-మత్స్యరంగాన్ని పరిశ్రమగా తీర్చిదిద్దుతాం -ఏటా 11 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి -5 వేల కోట్ల ఆదాయం లక్ష్యం -ఫిషరీష్ కార్పొరేషన్‌కు జవసత్వాలు -నిర్వహణ ఖర్చు మినహా ఆదాయం మత్స్యకారులకే -బెస్త, ముదిరాజ్ వివాదం వద్దు -రాష్ట్రంలో 5 లక్షల హెక్టార్ల వాటర్ స్ప్రెడ్ ఏరియా -ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ. 6 లక్షలు పరిహారం -రాష్ట్రంలో ఎర్ర రొయ్యలను కండ్ల చూడాలి -బేగంబజార్ మాఫియాను తరిమేద్దాం -ఫిషరిష్ విభాగంలో 500-600 ఉద్యోగాల భర్తీకి వచ్చే నెలలో నోటిఫికేషన్ -వచ్చే ఏడాది 2 ఫిషరీష్ కాలేజీలు ఏర్పాటు -అసెంబ్లీలో మత్స్య పరిశ్రమాభివృద్ధిపై చర్చలో సీఎం కే చంద్రశేఖర్‌రావు
రాష్ట్రంలో చేపల పెంపకాన్ని పరిశ్రమగా తీర్చిదిద్ది మత్స్యవిప్లవం తెస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. కాకతీయులు, రెడ్డి రాజులు అందించిన చెరువులు, మధ్య తరహా రిజర్వాయర్ల ఆసరాతో తెలంగాణ రాష్ట్ర జీవికను సుస్థిరం చేస్తామన్నారు. ఏటా 11 లక్షల టన్నుల చేపల ఉత్పత్తితో ఐదువేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించే కీలక ఆదాయవనరుగా మత్స్యపరిశ్రమను తీర్చిదిద్దుతామని చెప్పారు. రాష్ట్రంలో చేపల పెంపకంపై మంగళవారం అసెంబ్లీలో జరిగిన లఘుచర్చలో పాల్గొన్న సీఎం, మత్స్యపరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న బృహత్ ప్రణాళికను సభముందు ఆవిష్కరించారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర జీవిక సుస్థిరం చేసేలా, స్వరాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి చెందేలా నిర్ణయాలు తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు.

రాష్ట్రంలో మత్స్య సంపద అభివృద్ధికి అద్భుత అవకాశాలున్నాయన్న సీఎం, మత్స్యకార కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేస్తామన్నారు. ఫిషరీష్ కార్పొరేషన్ ద్వారా చేప పిల్లల పెంపకం, అమ్మకాలు జరిపి నిర్వహణ ఖర్చు పోగా మిగిలిన ఆదాయాన్ని మత్స్య కార్మికులకే అందచేస్తామని హర్ష ధ్వానాల మధ్య ప్రకటించారు. కిలో రూ.600కు చేపలు అమ్ముకుంటూ మత్య్సకార్మికులకు 15 రూపాయలే చెల్లిస్తున్న బేగంబజార్ మాఫియాను తరిమేస్తామని స్పష్టం చేశారు. పాలమూరు, కాళేశ్వరం ప్రాజెక్టులు పూర్తయితే రీజనరేటెడ్ వాటర్‌తో తెలంగాణ ఎర్రరొయ్యలను మళ్లీ కండ్ల చూస్తామని అన్నారు. మత్స్యకార్మిక సొసైటీల్లో బెస్తవారికి ముందు ప్రాధాన్యం ఇస్తామని, ఈ విషయంలో వివాదాలకు పోవద్దని హితవు పలికారు. కొత్త సొసైటీల ఏర్పాటుపై త్వరలోనే అఖిల పక్షం ఏర్పాటు చేసి అందరి ఆమోదంతో నిర్ణయాలు తీసుకుం టామన్నారు. వచ్చే సంవత్సరం రెండు ఫిషరీష్ కళాశాలలను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
