-కల్యాణ కళ కళ సంక్రాంతి లక్ష్మి -ఆరేండ్లలో పేదింటి ఆడబిడ్డల పెండ్ల్లికి 6423.58 కోట్లు -బిడ్డలెంతమంది ఉన్నా.. అందుతున్న ఆర్థిక సహాయం -గరీబుల కన్నీళ్లు తుడుస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ -ఆరేండ్లలో ప్రయోజనం పొందినవారు 8,00,574 -పేద ఆడపిల్లల పెండ్లిళ్లకు ప్రభుత్వం భరోసా

ఎవరిస్తరయ్యా ఈ రోజుల్లో.. కేసీఆర్ సారు కాబట్టి ఇచ్చిండు. భూతల్లి మీద ఆన కేసీఆర్ సారు చేసిన మేలు బతికున్నంతకాలం మరువం.. నా బిడ్డల పెండ్లికి సర్కారే కర్సులన్నీ పెట్టుకొన్నది. గిట్ల ఆడబిడ్డలకు అండగ నిల్సిన సర్కారును ఎప్పుడూ చూడలే. సారున్నడన్న ధైర్యం చాలు.. ఆడపిల్లల తల్లిదండ్రులు సుకూన్‌గా నిద్రపోవడానికి.. రాష్ట్రంలో ఏ ఊరికిపోయినా ఇదే మాట.. ఏ ఆడపిల్ల తల్లిదండ్రులను కదిలించినా ఇదే కృతజ్ఞత.
ఎవరూ అడగలేదు.. కావాలని ధర్నా చేయలేదు.. తానూ ఇస్తానని ఎన్నికలకు ముందు వాగ్దానమేమీ చేయలేదు. కానీ.. పేదల ఇండ్లలో.. ఆడపిల్లల తల్లిదండ్రులు పడే వేదన ఉద్యమనాయకుడిని విచలితం చేసింది. అప్పుడు సీఎం కేసీఆర్‌కు వచ్చిన ఆలోచనకు రూపమే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్
ఆడపిల్లల కన్నీరు తుడిచి వారి తలపై కల్యాణాక్షతలు చల్లి ఆనందం నింపిన పథకం ఏదైనా ఉన్నదంటే.. అది కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్. ఒకప్పుడు ఆడపిల్ల పెండ్లి చేయడమంటే అప్పులపాలుకావడమే. ఆర్థికంగా చితికిపోవడమే. ఇక ఒకరిని మించి ఆడపిల్లల సంతానం ఉంటే.. ఆ తల్లిదండ్రుల వేదన భరించరానిది. అలాంటి పేద తల్లిదండ్రుల ఆవేదనను తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దదిక్కులా మారి వారికి భరోసా కల్పించింది. ఎందరు ఆడపిల్లలున్నా.. వారందరి పెండ్లిళ్లకు ఆంక్షలు లేకుండా ఆసరాగా నిలిచింది. లక్షలాది ఆడపిల్లల పెండ్లిళ్లకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ బాసటగా నిలిచింది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఓదెల మండలం కొలనూరు. జీదుల స్వరూపది నిరుపేద కుటుంబం. ముగ్గురు ఆడపిల్లలు. భార్యభర్తలు కూలి పనిచేస్తే కానీ పూట గడవదు. ఇక ఆడపిల్లల పెండ్లెట్ల చేసేది? కిందమీద పడి.. ఏదోవిధంగా ఒక బిడ్డ పెండ్లి ఎల్లదీసిండ్రు. ఇంకిద్దరి పెండ్లి ఎట్ల సేయాలని రందిపడుతుంటే.. మేనమామలా సీఎం కేసీఆర్ ఆపన్న హస్తాన్ని అందించిండు. రెండోబిడ్డకు 2016లో పెండ్లిచేస్తే.. కల్యాణలక్ష్మి సాయం కింద రూ.51 వేలు సమయానికి అందినయి. 