-కార్యాచరణ ప్రారంభించండి -27 రకాల పండ్లమొక్కల పెంపకంతో మంకీ ఫుడ్‌కోర్టులా కోమటిబండ అడవి -అడవుల పెంపకం బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు తీసుకోవాలి -అటవీపునరుద్ధరణ పనులను కలెక్టర్లకు స్వయంగా చూపించిన సీఎం కేసీఆర్ -ప్రజలకు సత్వరసేవలందేలా కొత్త రెవెన్యూ చట్టం -రూపకల్పనకోసం మళ్లీ సమావేశమవుదాం -కోమటిబండలో కలెక్టర్లతో సమావేశంలో సీఎం

రాష్ట్రంలో 66.48 లక్షల ఎకరాల అటవీభూమి ఉన్నప్పటికీ ఆ నిష్పత్తితో అడవులు లేవని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ఈ స్థాయిలో అడవులను పునరుద్ధరించాలని చెప్పారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అటవీభూముల్లో అడవుల పునరుద్ధరణకు ప్రణాళిక రూపొందించి, కార్యాచరణ ప్రారంభించాలని కలెక్టర్లను ఆదేశించారు. సామాజిక అడవుల పెంపకం ఆవాసప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గించడానికి ఉపయోగపడితే.. అడవుల పెంపకం మొత్తం వాతావరణంలోనే మార్పు తెస్తుందని, వర్షాలు బాగా కురవటానికి, జీవవైవిధ్యానికి దోహదపడుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. బుధవారం ఉదయం గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని సింగాయిపల్లి, నేంటూరు, కోమటిబండ తదితర ప్రాంతాల్లో చేపట్టిన అటవీ పునరుద్ధరణ పనులను జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి స్వయంగా చూపించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని అటవీభూములు చెట్లు లేని ఎడారుల్లా మారిన దుస్థితి ఉండేదన్నారు. అటవీభూముల్లో అడవిని పునరుద్ధరించాలనే లక్ష్యంతో సమగ్ర ప్రణాళిక రూపొందించి అమలుచేసినట్లు వెల్లడించారు. మూడేండ్ల క్రితం ప్రారంభమైన పునరుద్ధరణ ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని అన్నారు. ఈ ప్రాంతమంతా పచ్చని చెట్లతో కళకళలాడుతున్నదని, వర్షపాతం కూడా పెరిగిందని చెప్పారు. 27 రకాల పండ్ల మొక్కలను ఈ అడవుల్లో పెంచడం వల్ల ఇవి మంకీ ఫుడ్‌కోర్టుల్లా తయారవుతున్నాయన్నారు. గజ్వేల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో చేపట్టిన అటవీ పునరుద్ధరణ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని, రాష్ట్రవ్యాప్తంగా అడవుల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. రాష్ట్రంలో 66.48 లక్షల ఎకరాల అటవీ భూమి ఉందని, ఇది మన భూభాగంలో 23.4 శాతం అని సీఎం అన్నారు. ఇంత అటవీభూమి ఉన్నప్పటికీ అదే నిష్పత్తిలో అడవులు లేవని చెప్పారు.
సహజ పద్ధతిలో చెట్ల పెంపకం గజ్వేల్ అటవీప్రాంతంలో చేపట్టిన అడవుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని ఆ శాఖ పీసీసీఎఫ్ ఆర్ శోభ, అడిషనల్ పీసీసీఎఫ్ ఆర్‌ఎం డోబ్రియాల్ కలెక్టర్లకు వివరించారు. అడవుల్లో ఉన్న రూట్‌స్టాక్‌ను ఉపయోగించుకొని సహజ పద్ధతిలో చెట్ల పెంపకం చేపట్టామన్నారు. అడవి చుట్టూ కందకాలు తీశామని, దీనివల్ల అడవికి రక్షణ ఏర్పడుతుందని చెప్పారు. బయటి జం తువులు లోపలకు రావడంగానీ, లోపలి జంతువులు బయటకు వెళ్లడంకానీ సాధ్యంకాదన్నారు. ఆ కందకాల్లో నీరు నిల్వ ఉండటం వల్ల చెట్లకు కావల్సిన తేమ అందుతుందని చెప్పారు. కందకాల కట్టలపై గచ్చకాయ చెట్లు నాటడంవల్ల అడవికి సహజ రక్షణ ఏర్పడుతుందన్నారు. 27రకాల పండ్లచెట్లు కూడా పెంచుతున్నామని, దీనివల్ల గ్రామాలు, పట్టణాల్లోని కోతులు అడవికి వాపస్ పోతున్నాయని అటవీశాఖ అధికారులు తెలిపారు. అడవుల పునరుద్ధరణవల్ల కాలుష్యం తగ్గుతుందని, ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతాయని, వర్షపాతం పెరుగుతుందని, జీవవైవిధ్యానికి అవకాశం కలుగుతుందని వివరించారు.

ఆయాజిల్లాల్లో ఉన్న అడవులను కాపాడుకోవాలని, అందులో మొక్కలునాటి అడవిని పునరుద్ధరించాలని, మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు ఈ బాధ్యత తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా సూచించారు. పునరుద్ధరించిన అడవుల సందర్శన అనంతరం కలెక్టర్లు కోమటిబండలో నిర్మించిన మిషన్ భగీరథ ప్లాంటును సందర్శించారు. అక్కడే కలెక్టర్లతో కలిసి ముఖ్యమంత్రి మధ్యాహ్న భోజనంచేశారు. అనంతరం కలెక్టర్లతో సమావేశమయ్యారు. కార్యక్రమాల్లో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఈటల రాజేందర్, జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, వీ శ్రీనివాస్‌గౌడ్, కొప్పు ల ఈశ్వర్, నిరంజన్‌రెడ్డి, మల్లారెడ్డి, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శేరి సుభాష్‌రెడ్డి, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

పల్లెలు, పట్టణాలు పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడాలన్నది ప్రభుత్వ లక్ష్యం. దీనికి అనుగుణంగా 60 రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలుచేయాలి. రాష్ట్రంలోని పట్టణాలు, గ్రామాల్లో ఈ 60 రోజుల్లో స్పష్టమైన మార్పు కనిపించాలి. ప్రజలకు సేవలు అందించేందుకే కొత్త పంచాయతీరాజ్, పురపాలకచట్టాలు చేసుకున్నాం. వీటిని పక్కాగా అమలు చేయాలి. రాష్ట్రంలోని అన్ని అటవీప్రాంతాలను అభివృద్ధి చేయాలి. – ముఖ్యమంత్రి కేసీఆర్

1. బుధవారం సిద్దిపేట జిల్లా కోమటిబండలో మిషన్‌భగీరథ ప్లాంటునుంచి అటవీప్రాంతాన్ని పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. 2. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం సింగాయిపల్లి ఫారెస్టు పునరుద్ధరణ పనుల వివరాలను కలెక్టర్లకు తెలియజేస్తున్న అటవీశాఖ పీసీసీఎఫ్ ఆర్ శోభ.చిత్రంలో సీఎం కేసీఆర్, మంత్రులు కూడా ఉన్నారు.