తెలంగాణ రాష్ట్రానికి జీవిక ఏర్పడాలి కొత్తగా ఏర్పడిన రాష్ర్టానికి ఒక పరిపుష్టమైన, చక్కటి భవిష్యత్తు మార్గనిర్దేశనంతో కూడిన ఒక జీవిక ఏర్పడాలంటే అందుకు పటిష్టమైన పునాది, పటిష్టమైన ప్రయత్నాలు పకడ్బందీగా జరగాలి. ఇందుకోసం నేను అన్ని రంగాల్లో అనేక మంది సీనియర్ అధికారులు, బ్యూరోక్రాట్లు, ఆర్థికశాస్త్రవేత్తలతో చర్చోపచర్చలు జరిపాను. తొందరపాటుగానో, తత్తరపాటుగానో కాకుండా చాలా దీర్ఘంగా సాధ్యాసాధ్యాలు ఆలోచించి, మనకున్న ఆర్థిక వనరులను అర్థం చేసుకుని ప్రణాళికబద్ధంగా ప్రణాళిక రచన చేస్తున్నాము. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఒక భాగంగా ఉన్నప్పుడు సముద్రతీరం వెంట ఉన్నవారే మత్స్యకారులు అన్నట్టు ఉండేది. తెలంగాణపై దృష్టిసారించకపోగా, ఇక్కడి మత్స్యరంగాన్ని ధ్వంసం చేశారు.
చిన్నతనంలో నేను దుబ్బాక జెడ్పీహెచ్‌ఎస్‌లో చదువుకుంటున్నపుడు మమ్మల్ని ఎక్స్‌కర్షన్‌కి అని ప్రస్తుతం సిరిసిల్ల జిల్లాలో ఉన్న అప్పర్‌మానేరుకు తీసుకెళ్లారు. అక్కడ జలాశయాన్ని చూపించి ఇది చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం అని మా టీచర్ చెప్పినట్టు గుర్తుంది. ఒక్క అప్పర్ మానేరు దగ్గరే కాదు, దశాబ్దాల క్రితం తెలంగాణలో ప్రతి ప్రాజెక్టు దగ్గర చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు ఉండేవి. అన్నీ మూతపడ్డాయి. ఫిషరీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను మార్చి ఫెడరేషన్ చేశారు. మా ప్రభుత్వం మత్స్యశాఖను మత్స్య పరిశ్రమగా రూపొందించాలని నిర్ణయం తీసుకుంది. మనకు సముద్రతీరం లేకపోయినా కాకతీయులు, రెడ్డి రాజుల కాలంలో నిర్మించిన మైనర్ ఇరిగేషన్ వ్యవస్థ గొప్ప వరంగా ఉంది. వాటిలో చేపల పెంపకానికి అద్భుత అవకాశాలు ఉన్నాయి. అప్పట్లో 75వేల చెరువులు ఉంటే అన్నీ నాశనమై చివరకు ఇప్పుడు 46,500 చెరువులు మిగిలాయి. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇన్ని చెరువులు లేవు. మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని తీసుకుని 15నుంచి 16వేల చెరువులను బాగు చేశాం. ఈ ఏడాది భగవంతుడి దయవల్ల మంచి వర్షాలు కురిసి చెరువలన్నీ నిండి ఉన్నాయి.