2019లో మూడో బిడ్డ పెండ్లీ జరిగింది. అప్పటికి స్కీం పరిమితి పెరిగింది. మూడోబిడ్డకు అదే కల్యాణలక్ష్మి పథకం కింద లక్షా నూటపదార్లు వచ్చినయి. అంతేనా.. ఇద్దరు బిడ్డల కాన్పులు సర్కారు దవాఖానల్నే జరిగినయి. ఇంటినుంచి దవాఖానకు తీసుకుపోయి.. పురుడుపోసి.. మగపిల్లలు పుట్టడంతో రూ.12 వేలు, కేసీఆర్ కిట్లు చేతికిచ్చి.. మళ్లీ భద్రంగా ఇంట్లో దిగబెట్టి వెళ్లారు. రూపాయి ఖర్చులేకుండా అన్నీ జరిగిపోయినయి. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు.. పేదింటి ఆడపిల్లల తల్లిదండ్రుల కన్నీళ్లు తుడిచేందుకు తన మానసపుత్రికగా ప్రారంభించిన కల్యాణలక్ష్మి-షాదీ ముబారక్ పథకం సాధించిన విజయానికి మచ్చుతునక. ఇది ఏ ఒక్క జిల్లాకో.. ఊరికో పరిమితం కాలేదు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో, గ్రామాల్లో.. పేదిండ్లలో.. ఆడపిల్లలు, వారి తల్లిదండ్రుల కండ్లలో కనిపిస్తున్న ఆనందానికి కారణమీ పథకం. ఎలాంటి ఆంక్షలు లేకుండా.. ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలుంటే.. అందరికీ ఈ పథకం వర్తింపజేయడంతో తల్లిదండ్రులు గుండెలమీద చేయివేసుకొని హాయిగా నిద్రపోతున్నారు. బాల్య వివాహాలు ఆగిపోయాయి. ఆత్మగౌరవంతో.. సంబురంగా బిడ్డల పెండ్లిళ్లు చేస్తున్నారు. ఆడపిల్లల పురుళ్లు పోయడం.. వారి పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పించి.. తీర్చిదిద్దేంతవరకు ప్రభుత్వమే బాధ్యత తీసుకోవడంతో వారికిప్పుడు పేదరికం కనిపించడంలేదు. ఆత్మగౌరవంతో జీవిస్తున్నారు. ఈ ఒక్కపథకం తెలంగాణలో సామాజిక మార్పు ఇది.
కవలల కల్యాణోత్సాహం మాకు కవలలుగా ఆడ పిల్లలు పుట్టారు. తర్వాత మళ్లీ ఆడపిల్ల పుట్టింది. కవలలిద్దరికి పెండ్లిచేశాం. ప్రభుత్వం అందించిన కల్యాణలక్ష్మి డబ్బులు మమ్మల్ని కష్టాల నుంచి గడ్డకు పడేసినయి. ఇప్పుడు అయినవారే ఆదుకుంటలేరు. మా బోటి వారికి పెద్ద సారు కేసీఆర్ పెద్ద దిక్కుగా మారి సాయం చేసిండు. నేను ఎన్ని సోడాలు అమ్మితే రూ.2 లక్షలు పోగు కావాలె. ఆ డబ్బులు మాకు ఎంతో ఆసరైనయ్. – దాసరి సంపత్, విజయ.. జయశంకర్ భూపాలపల్లి
