Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

మావి న్యూట్రిషన్‌ పాలిటిక్స్‌.. విపక్షాలవి పార్టిషన్‌ పాలిటిక్స్‌

-బీఆర్‌ఎస్‌ది పనులు చేసే ప్రభుత్వం.. బీజేపీది పన్నులేసే ప్రభుత్వం
-కేసీఆర్‌ది తల్లి లాలన, తండ్రి పాలన.. కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌ గొప్ప పథకం
-ప్రస్తుతం 9 జిల్లాల్లో.. త్వరలోనే రాష్ట్రమంతా అమలు: మంత్రి హరీశ్‌రావు

రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిది న్యూట్రిషన్‌ పాలిటిక్స్‌ అయితే, ప్రతిపక్షాలవి పార్టిషన్‌ పాలిటిక్స్‌ అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. తల్లులు, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని మనం ఆలోచిస్తుంటే.. విభజన రాజకీయాలతో కొన్ని విపక్షాలు నిత్యం కుటిల రాజనీతికి పాల్పడుతున్నాయని మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌లో కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌ పథకాన్ని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, ఎమ్మెల్యేలు హన్మంత్‌ షిండే, జాజాల సురేందర్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ దఫేదార్‌ శోభ, ఉర్దూ అకాడమీ చైర్మన్‌ ముజీబుద్దీన్‌తో కలిసి బుధవారం లాంచనంగా ప్రారంభించారు.

కామారెడ్డితోపాటు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, వికారాబాద్‌, నాగర్‌కర్నూల్‌, గద్వాల జిల్లాల్లో వర్చువల్‌ విధానంలో ఏకకాలంలో కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ఆన్‌లైన్‌లో మంత్రులతో ముఖాముఖిగా సంభాషించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించిన న్యూట్రిషన్‌ కిట్‌ను ప్రతి గర్భిణి తప్పక వాడాలని కోరారు.

బిడ్డ కడుపు పండాలని.. తల్లి మనసుతో..
సీఎం కేసీఆర్‌ ఒక తండ్రిగా, తల్లిగా ఆలోచించి గర్భిణుల ఆరోగ్యం కోసం న్యూట్రిషన్‌ కిట్‌ పథకాన్ని తెచ్చారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ‘తల్లి బాగుంటే పుట్టబోయే బిడ్డ బాగుంటుంది. బిడ్డ బాగుంటే రేపటి భారతం బాగుంటుంది. ఇంతకు మునుపు బిడ్డ పుట్టిన తర్వాత ప్రభుత్వం కేసీఆర్‌ కిట్‌ ఇచ్చేది. ఇప్పుడు బిడ్డ కడుపులో పడగానే ఇచ్చేది న్యూట్రిషన్‌ కిట్‌. ఇందులో ప్రొటీన్‌తో కూడిన ఆహారం (డైట్‌) ఇస్తున్నాం. అందరూ తప్పకుండా వాడాలి. మీ ఇంట్లో భర్తకో, పిల్లలకో ఈ కిట్‌లోని బలవర్ధకమైన పదార్థాలను పెట్టకండి. మీరే వాడండి. మీకు రెండు సార్లు ఈ కిట్‌ ఇస్తాం. ఒక్కో కిట్‌ విలువ సుమారు రూ.2 వేలు. మొదటి కిట్‌ను బుట్టలో అందజేస్తాం. రెండోది జూట్‌ బ్యాగులో ఇస్తాం. సీఎం కేసీఆర్‌ తల్లిలాగా, తండ్రిలాగా నిరంతరం పేదల కోసం ఆలోచిస్తున్నారు’ అని తెలిపారు.