మత్స్యశాఖలో మరో 600 పోస్టుల భర్తీ కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో తన జీవికను సుస్థిరపర్చుకోవాలి. ఏయే రంగంలో మనకు ఏం అవకాశాలున్నాయి.. ఏం చేయాలన్నదానిపై చాలా ముందుచూపు ఉండాలి. ఈ సభకు నేను హామీ ఇస్తున్నాను. అద్భుతమైన పెట్టుబడులు మత్స్యరంగంలో పెట్టబోతున్నాం. నాలుగున్నర నుంచి ఐదున్నర వేల కోట్ల రూపాయల విలువ చేసే చేపలను తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నట్టు ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. మనం ఆ లక్ష్యాన్ని చేరుకుంటామని నాకు నమ్మకం ఉంది. వచ్చే బడ్జెట్‌లో ఇందుకు అవసరమైన నిధులు కేటాయిస్తాం. దక్షిణ తెలంగాణలోని జూరాల దగ్గర మొదలు పెట్టుకుంటే, రామన్‌పాడ్, శ్రీశైలం, నాగార్జునసాగర్, టెయిల్‌పాండ్, పులిచింతల, నల్లగొండ జిల్లా మూసీ ప్రాజెక్టు, మహబూబ్‌నగర్ కోయిల్‌సాగర్, కొత్తగా వచ్చిన సంగంబండ రిజర్వాయర్ ఇట్లా అన్నింటినీ స్టడీ చేస్తున్నాం.
ఉత్తర తెలంగాణ వైపు వస్తే సింగూరు, నిజాంసాగర్ ప్రాజెక్టు, ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, కడెం రిజర్వాయర్, ఆదిలాబాద్‌లో ఉండే అన్నీ ప్రాజెక్టులు, ఎల్లంపల్లి, లోయర్ మానేరు, మిడ్‌మానేరు, అప్పర్‌మానేరు డ్యాంలు, వరంగల్ పాకాల, ఘనపురం, రామప్ప, లక్నవరం, ఖమ్మంలో లంకాసాగర్, వైరా, పాలేరు రిజర్వాయర్లు మనకు ఉన్నయి. వీటిని వినియోగించుకొని ఐదువేల కోట్ల రూపాయల ఆదాయాన్ని మన తెలంగాణ మత్స్యకారులకు అందించాలని లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. దక్షిణ తెలంగాణలో ఒకటి, ఉత్తర తెలంగాణలో మరొకటి వచ్చే విద్యా సంవత్సరంలో రెండు ఫిషరీస్ కాలేజీలు నెలకొల్పుతాం. చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేసి వచ్చే ఏడాది నుంచే అందుబాటులోకి తెస్తాం. ఫిషరీస్ విభాగంలో ఇపుడు 480 మంది మాత్రమే సిబ్బంది ఉన్నారు. 80 ఖాళీలు ఉన్నాయి. ఆ సిబ్బంది సరిపోరు. వచ్చే నెలలో నోటిఫికేషన్ ఇచ్చి ఇంకో 500 నుంచి 600 మందిని నియమిస్తాం. ఇప్పుడున్న ఫిషరీస్ కార్పొరేషన్ జవజీవం లేకుండా ఉంది. దాన్ని పరిపుష్టం చేసేలా ఒక ఐఏఎస్ అధికారిని నియమిస్తాం. రాబోయే ఏడాది బడ్జెట్‌లో బీసీ వర్గాల్లో ప్రధాన వర్గాలైన యాదవులు, మత్స్యకారులకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకుంటాం.
అంతర్రాష్ట ప్రాజెక్టుల్లో వాటాలు తేలాలి ఉద్యమంలో భాగంగా మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు వెళ్లినప్పుడు ఆంధ్రా ప్రాంతం వాళ్లు శ్రీకాకుళం నుంచి వచ్చి మర బోట్లతో శ్రీశైలం, నాగార్జున సాగర్‌లో చేపలు పడుతూ.. మన వాళ్లు పోతే దాడులు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఇప్పుడు మన రాష్ట్రం ఏర్పడింది. అంతర్రాష్ట సమస్యలపై వేసిన కమిటీలో చర్చించి శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో మన చేపల వాటాను, అంతర్రాష్ట ప్రాజెక్టుల్లో షేర్‌ను తేల్చుకుంటాం.