సారే దిక్కైండు నా భర్త భివండిలో చేనేత పనిచేస్తడు. నేను బీడీలు చుడుత. మాకు ఇద్దరు ఆడబిడ్డలు సుప్రజ, సాధన. మూడేండ్ల కింద నా భర్త అనారోగ్యంతో మంచం పట్టి ఏడాదిపాటు లేవలేదు. అటు దవాఖాన్లకు తిరుగుకుంట, ఇటు బీడులు సుట్టుకుంట, కూలీ పనులు చేసుకుంట బతుకు ఎల్లదీసిన. చేతుల పైసలు లెవ్వు. ఇంట్ల పెండ్లికెదిగిన ఆడపిల్లలు ఇద్దరు ఉన్నరు. ఏం చేయాలె.. ఎట్ల చేయాల్నని మస్తు రందివడ్డ. కేసీఆర్ సార్ కల్యాణలక్ష్మి ఇత్తున్నడని తెలిసి మస్తు ధైర్యమనిపించింది. ఎట్లనో కట్టపడి పెండ్లి చేసిన. ఇద్దరికీ కల్యాణలక్ష్మి సాయం రూ. లక్షా నూట పదహార్లు అచ్చినయ్. నా చిన్న బిడ్డకు గా పైసలే కట్నంగా ఇచ్చిన. నాకు రూ.2016 బీడీ పింఛన్ వస్తుంది. నాభర్త అనారోగ్యంతో దవఖాన్లకు పోయినప్పుడు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం చేసిండ్రు. రూ.80 వేల ఖర్చు తప్పింది. కల్యాణలక్ష్మి, ఆరోగ్యశ్రీ లేకుంటే మా పరిస్థితి ఎట్లుండేదో తలుసుకుంటెనే బయమేస్తది. మా కుటుంబానికి కేసీఆర్ సారే పెద్ద దిక్కైండు. -గుంటుకు రేణుక, గర్శకుర్తి
అక్కెరకు పైసలొచ్చినయి నా భర్త సమ్మయ్య సౌదీ పోయిండు. మాకు ముగ్గురు అడపిల్లలు. ఎకరం భూమి ఉన్నది. మొదట్లో అప్పో సప్పో జేసి పెద్ద బిడ్డ రాధికను ఊళ్లెనే మేనల్లుడికి ఇచ్చి ఉన్నంతలా పెండ్లి చేసినం. మళ్ల ముందటేడు రెండో బిడ్డ కోమలత, చిన్న బిడ్డ స్వప్న ఇద్దరి బిడ్డల పెండ్లి ఏడాదిలోనే మా స్థోమత పట్టి చేసినం. అప్పుడు నా భర్త సౌదీలో ఉన్నడు. పెండ్లి ఖర్చు కోసం పైసల తిప్పల బాగా అయ్యింది. అప్పులు పుట్టలేదు. నెల, రెండు నెలల మాటా మీద ఆడ, ఇడ రెండు, మూడు లక్షలు తెచ్చిన. సీఎం కేసీఆర్ దయ వల్ల వెంట, వెంటనే ఇద్దరు బిడ్డలకు కల్యాణలక్ష్మి చెక్కులు వచ్చినై. బ్యాంకుల వేసి పైసలు ఇడిపించుకచ్చి తెచ్చిన కాడ ఇచ్చిన. కల్యాణలక్ష్మి పైసలు ఎంతో అక్కెరకువచ్చి, మాట నిలబెట్టినై. కేసీఆర్ మా లాంటి గరిబోళ్లకు పెద్ద దిక్కు అయి దేవుడి లెక్క అదుకుంటుండు. కేసీఆర్ సారును మేము బతికినంతకాలం మరిచిపోం, ఆయనకు చేతులెత్తి మొక్కుతున్నం. -గొట్టె లక్ష్మి, అక్కన్నపేట, సిద్దిపేట జిల్లా
సర్కారే కర్సులు పెట్టుకొన్నది మా ఇద్దరు బిడ్డలకూ పెండ్లిజేసినం. ఇద్దరికీ కల్యాణలక్ష్మి కింద రూ.50 వేల చొప్పున అచ్చినయ్. సంబురంగా పెండ్లి జేసి, బిడ్డలిద్దరిని అత్తారింటికి పంపినం. అసలు చేతిలో డబ్బులు లేక, పెండ్లెట్ల చేసుడని రంది పడ్డం. అప్పు తెస్తే తీర్చుడు కూడా పెద్ద కష్టమయ్యేది. బిడ్డలను ఉట్టిగనే పంపుడంటే మనసొప్పలే. సర్కారే కర్సులు వెట్టుకుని పెండ్లి చేసినట్టనిపించింది. లేకుంటే మాకున్న మూడెకరాల భూమి అమ్మాల్సి వచ్చేది. బిడ్డలు చాంగుబాయి, సుగుణాబాయి మంచిగ బతుకుతున్నరు. సీఎం కేసీఆర్ ఇలాంటి పథకం తెచ్చి ఎంతో మంచిపని చేసిండు. ఇంత మంచి సాయం చేస్తున్నడంటేనే ఆయన దయాగుణం అర్థమవుతున్నది. గిట్ల ఆడబిడ్డలకు అండగా నిలిచిన ముఖ్యమంత్రిని గతంల ఎప్పుడూ సూడలె. -జాదవ్ తానాజీ, జమునాబాయి దంపతులు, బోథ్, ఉమ్మడి ఆదిలాబాద్