ఆడపిల్లలు బాగా చదువుకోవాలని రాష్ట్రంలో 551 గురుకులాలు, పెద్ద చదువుల కోసం 68 మహిళా రెసిడెన్షియల్‌ డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతి పేదింటి ఆడబిడ్డకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ ద్వారా రూ.1,0116 అందిస్తున్నామని, పెండ్లయిన తర్వాత బిడ్డ కడుపులో పడగానే పాలు, కోడిగుడ్డుతో అంగన్‌వాడీలో పౌష్టికాహారం పెడుతున్నామని, తల్లి ఆరోగ్యంగా ఉండాలని న్యూట్రిషన్‌ కిట్‌ అందిస్తున్నామని వివరించారు. గర్భిణులకు స్కానింగ్‌, ఏఎన్‌సీ చెకప్‌లు, టిఫా యంత్రాలతో ఉచితంగా స్కానింగ్‌లు చేయిస్తున్నామని చెప్పారు. ‘న్యూట్రిషన్‌ కిట్‌లో భాగంగా ఇస్తున్న ఖర్జూరాలతో ఐరన్‌ వృద్ధి చెందుతుంది. ప్రొటీన్‌ పౌడర్‌ను పాలలో, లేదంటే నీటిలో కలుపుకుని తాగాలి. నెయ్యిని భోజనంలో కలిపి తినాలి. ఐరన్‌ టానిక్‌లు తప్పనిసరిగా తీసుకోవాలి’ అని కిట్‌లోని వస్తువులను చూపిస్తూ లబ్ధిదారులకు హరీశ్‌రావు వివరించారు.

రాష్ట్రంలో మానవీయ పథకాలు: వేముల
రాజకీయాలతో సంబంధం లేకుండా సీఎం కేసీఆర్‌ మానవీయంగా ఆలోచించి న్యూట్రిషన్‌ కిట్‌ పథకాన్ని రూపొందించారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చెప్పారు. గర్భిణులకు అమ్మ ఒడి, కేసీఆర్‌ కిట్‌, కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌ పథకాలు మహాద్భుతంగా సేవలందిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలకు అందించడంలో ఆశ వర్కర్ల సేవలు గొప్పవని కొనియాడారు. ఆశ వర్కర్లు తల్లికన్నా తక్కువేమీ కాదని ప్రశంసించారు. కార్యక్రమంలో వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ శ్వేతా మహంతి, డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ రమేశ్‌ రెడ్డి, వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ అజయ్‌కుమార్‌, కామారెడ్డి కలెక్టర్‌ జితేశ్‌ వీ పాటిల్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వాలను కూల్చేటోడు లీడర్‌ కాడు: పోచారం
కొంత మంది రాజకీయ నాయకులకు ఏం పని లేక నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. ‘విపక్షాలకు ఓట్ల యావ. కేసీఆర్‌ తల్లీబిడ్డల సంరక్షణ నావ. మనకు, వాళ్లకు అదే తేడా. ఒక సీనియర్‌ నాయకుడిగా చెప్తున్నా.. దేశానికి, రాష్ట్రానికి, గ్రామాలకు కావాల్సింది రాజకీయవేత్త కాదు. లీడర్‌ కావాలి. హీరో కావాలి. ధైర్యంతో నిర్ణయం తీసుకొనే నాయకుడు కావాలి’ అని పోచారం అన్నారు. ప్రభుత్వాలను పడగొట్టే నాయకుడు కాదు.. ప్రజలను రక్షించే నాయకుడు కావాలి అని పేర్కొన్నారు. ప్రసవం తర్వాత బిడ్డలకు ముర్రుపాలు తప్పనిసరిగా తాగించాలని గర్భిణులకు సూచించారు. ‘ముర్రుపాలు అమృతంతో సమానం. నాకు ఇప్పుడు 75 ఏండ్లు. ఏ రోగం లేదు. అందుకు కారణం నేను నా నాలుగేండ్లు తల్లిపాలు తాగిన’ అని తెలిపారు.