బెస్త, ముదిరాజ్‌ల మధ్య కొట్లాట వద్దు మన రాష్ట్రంలో బెస్త కులస్తులను రెండు రకాలుగా పిలుస్తాం. నిజామాబాద్, ఆదిలాబాద్‌లలో బెస్తవాళ్లను గూండ్లోళ్లు అంటారు. హైదరాబాద్‌లో గంగపుత్రులు అంటారు. మిగిలిన తెలంగాణలో బెస్తవాళ్లు అంటాం. వీళ్లతోపాటు ముదిరాజ్‌లు కూడా చేపలు పెంపకాన్ని వృత్తిగా మార్చుకున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు కూడా చేపల పట్టే వృత్తిలో ఉన్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో కేవలం 47వేల మంది మాత్రమే మత్స్యకారులమని నమోదు చేసుకున్నారు. కొంతమంది నమోదు కాకపోవచ్చు. బెస్త కులస్తుల తర్వాత ఈ వృత్తిలోకి దిగిన వారు ముదిరాజ్‌లు. బెస్తవాళ్లకు, ముదిరాజ్ కులస్తులకు ఈ సభ ద్వారా ఒక్కటే విన్నవిస్తున్నా. మీరు ఘర్షణలకు పోవద్దు. గతంలో చేగుంట మండలంలో అవగాహన లేకపోవడంతో కుల ఘర్షణల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అట్లాంటి కొట్లాటలు రాకుండా నేను ప్రార్థిస్తున్నా. రానున్న రోజుల్లో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతోటి రూ.500కోట్లు ఉన్న చేపల ఉత్పత్తి ఆదాయం 10 రెట్లు పెరుగనుంది. అందరికీ అవకాశం దొరుకుతుంది. సొసైటీ సభ్యత్వాల్లో బెస్తవారికి తొలి ప్రాధాన్యం ఇస్తాం. ముదిరాజ్‌లు, బెస్తవాళ్లు ఇద్దరూ ప్రభుత్వానికి సమానమే. అందరికీ లాభం చేకూరేలా, అందరి కడుపు నింపేలా ప్రభుత్వం చూస్తుంది.
జనహితహాల్‌లో మాట్లాడతా సమాజంలోని అన్ని వర్గాల వారితో నేను స్వయంగా సమావేశం పెట్టి మాట్లాడేలా ప్రగతిభవన్‌లో జనహిత అనే హాల్ కట్టించాం. మధ్యప్రదేశ్ సీఎం నివాస గృహంలో ఉన్న భవనాన్ని స్ఫూర్తిగా తీసుకుని దీన్ని నిర్మించాం. అందులో మత్స్యకారులు, బెస్త, ముదిరాజ్ సోదరులతో ప్రత్యక్షంగా మాట్లాడతాను. మత్స్య పరిశ్రమపైన ఆధారపడి జీవిస్తున్న వారిలో ప్రతి ఒక్కరికి మత్స్య సొసైటీల్లో సభ్యత్వం కల్పిస్తాం. ప్రాజెక్టుల నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు ప్రాజెక్టుల్లో చేపల ద్వారా ఆదాయం కల్పిస్తామని చెప్పాం. ప్రాజెక్టుల పరిధిలోని చేపల సొసైటీల్లో వారికి సభ్యత్వం ఇస్తాం. ప్రభుత్వ పెట్టుబడులతో పరిశ్రమ ఎనిమిది, తొమ్మిదిరెట్లు పెరుగుతుంది కాబట్టి అందరికీ చేపల పెంపకంలో ఉపాధి దక్కుతుంది.