నాలుగో కూతురికి కూడా.. నాకు నలుగురు కూతుళ్లు. వినాయకుడి విగ్రహాలు చేసుకొంటూ బతుకుతున్నా. 2013లో అప్పులుచేసి పెద్దకూతురు పెండ్లి చేసిన. 2015లో రెండో కూతురు పెండ్లికి కల్యాణలక్ష్మి పథకం కింద రూ.50 వేలు వచ్చినయి. మళ్ల రెండేండ్లకు మూడో కూతురు పెండ్లిచేసిన. అప్పుడు లక్షా నూటపదార్లు వచ్చినయి. మొన్న డిసెంబర్‌లో నాలుగో కూతురు పెండ్లిచేసిన. కల్యాణ లక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకొన్న. కేసీఆర్ సారు మా కుటుంబానికి ఎంతో ఆసరాగా నిలిచాడు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాం. -పోలకొండ సువర్ణ, పురాణీపేట్, నిజామాబాద్ జిల్లా
కేసీఆర్ సార్ కాబట్టి ఇచ్చిండు సీఎం కేసీఆర్ సార్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకం ఎంతోమంది అమ్మాయిలు ఉన్న తల్లిదండ్రులకు భరోసానిచ్చింది. ఇంట్లో ఆడపిల్లల పెండ్లి చేయాలంటే ఎంతో కష్టం. కట్నం ఇవ్వకున్నా సరే పెండ్లి చేయాలంటే పెద్ద తతంగం. అన్నీ అర్థం చేసుకున్న కేసీఆర్ సార్ మంచి పథకం పెట్టిండు. మా ఇంట్లో ఉన్న ఇద్దరమ్మాయిలకు పెండ్లి చేసిన. కల్యాణలక్ష్మి మా చేతికే వచ్చింది. ఎవరిస్తారయ్య ఈ రోజుల్లో లక్ష రూపాయలు. మనుషులను నమ్మి అప్పులు పుట్టే పరిస్థితి కూడా లేదు. కేసీఆర్ కాబట్టే ఇచ్చిండు. ఆయన వచ్చినంకనే మాకు న్యాయం జరిగింది. -మచ్చా విజయ, గృహిణి, కూలీ, కొత్తగూడెం
డబుల్ చెక్కులతో పట్టలేని ఆనందం.. నాకు ఇద్దరు ఆడపిల్లలు. వాళ్లు పుట్టినప్పుడు ఆడపిల్లలను ఎలా పెంచాలి. పెండ్లిళ్లు ఏం పెట్టి చేయాలనే అనే రంది పడ్డాం. కానీ పట్టుబట్టి తెలంగాణను సాధించిన కేసీఆర్ సారు రాష్ట్రంలో మంచి పనులు చేస్తుండు. అందులో ఒకటి ఈ కల్యాణలక్ష్మి. మాలాంటి పేదోళ్లకు పెండ్లిళ్లు చేయాలంటే మాటలా.. ఇప్పుడున్న ఖర్చులకైతే అప్పులపాలయ్యేవాళ్లం. కానీ ఒకేరోజు ఇద్దరు బిడ్డల పెండ్లిడ్లకు సంబంధించిన రెండు చెక్కులను ఎమ్మెల్యే చేతులు మీదుగా తీసుకున్న. ఎంతో ఆనందం కలిగింది. మా కుటుంబమంతా సీఎం సారుకి, తెలంగాణ ప్రభుత్వానికి జీవితాంతం రుణపడి ఉంటుంది. -నడ్డి జయమ్మ, వెంకటేశ్వరరావు, దంపతులు, కందుకూరు గ్రామం, వేంసూరు మండలం, ఖమ్మం జిల్లా.
