Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

అభివృద్ధి చేశాం ఆశీర్వదించండి

-అన్నివర్గాలకు సంక్షేమ పథకాలు
-ఓటడిగే హక్కు టీఆర్‌ఎస్‌కే ఉన్నది
-కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ లేదు
-బీజేపీకి బిల్డప్‌ ఎక్కువ.. పని తక్కువ
-టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు
-సిరిసిల్ల, వేములవాడలో రోడ్‌షోలు
-అడుగడుగునా బ్రహ్మరథంపట్టిన ప్రజలు

కేంద్రంలో 70 ఏండ్లనుంచి పాలించిన కాంగ్రెస్‌, బీజేపీలు చేయని అభివృద్ధిని రాష్ట్రంలో కేవలం ఐదేండ్లలో చేసి చూపించామని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ, పురపాలకశాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. రాష్ర్టాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేశామని, మున్సిపల్‌ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటువేసి ఆశీర్వదించాలని కోరారు. కారుగుర్తుకు ఓటేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, తనకు వేసినట్టేనని పేర్కొన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు టీఆర్‌ఎస్‌ పార్టీకే ఉన్నదని, ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తామన్నారు.

మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం వేములవాడ, సిరిసిల్ల పట్టణాల్లో నిర్వహించిన రోడ్‌షోలలో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌కు మహిళలు.. బోనాలు, బతుకమ్మలు, మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. రోడ్‌షోకు స్థానిక ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. జై కేటీఆర్‌ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. రాష్ట్ర ప్రభుత్వం అన్నివర్గాల సంక్షేమం కోసం పనిచేస్తున్నది. గత ప్రభుత్వాలు పేదలకు రూ.200 పింఛన్లు ఇస్తే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షల మందికి రూ.2,016, దివ్యాంగులకు రూ.3,016 చొప్పున ఇస్తున్నది. పీఎఫ్‌ లేకున్నా దేశంలో ఎక్కడా లేనివిధంగా బీడీ కార్మికులకు పింఛను ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్‌ఎస్సే. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్‌ కిట్లు, కిడ్నీ బాధితులకు డయాలసిస్‌ కేంద్రాలు..

ఇలా అనేక పథకాలు ప్రవేశపెట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణే. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఊసేలేదు. బీజేపీ వాళ్లది బిల్డప్‌ ఎక్కువ.. పని తక్కువ. వారు ఓటు కోసం వస్తే ఏం చేశారని నిలదీయండి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, మిషన్‌ భగీరథ ప్రాజెక్టు బాగున్నదని స్వయానా ప్రధాని నరేంద్రమోదీ ఏర్పాటుచేసిన నీతి ఆయోగ్‌ సంస్థ నివేదిక ఇచ్చింది. ప్రాజెక్టుకు రూ.19 వేలకోట్లు ఇవ్వాలని ఆ సంస్థ సిఫారసు చేసినా నయాపైసా కూడా ఇవ్వలేని పార్టీకి ఓటెందుకు వేయాలి. ఎన్నికలు రాగానే కులం, మతం పేరుతో రాజకీయాలు చేయడం మంచిదికాదు. మున్సిపల్‌ ఎన్నికల్లో తామూ టీఆర్‌ఎస్‌ పార్టీనే అని చెప్పుకొంటున్న ఇండిపెండెంట్‌ అభ్యర్థులను నమ్మొద్దు. గెలిచాక టీఆర్‌ఎస్‌లో చేరుతామంటూ నమ్మబలుకుతున్నవారికి ఎట్టి పరిస్థితిలో ఓటు వేయొద్దు.