ఆ తెలంగాణను నేను చూడగలుగుతున్నాను ఒక హెక్టార్ వాటర్ స్ప్రెడ్(నీటి ఉపరితల విస్తరణ)లో 350 కిలోల చేపలు ఉత్పత్తి అవుతాయని ఒక అంచనా. మన రాష్ట్రంలో మొత్తం 3 నుంచి 4 లక్షల హెక్టార్ల పైన వాటర్ స్ప్రెడ్ ఏరియా ఉంది. మన రాష్ట్రంలో మామూలుగా వచ్చే సాధారణ చేపల దిగుబడి ఏడాదికి లక్ష టన్నుల వరకు ఉంటది. చేప విత్తనం వేసి పెంచడం ద్వారా మరో లక్ష టన్నుల ఉత్పత్తి వస్తది. ఈసారి మంత్రి తలసాని చొరవతో రూ.24కోట్ల వ్యయంతో 28 కోట్ల చేప పిల్లలను చెరువుల్లో వేశాం. దీనితో ఇంకో లక్షంబావు టన్నుల ఉత్పత్తి కలుపుకొని మొత్తం ఈ ఏడాది మూడున్నర లక్షల టన్నుల ఉత్పత్తి వస్తదని మత్స్యశాఖ అంచనా వేస్తుంది. భవిష్యత్తులో మనం అంచనా వేసేది ఏడాదికి కనీసం 10 నుంచి 11 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి సాధించాలని. వచ్చే బడ్జెట్‌లో ఎక్కువ కేటాయింపులు చేస్తాం. ఇంకో ఏడాదిన్నరలో ఐదువేల కోట్ల రూపాయల లాభం వచ్చేలా మత్స్యశాఖను అభివృద్ధి చేస్తాం. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌తో నేను ఇప్పటికే చర్చలు జరిపాను. కేంద్రం నుంచి పెద్ద సహాయం తీసుకుంటాం. ఇట్లా పెద్ద ఎత్తున మత్స్య సంపద పెరిగిన తెలంగాణను నేను చూడగల్గుతున్నాను.
వాటర్ స్ప్రెడ్ ఏరియా పెరుగుతుంది తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో నిర్మించే ప్రతిబ్రిడ్జి కింద చెక్‌డ్యాంలు కట్టాలని నిర్ణయించాం. గోదావరిపై కడుతున్న బ్యారేజ్‌లో కొత్తూరు దగ్గర దేవాదుల ప్రాజెక్టులోదాదాపు 20కిలోమీటర్ల వాటర్ స్ప్రెడ్ ఏరియా ఉంది. ఆ తర్వాత కట్టే మేడిగడ్డ వద్ద గోదావరి, ప్రాణహిత నది కలిసి 54 కి.మీ. పొడవు వాటర్ స్ప్రెడ్ ఏరియా, దాని తర్వాత సుందిళ్ల వద్ద 17 నుంచి 18కిలోమీటర్ల వాటర్ స్ప్రెడ్ ఉంది. ఎల్లంపల్లి రిజర్వాయర్ నుంచి ధర్మపురి దాటిన తర్వాత జైన గ్రామం వరకు దాదాపు 36కిలోమీటర్ల దూరం నీళ్లు ఉన్నాయి. మంథని నియోజకవర్గం నుంచి జైన వరకు 100 నుంచి 150కిలోమీటర్లు గోదావరి ఎప్పుడూ నీటితో కళకళలాడుతూ ఉంటది. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం పూర్తయితే కొత్తూరు నుంచి జైన వరకు దాదాపు 70 నుంచి 75టీఎంసీల నీళ్లు గోదావరిలోనే లైవ్‌గా ఉంటాయి. ఆ చిత్రం ఊహించుకుంటేనే కడుపునిండినట్టు ఉంది. మహబూబ్‌నగర్ ప్రాజెక్టులు జూరాల, సంగంబండ, రాబోతున్న రిజర్వాయర్లు, కోయిల్‌సాగర్‌లోనూ మత్స్య సంపదను పెంచవచ్చు. నాగార్జునసాగర్‌లో మన వాటా తెల్సుకుంటే చేపలు పెంచే అవకాశం ఉంది.