కేసీఆర్ సార్.. మాకు పిలువని చుట్టం తెలంగాణ వచ్చినంక మాలాంటి పేదోళ్ల బతుకులు చానా బాగుపడ్డయ్. కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అయినంక మాలాంటి వారి బరువును భూజాలకు ఎత్తకుండు. నాకు ఇద్దరు కూతుళ్లు. పెద్దమ్మాయి హసీనాకు 2016 జూలైలో పెండ్లి జరిపించాం. షాదీముబారక్ పథకం ద్వారా ప్రభుత్వం నుంచి రూ.50,016 వచ్చినయి. మూడేండ్ల తరువాత 2019 నవంబర్‌లో చిన్న కూతురు రుబీనాకు పెండ్లి చేసినం. మళ్లీ ప్రభుత్వం నుంచి ఈ మధ్యనే రూ.లక్ష నూటపదార్ల చెక్కు ఇచ్చిర్రు. నా బిడ్డల పెండ్లిళ్లకు కేసీఆర్ మాకు పెద్ద దిక్కై పిలవని చుట్టంలా ఆదుకున్నడు. నాకే కాదు.. రాష్ట్రంలో చాలా మంది ఆడపిల్లల తల్లిదండ్రులు పెండ్లి అంటే దిగులు పడుతుండే. ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా ఆ దిగులు లేకుండా చేసిండు. -ఖాదర్‌బాబా, లింగగిరి గ్రామం, హుజూర్‌నగర్ మండలం, సూర్యాపేట జిల్లా
ఇద్దరు చెల్లెండ్లకు ఆసరా.. నాకు ముగ్గురు చెల్లెండ్లు. అమ్మనాన్నలు చనిపోయారు. అందర్నీ నేనే చూసుకోవాలి. బీడీలు చుడ్తూ కుటుంబాన్ని పోషించుకొన్నా. కష్టపడి పెద్ద చెల్లె లావణ్య పెండ్లిచేసిన. మిగతా ఇద్దరు చెల్లెండ్ల పెండ్లికి కల్యాణలక్ష్మి పథకం కింద లక్షా నూటపదార్లు రావడంతో.. మంచి సంబంధాలు చూసి ఇద్దరి పెండ్లిళ్లు ఒకేసారిచేసిన. వాళ్లిద్దరికీ పిల్లలు పుట్టిన్రు. కేసీఆర్ కిట్లు, నగదు సాయం కూడా అందింది. నా ఆనందానికి అవధుల్లేవు. -బోనగిరి జ్యోతి, బీబీపేట మండలం, జనగామ గ్రామం, కామారెడ్డి జిల్లా
కేసీఆర్ ఉన్నాడన్న ధైర్యం చాలు మాకు ముగ్గురు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు. నేను పెయింటర్‌గా పనిచేస్తున్న, బొంబాయికాలనీ మసీద్‌కు సదర్‌గా వ్యవహరిస్తున్న. మూడేండ్ల క్రితం వెంటవెంటనే సంబంధాలు కుదరడంతో రెండు నెలల వ్యవధిలోనే ఇద్దరు బిడ్డల పెండ్లిళ్లు చేసిన. షాదీముబారక్ పథకానికి దరఖాస్తు చేసుకుంటే ఇద్దరికి రూ.75 వేల చొప్పున రూ.1.50 లక్షలు వచ్చాయి. ప్రభుత్వ సహకారంతో బిడ్డల పెండ్లిళ్ల కోసం చేసిన అప్పులను తీర్చాము. -ఎస్‌కే గౌస్, సమీన, భారతీనగర్ డివిజన్ బొంబాయికాలనీ, సంగారెడ్డి
కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారుల వివరాలు 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2019-20 ఆర్థిక సంవత్సరం నాటికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద ప్రయోజనం పొందిన లబ్దిదారులు, సామాజిక వర్గాల వారీగా ఈ విధంగా ఉన్నాయి. ఎస్సీ: 148,557 ఎస్టీ: 90, 281 బీసీ, ఈబీసీ: 2,42,292 మైనారిటీ: 1,52,192 మొత్తం: 6,33,322 ప్రభుత్వ వ్యయం( కోట్లలో): 4,749.12