కార్మిక, ధార్మికక్షేత్రాల అభివృద్ధే లక్ష్యం
రాష్ర్టాన్ని అభివృద్ధిలో వెనుకబడేసిన సమైక్య పాలకులు ఎములాడ రాజన్నను దర్శించుకుంటే మంత్రి పదవులు పోతాయని బదనాం చేశారు. ఆ అపవాదును తొలగించడానికే ఇప్పటికి నాలుగుసార్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ వేములవాడ క్షేత్రానికి వచ్చి రాజన్నను దర్శించుకున్నారు. యాదాద్రి, భద్రాద్రి ఆలయాల అభివృద్ధి తరహాలో వేములవాడ శైవక్షేత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాం. చరిత్రలోనే మొదటిసారిగా రూ.220 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. సిరిసిల్ల మానేరుపై నిర్మించిన మధ్యమానేరుకు శ్రీ రాజరాజేశ్వర ప్రాజెక్టుగా నామకరణం చేశాం. గోదావరి జలాలతో తమ కాళ్లు కడుగుతానని కేసీఆర్‌ ఇచ్చిన హామీ నెరవేర్చినం. బోయినపల్లి మండలం కొదురుపాక బ్రిడ్జిపైనుంచి గోదావరి జలాలను చూస్తే సముద్రంలా కనిపిస్తున్నందుకు ప్రజలంతా సంతోషిస్తున్నారు. సాగునీళ్లు లేక బీళ్లుగా మారిన మెట్టప్రాంతాన్ని గోదావరి జలాలతో సస్యశ్యామలం చేస్తాం. జిల్లాలో రెండులక్షల ఎకరాలకు సాగునీరందిస్తాం. సిరిసిల్ల, వేములవాడ పట్టణాలను దేశంలోనే అగ్రశేణి పట్టణాలుగా తీర్చిదిద్దుతాం.

రాజకీయ జన్మనిచ్చిన సిరిసిల్ల రుణం తీర్చుకుంటా
ఐదేండ్ల కిందట తనకు ఎమ్మెల్యేగా ఒక్కసారి అవకాశం ఇస్తే సిరిసిల్ల ముఖచిత్రాన్నే మార్చేస్తానని చెప్పాను. చెప్పినట్టుగానే రాష్ర్టానికే ఆదర్శంగా తీర్చిదిద్దాను. నాకు రాజకీయ జన్మనిచ్చిన సిరిసిల్లకు రుణపడి ఉంటాను. సమైక్యపాలకుల నిర్లక్ష్యం వల్ల సిరిసిల్ల ఉరిసిల్లగా మారింది. కానీ, ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో నేతన్నల కోసం చేపట్టిన సంక్షేమ పథకాలు సత్ఫలితాలిచ్చాయి. బతుకమ్మ చీరలు, రంజాన్‌, క్రిస్మస్‌, విద్యార్థుల యూనిఫాంల తయారీ ఆర్డర్లు ఇచ్చి నేతన్నలకు ఉపాధి కల్పించాం. రెండేండ్లలో సిరిసిల్ల జిల్లా ప్రజలకు రైలు కూత వినిపిస్తాను.

సిరిసిల్ల నుంచి ముంబై, భీవండి, షోలాపూర్‌, తిరుపతి తదితర ప్రాంతాలకు రైలెక్కి వెళ్లొచ్చు. సిరిసిల్ల మానేరు నది ఒడ్డున కరకట్ట, వైకుంఠధామాలు, బతుకమ్మ ఘాట్‌లను అభివృద్ధి చేశాను. గోదావరి జలాలతో కనువిందు చేస్తున్న రామప్పకొండలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరుస్తా. సిరిసిల్లలో నర్సింగ్‌ కళాశాల, వ్యవసాయ పాలిటెక్నిక్‌, వ్యవసాయ కళాశాలలు ఏర్పాటుచేశాను. త్వరలో జేఎన్టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల ఏర్పాటుచేస్తాం.

విప్లవాత్మక మార్పులతో కొత్త మున్సిపల్‌ చట్టం
సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో విప్లవాత్మక మార్పులతో కొత్త మున్సిపల్‌ చట్టం అమలు కాబోతున్నదని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. అవినీతి నిర్మూలన కోసం ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలుచేస్తామన్నారు. 75 గజాల స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణం కోసం ఎలాంటి అనుమతులూ అవసరం లేదని, 100 గజాలపైన ఉన్న నిర్మాణాలకు 21 రోజుల్లో అనుమతిస్తామని తెలిపారు. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు ఏ పార్టీ వారైనా సరే ప్రజలకు సరైన న్యాయం చేయకుంటే వారిని నిర్దాక్షిణ్యంగా తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉన్నదని చెప్పారు.

ఎన్నికల తర్వాత కొత్త చట్టంపై అధికారులకు, అభ్యర్థులకు శిక్షణ ఇస్తామని ఆయన తెలిపారు. ఆయా రోడ్‌షోలలో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు, జెడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, ఎమ్మెల్సీ భానుప్రసాదరావు, హైదరాబాద్‌ నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు చీటి నర్సింగరావు, చిక్కాల రామారావు, గూడూరి ప్రవీణ్‌, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, రెండు మున్సిపాలిటీల టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.