ఇప్పుడు 9 జిల్లాల్లో.. తర్వాత రాష్ట్రమంతా
కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌ పథకాన్ని ఎనీమియా ఎక్కువగా ఉన్న 9 జిల్లాల్లో మొదట ప్రారంభిస్తున్నామని, భవిష్యత్తులో రాష్ట్రమంతటా విస్తరిస్తామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. గతంలో ప్రభుత్వ దవాఖానల్లో 30 శాతమే డెలివరీలు అవుతుండగా, ప్రభుత్వం దవాఖానలను అభివృద్ధి చేయటంతో ప్రస్తుతం 66 శాతానికి పెరిగాయని వెల్లడించారు. మాతా శిశు సంక్షేమ వైద్యశాలలు 2014లో 6 ఉంటే, 26కు పెంచామని, పడకల సంఖ్య 17 వేల నుంచి 28 వేలకు పెంచామని వెల్లడించారు. 11 వేల బెడ్లు కేసీఆర్‌ హయాంలోనే పెరిగాయని పేర్కొన్నారు. ఐసీయూ పడకలు 200 ఉంటే 6 వేలకు పెంచామని, మాతా శిశు మరణాలు కూడా చాలావరకు తగ్గించామని తెలిపారు. 2014లో రాష్ట్రంలో మాతృ మరణాల రేటు 92 ఉండగా, ప్రస్తుతం 43కు తగ్గినట్టు ఈ నెలలో విడుదలైన కేంద్ర ప్రభుత్వ శాంపిల్‌ రిజిస్ట్రేషన్‌ సర్వేనే తేల్చిందని గుర్తుచేశారు. మాతృ మరణాలు తగ్గించడంలో దేశంలోనే మనం మూడో స్థానంలో నిలిచామని చెప్పారు.

ఈ సంఖ్యను మరింత తగ్గించేందుకు కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌ పథకం దోహదపడుతుందని అన్నారు. ‘స్కానింగ్‌ కోసం ప్రైవేటు దవాఖానలకు వెళ్లొద్దు. కామారెడ్డితోపాటు తెలంగాణలో 44 దవాఖానల్లో టిఫా యంత్రాలను ఏర్పాటుచేశాం. నార్మల్‌ స్కానింగ్‌తో పాటు హై ఎండ్‌ అల్ట్రా సౌండ్‌ మెషిన్‌తో ప్రభుత్వ దవాఖానల్లోనే చేస్తున్నాం. పేదలకు పైసా ఖర్చు కాకుండా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమిది. ఇలాంటి కార్యక్రమాలు గతంలో ఎవరైనా చేశారా? అడగకుండానే అనేక పథకాలను అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌ది. తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికి 5 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ఉంటే, ఇప్పుడు 17 కాలేజీలు వచ్చాయి. వచ్చే ఏడాది మరో 9 కాలేజీలు ప్రారంభమవుతాయి. అందులో కామారెడ్డి కూడా ఉన్నది’ అని తెలిపారు.

సర్కారు వైద్యంపై ప్రజల్లో విశ్వాసం

పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
స్వరాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానల్లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సకల వసతులు కల్పించడంతో సర్కారు వైద్యంపై ప్రజలకు విశ్వాసం పెరిగిందని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బుధవారం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఇల్లందు క్లబ్‌ హౌస్‌లో కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్లను మంత్రి అందజేశారు. ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించడం వల్లే జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌ సతీమణి, వనపర్తి జడ్జి ప్రభుత్వ దవాఖానల్లో పండంటి బిడ్డలకు జన్మనిచ్చారని చెప్పారు.

గర్భిణులకు వరం న్యూట్రిషన్‌ కిట్‌

ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌లు గర్భిణులకు వరంగా మారనున్నాయని ఎక్సైజ్‌, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. బుధవారం నాగర్‌కర్నూల్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, కలెక్టర్‌ ఉదయ్‌కుమార్‌తో కలిసి గర్భిణులకు న్యూట్రిషన్‌ కిట్లను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని చెప్పారు. గర్భిణిలను రక్తహీనత నుంచి రక్షించేందుకు న్యూట్రిషన్‌ కిట్లను అందజేస్తున్నామని తెలిపారు.

కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌ దేశానికే ఆదర్శం

వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి
కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌ పథకం దేశానికే ఆదర్శమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. బుధవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యేలు కృష్ణమోహన్‌రెడ్డి, అబ్రహంతో కలిసి గర్భిణులకు మంత్రి న్యూట్రిషన్‌ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణీల్లో రక్తహీనతను పోగొట్టేందుకు ప్రభుత్వం న్యూట్రిషన్‌ కిట్లను అందజేస్తున్నదని తెలిపారు. ఆడబిడ్డలు బలంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణమవుతుందని అన్నారు. కలెక్టర్‌ వల్లూరు క్రాంతి, జెడ్పీ చైర్‌పర్సన్‌ సరిత తదితరులు పాల్గొన్నారు.