2020-21ఏడాదిలో 1,67,252 మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆర్థిక సంవత్సరం (డిసెంబర్14, 2020నాటికి) 1,67,252 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద చెక్కుల పంపిణీ చేశారు. ఈ సంఖ్య గత సంవత్సరం కన్నా 33వేలు ఎక్కువ కావటం విశేషం. ఎస్సీ: 17,296 ఎస్టీ: 11,759 బీసీ: 1,12,941 షాదీముబారక్ కింద: 25,256 మొత్తం: 1,67,252 ప్రభుత్వ వ్యయం( కోట్లలో): 1,674.46
ట్రిపుల్ కాంతులు.. కల్యాణ లక్ష్మి భరోసాతో నలుగురు ఆడబిడ్డల పెండ్లిళ్లు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రానికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు చిన్నం లక్ష్మయ్య. లక్ష్మయ్య, పద్మ దంపతులకు నలుగురూ అమ్మాయిలే. పెద్ద కూతురు బాలమణి పెండ్లిని 2016లో చేశారు. అప్పట్లో కల్యాణలక్ష్మి కింద రూ.50 వేల సాయాన్ని అందుకొన్నారు. 2017లో రెండో కూతురు భవానీకి పెండ్లి టైంలో రూ.50వేలు అందాయి. 2018లో మూడో కూతురు శ్రావణికి పెండ్లి జరిపించగా రూ.75 వేల సాయం అందింది. నిరుడు డిసెంబర్ 27న చిన్న కూతురు స్వాతికి పైండ్లెంది. ఈ క్రమంలో కల్యాణ లక్ష్మి పథకం సాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. నేడో.. రేపో ఈమెకు రూ.1,00,116 సాయం అందనున్నది. తన నలుగురు అమ్మాయిల పెండ్లిళ్లకు కల్యాణలక్ష్మి కొండంత అండగా నిలిచిందని లక్ష్మయ్య అంటున్నారు.
నా బిడ్డలకు పెద్దన్న కేసీఆర్ నాకు అంగవైకల్యం ఉండటంతో బరువు పనులకు వెళ్లలేక డప్పుకొట్టుకుని బతుకుతున్నా. ఇద్దరు బిడ్డల పెండ్లి ఎలా చేయాలని ఆలోచిస్తున్న తరుణంలో కల్యాణలక్ష్మి మమ్మల్ని ఆదుకొన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకం ద్వారా ఆర్థిక సాయం అందించి నా బిడ్డలకు పెద్దన్నగా నిలిచారు. ఇప్పుడు అప్పులు తీర్చుకొని సంతోషంగా ఉన్నాము. నాకు మూడువేల రూపాయల పింఛన్ కూడా వస్తున్నది. చీకూచింతలేకుండా జీవిస్తున్నా. – శివరాల లక్ష్మయ్య దంపతులు మజీద్‌పూర్ గ్రామం, అబ్దుల్లాపూర్‌మెట్, రంగారెడ్డి జిల్లా
చదువులన్నీ రీయింబర్స్‌మెంట్‌తోనే.. పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నా.. లక్ష్మయ్య తన నలుగురు పిల్లలను ఉన్నత చదువులు చదివించాడు. ప్రాథమిక విద్య ప్రభుత్వ పాఠశాలల్లోనే సాగగా.. ఉన్నతవిద్య రీయింబర్స్‌మెంట్‌తోనే సాగింది. పెద్ద కూతురు బాసర ట్రిపుల్ ఐటీలో చదువుకొని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది. మరో కూతురు భవాని ఎంఎస్సీ, మూడో కూతురు శ్రావణి బీఎస్సీ పూర్తిచేశారు. చిన్న కూతురు స్వాతి బీఎస్సీ నర్సింగ్ కోర్సు ఫైనలియర్ చదువుతున్నది.
