటు ఎన్నికల సంఘంపై నమ్మకం లేని ఆయనను హుజూర్‌నగర్‌ ఓటర్లు ఓడించారన్నారు. ఉత్తమ్‌తోపాటు, ఆయన పార్టీ తమకు అవసరం లేదని.. ఇంట్లో కూర్చుంటే మంచిదని ప్రజలు సూచించారనే విషయాన్ని గ్రహించాలని ఎద్దేవాచేశారు.

కేసీఆర్‌ సామాజిక న్యాయంచేసి చూపించారు
సామాజిక సమతూకం విషయంలో టీఆర్‌ఎస్‌ ఎన్నికలకు ముందు ఎలాంటి హామీలు, వాగ్దానాలు చేయలేదని, కానీ ఫలితాల తర్వాత సామాజికన్యాయం అంటే ఏమిటో సీఎం కేసీఆర్‌ చేసి చూపించారని కేటీఆర్‌ తెలిపారు. మహిళలకు 50శాతం రిజర్వేషన్లు ఉంటే.. వారి కి 57% మేయర్‌, చైర్‌పర్సన్లు కేటాయించారని చెప్పారు. జనరల్‌ స్థానాల్లోనూ బీసీ, ఎస్సీలకు అవకాశమిచ్చారని, 58 మున్సిపాలిటీల్లో బలహీనవర్గాలవారు చైర్‌పర్సన్లు అయ్యారని, ఎంబీసీలకు కూడా అవకాశం కల్పించారని తెలిపారు. ఆరెకటిక, గంగపుత్రులు, కంసాలీ, మేదరి, పెరిక, వడ్ల, రజక తదితర కులాలకు ప్రాతినిధ్యం ఇచ్చారని పేర్కొన్నారు. సూర్యాపేటలో జనరల్‌ మహిళ స్థానంలో ఎస్సీ మహిళకు అవకాశమిచ్చిన ఘనత మంత్రి జగదీశ్‌రెడ్డికి దక్కుతుందన్నారు. మేడ్చల్‌లో జనరల్‌స్థానంలో ఎస్టీలకు, కామారెడ్డిలో ఆర్య క్షత్రియులకు చైర్‌పర్సన్‌ పదవులు దక్కాయన్నారు.

గుండెలనిండా గులాబీ పార్టీ
మున్సిపల్‌ ఎన్నికల్లో భారీ ప్రచారం చేయలేదని, రోడ్‌షోలు నిర్వహించలేదని, సభలు పెట్టలేదని.. అయినా గులాబీ పార్టీని, కేసీఆర్‌ను గుండెలనిండా పెట్టుకున్న ప్రజలు టీఆర్‌ఎస్‌కు బ్రహ్మాండమైన విజయాన్ని అందించారని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. వారి అంచనాలకు అనుగుణంగా, వారి నమ్మకాన్ని వమ్ముచేయకుండా పనిచేయాలని సూచించారు. పట్టణాల రూపురేఖలు మార్చాలన్నా, పట్టణ ప్రగతి కార్యక్రమం విజయవంతం కావాలన్నా కౌన్సిలర్లు, కార్పొరేటర్ల చేతుల్లో ఉన్నదన్నారు. వారు గట్టిగా అనుకుంటే దేశంలోనే ఆదర్శ పట్టణాలను తయారుచేసి చూపే సత్తా ఉన్నదనే సంపూర్ణ విశ్వా సం తనకు ఉన్నదని అన్నారు. మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్‌ తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు పొందారని.. సీఎం కేసీఆర్‌ తెలంగాణ సాధిస్తే, సాధించిన తెలంగాణను కొత్త ఒరవడితో ముందుకుతీసుకెళ్తున్నారని కొనియాడారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలపై కొంత వ్యతిరేకత ఉం డటం సహజమని, కానీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఎక్కడా వ్యతిరేకతలేదన్నారు.

జనరల్‌స్థానాల్లోనూ బీసీ, ఎస్సీలకు అవకాశమిచ్చిన టీఆర్‌ఎస్‌ బడుగు, బలహీనవర్గాలకు వేదిక అయిందని తెలిపారు. టీఆర్‌ఎస్‌ రాష్ట్రాన్ని మరో 40 ఏండ్లు పాలిస్తుందన్నారు. కేసీఆర్‌ ప్రధాని కావాలని, కేటీఆర్‌ సీఎం కావాలని ఆకాంక్షించారు. సమావేశం ప్రారంభంలో మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా జాతిపిత చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సమావేశంలో ప్రభుత్వ విప్‌లు గంప గోవర్ధన్‌, బాల్క సుమన్‌, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యేలు రెడ్యానాయక్‌, పద్మాదేవేందర్‌రెడ్డి, రసమయి బాలకిషన్‌, పెద్ది సుదర్శన్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, మర్రి జనార్ధన్‌రెడ్డి, వొడితెల సతీష్‌, జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, మాజీమంత్రి బస్వరాజు సారయ్య పాల్గొన్నారు.

పీసీసీ ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈవీఎంలపై ఆరోపణలు చేశారు. తర్వాత బ్యాలెట్‌ పద్ధతిలో జరిగిన పంచాయతీ, పరిషత్‌ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ ఘోరపరాజయం పాలయింది. న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘంపై నమ్మకం లేని ఆయనను హుజూర్‌నగర్‌ ఓటర్లు ఓడించారు. ఉత్తమ్‌, ఆయన పార్టీ తమకు అవసరం లేదని.. ఇంట్లో కూర్చుంటే మంచిదని ప్రజలు సూచించారనే విషయాన్ని ఆయన గ్రహించాలి.

– మంత్రి కేటీఆర్‌

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.