బేగం బజార్ చేపల బ్రోకర్లను తరిమేస్తాం గతంలో మత్స్యశాఖనుంచి చేప పిల్లల పెంపకానికి కేవలం రూ.4కోట్లు ఇచ్చేవాళ్లు. వాటిని పంచితే ఒక్కో చెరువుకు రూ.12వేలు వచ్చేవి. అంత వరకే చేప పిల్లలు వేసేవాళ్లు. మిగతా చెరువుల్లో బేగంబజార్‌లోని బ్రోకర్లు చేప పిల్లలు వేసేవాళ్లు. కేజీ రూ.350 నుంచి రూ.600 మధ్య అమ్ముకుంటూ మత్స్యకారులకు కేజీకి రూ.15 మాత్రమే ఇచ్చేవాళ్లు. ఇట్లా చేపల పెంపకంలో బ్రోకర్లను పెంచి పోషించింది కాంగ్రెస్ ప్రభుత్వమే. వారిని బేగం బజార్లో సుస్థిర పర్చిన ఘనత వారిదే. మేం చేపలు పెంచే కార్యక్రమాన్ని మత్స్యపరిశ్రమగా మార్చుతాం. ఈ క్రమంలో బేగం బజార్ బ్రోకర్లను తరిమేస్తాం. ఫిషరీస్ కార్పొరేషన్‌ను బలోపేతం చేస్తాం. చేపల ఉత్పత్తి నిర్వహణ నుంచి ఎగుమతి వరకు అంతా కార్పొరేషనే చూసుకుంటుంది. కేవలం నిర్వహణ ఖర్చు తీసుకుని.. వచ్చే ఆదాయాన్ని ఆ కార్మికులు పొందేలా చర్యలు తీసుకుంటాం.
కేజీ కల్చర్ కాదు జీవన్‌రెడ్డిగారు కేజీ కల్చర్ అన్నరు. అది కేజీ కల్చర్ కాదు. కేజ్ కల్చర్. జార్ఖండ్ రాష్ట్రంలో అది బాగా చేస్తున్నరంటే మన ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అక్కడికి వెళ్లి పరిశీలించి వచ్చినరు. మన దగ్గర ఐదు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా చేసినం. మేం చెప్పిన లైవ్‌లీనెస్… చెరువులు, నదులు, బరాజ్‌లు, చెక్‌డ్యాంల్లో ఆ లైవ్‌లీనెస్ (నిండుగా నీరు) వచ్చేలోపు కేజ్ కల్చర్, సీడ్ ప్రొడక్షన్‌ను పరిశీలిస్తున్నరు. పాత సీడ్ ప్రొడక్షన్ ఎక్కడెక్కడ జరిగిందో చూస్తున్నరు. పని మొదలైంది.
సొసైటీల సభ్యత్వ విధానంపై అఖిలపక్షం మత్స్య పరిశ్రమ పట్ల గత ప్రభుత్వాలు అవలంభించిన వైఖరితో ఐదారు గ్రామాలకు కలిపి ఒక సొసైటీ చేయడం వల్ల అనేక చోట్ల ఘర్షణలు వచ్చినయి. ఇపుడు ప్రభుత్వం ఈ పరిశ్రమపై పెద్ద ఎత్తున ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతున్నది. కొత్త సొసైటీలు రావలిసిన అవసరం ఉన్నది. సొసైటీలు ఏర్పాటు చేసే ముందు ప్రభుత్వం తరపున ఒక అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తం. మత్స్యకారులను కూడా పిలిచి మాట్లాడుదాం. ప్రతిపాదనలన్నీ చర్చించి వారికి లాభం జరిగేలా చూద్దాం. ఇది గొప్ప పరిశ్రమగా అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుందాం. హైదరాబాద్‌లో చెరువులను గురించి కిషన్‌రెడ్డి చెప్పిండ్రు. వాటిని క్లీన్ చేసేందుకు నీటిపారుదల శాఖ, జీహెచ్‌ఎంసీ చర్యలు తీసుకుంటున్నయి. రాజయ్యగారు మరబోట్లు, వలలు అంటూ చెప్పిండ్రు. 30 ఏండ్లనుంచి ఇవన్నీ వింటున్నవే. ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్‌తో చేపల పరిశోధన, సీడ్స్ తయారు చేయడం, ఉత్పత్తి చేయడం. ఉత్పత్తిని శాస్త్రీయంగా ఇక్కడగానీ, బయటికిగానీ ఎగుమతి చేసేలా చర్యలు చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటం. అందరం కలిసి ఈ పరిశ్రమను ఒక వైబ్రంట్ ఇండస్ట్రీగా ముందుకు తీసుకుపోదాం అని సీఎం కేసీఆర్ తెలిపారు.