తల్లులు దీవిస్తున్నారు… కల్యాణలక్ష్మి చెక్కులు తీసుకుంటున్న సమయంలో తమకందిన సహాయానికి సంతోషిస్తూ, ఆడపిల్లల తల్లులు ఆనందభాష్పాలతో ప్రభుత్వాన్ని దీవిస్తున్నారు. ఈ పథకం ద్వారా లబ్ధిపొందడానికి కనీస వయో పరిమితి 18 సంవత్సరాలుగా నిర్ణయించాం. దీంతో పథకం ప్రయోజనాలు పొందడంకోసం బాల్య వివాహాలు చేయకుండా 18 సంవత్సరాలు నిండేవరకు తల్లిదండ్రులు వేచి ఉంటున్నారు. కల్యాణలక్ష్మి సహాయం అందుకున్న వివాహాలకు ప్రభుత్వ గుర్తింపుతోపాటు చట్టబద్ధత లభిస్తున్నది. ఇది ఈ పథకం సాధించిన మరో ప్రయోజనం.’
ఆడపిల్లల కన్నీరు తుడిచిన ఈ పథకం తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్ఠను పెంచింది. కల్యాణలక్ష్మి వ్యక్తిగతంగా నా హృదయానికి ఎంతో దగ్గరైన పథకం. అంతకంటే ఎక్కువగా ఈ రాష్ట్ర ప్రజలు మెచ్చిన పథకం. మొదట ఈ పథకాన్ని ‘కల్యాణలక్షి’ పేరుతో ఎస్సీ, ఎస్టీలకు, షాదీముబారక్ పేరుతో మైనార్టీ వర్గాల ఆడపిల్లల పెండ్లికి రూ.51,000 అందించేవిధంగా ప్రారంభించాం. ఆ తర్వాత ప్రజలనుంచి వచ్చిన అభ్యర్థన మేరకు సామాజికవర్గంతో నిమిత్తం లేకుండా రాష్ట్రంలోని నిరుపేదలందరికీ వర్తింపచేశాం.

19-3-2018 రాష్ట్ర శాసనసభలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు భూతల్లి మీద ఆన.. కేసీఆర్ మేలు మరువం మేము నమ్ముకున్న భూతల్లి మీద ఆన.. మా ఇద్దరు ఆడపిల్లల పెండ్లికి కేసీఆర్ సారు చేసిన మేలును మరువం. మాకు ముగ్గురూ ఆడపిల్లలే ఉన్నారు. కుటుంబాన్ని సాకడమే కష్టమైన పరిస్థితిలో ఆడపిల్లల పెండ్లి చేసుడంటే అల్కటి ముచ్చట కాదు. కేసీఆర్ సారు పెట్టిన కల్యాణలక్ష్మి పథకం పుణ్యాన ఒక్క పైసా అప్పు చేయకుండా ఇద్దరు ఆడపిల్లల పెండ్లిళ్లు చేసినం. గిసుంటి సర్కార్ సల్లంగుండాలే.. కేసీఆర్ సార్‌కు మా అసుంటి పేదోల్లు వెన్నంటి ఉంటరు.