-మరో రెండేండ్లలో 27,187 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం.. -ఉదయ్ స్కీంతో వినియోగదారులకూ మేలు.. -అసెంబ్లీలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గారు
రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పభుత్వం అధికారంలోకి రాగానే విద్యుత్ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించామని, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని భారీగా పెంచేందుకు స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలను రూపొందించామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. తమ విధానాల ఫలితంగా పరిస్థితి ఎంతగానో మారిందని, ఇప్పుడు ఇన్వర్టర్లు పోయి ఇన్వెస్టర్లు వస్తున్నారని బుధవారం అసెంబ్లీలో చెప్పారు. 24 గంటలపాటు విద్యుత్‌ను అందించగలుగుతున్నామన్నారు. కొత్తగా 5039 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేశామని, త్వరలో మరో 5880 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్ ఇన్వర్టర్లు పోయి.. ఇన్వెస్టర్లు వచ్చేకాలం వచ్చిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. గత పాలకుల లోపభూయిష్ట విధానాల ఫలితంగా రెండు డిస్కమ్‌లు రూ.11,897 కోట్ల అప్పుల ఊబిలో కూరుకపోయాయని చెప్పారు. ఉదయ్ పథకంలో చేరడం ద్వారా ఈ అప్పుల్లో 75 శాతం (రూ.8,923కోట్లు) రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని, మిగిలిన రూ.2974 కోట్లకు ప్రభుత్వ గ్యారంటీతో బాండ్లు ఇచ్చే వెసులుబాటు డిస్కంలకు లభిస్తుందని తెలిపారు. ఉదయ్ స్కీంలో చేరేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంతకం చేయడంపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు బుధవారం అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని భారీగా పెంచేందుకు స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలను రూపొందించినట్లు చెప్పారు. రాష్ట్రంలో డిమాండ్‌కు, ఉత్పత్తికి మధ్య వేయి మెగావాట్లకు పైగా వ్యత్యాసం ఉంది. అయినా, రాష్ట్రంలో విద్యుత్ కోతలు విధించకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నాం.
భవిష్యత్తులోనూ నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు, రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అంకితభావంతో కృషి చేస్తాం, రాష్ట్ర ప్రజల జీవితంలో నిత్యం విద్యుత్ కాంతులు నింపుతాం అని ఆయన అన్నారు. రాష్ట్రంలో 2019 నాటికి 27,187 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంటుందని చెప్పారు. సరఫరా, పంపిణీలో కలుగుతున్న నష్టాలను 16.83 శాతం నుంచి 15.98 శాతానికి తగ్గించాం. విద్యుత్ రంగంలో రాష్ట్రం ఇంతటి ప్రగతి సాధించడం వెనుక విద్యుత్ శాఖలోని వివిధ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల కృషి ఎంతో ఉంది. వీరిలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తూ విద్యుత్ సంస్థలకు సేవలందిస్తున్న ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం సానుభూతితో అర్థం చేసుకుని, . దాదాపు 20వేల మంది సర్వీసులను క్రమబద్ధీకరించాలని నిర్ణయం తీసుకుంది అని సీఎం తెలిపారు. రాష్ట్ర విద్యుత్ శాఖ పనితీరును ప్రశంసిస్తూ ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీ వంటి ఆర్థిక సంస్థలు రుణాలపై వడ్డీరేటును 12 శాతం నుంచి 9.95 శాతానికి తగ్గించాయని, దీనివల్ల విద్యుత్ సంస్థలకు రూ.రెండు వేల కోట్లు ఆదా అవుతున్నాయని చెప్పారు. విద్యుత్‌రంగంపై ముఖ్యమంత్రి ప్రసంగం ఆయన మాటల్లోనే..