ఎర్రరొయ్యలు మళ్లీ దొరకాలి ఆంధ్రప్రదేశ్‌లో కలువకముందు తెలంగాణ ప్రజలు రెండు రకాల రొయ్యలు తినేవాళ్లు. ఒకటి గోదావరి ప్రాంతంలో దొరికే గంగ రొయ్యలు. అవికాకుండా చెరువుల్లో ఎర్ర రొయ్యలు దొరికేవి. చింతచిగురు, శెనగపప్పువేసి ఎర్ర రొయ్యలు వండితే బ్రహ్మాండమైన రుచి ఉండేది. నేను చిన్నప్పుడు తిన్నా. ఇప్పుడు అవి లేనే లేవు. కరీంనగర్ జిల్లాల్లో కొన్ని చెరువుల్లో మాత్రమే దొరుకుతున్నయి. అదీ ఎస్సారెస్పీ రీజనరేటెడ్ వాటర్ వల్ల. ఎల్లంపల్లి రిజర్వాయర్లోకి నిన్నకూడా 70 క్యూసెక్కుల రీజనరేటెడ్ వాటర్ వచ్చింది. ప్రతి రోజూ ఎంత నీళ్లు వస్తున్నయి. వాటిని ఎట్లా వాడుకోవాలని ప్రణాళికలు వేసుకుంటున్నాం. కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తయితే వచ్చే ఏడాదికి రిజర్వాయర్లన్నీ పూర్తయితవి.
రీ జనరేటెడ్ వాటర్ ద్వారా తెలంగాణలోని ప్రతి చెరువులో, ప్రతి కుంటలో మళ్లీ ఎర్ర రొయ్యలు పెరిగే విధంగా మన సిస్టం ఉంటది. ఎక్కువ నీళ్లు తీసుకుందాం. మల్లన్న సాగర్ కడదామన్నది ఈ ఎర్ర రొయ్యలు కండ్ల చూడాలనే. రీ జనరేటెడ్ వాటర్ ద్వారా 300 రోజులు మన చెరువులు, కుంటలు నిండి ఉండాలన్నదే ఉద్దేశం. నేను ఆ తెలంగాణను చూడాలనుకుంటు న్నా. భగవంతుడు మన్నించి అప్పటి వరకు బతకాలని కోరుకుంటున్నా. కాళేశ్వరం, పాలమూరు ఒకసారి పూర్తయితే ఆయకట్టులో ఉండే చెరువులన్నీ జలకళతో ఉంటాయి. రోహిణికార్తి వచ్చిందంటే తెలంగాణ రైతు మొగులుకు మొహం పెట్టకుండా వ్యవసాయం చేసే రోజు కచ్చితంగా వస్తది.