ఆరోగ్య తెలంగాణే కేసీఆర్‌ లక్ష్యం

మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌
బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే తల్లికి సరైన పోషకాలు అందాలి, అప్పుడే పండంటి బిడ్డకు జన్మనివ్వగలదని గ్రహించి సీఎం కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌ పథకాన్ని ప్రారంభించారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో గర్భిణులకు కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్లను ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎనీమియా (రక్తహీనత) ఉన్నట్టు సర్వేల్లో వెల్లడైందని, దీనికోసం కొత్తగూడెంలో తొలి విడతగా దాదాపు 16 వేల కిట్లు పంపిణీ చేస్తున్నామని చెప్పారు.

ప్రజల సంరక్షణే ప్రభుత్వ ధ్యేయం

గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌
ప్రజల ఆరోగ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలుచేస్తున్నదని రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. గర్భిణుల సంరక్షణ కోసం తాజాగా కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌ పథకాన్ని ప్రారంభించిందని చెప్పారు. ములుగులో బుధవారం గర్భిణులకు ఆమె న్యూట్రిషన్‌ కిట్లను అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గర్భిణీల్లో రక్తహీనతను నివారించి తల్లి బిడ్డల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్ల పంపిణీని ప్రభుత్వం చేపట్టిందని పేర్కొన్నారు. తల్లి బాగుంటేనే పుట్టబోయే బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటుందని చెప్పారు. అంతకు ముందు జిల్లా కేంద్రంలో రూ. 1.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ప్రత్యేక అవసరాలు గల పిల్లల పాఠశాల (వికాసం) భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు.

తల్లీబిడ్డల ఆరోగ్యం కోసమే న్యూట్రిషన్‌ కిట్‌

మంత్రి అల్లోల, విప్‌ బాల్క సుమన్‌
తల్లీబిడ్డల ఆరోగ్యం కోసమే ప్రభుత్వం కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌ పథకాన్ని తెచ్చిందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ అన్నారు. ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌లో మంత్రి అల్లోల, కుమ్రం భీం ఆసిఫాబాద్‌ ప్రభుత్వ దవాఖానలో బాల్క సుమన్‌ న్యూట్రిషన్‌ కిట్‌ పథకాన్ని ప్రారంభించి మాట్లాడారు.

తల్లి బాగుంటేనే బిడ్డ బాగుంటుంది

మంత్రి పి.సబితారెడ్డి
తల్లిబాగుంటేనే బిడ్డ బాగుం టుందనే లక్ష్యంతో కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌ పథకాన్ని ప్రవేశపెట్టారని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పేర్కొ న్నారు. వికారాబాద్‌ జిల్లా పూడూరులో గర్భిణులకు న్యూట్రిషన్‌ కిట్లను ఎమ్మెల్యేలు మహేశ్వర్‌రెడ్డి, నరేం దర్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డితో కలిసి ఆమె అందజేశారు. న్యూట్రిషన్‌ కిట్ల పంపిణీ చరిత్రలో నిలిచిపోతుందని, యావత్‌ మహిళాలోకం తరఫున ఈ నిర్ణయం తీసుకొన్న సీఎం కేసీఆర్‌కు ధన్యావాదాలు తెలిపారు.

తొలిరోజు 6,776 మందికి కిట్లు
రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్ల పంపిణీ కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. తొలిరోజున 6,776 మంది గర్భిణులు కిట్లను అందుకొన్నారు. ఆదిలాబాద్‌లో 1,475, భద్రాద్రి కొత్తగూడెంలో 1,469, వికారాబాద్‌లో 901, నాగర్‌కర్నూల్‌లో 786, కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో 734, కామారెడ్డిలో 538, ములుగులో 410, జయశంకర్‌ భూపాలిపల్లిలో 398, జోగులాంబ గద్వాలలో 65 మంది గర్భిణులకు కిట్లను అందజేశారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.