ఉదయ్‌తో అప్పు సమస్యకు విముక్తి విద్యుత్ రంగంలో మరింత ప్రగతి సాధించడానికి డిస్కంలను బలోపేతం చేయడం కోసం ప్రభుత్వం మరొక ముందుడుగు వేస్తున్నది. ఉదయ్ పథకంలో చేరేందుకు బుధవారం ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంటున్నదని సంతోషంగా తెలియజేస్తున్నాను. గత పాలకుల లోపభూయిష్ట విధానాల ఫలితంగా రెండు డిస్కమ్‌లు రూ.11,897కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. టీఎస్‌ఎస్పీడీసీఎల్‌కు రూ.7,392కోట్లు, టీఎస్‌ఎన్పీడీసీఎల్‌కు రూ.4,505కోట్ల అప్పున్నది. ఉదయ్ పథకంలో చేరడం ద్వారా ఈ అప్పుల్లో 75 శాతం అంటే దాదాపు రూ.8,923కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. మిగిలిన రూ.2974కోట్లు ప్రభుత్వ గ్యారంటీతో బాండ్లు ఇచ్చే వెసులుబాటు డిస్కంలకు లభిస్తుంది. దీంతో డిస్కంలకు రుణభారం నుంచి విముక్తి కలుగుతుంది. అప్పులను రాష్ట్ర ప్రభుత్వమే తీర్చడం వల్ల డిస్కమ్‌లు ప్రతి ఏటా రూ.890కోట్లు వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. డిస్కంలు తిరిగి కొత్తగా అప్పు పొందేందుకు అవకాశం కలుగుతుంది. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో డిస్కంలకు రూ.4,584కోట్లు అందిస్తున్నది. ఈ నిర్ణయాలతో వినియోగదారులకు ఎంతో మేలు కలుగుతుంది.
కొత్తగా 5039 మెగావాట్ల ఉత్పత్తి టీఆర్‌ఎస్ పభుత్వం అధికారంలోకి రాగానే విద్యుత్ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాం. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని భారీగా పెంచేందుకు స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలను రూపొందించాం. సరఫరా, పంపిణీలో కలుగుతున్న నష్టాలను 16.83 శాతం నుంచి 15.98 శాతానికి తగ్గించాం. జెన్ కో ద్వారా అయ్యే విద్యుత్ ఉత్పత్తిని గణనీయంగా పెంచాం. స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నాం. నత్తనడకన సాగుతున్న విద్యుత్ ప్లాంట్లను వేగంగా పూర్తిచేసే దిశగా అడుగులు వేశాం. ఈ చర్యల ఫలితంగా భూపాలపల్లి కేటీపీపీ ద్వారా 600 మెగావాట్లు, జైపూర్ సింగరేణి పవర్ ప్లాంటు ద్వారా 1200మెగావాట్లు, థర్మల్ పవర్ టెక్ ద్వారా 840మెగావాట్లు, సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్స్ (సీజీఎస్) ద్వారా 550 మెగావాట్లు,
జూరాల హైడ్రో పవర్ ప్రాజెక్టు ద్వారా 240మెగావాట్లు, పులిచింతల ప్రాజెక్టు ద్వారా 30మెగావాట్లు, సోలార్ పవర్ 1,080మెగావాట్లు, విండ్ పవర్ 99మెగావాట్లు.. ఇలా మొత్తంగా 5,039 మెగావాట్లను రెండున్నర సంవత్సరాల కాలంలోనే అందుబాటులోకి తేగలిగాం. 2014 జూన్ 2 నాటికి రాష్ట్రంలో 5,863 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఉంటే, ఈ రెండున్నరేండ్లలోనే అదనంగా 5,039 మెగావాట్లు అందుబాటులోకి తేగలిగాం. రాష్ట్రంలో ప్రస్తుతం 10,902 మెగావాట్ల విద్యుత్‌లో జలవిద్యుత్ (హైడల్ పవర్), సౌరశక్తి (సోలార్ పవర్), పవన విద్యుత్ (విండ్ పవర్) ద్వారా వచ్చేది 3,531 మెగావాట్లు. కానీ ఈ మూడు మార్గాల ద్వారా వచ్చే విద్యుత్ అంతగా ఆధారపడదగింది కాదు. 10,902 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్నప్పటికీ, స్థిరంగా అందుబాటులో ఉండేది 7,371 మెగావాట్లు. రాష్ర్టానికున్న విద్యుత్ డిమాండ్ గరిష్ఠంగా 8,284 మెగావాట్లు. రాష్ట్రంలో డిమాండ్‌కు, ఉత్పత్తికి మధ్య వేయి మెగావాట్ల వరకు వ్యత్యాసం ఉంది. అయినా, విద్యుత్ కోతలు విధించకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నాం.