ఆరు లక్షల పరిహారం అధ్యక్షా ఏదన్న మాట్లాడితె అతికినట్టుండాలె. చేపలను ఆర్నెల్లు ముందు వేసేదుండె అంటరు. నీళ్లు వచ్చిందే అప్పుడు కదా! ఈ విషయం రాష్ట్రంలో చేపలు పట్టే ఎవరిని అడిగినా చెబుతరు. ప్రమాదవశాత్తు చనిపోయిన మత్స్యకారులకు ఇన్సూరెన్స్‌కు సంబంధించి ఇప్పటికే మంత్రికి ఆదేశాలిచ్చిన. ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడుతున్నరు. కాంగ్రెస్ హయాంలో రూ.2 లక్షలు ఇచ్చిన ఘనత మీది. కానీ ప్రమాదవశాత్తు మత్స్యకారులు చనిపోతే మా ప్రభుత్వం రూ.ఆరు లక్షల పరిహారం ఇస్తది. కాంగ్రెస్ 40 ఏండ్లు పాలించిన సమయంలో మత్స్య పరిశ్రమ ఎట్లుండేది? వాళ్లు ఎంత ఆదరణకు గురైండ్రో.. ఎంత ఆదాయం వచ్చిందో అందరికీ తెలుసు. చేపలు పిల్లలకు వీళ్లిచ్చే పదిశాతం సబ్సిడీ ఏ మూలకు సరిపోకపోతే… బేగంబజార్‌లో స్థిరపడిన చేపలమ్మే వ్యాపారులు బ్రహ్మాండంగ వర్థిల్లి. కోటీశ్వరులై పోయిండ్రు. మత్స్యకార్మికులు మాత్రం ఎక్కడున్నరో అక్కడే ఉన్నరు. ఇప్పుడు ఏం చేయబోతున్నం, ఎంత గొప్పగ చేస్తామనేది చెప్పిన. మీరు మాట్లాడింది, మేం మాట్లాడింది ప్రజలు విన్నరు. అట్లనే రేపు బడ్జెట్‌లో ఎంతెంత కేటాయిస్తమో చూస్తరు.
ప్రత్యామ్నాయ వృత్తులవైపు ప్రోత్సహించాలి కుల వృత్తుల వారు క్రమంగా ఉపాధి కోల్పోతున్నారు. కుమ్మరులు, చేనేత కార్మికులు, స్వర్ణకారులు ఇలా ఉపాధి కోల్పోతున్నారు. కుండల్లో వంట చేసే పరిస్థితి లేదు. దీపావళిరోజు దీపెంతలు, పెండ్లిల్ల ఐరేణి కుండలు తప్ప తీసుకునే పరిస్థితి లేదు. సామాజిక పరిణామ క్రమంలో కొన్ని వృత్తులు అంతరిస్తాయి. కొన్ని వృత్తులు కొత్తగా వస్తాయి. ఉదాహరణకు చెప్పుకుంటే, దేశంలోని 130 కోట్ల మంది వస్త్ర అవసరాలను దేశంలోని చేనేత కార్మికులు తీర్చలేరు. మిల్లులు వస్తే వాటి పోటీని చేనేత కార్మికులు తట్టుకోలేరు. ఇవాళ మగ్గం పట్టుకుని ఉన్న చేనేత కార్మికులే ఆకలి చావుల పాలవుతున్నరు. 30 ఏండ్ల కింద మనకు ఆటోరిక్షా అంటే తెల్వదు. ఇప్పుడు ఆటోరిక్షా జీవనోపాధినిచ్చే వృత్తిగా మారింది. కాబట్టి ఆలోచన ఉన్న ప్రభుత్వాలు ఉంటే ఆ ప్రత్యామ్నాయ వృత్తులకు మరల్చగల్గాలి. మా ప్రభుత్వం అదే పని చేయబోతున్నది. చేనేత కార్మికులు, కుమ్మరులు, స్వర్ణకారులు ఇలా అందరినీ ఆర్థికంగా ఆదుకుంటాం. మన రాష్ట్రంలో 85శాతం ఉన్న వృత్తి పనివారంతా గౌరవ ప్రదమైన జీవనం గడిపినపుడే బంగారు తెలంగాణ అవుతుంది. ఈ ఏడాది బడ్జెట్‌లో లక్షల కొద్దీ యూనిట్లు ఇచ్చేలా మత్స్య పరిశ్రమ, గొర్రెల పరిశ్రమకు బడ్జెట్ పెడుతున్నాం. గొర్రెల పెంపకం పాలసీ, మత్స్యపాలసీ తెస్తున్నాం