నాడు కాల్పులు.. విద్యుత్ సంక్షోభానికి మూలాలు సమైక్య రాష్ట్రంలో అనుసరించిన విధానంలో ఉన్నాయి. రాష్ట్రంలో ఏర్పడే విద్యుత్ డిమాండ్‌కు సంబంధించిన సరైన అంచనా, ప్రణాళిక లేకుండా ఆనాటి విద్యుత్ విధానం కొనసాగింది. దీంతో ప్రజలు రోడ్డెక్కి నిరసనలకు దిగవలసిన పరిస్థితి ఏర్పడింది. పెంచిన కరెంటు చార్జీలు తగ్గించాలని, మెరుగైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కిన రైతాంగం మీద సమైక్య పాలకులు కాల్పులు జరిపితే, ఇద్దరు రైతులు ప్రాణాలు కోల్పోయిన బషీర్‌బాగ్ దుర్ఘటన సమైక్య రాష్ట్ర చరిత్రలో ఒక మాయనిమచ్చ. ఈ దమనకాండకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం పెల్లుబికింది. ప్రజాఉద్యమం విజయం సాధించి తెలంగాణ ఏర్పడింది.
24 గంటల విద్యుత్ సరఫరా రాష్ట్రం ఏర్పడిన ఆరో నెల 2014 నవంబర్ 20 నాటినుంచే ప్రజలకు కోతల్లేని విద్యుత్‌ను అందిస్తున్నాం. గృహావసరాలకు, పరిశ్రమలకు, వాణిజ్య అవసరాలకు 24గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నాం. వ్యవసాయానికి 9 గంటల త్రీఫేజు కరెంటు అందిస్తున్నాం. విద్యుత్ రంగాన్ని చక్కదిద్ది నేడు నిరంతరాయంగా విద్యుత్ అందిస్తున్నందుకు పారిశ్రామికవర్గాలతోపాటు వినియోగదారులందరూ ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం జనరేటర్ల అవసరం చాలావరకు తగ్గిపోయింది. ఈ రోజు రాష్ట్రంలో ఇన్వర్టర్లు పోయి, ఇన్వెస్ట్టర్లు వచ్చే కాలం వచ్చింది.
త్వరలో మరో 5880 మెగావాట్లు రాబోయే రోజుల్లో విద్యుత్ రంగంలో స్వయంసమృద్ధిని సాధించి, తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా అభివృద్ధి చేసేందుకు విద్యుత్ ఉత్పత్తిని గణనీయంగా పెంచబోతున్నాం. నూతనంగా భద్రాద్రి, యాదాద్రి, కొత్తగూడెం పవర్ ప్లాంట్ల ద్వారా 5880 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రామగుండంలో 4వేల మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఎన్టీపీసీ నెలకొల్పుతుంది. ఇటీవలే 1600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మొదటి దశ నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. రాబోయే మూడేండ్లలో సీజీఎస్ ద్వారా మనకు 595 మెగావాట్ల విద్యుత్ సమకూరుతుంది. సింగరేణి మరో 800మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని జైపూర్‌లో నెలకొల్పుతున్నది. ఛత్తీస్‌గఢ్ నుంచి నాలుగు నెలల్లో వేయి మెగావాట్ల విద్యుత్ రాబోతున్నది. 2017-18 నాటికి 3,920 మెగావాట్ల సోలార్ విద్యుత్ కూడా అందుబాటులోకి వస్తుంది. పులిచింతల ద్వారా మరో 90మెగావాట్ల జలవిద్యుత్ వస్తుంది. ఇవన్నీ కలిసి 2019 నాటికి మన రాష్ట్రంలో 27,187 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం నెలకొని ఉంటుంది. అప్పుడు రాష్ట్రం విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధిని పొందుతుంది.
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజ్ విద్యుత్‌రంగంలో రాష్ట్రం ఇంతటి ప్రగతి సాధించడం వెనుక విద్యుత్‌శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల కృషి ఎంతో ఉంది. వీరిలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తూ విద్యుత్ సంస్థలకు సేవలందిస్తున్న ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం సానుభూతితో అర్థం చేసుకుంది. దాదాపు 20వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించాలని నిర్ణయం తీసుకున్నాం. 1175 మంది కాంట్రాక్టు జేఎల్‌ఎంలను ఇప్పటికే రెగ్యులరైజ్ చేశాం. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల శ్రమను గౌరవించి, సర్వీసులను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడంతో వీరికి ఉద్యోగ భద్రత, మెరుగైన జీతభత్యాలు లభిస్తాయి. భవిష్యత్తులోనూ రాష్ట్రంలో నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు, మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాం. రాష్ట్ర ప్రజల జీవితంలో నిత్యం విద్యుత్ కాంతులు నింపుతాం.